శాలివాహన 1943 శ్రీ ప్లవ కార్తీక శుద్ధ చవితి – 08 నవంబర్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ఉద్దేశం స్వాతంత్య్ర సమరయోధులను తలుచుకోవడమే తప్ప, వాళ్ల త్యాగాలకి వక్రభాష్యాలు చెప్పడం కాదు. తమదైన శైలిలో వారిని గుర్తు చేస్తూ ఓట్లు దండుకోమని చెప్పడం అసలే కాదు. సమయం దొరికింది కదా అని దేశం మీద చరిత్ర పేరుతో అజ్ఞానాన్ని సంధించమని కూడా కాదు. ముస్లిం ఓటర్లను బుజ్జగించడంలోను, అధికారమే పరమావధిగా రాజకీయాలు చేయడంలోను అందె వేసిన చేయి కలిగిన అఖిలేశ్‌ ‌యాదవ్‌ అక్టోబర్‌ 31‌న హర్దోయ్‌ అనే చోట బహిరంగ సభలో చేసిన ప్రకటన స్వాతంత్య్ర సమరాన్నీ, సమరయోధులనీ అవమానించేదే. స్వాతంత్య్ర సిద్ధికి పెడార్ధాలు కల్పించడమే. సర్దార్‌ ‌పటేల్‌, ‌మహాత్మా గాంధీ, జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ, మహమ్మదలీ జిన్నా పోరాడి ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని అఖిలేశ్‌ ఒక సరికొత్త చరిత్ర పాఠాన్ని ఆవిష్కరించి ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రజలను ధన్యులను చేశారు.

అసలు ఎన్నికలు వస్తే చాలు, చాలామంది నాయకుల నాలుకలు వశం తప్పిపోతాయి. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఎందుకు మాట్లాడతారో తెలియదు. జిన్నా, పటేల్‌, ‌గాంధీజీ, నెహ్రూ ఒకే సంస్థలో చదివి బారిస్టర్లు అయ్యారన్న ఒక నిగూఢ సత్యాన్ని కూడా అఖిలేశ్‌ ‌భారతజాతికి అందించారు. నిజం ఏమిటంటే వారు ఇంగ్లండ్‌లో చదివారు తప్ప ఒకే సంస్థలో కాదు. పటేల్‌ ‌మిడిల్‌ ‌టెంపుల్‌లో, గాంధీ ఇన్నర్‌ ‌టెంపుల్‌, ‌జిన్నా లింకన్స్ ఇన్‌ ‌సంస్థలలో న్యాయశాస్త్రం చదివారు.

మహమ్మదలీ జిన్నా గురించీ, భారత స్వాతంత్య్రోద్యమం సమయంలో ఆయన నిర్వహించిన పాత్ర గురించీ కొంచెం తెలిసిన వారైనా జిన్నా భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చాడంటే చచ్చినా నమ్మరు. ఆయన భారత్‌ను విభజించి, పాకిస్తాన్‌ అనే దేశాన్ని సృష్టించారు. 1936 నుంచి 1947 వరకు అందుకోసం ఊపిరాడకుండా పనిచేశారు. 1940లో లాహోర్‌ ‌ముస్లిం లీగ్‌ ‌సమావేశాల తరువాత పత్రికలన్నీ జిన్నా పాకిస్తాన్‌ అనే ప్రత్యేక దేశం ఏర్పాడాలని కోరుతున్నాడని వెల్లడించాయి. 1944లో గాంధీజీకీ, జిన్నాకీ నడుమ బొంబాయిలోని జిన్నా నివాసంలో దాదాపు పక్షం రోజుల పాటు చర్చలు జరిగాయి. క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో అరెస్టయి, తరువాత బయటకు వచ్చిన గాంధీజీ రాజాజీ ప్రణాళిక ప్రాతిపదికగా జిన్నాతో చర్చలకు వెళ్లారు. మత ప్రాతిపదికన దేశం ఏర్పాటు చేయడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఆ సమావేశంలో గాంధీజీ ఎలాంటి శషభిషలు లేకుండా జిన్నాకు చెప్పారు. పాకిస్తాన్‌ ఏర్పడితే అక్కడ ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనుల భవిష్యత్తు గురించి కూడా మాటలు వచ్చాయి. ఎన్ని చెప్పినా గాంధీజీ జిన్నాను విభజన నిర్ణయం నుంచి వెనకడుగు వేయించలేకపోయారు.

1946లో ప్రత్యక్ష చర్య అంటూ బొంబాయి నుంచి జిన్నా ఇచ్చిన పిలుపు భారతీయ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే కొన్ని నెత్తుటి వాక్యాలకు కారణమైంది. పిలుపు బొంబాయిలో ఇచ్చినా దాని ప్రతిధ్వని బెంగాల్‌లో కనిపించింది. బెంగాల్‌లో ముస్లింలీగ్‌ ‌నాయకుడు సుహ్రావర్ధి కనుసన్నలలో అంత దారుణమైన ఊచకోత జరిగిపోయింది. భారత్‌ను విభజిస్తాం, లేదంటే విధ్వంసం చేస్తాం వంటి ఘోరమైన ధోరణికి జిన్నా వచ్చారు. చిట్టచివరి వైస్రాయ్‌ ‌మౌంట్‌బాటన్‌తో కూడా జిన్నా, తమకు మాత్‌ ఈటెన్‌ ‌పాకిస్తాన్‌ ఇస్తున్నారంటూ వాదనకు దిగిన మాట నిజం. అంటే తాము కోరుకున్న ప్రదేశాలన్నీ ఇవ్వడం లేదనే.1946లో తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి కూడా జిన్నా పేచీ పెట్టారు. నిజాం హైదరాబాద్‌ ‌సహా కశ్మీర్‌, ‌జునాగఢ్‌ ఇం‌కా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న అనేక ప్రాంతాలను పాకిస్తాన్‌లో భాగం చేయాలన్నది జిన్నా గొంతెమ్మ కోరిక. ఆఖరికి దేశం విడిపోయిన తరువాత హైదరాబాద్‌ ‌నవాబుతో మంతనాలు జరిపారు. గిరిజనుల పేరుతో కశ్మీర్‌లోకి సైన్యాలను పంపారు.

ఇంత దారుణమైన పథకానికి కారకుడైన వ్యక్తి ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చాడని ఎలా చెబుతారు? ఎంతయినా అఖిలేశ్‌ ‘‌మౌల్వీ ములాయం సింగ్‌ ‌యాదవ్‌’ ‌కుమారుడే కదా! అయోధ్య ఉద్యమం సమయంలో ములాయంను అదే విశేషణంతో రామభక్తులు ఈసడించేవారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ‌బీజేపీ ప్రముఖుడు మౌర్య ‘అఖిలేశ్‌ అలీ జిన్నా’ అని పిలవడం కూడా అర్ధవంతంగానే అనిపిస్తుంది.ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు ఆలస్యం లేకుండానే తేల్చారు. ఆ ఎత్తుగడ వెనుక ఉన్నది ముస్లిం ఓట్లకు గాలమే.చరిత్రలోని కొన్ని భూతాలను ఎన్నికల వేళ మేల్కొల్పాలని చూడడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. గతంలో ముస్లిం-యాదవ్‌ ‌మైత్రి పేరుతో చిరకాలం రాజ్యం ఏలిన ములాయం యాదవ్‌, అఖిలేశ్‌ ‌యాదవ్‌లు ఉత్తర ప్రదేశ్‌ను అధ:పాతాళానికి పంపించారు.

 చాలా చిత్రంగా ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ చాలా యుక్తిగా అఖిలేశ్‌ ‌ప్రకటనను ఖండించారు. ముస్లిం ఓట్ల మీద ఆశతో తప్ప, జిన్నా గురించి తెలిసి అఖిలేశ్‌ ఈ ‌ప్రకటన చేయలేదు. ముస్లిం ఓటర్లలో తన వైభవం తగ్గకుండా చూసుకుంటూ ఒవైసీ, భారతీయ ముస్లింలకూ, జిన్నాకూ ఎలాంటి సంబంధం లేదని వెంటనే ప్రకటించారు. ఆయన సృష్టించిన పాకిస్తాన్‌ ఎలాంటి అధోగతిలో ఉందో ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం కలిగి ఒవైసీ ఇలాంటి ప్రకటన చేస్తే దేశమంతా సంతోషించవలసిందే. జిన్నాను చరిత్ర పురుషునిగా చూడక తప్పదు. అంతే తప్ప ఆయన ప్రేతాత్మను ఎన్నికల వేళ లేపుకు రావాలని అనుకోవడం సరికాదు. అధికారం కోసం వెంపర్లాడే అఖిలేశ్‌ ‌వంటి అంగుష్టమాత్రులు, చరిత్ర తెలియనివారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. తరువాత ప్రజలు అగచాట్లు పడతారు.

About Author

By editor

Twitter
Instagram