ఎవరి ప్రాణం! ఎంత విలువ?

సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి – 18 అక్టోబర్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఎవరి ప్రాణం విలువ ఎంత? బీజేపీ పాలిత రాష్ట్రాలలో దుర్మరణం పాలైనవారి ప్రాణాలకు ఉండే విలువ ఎంత? కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలలో హత్యకు గురైన వారి ప్రాణం విలువ ఎంత? జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలైతే వారి ప్రాణాల విలువ ఎంత? అక్టోబర్‌ ఆరంభంలో కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, ‌రాజస్తాన్‌లలో జరిగిన దుర్ఘటనలు, వాటిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి ప్రకటించడంలో కాంగ్రెస్‌, ‌మిగిలిన విపక్షాలు ప్రదర్శించిన వివక్ష చూశాక ఈ ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రం, వర్గాలను బట్టి పోయిన ప్రాణాలకు విలువ కట్టే దౌర్భాగ్య స్థితిలో వారున్నారు.

ఈ సంవత్సరంలో ఇంతవరకు 29 మంది పౌరులను జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు చంపారు. సెప్టెంబర్‌ ఆఖరు నుంచి ఇప్పటి వరకు ఏడుగురు సాధారణ పౌరులనూ పొట్టన పెట్టుకున్నారు. ఇదే పాత ఘటనల అనుభవంతో కొత్త భయాలకు పాదుకొల్పింది. మృతులలో హిందువులు, సిక్కులు, ముస్లింలు కూడా ఉన్నారు. మఖన్‌లాల్‌ ‌బింద్రూ అనే ప్రఖ్యాత ఔషధాల వ్యాపారిని, బిహార్‌ ‌నుంచి వచ్చి లోయలో భేల్‌పూరి అమ్ముకుంటూ జీవిస్తున్న వీరేంద్ర పశ్వాన్‌ను చంపారు. శ్రీనగర్‌ ‌శివార్లలో ఉన్న ఒక పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు సుపీందర్‌ ‌కౌర్‌, ఉపాధ్యాయుడు దీపక్‌ ‌చంద్‌ల ఉసురు తీశారు. లష్కరే తాయిబా మద్దతు ఉన్న ది రెసిస్టెన్స్ ‌ఫ్రంట్‌ ఈ ‌హత్యలకు కారణమని చెబుతున్నారు.

ఉగ్రవాదుల తాజా హత్యాకాండలో ఇద్దరు ముస్లింలు మరణించి ఉండవచ్చు. కానీ ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు మళ్లీ హత్యాకాండ మొదలుపెట్టారన్న భయాలు మొదలయినాయి. 1990 నాటి వలస గుర్తుకు వచ్చే విధంగా పండిత్‌లు లోయను వీడి జమ్ము దారి పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 75 వేలకు పైగా పండిత్‌ ‌కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు 800కు చేరాయి. ఏమైనా తాము లోయను వీడబోమని వీరు చెబుతున్నారు. కానీ 1990 నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని ఈ కుటుంబాలకు చెందిన రుద్రేశ్‌ ‌చకు అనే ఐటీ ఉద్యోగి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ నిషిద్ధ మత సంస్థలతో సంబంధం ఉన్న 500 మంది సహా ఏడు వందల మందిని భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఎక్కువ మంది గతంలో కిరాయి తీసుకుని రాళ్లు విసిరిన వాళ్లే. లోయ వీడే పని చేయవద్దనీ, 1990 నాటి ఘటనలు పునరావృతమైనాయని అనుకోవద్దనీ అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంతవరకు ఉగ్రవాదుల చేతులలో మరణించిన 29 మందిలో 21 మంది ముస్లిములేనని చెబుతున్నారు. ఇది పౌరులను చంపి బీభత్సం చేయడానికేనని వాదిస్తున్నారు. కశ్మీర్‌ ‌పరిస్థితి మీద కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు కూడా.

అక్టోబర్‌ 3‌న సంయుక్త కిసాన్‌ ‌మోర్చా ఉత్తర ప్రదేశ్‌లోని ఖింపూర్‌ ‌ఖేరిలో తలపెట్టిన ప్రదర్శన ఎనిమిది మంది రైతులు మరణానికి దారి తీసిందని ఆరోపణలు వచ్చాయి. ఆందోళనకారులను దూసుకుంటూ కారు వెళ్లడంతో ఆ మరణాలు సంభవించాయనీ, ఆ కారు కేంద్రమంత్రి అజయ్‌ ‌మిశ్రా తేరిది అని, ఆ సమయంలో కారు నడుపుతున్నది ఆయన కుమారుడు ఆశిష్‌ అని రైతుల ఆరోపణ. అక్టోబర్‌ 9‌న రాజస్తాన్‌లోని హనుమాన్‌గఢి జిల్లా ప్రేమ్‌పురాలో జగదీశ్‌ అనే ఎస్సీ యువకుడిని హత్య చేసి అతడి ఇంటి దగ్గరే పడేశారు. ఇది స్త్రీ వ్యవహారం.

ఇక్కడ గమనించవలసినది ప్రాణాలకు ప్రతిపక్షాల వారు కడుతున్న ఖరీదు. కశ్మీర్‌లో ఏడుగురిని పాశవికంగా హత్య చేసినా ప్రతిపక్షాలు నోరు విప్పలేదు. రాజస్తాన్‌లో ఎస్సీ యువకుడిని దారుణంగా హింసించిన వీడియో జాతి మీదకు వదిలిపెట్టి తరువాత హత్య చేశారు. కానీ విపక్షాలు లఖింపూర్‌ ‌ఖేరి మరణాల గురించి మాత్రమే ఆందోళన చేస్తున్నాయి. అది ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. కాబట్టి ఒక దెబ్బకు రెండు పిట్టలు కాదు, మూడు. మొదట కేంద్రమంత్రిని రాజీనామా చేయించాలని పట్టుపట్టే అవకాశం. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడం, రైతులను తమ వైపు తిప్పుకునే అవకాశం రావడం. కొత్తగా సెక్యులర్‌ ‌మతం పుచ్చుకున్న శివసేన రైతుల మరణానికి నిరసనగా మహారాష్ట్రలో సంపూర్ణ బంద్‌ ‌చేయించింది.

ప్రాణం ఎవరిదైనా ఒకటే. ఇదే ఒక ఎస్సీ వర్గీయుడు బీజేపీ పాలిత రాష్ట్రంలో దురదృష్టవశాత్తు మరణిస్తే అందుకు విపక్షాలు చేసే రచ్చ ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పాలిత రాజస్తాన్‌లో అదే జరిగితే ఎందుకు నోరు పెగలడం లేదు? కశ్మీర్‌లో ఏడుగురిని కాల్చి చంపేసినా ఎందుకు బంద్‌ ‌పిలుపు ఇవ్వరు? 1990లో కొన్ని లక్షల మంది పండిత్‌లు లోయ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చి పేవ్‌మెంట్ల మీద బతికినప్పుడు కూడా నోరెత్తని కాంగ్రెస్‌ ఇప్పుడు నోరెత్తక పోవడం ఆశ్చర్యం కాదు. కేంద్రమంత్రి తనయుడికి పోలీసు కస్టడీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. తరచి చూస్తే విపక్షాల వ్యూహాలలో కనిపించేది పాకిస్తాన్‌ అనుకూల వైఖరే. కశ్మీర్‌ ‌లోయలో పండిత్‌ల కడగండ్ల గురించి మాట్లాడితే రెండు విధాలుగా వాటికి నష్టం. ముస్లిం ఓట్లు పోతాయి. పాకిస్తాన్‌కు ఆగ్రహం వస్తుంది. అది సెక్యులర్‌ ‌కాంగ్రెస్‌కు భరించలేని క్షోభ. ఇక, ఓ ఎస్సీని కొట్టి చంపేసిన చోటు రాజస్తాన్‌. ‌కాబట్టి తప్పు పట్టక్కరలేదు. ఇదే కాంగ్రెస్‌ ‌వైఖరి. మనిషిని బట్టి, మనిషి చనిపోయిన స్థలాన్ని బట్టి, వర్గాన్ని బట్టి ప్రాణం విలువ కడుతూ దేశంలో విభజన తీసుకురావాలన్న కాంగ్రెస్‌ ‌విషపుటాలోచన ఎప్పుడో బయటపడింది. ఇలా చేస్తూ పోతే, ఎన్నికలలో ఆ కొన్ని సీట్లు కూడా రావు. విభజించుకుంటూ పోతే అధికారంలోకి కాదు, చెత్తబుట్టలోకి పోతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram