ఆంధప్రదేశ్‌లో విద్యారంగం భవిష్యత్తు ఏమిటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేశ్‌ ‌విచారణ ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం ఇక్కడ ఉంది. అందుకే ఆయన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ ‌కూడా వినిపిస్తున్నది. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం, రాజంపల్లి చెంచుగూడెంలోని గిరిజన పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్‌ ‌నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా చర్చి నిర్మించడానికి కొందరు క్రైస్తవులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అక్కడి చెంచులు అడ్డుకోగా వారి మీద దాడులు జరిగాయి. ఇదే జిల్లాకు చెందిన మన మంత్రిగారి ఆదేశానుసారం నిందితులపై ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయలేదు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఈ అంశంపై తీవ్ర నిరసన తెలియచేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తెలిసినవి కొన్ని తెలియనివి ఎన్నో.

రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రులకు తెలుగుభాష దూరం చేయాలనే భావంతో ప్రాథమిక స్థాయి వరకు మాతృభాష తెలుగు బోధించాల్సి ఉన్నప్పటికీ దానిస్థానంలో ఇంగ్లిష్‌ను ప్రవేశపెట్టారు. డిగ్రీలో తెలుగు మాధ్యమ బోధనను తొలగించారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దుచేశారు. ఎయిడెడ్‌ ‌వ్యవస్థను తొలగించేలా జీవోలు ఇచ్చారు. సరైన సర్వే లేకుండా ఇంటర్‌ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇవన్నీ విద్యావ్యవస్థను ధ్వంసం చేయడానికి ఉద్దేశించినవే. పీజీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ ‌సదుపాయం తొలగించడమంటే మానవ వనరులకు నైపుణ్యాన్ని అందించకపోవడమే.

మరో ఓటుబ్యాంకు జీవో రద్దు

ఓటుబ్యాంకు రాజకీయాలకై తల్లుల ఖాతాల్లో జమచేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌చెల్లింపు జీవోను హైకోర్టు రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. వృత్తివిద్యా కోర్సుల్లో గత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌పథకాన్ని అమలుచేస్తున్నాయి. కన్వీనర్‌ ‌సీటు సంపాదించిన వారికి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఫీజులను విద్యార్థి చదివే కళాశాలలకే నేరుగా జమ చేసేది. ఈ పక్రియతో విద్యార్థికి ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ప్రభుత్వ బాధ్యత ఉంది కాబట్టి బకాయిలు ఉన్నా కోర్సు కాలపరిమితి పూర్తయినా సర్టిఫికెట్లు ఇచ్చేసేవారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దీనికి జగనన్న విద్యాదీవెన పథకంగా పేరుమార్చింది. కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వం చెల్లించకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి వేస్తోంది. తల్లులు కళాశాలలకు వెళ్లి ఫీజులను చెల్లించాలని చెప్పింది. కానీ పేదరికంలో ఉన్న కొన్ని విద్యార్థి కుటుంబాలు ఫీజులను సొంత అవసరాలకు వాడుకుంటున్నాయి. 40 శాతం కళాశాలలకు చెల్లించడం లేదు. దాంతో కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు కళాశాలలకు అనుకూలంగా తీర్పు ఇస్తూ తల్లుల ఖాతాల్లో జమచేసేందుకు ఉద్దేశించిన జీవోను రద్దుచేసింది.

ప్రచార యావ కోసం

రాష్ట్ర ప్రభుత్వం ప్రచారయావ కోసం ఈ విధమైన కార్యక్రమాలకు పాల్పడుతోంది. ఫీజులను నాలుగు భాగాలు చేసి ఏడాదికి నాలుగుసార్లు తల్లుల ఖాతాల్లో వేసి తామే డబ్బు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి సొంత ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతిసారి పత్రికలు, చానళ్లలో కోట్లు ఖర్చుచేసి ప్రచారం చేసుకుంటున్నారు. రెండేళ్లుగా ఈ ప్రచారానికై ఖర్చుచేసిన సొమ్ము దుర్వినియోగం అయినట్లే. ఈ సొమ్మును ముఖ్యమంత్రి తన ఆస్తి నుంచి జమచేయాలి.

ఆ ఫీజులతో ఎలా నడుపుతారు?

రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణ ఇబ్బందిగా మారింది. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన చిన్న పాఠశాలలు ప్రభుత్వ తీరుతో మూసేసే పరిస్థితికి చేరాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రైవేట్‌ ‌పాఠశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి.

పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం రోజుకో జీవో విడుదల చేస్తూ యాజమాన్యాలను గందర గోళానికి గురిచేస్తోంది. తాము నిర్ణయించిన ఫీజులతో పాఠశాలలు నడపాలని ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం, విద్యా కమిషన్‌ ఉత్తర్వులు జారీచేశాయి. ఏడాదికి కేవలం రూ.10 వేలు, రూ.18 వేలు ఫీజులతో నాణ్యమైన బోధన అందించాలని ప్రభుత్వం కోరింది. ఈ ఫీజులతో పాఠశాలలు నడపడం ఏరకంగా సాధ్యమవుతుందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు రూ.30వేలకు పైగా జీతాలుంటాయి. పాఠశాల భవనాలకు అద్దె ఉండదు. కాని ప్రైవేటు పాఠశాలకు అద్దె, కరెంటు, పారిశుధ్య నిర్వహణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఇలా అన్నీ భారమే. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు వసూలుచేస్తే ఉపాధ్యాయులకు నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు మాత్రమే జీతాలు చెల్లించగలుగుతామని, విద్యాసంస్థల యాజమాన్యం చెబుతోంది. ఈ ఫీజులతో పాఠశాలలు ఎలా నడపగలమని వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని అంటున్నారు. పెరిగిన వ్యయం దృష్ట్యా ప్రైమరీకి రూ.20 వేలు, హైస్కూల్‌కు రూ.30 వేలు ఫీజులు నిర్ధారించాలని వేడుకుంటున్నారు. పాఠశాల గుర్తింపు కాలాన్ని మూడు సంవత్సరాలకు కుదించడం, విద్యుత్‌ ‌టారిఫ్‌లు పెంచడం కూడా యాజమాన్యాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి, ఎందరికో విద్యాదానం చేసే విద్యాసంస్థలకు రాయితీలు, రుణసదుపాయాలు కల్పించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram