ఇస్లామిక్‌ ‌దేశాల ద్వంద్వ వైఖరి

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

అఫ్ఘానిస్తాన్‌ ‌పరిణామాలు నాలుగైదు దేశాలకు తప్ప యావత్‌ అం‌తర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అక్కడి పరిణామాలు తమపై చూపగల ప్రభావం, అనుసరించాల్సిన వ్యూహాలు గురించి ప్రపంచదేశాలు అంచనా వేసుకుంటున్నాయి. అఫ్ఘాన్‌ ‌ప్రజల భవితవ్యం, ఆ దేశ మనుగడపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. తాలిబన్‌ ‌రాకతోనే ప్రజల్లో వణుకు మొదలైంది. 1996-2001 మధ్య వారి పాలనను చూసిన అఫ్ఘాన్‌ ‌వాసులు మున్ముందు జరగబోయే పరిణామాలపై ఒక అవగాహనకు వచ్చారు. అందరికీ క్షమాభిక్ష పెడతామని తాలిబన్‌ ‌ఘనంగా ప్రకటించినప్పటికీ గతానుభవాల నేపథ్యంలో ప్రజలు వారిని పెద్దగా విశ్వసించలేదు. వారు ఊహించినట్లుగానే అనంతర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా కాబూల్‌ ‌విమానాశ్రయంలో కాల్పుల ఘటనలు ఇందుకు దర్పణం పట్టాయి. బతికుంటే బలుసాకు తినవచ్చన్న ధోరణిలో దేశాన్ని వీడేందుకు సగటు అఫ్ఘానీలు తాపత్రయపడుతున్నారు. తమ సంగతిని పక్కనపెడితే కనీసం తమ బిడ్డలైనా బాగుంటే చాలన్న ఉద్దేశంతో వారిని ఏదో ఒక విధంగా దేశం దాటించేందుకు చేస్తున్న ప్రయత్నాలు హృదయ విదారకంగా ఉంటున్నాయి. కిక్కిరిసిన విమానాల్లో, ఆఖరికి దాని రెక్కలు పట్టుకుని ప్రయా ణించేందుకు సైతం సిద్ధపడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక విమానంలో చోటు దొరకక పోతుందా అన్న ఆశతో ప్రజలు కాబూల్‌ ‌విమానాశ్రయానికి బారులు తీరుతున్నారు. అక్కడే గంటలకొద్ది నిరీక్షిస్తున్నారు. ఇదీ అఫ్ఘాన్‌ ‌తాజా పరిస్థితి.

ఈ నేపథ్యంలోఅఫ్ఘాన్‌ ‌వాసులకు అండగా నిలవాల్సిన దేశాల్లో కొన్ని అందుకు భిన్నంగా వ్యవహ రిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. తాలిబన్‌కు మద్దతు, గుర్తింపు, అఫ్ఘాన్‌కు ఆర్థిక సాయం వంటి అంశాలను పక్కన పెడితే ఆ ప్రజలకు తామున్నా మంటూ భరోసా కల్పించడం అంతర్జాతీయ సమాజం ముందున్న తక్షణ కర్తవ్యం. ముఖ్యంగా దేశం వదిలి వెళ్లాలనుకుంటున్న శరణార్థులను అనుమతించడం అత్యంత కీలకం. ఈ బాధ్యతలను భుజానికి ఎత్తుకోవడానికి పలు పాశ్చాత్య దేశాలు ముందుకు వస్తున్నాయి. అయితే అఫ్ఘాన్‌ ఇరుగు పొరుగు దేశాలు, ఆ దేశ శ్రేయస్సే ప్రధానమని గంభీరంగా ప్రకటించే దేశాలు, ఇస్లామిక్‌ ‌సమాజం శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అఫ్ఘానీల ప్రయోజనాలు ఆయా దేశాలకు ఎంతమాత్రం పట్టక పోవడం గమనించదగ్గ విషయం. మూడు కోట్లకు పైగా జనాభా, రమారమి 6,52,864 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల అఫ్ఘాన్‌కు నాలుగు వైపులా భూ సరిహద్దులే ఉన్నాయి. సింహభాగం సరిహద్దును (దాదాపు 2670 కిలోమీటర్లు) పాకిస్తాన్‌తోనే పంచుకుంటోంది. ఒకప్పటి సోవియట్‌ ‌యూనియన్‌ ‌దేశాలైన తజికిస్తాన్‌తో 1357, తుర్కుమెనిస్తాన్‌తో 804, ఉజ్బెకిస్తాన్‌తో 144, చైనాతో 91 కిలోమీటర్ల సరిహద్దును అఫ్ఘాన్‌ ‌పంచుకుంటోంది. పశ్చిమాసియా దేశమైన ఇరాన్‌తో 1357 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఇవన్నీ ఇస్లామిక్‌ ‌దేశాలు, అఫ్ఘాన్‌ ‌శ్రేయస్సును ఆకాంక్షించే దేశాలే కావడం గమనార్హం. కానీ అఫ్ఘాన్‌ ‌శరణార్థులను అనుమతించేందుకు మాత్రం సిద్ధంగా లేవు. ఇప్పటికే తమ దేశంలో పెద్దసంఖ్యలో అఫ్ఘాన్‌ ‌శరణార్థులు ఉన్నారని, తమ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదని, అందువల్ల కొత్త వారిని అనుమతించబోమని పాక్‌ ‌తెగేసి చెప్పింది. అంతేకాక తమ సరిహద్దులను కూడా మూసేసింది. కొంతమంది పాకిస్తానీలు ఈ సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఉభయ దేశాల సరిహద్దుల్లోని ‘చమన్‌’ (‌పాక్‌ ‌పట్టణం) వద్ద బలగాల కన్నుగప్పి మనుషులను అక్రమంగా రవాణా చేస్తూ సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. పాక్‌ ‌చూపంతా తాలిబన్‌ అఫ్ఘాన్‌లో బలోపేతం కావడంపైనే ఉంది. అంతేతప్ప అక్కడి ప్రజల కడగండ్లు దానికి ఏమాత్రం పట్టడం లేదు. తాలిబన్‌ ఆ‌క్రమణ తరవాత సానుకూలంగా స్పందించిన నాలుగైదు దేశాల్లో పాకిస్తాన్‌ ఒకటి కావడం గమనార్హం. తాలిబన్‌కు నారూనీరూ పోసి పెంచి పోషించిన ఇస్లామాబాద్‌ ‌వారి అభీష్టానికి వ్యతిరేకంగా శరణార్థులను అనుమతిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. శరణార్థులను అనుమతిస్తే తాలిబన్‌ ‌బలహీనపడతారని దానివల్ల తాను అఫ్ఘాన్‌లో బలహీనపడతానన్నది ఇస్లామాబాద్‌ అసలు ఉద్దేశం. అందుకే శరణార్థుల విషయంలో ససేమిరా అంటోంది. పైకి మాత్రం ఇప్పటికే 1979 నాటి సోవియట్‌ ‌యూనియన్‌ ‌దురాక్రమణ సమయంలో వచ్చిన 1.4 మిలియన్ల మంది అఫ్ఘాన్‌ ‌శరణార్థులు ఉన్నారని చెబుతోంది. దీంతో తాము భారాన్ని మోస్తున్నామని చెబుతోంది. అయితే అప్పుడు శరణార్థుల రాకను అంగీకరించిన పాక్‌ ఇప్పుడు మాత్రం తిరస్కరించడం దాని ద్వంద్వ వైఖరికి దర్పణం పడుతోంది. పాక్‌ ‌గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టెలిజెన్స్) అధిపతి హమిద్‌ ‌ఫైజ్‌ ‌కాబోయే అఫ్ఘాన్‌ అధిపతి అయిన తాలిబన్‌ ‌కీలక నేత ముల్లా అబ్దుల్‌ ‌ఘనీ బరాదార్‌ను కాబూల్‌ ‌వెళ్లి కలిసి వచ్చారు. ప్రధాని ఇమ్రాన్‌, ‌విదేశాంగ మంత్రి షా మహముద్‌, ‌జాతీయ భద్రతా సలహాదారు మొయిన్‌ ‌యూసఫ్‌ ‌తదితరులు అఫ్ఘాన్‌ను ఆర్థికంగా ఆదుకుంటామని ప్రకటిస్తున్నారు తప్ప శరణార్థులను అనుమతించలేమని తేల్చి చెబుతున్నారు. ఇక యావత్‌ ఇస్లామిక్‌ ‌ప్రపంచానికి తానే ఏకైక ప్రతినిధి అని చాటుకునేందుకు ఇటీవల కాలంలో అదేపనిగా ఆరాట పడుతున్న నాటో (నార్త్ అట్లాంటిక్‌ ‌ట్రీటీ ఆర్గనైజేషన్‌) ‌దేశం టర్కీ తాజాగా అఫ్ఘాన్‌ ‌శరణార్థుల విషయంలో మాత్రం ‘నో’ అంటోంది. ఇరాన్‌ ‌సరిహద్దుల గుండా వచ్చే అఫ్ఘాన్‌ ‌శరణార్థులను అడ్డుకునేందుకు అక్కడ మూడు మీటర్ల ఎత్తుతో పెద్ద గోడను నిర్మిస్తోంది. టర్కీకి ఇరాన్‌తో దాదాపు 295 కిలోమీటర్ల సరి హద్దుంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌ ఆ‌శ్రయం ఇవ్వడాన్ని సైతం టర్కీ అధినేత రెసెప్‌ ‌తయ్యిద్‌ ఎర్డోగన్‌ ‌బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.

ఇక తజికిస్తాన్‌, ‌కజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌లది  సైతం అదే పరిస్థితి. తాలిబన్‌ అఫ్ఘాన్‌ను ఆక్రమిస్తున్న సమయంలోనే అఫ్ఘాన్‌ ‌వలసలను అడ్డుకునేందుకు తజకిస్తాన్‌ ఇరవై వేల మంది సైనికులను సరిహద్దుల్లో మోహరించింది. తాలిబన్‌ ‌నాయకత్వంలోని అఫ్ఘాన్‌ ‌తమకు అత్యంత సన్నిహితమని చంకలు చరుచుకునే చైనా అక్కడి పరిణామాల నుంచి చలిమంటలు కాచు కునే ప్రయత్నంలో ఉంది తప్ప అఫ్ఘాన్‌ ‌శరణార్థుల గురించి అసలు ఆలోచించడం లేదు. ఇక్కడి సహజ వనరులపై కన్నేసిన బీజింగ్‌ ‌తెలివిగా పావులు కదుపుతోంది. దాదాపు 91 కిలోమీటర్ల సరిహద్దు చైనాకు ఉంది. అయినా అఫ్ఘాన్‌ ‌శరణార్థులను అనుమ తించడం లేదు. అఫ్ఘాన్‌లోని బాదక్షాన్‌ ‌ప్రావిన్స్‌తో బీజింగుకు సరిహద్దుంది. పైకి చెప్పనప్పటికీ తమ దేశంలోని జిన్‌ ‌జియాంగ్‌ ‌ప్రావిన్స్‌లోని తాలిబన్‌ ఎక్కడ చిచ్చు పెడతారేమోనన్న అనమానం దానికుంది. ఈ ప్రావిన్స్‌లోని ముస్లింలు బీజింగ్‌పై అసమ్మతితో ఉన్నారు. 57 ఇస్లామిక్‌ ‌దేశాల వాణిని వినిపించే ఓఐసీ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కంట్రీస్‌) ‌సైతం ఈ విషయంలో మౌనంగా ఉంది. ఈ కూటమి లోని కీలక సంపన్న దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ), బహ్రెయిన్‌, ఇరాన్‌ ‌సైతం మౌనాన్నే ఆశ్రయించడం గమనించదగ్గ అంశం. ఇందులో పాకిస్తాన్‌ ‌కూడా భాగస్వామే కావడం విశేషం. టర్కీ దాదాపు 720 బిలియన్‌ ‌డాలర్లు, సౌదీ అరేబియా 700, యూఏఈ 421, బంగ్లాదేశ్‌ 324, ‌పాకిస్తాన్‌ 263 ‌బిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. ముస్లిముల్లో షియా తెగకు ప్రాతినిథ్యం వహించే ఇరాన్‌ ‌సైతం శరణార్థు లను అనుమతించడం లేదు. ఇప్పటికే తమ దేశంలో 3.38 మిలియన్ల మంది అఫ్ఘాన్‌ ‌శరణార్థులు ఉన్నారని తాజాగా అనుమతించలేమని టెహరాన్‌ అధినేత ఇబ్రహిం రైసీ స్పష్టంచేశారు. వీటిల్లో ఒక్క బంగ్లాదేశ్‌ ‌మాత్రమే అఫ్ఘాన్‌ ‌శరణార్థులను ఆదరిస్తోంది. మిగిలిన దేశాలు తగిన ఆర్థిక స్థోమత కలిగి ఉన్నప్పటికీ ముందుకు రావడం లేదు. తాలిబన్‌ను సమర్థించే రష్యా సైతం శరణార్థలను అనుమతించేది లేదని చెబుతోంది. అఫ్ఘాన్‌తో సుదీర్ఘ సరిహద్దు, ప్రత్యేక అనుబంధం గల పాకిస్తాన్‌ ‌చేతులు దులిపేసుకున్న ప్పుడు ఇతర దేశాలను తప్పుపట్టడంలో అర్థం లేదు. తాజా పరిణామాలు ఇస్లామిక్‌ ‌ప్రపంచం ద్వంద్వ ప్రమాణాలను చాటుతున్నాయి. 1996-2001 మధ్య కాలంలో తాలిబన్‌ ‌పాలనలో ఈ దేశాలు అఫ్ఘాన్‌ ‌శరణార్థులను అనుమతించడం తెలిసిందే.

ఇదే సమయంలో అఫ్ఘాన్‌తో ఎలాంటి సరిహద్దు లేని, భౌగోళికంగా ఎక్కడో సుదూరాన ఉన్న అనేక పాశ్చాత్య దేశాలు శరణార్థులను ఆదుకునేందుకు తమ వంతు చర్యలు చేపడుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ‌కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ ‌వంటి దేశాలు శరణార్థులకు దన్నుగా నిలుస్తున్నాయి. ఈపాటి ఉదారతను, పెద్ద మనస్సును ఇస్లామిక్‌ ‌దేశాలు ప్రదర్శించలేక పోయాయి. అంటే పరోక్షంగా ఉగ్రవాద ముఠా అయిన తాలిబన్‌కు దన్నుగా నిలుస్తున్నాయన్నది సుస్పష్టం. ఇది యావత్‌ ‌ప్రపంచ భద్రతకు ప్రమాదకర పరిణామం. ఈ విషయాన్ని ఆయా దేశాలు ఎంత త్వరగా గుర్తిస్తే అంతగా అంతర్జాతీయ సమాజానికి, అఫ్ఘాన్‌ ‌ప్రజలకు మంచిది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram