ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం విద్యావ్యవస్థలో తెస్తున్న మార్పులు మన సంస్కృతిని  కనుమరుగు చేస్తున్నట్లు హిందూసమాజం ఆరోపిస్తోంది. ప్రాథమిక విద్య నుంచి పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ ‌వరకు అమలు చేస్తున్న సంస్కరణలు సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నట్లు భావిస్తోంది. ముఖ్యంగా మాతృభాష తెలుగును మన నుంచి దూరం చేయడాన్ని తప్పుపడుతోంది. ప్రభుత్వ విద్యావ్యవస్థను సంస్కరించుకోలేక తప్పంతా ప్రైవేటు విద్యావ్యవస్థపై నెట్టివేసి వాటిపై దాడికి పూనుకుంది. తెలుగును తొలగించి మొత్తం ఇంగ్లిషులో విద్యాభోధన ప్రకటించింది. ఫీజుల నియంత్రణ పేరిట వాటిపై ఉక్కుపాదం మోపింది. పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌కు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంటును నిలిపివేసింది. ఎయిడెడ్‌ ‌విద్యాసంస్థలకు ఇస్తున్న ఎయిడ్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు తీసేసి బోధనా వృత్తిపై అనాసక్తి కలిగేలా చేస్తోంది.  ఈ చర్యలన్నీ హైందవ మతంపై జరుగుతున్న దాడిగా హిందూసమాజం, ధార్మిక సంస్థలు భావిస్తున్నాయి. ఒకప్పుడు భారతీయులను లొంగదీసుకునేందుకు మాతృభాషల ధ్వంసానికి సంకల్పించిన బ్రిటిషర్ల ఎజెండాను నేడు జగన్‌ ‌ప్రభుత్వం సంపూర్ణం చేసేందుకు ప్రయత్నిస్తుందని హిందూ ధార్మిక సంస్థలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి.

భారతదేశాన్ని పాలించిన ముస్లింలు, బ్రిటిషర్లు వీలైనంతవరకు మన సంపదను దోచుకున్నారు. మతమార్పిళ్లు భారీగా చేశారు. అయినా హిందూమతం బతికింది. తాము ఎన్ని కష్టాలుపెట్టినా, అత్యాచారాలు చేసినా, చంపినా ప్రజలు ఇంకా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పోరాడటం, వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటంతో బ్రిటిషర్లు ఆందోళనకు గురయ్యారు. దీనికి కారణాలు తెలుసుకోవాలని ఇక్కడి పాలకులు ఆంగ్లభాషా పండితుడు రాబర్ట్ ‌మెకాలేను భారత్‌కు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన మెకాలే భారతీయుల జీవన విధానాన్ని పరిశీలించి వారి ఆత్మవిశ్వాసానికి మూలకారణం ఈ దేశంలోని మాతృభాషల్లో ఉన్న సాహిత్యం, పురాణాలు, ధార్మిక అంశాలు, నీతిసూక్తులు వంటివని గ్రహించాడు. వాటిని విచ్ఛిన్నం చేస్తే తప్ప భారతీయులు బ్రిటిషర్లకు లొంగరని భావించాడు. మన మాతృభాషలను ధ్వంసం చేయాలని బ్రిటిషర్లకు సలహా ఇచ్చాడు.

మెకాలే సూచన ప్రకారం బ్రిటిషర్లు విద్యను అందరికీ అందుబాటులోకి తెస్తున్న ముసుగులో గురుకులాల వ్యవస్థను తొలగించి ప్రభుత్వ స్కూళ్లను తెరిచారు. ఇంగ్లిషు భాషను నేర్పించి 35 మార్కులకు ఉత్తీర్ణులు చేసి గుమస్తా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ కుట్రలో మగ్గిన దేశం తరాలుగా దిగజారుతూ రానురాను తెలుగు భాషపై పట్టుకోల్పోయింది. నేడు మన పురాణాలు, ఇతిహాసాలు, ఆయుర్వేదం, భాష పనికిరాదని ప్రచారం చేసే స్థాయికి చేరింది. దేశభాషల పట్ల ద్వేషం, ఇంగ్లిషు పట్ల మోజు పెంచుకున్నాం. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు మూలకారణం మనం అరకొరగా చదువుతున్న ఆంగ్ల మాధ్యమ విద్యే.

తెలుగుభాషపై మెకాలే వేసిన వ్యతిరేక బీజాలను జగన్‌ ‌నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మెకాలే కలను సంపూర్ణంగా అమలు చేసేందుకు నిర్ణయించుకుంది. తెలుగుభాష నిరర్ధకమైన దని, ఉద్యోగాలు రావని ప్రచారంచేసి తొలగించే ప్రయత్నం చేస్తోంది. ప్రాథమిక విద్యతో పాటు, పదో తరగతి వరకు ఆంగ్లాన్ని అమలుచేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది. డిగ్రీ కోర్సుల్లోను తెలుగు మాధ్యమాన్ని రద్దుచేసి ఆంగ్లాన్ని అమలుచేస్తోంది.

ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్చుకోకుంటే ఆయా అంశాల్లో అవగాహన ఉండదు. దీంతో తెలుగు రాదు. ఆంగ్లంరాదు. ఏదీరాదు. ఆంగ్లం వల్ల మన సంస్కృతి మనకు దూరం అవుతుంది. విలువలు, సాంప్రదాయాలు కోల్పోతాం. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అభ్యాసం చేస్తారు.

ఇదీ వాస్తవం!

పేదలకు ఆంగ్లమాధ్యమాన్ని అందిస్తే వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. కాని ఇది నిజం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేకపోవడాన్ని సాకుగా చేసుకుని ప్రైవేటు పాఠశాలలు తమ మార్కెటింగ్‌ ‌నైపుణ్యాన్ని ఉపయోగించి తల్లిదండ్రుల్ని ఆకర్షించి పిల్లల్ని చేర్చుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో కూడా మాతృభాష అభ్యసన జరిగేలా ప్రభుత్వం అమలుచేయాలి. అంతేకాని ప్రైవేటు పాఠశాలల స్థాయిని అందుకోకుండా.. దానిని సాకుగా చూపించి తమ ఎజెంండా అయినా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాలని, బైబిల్‌కు దగ్గర చేయాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది.

ప్రైవేటుపై దాడి

విద్యార్థి భవిష్యత్‌ను నిర్ణయించేది ఇంటర్మీడియట్‌ ‌కోర్సు. ఇంజనీరింగ్‌, ‌మెడికల్‌, అ‌గ్రికల్చరల్‌, ‌సైన్స్ ఇలా వృత్తివిద్యల్లో ప్రవేశానికి అవసరమైన శిక్షణ ఇంటర్‌లోనే తీసుకోవాలి. ఇంటర్‌లో వచ్చిన మార్కులు, ఎంట్రన్స్ ‌పరీక్షల్లో వచ్చిన మార్కులతోనే పేరొందిన విద్యాసంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి. రాష్ట్రంలో ఎంసెట్‌ ‌ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రభుత్వ కళాశాలలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. దాంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఇంటర్‌లో వ్రవేశించి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి ర్యాంకులు సాధిస్తోంటే తల్లిదండ్రులు ఆకర్షితులై తమ పిల్లలను ఈ విద్యాసంస్థల్లో చేర్పించారు. ఎక్కువ ఖర్చైనా అంగీకరించి వీటిలో చేర్పిస్తున్నారు. కాని ప్రభుత్వం మాత్రం తన తప్పును తెలుసుకోలేదు. సరికదా దిద్దుబాటు చర్యలకు పూనుకోలేదు. ప్రభుత్వ ఇంటర్‌ ‌కళాశాలలను ప్రక్షాళించక, ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రతాపాన్ని చూపుతోంది. అడ్మిషన్ల అంశంలో జోక్యం చేసుకుని విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతోంది. అదెలాగో చూద్దాం…

ఇంటర్‌ ‌చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు నచ్చిన జూనియర్‌ ‌కళాశాలలో •రే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని ఆదేశించింది. కనీసం 10 ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జూనియర్‌ ‌కళాశాలకు మొత్తం గరిష్టంగా మూడు వందల యాభై ఆరు సీట్లు, తరగతికి 40 సీట్లు మాత్రమే ఉండాలని నిర్దేశించింది. అయితే గరిష్టంగా రూ. 20 వేలు మాత్రమే ఫీజు ఉండాలని ఉత్తర్వులిచ్చింది. తరగతిలో విద్యార్థుల సంఖ్య, ఫీజుల నియంత్రణ వంటి చర్యలు విద్యాసంస్థలు, ప్రమాణాలను అస్థిరపరిచేవిగా ఉన్నాయని ప్రైవేటు ఇంటర్‌ ‌కళాశాలల యాజమాన్యాలు అంటున్నాయి. ప్రభుత్వం పేర్కొన్న అంశాలేవీ తమకు గిట్టుబాటు కావని చెబుతున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పరిమితి చేయడంతో విద్యార్థులకు కోరుకున్న కళాశాలలో సీటు రాదు. ఊరి చివర కళాశాలలో సీటు వస్తుంది. ఉదయం, సాయంత్రం పిల్లలను కళాశాలకు తీసుకెళ్లడం, తీసుకురావడం సమస్యగా మారుతుంది. దీనికోసం ఒకరికి విధులు కేటాయించాలి. రవాణ ఖర్చులు భరించాలి. ఇదంతా తల్లిదండ్రులకు మానసిక ఒత్తిడితో పాటు ఆర్థిక భారంగా మారుతుంది.

ఇంటర్‌తో పాటు పదో తరగతి వరకు బోధించే ప్రైవేటు విద్యాసంస్థలపైనా రాష్ట్ర ప్రభుత్వం పంజా విసిరింది. పాఠశాలల ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు సహేతుంగా లేవని యాజమాన్యాలు అంటున్నాయి. పాఠశాల గుర్తింపు కాలాన్ని మూడు సంవత్సరాలకు కుదించడం, విద్యుత్‌ ‌టారిఫ్‌లు పెంచడం కూడా యాజమాన్యాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రాంతాన్ని బట్టి ఏడాదికి కేవలం రూ.10 వేలు, రూ.18 వేలు ఫీజులతో నాణ్యమైన బోధన అందించాలని ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. అద్దె, కరెంటు, పారిశుధ్య నిర్వహణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఇలా అన్నీ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యానికి భారమే. ఈ ఫీజులతో పాఠశాలలు ఎలా నడపపగలమని వీరు ప్రశ్నిస్తున్నారు. పెరిగిన వ్యయం దృష్ట్యా ప్రాథమిక విద్యకు రూ.20 వేలు, హైస్కూల్‌కు రూ.30 వేలు ఫీజులు నిర్ధారించాలని వేడుకుంటున్నారు. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన చిన్న పాఠశాలలు ప్రభుత్వ తీరుతో మూసేసుకునే పరిస్థితికి చేరాయి.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram