సంస్కారం అంటే ఏమిటి?

-సురేష్‌జీ సోని (ఆర్‌ఎస్‌ఎస్‌-అఖిల భారత కార్యకారిణి సదస్యులు)

పరస్పర సమన్వయంతో కూడిన కుటుంబం అంటే మన దగ్గర ఆత్మీయత, గౌరవం, భక్తితో పాటు జీవితాన్ని కొనసాగించే ఒక కేంద్రం. దుర్భలుడయినా, యోగ్యుడయినా, గుణహీనుడయినా, గుణవంతు డయినా-వారంతా గౌరవంతో, శ్రద్ధతో, ఆత్మీయతతో జీవనాన్ని కొనసాగించేందుకు ఆశ్రయమిచ్చే స్థలం కుటుంబం. అందుకే ప్రాచీన కాలంలో మన వద్ద నిరాశ్రయులకు ఆవాసాల ఏర్పాటు అవసరం ఉండేది కాదు, అనాథ శరణాలయాల, వృద్ధాశ్రమాల అవసరం ఉండేది కాదు. వికలాంగులైన పిల్లలుగాని, ముసలి వారు గాని ప్రేమ పూర్వకమయిన ఆత్మీయతలతో, గౌరవ మర్యాదలతో, ఆనందంతో బ్రతుకుని వెళ్లదీసే అవకాశం ప్రతి ఇంట్లో ఉండేది. ఈ క్రమంలో అకస్మాత్తుగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉత్పన్నమయి నప్పుడు అవసరమైన నిర్వహణకు కృత్రిమ వ్యవస్థలని ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. అందుకే మన పూర్వీకులు మనిషి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబ వ్యవస్థని అద్భుతంగా మలిచారు.

మనిషి ‘స్వ’ అనగా స్వార్థం నుండి ముందుకెళ్లి పరమార్థం వైపు చింతన చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం ఒకమాట చెప్పాల్సి వస్తే మనిషి అంటే ‘నేను’ అనే భావన నుండి ‘మనం’ అనే దాకా పరిణతి చెందటమే. దీన్నే శాస్త్రీయ పద్ధతిలో చెప్పాల్సి వస్తే ‘అహం’ నుండి ‘బ్రహ్మ’ దాకా కొనసాగించిన యాత్ర, నరుడి నుండి నారాయణుడిగా పరిణతి చెందటానికి కొనసాగించిన యాత్ర, జీవాత్మ నుండి పరమాత్మగా మారేందుకు చేసిన యాత్ర అనవచ్చు. వీటన్నిటికీ తొలిమెట్టు వికసించిన కుటుంబం. కుటుంబం లోపల చిన్న పిల్లవాడిని చూస్తే పరమస్వార్థిగా అగుపిస్తాడు. ఆ ఆట వస్తువు తనదే అంటూ మరెవరూ దానిని తీసుకోకూడదంటాడు.

అయితే మెల్లమెల్లగా కుటుంబంలోని వాతావరణంతో వికాసం చెందు తాడు. వీళ్లు నీ సోదరులు, వీళ్లు నీ సోదరీమణులు అని చెప్పటంతో ఆత్మీయత మరింతగా విశాల మౌతుంది. నేను, నాది అనేదాని నుండి బయటపడి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, అమ్మానాన్నల దాకా అతని పరిధి చేరుకుంటుంది. ఈ పక్రియ ఇలా ముందుకు సాగుతుంది. అందుకే కుటుంబాన్ని మానవ వికాసానికి తొలి మెట్టుగా చెప్పుకోవాలి. ఈ దృష్టితో ఒకవేళ దీన్ని వ్యవహారంలోకి తేవాలంటే రెండు విషయాల ద్వారా ఇది సాధ్యమౌతుంది. అన్నిటికన్నా మొదలు మనిషి భావనాత్మక దృష్టితో, ఆలోచనా దృష్టితో పరిణతి చెందాలి. అప్పుడే తనలోని సంవేదన శీలత పెరుగుతుంది. తన ఆలోచనా పరిధిలో మమత్వంలోని నేను అనే భావన నుండి ఎదిగి, సృష్టి నుండి ఎంత అధికంగా తీసుకుంటే అంతే అధికంగా, అదే ప్రామాణికతలో ఇవ్వడానికి నేను ఉదారంగా వ్యవహరించగలగాలి. ఈ భావన దేనివల్ల సాధ్యమౌతుందో, దాన్నే మనం ‘సంస్కారం’ అంటున్నాం. మనిషి దేవునిగా మారాలని మన కోరిక. కాని మనిషి సహజంగా స్వకేంద్రితుడు (నేను, నాది అనే భావన కలిగి ఉంటాడు). ఈ భావన నుండి బయట పడితేనే అది సంస్కారమవుతుంది.
అభిప్రాయం, ఆలోచన, క్రియశుద్ధి

సంస్కారం అంటే ఏమిటి? ఏ పనుల ద్వారా, ఏ ఏ పద్ధతుల ద్వారా, ఏదేని పదార్ధం ద్వారా వ్యక్తి యోగ్యుడవుతాడో.. అది సంస్కారం. మన దగ్గర ప్రతి ఇంట్లో చెప్పొచ్చేదేమంటే మనిషికి కోరిక ఉంటుంది, మానవుడు పరమాత్ముడుగా మారాలనే ధోరణి మానవుడి సహజ స్వభావంలో ఒక భాగం. నేను, నాది అనే భావన కేంద్రితమై ఉండటం మూలాన ఇతడిని సంస్కారం వైపు తీసుకెళ్లాలి. ప్రాచీనకాలం నుండి ప్రతి ఇంట్లో ‘షోడష (16) సంస్కారా’ల పద్ధతి కొనసాగుతూ వస్తోంది. ఇక్కడో విషయముంది, సంస్కారమన్నది భావనతో, ఆలోచనతో మనల్ని ఏకం చేస్తుంది. అయితే భావన, ఆలోచన మాత్రమే ఉంటే సరిపోదు, అది ఆచరణలోకి రావాలి, మన వ్యవహారాల్లో భాగం కావాలి… ఇది కూడా అత్యవసరం.

అందుకే మనవాళ్లు శుద్ధి కావాలని అంటుం టారు. జీవితంలో మూడు రకాలుగా శుద్ధిని పాటించాలి. భావ శుద్ధి కావాలనేది ఒకటి, అంటే వారి అభిప్రాయాలు స్వచ్ఛం కావాలి. ఒకవేళ ఎవరి పట్లయినా మన అభిప్రాయాలలో ద్వేషభావన ఉందనుకోండి, చెడుగా ఆలోచిస్తున్నామనుకోండి -అవతలి మనిషి కూడా అలానే మారతాడు. తులసీదాసు రామచరిత మానస్‌లో ఓ చోట ‘జాకీ రహీ భావనా జైసీ ప్రభు మూరత్‌ ‌దేఖీ తిన్‌ ‌తైసీ’ అని చెబుతారు. రాముడు ఒక్కడే. అయితే తనని ఒకరు పుత్రుడిగా చూశారు, మరొకరు భర్తగా భావించారు, ఇంకొకరు మిత్రుడిగా చూస్తే, వేరొకరు శత్రువుగా భావించారు. అక్కడున్నది ఒక్కరే, కానీ తేడా భావనలో వ్యక్తమవుతోంది. కనుక భావ శుద్ధి కావాలని చెప్పారు. భావన తరువాత ఆలోచన వస్తుంది. అందుకే ఆలోచనా శుద్ధి కావాలంటారు. ఇక మూడవది క్రియా శుద్ధి. క్రియతో పరిశుద్ధమైన మనసు అవతరిస్తుంది. భావ శుద్ధి, ఆలోచనా శుద్ధికి సంబంధించిన పక్రియ సంస్కారం ద్వారా, ఆచారం ద్వారా అమలౌతుంది. దీన్నే యజ్ఞం అని కూడా చెబుతారు. అందుకే మన సమస్తాన్ని ఒకానొకప్పుడు ఒక చిత్తరువు చేసి నిలబెట్టడం జరిగింది. భారతీయ సమాజ జీవనం రెండు అనుభవాల ప్రపంచమని ఇవాళ కూడా పలువురు చెబుతుంటారు. ఈ ప్రపంచంలో ఇస్లాం మతావలంబులు ప్రబల మయ్యారు, ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయారు.. ప్రపంచానికి కూడా వారి విషయం అనుభవంలోకి వచ్చింది. యూరోపియన్ల శక్తి కూడా ప్రబలమయింది, వారు కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించారు. ప్రపంచానికి వారి విషయం కూడా అనుభవంలోకి వచ్చింది. ఈ రెండు అనుభవాలు ఎలాంటివి? ఇవి రెండూ ఒకే విధమైన అనుభవాలు.. అన్ని వైపులా దోపిడీలు జరిగాయి, కాలనీల నిర్మాణాలు జరిగాయి. అయితే వీళ్లు మేల్కొనడానికి మునుపే వేల ఏళ్ల క్రితం భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లారు. అయితే ఎక్కడ కూడా భారతీయులు దోపిడీలకు పాల్పడలేదని, వినాశ కార్యాలకు పూనుకోలేదని, అక్కడ ఉన్న వారిని మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లారని లోకులు చెబుతారు. అక్కడి వారికి వ్యవసాయం రాకపోతే మన వాళ్లు వారికి వ్యవసాయం నేర్పారు. ఎక్కడయితే విద్య లేదో అక్కడున్న వారికి మనవాళ్లు విద్య నేర్పారు. అదే విధంగా ఎక్కడయితే సాంస్కృతిక జీవన విలువలు లేవో వాటిని అక్కడి వారికి మనవాళ్లే బోధపరిచారు. అందుకే ఇవాళ కూడా ప్రపంచంలోని వివిధ దేశాలలో భారత్‌తో ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆదరభావాన్ని వ్యక్తం చేస్తుంటారు.

ఇదంతా ఎలా ఉత్పన్నమైంది?
యజ్ఞాలు

ఇది రెండు విషయాల ద్వారా సాధ్యమయింది. సంస్కారాల ద్వారా అలాంటి వ్యక్తిగా మారటం, కుటుంబాలను నిర్మాణం చేయటం, యజ్ఞం ద్వారా ఈ జీవన పద్ధతిలో ప్రవేశించటం, వ్యవహారాల్లో చొచ్చుకొని పోవటం జరిగింది. అందుకే వీటికి ‘సంస్కారం’, ‘యజ్ఞం’ అనే రెండు దీపస్తంభాలు ఆధారభూతమయ్యాయి. ఈ దృష్టితో మనం యోచిస్తున్నప్పుడు ‘యజ్ఞ’ ప్రస్తావన రాగానే మన మనసులో ఒక చిత్రం కదులాడుతుంటుంది. ఒక యజ్ఞ కుండం ఉంటుంది, అందులో అగ్ని జ్వలిస్తూ ఉంటుంది, కొందరు వేద మంత్రాలను పఠిస్తుంటారు, మరికొందరు యజ్ఞకుండంలో ఆహుతులిస్తున్న దృశ్యం కళ్ల ముందు ప్రత్యక్షమౌతుంది. అయితే ఇక్కడ యజ్ఞం అనే పదాన్ని విస్తృతార్థంలో చూడాలి. ఇక్కడ యజ్ఞ వాటికలో అగ్నిని జ్వలింపచేస్తు యజ్ఞం చేస్తుంటారు, ఇది దీని ఒక రూపం. యజ్ఞంలో ఒక విశేషత ఉంది. ఆహుతి ఇచ్చే సమయాన వారేమి చెబు తుంటారో మీరంతా వినే ఉంటారు… అగ్నయే స్వాహా – ‘ఇదం అగ్నయే ఇదం న మమ’ అని ఆహుతి ఇచ్చే వ్యక్తి అంటూ ఉంటాడు. ఇదంతా అగ్నిదే, నాది కాదు అని అర్థం. ఇంకొందరు ‘ఇంద్రాయ స్వాహ – ఇదం ఇంద్రాయ ఇదం న మమ’ అని పలుకుతుంటారు. మనం మాత్రం ‘రాష్ట్రాయ స్వాహా – ఇదం రాష్ట్రాయ ఇదం న మమ’ అని చెబుతాం. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌ద్వితీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌పరమ పూజనీయ గురూజీ ఫోటో మనందరం చూసే ఉంటాం, అందులో గురూజీ యజ్ఞం ముందర కూర్చొని యజ్ఞ కుండంలో ఆహుతినిస్తూ ఉంటారు.. ఫోటో క్రింద ‘ఇదం రాష్ట్రాయ ఇదం న మమ’ అని వ్రాసి ఉంటుంది.

ఈ యజ్ఞ పరంపరలో వాస్తవానికి చూడబోతే యజ్ఞంలో కర్తవ్యం కర్మ రూపాన ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు దీని గూర్చి చాలా చక్కగా భగవద్గీతలో బోధించారు. సమస్త విశ్వం అంటే ఏమిటి, అది ఎలా నిర్మితమైంది అనే విషయాన్ని భగవానుడు వివరించాడు. ‘సః యజ్ఞః ప్రజా శ్రేష్ఠవా పురోవాచః సృష్టి’. అంటే భిన్న భిన్న మానవ సమూహాలు తమ తమ కర్తవ్య కర్మలతో కూడి ఉన్నాయని అర్థం. అందుకే ప్రతి ఒక్కరికీ తమ తమ కర్తవ్య కర్మలుం టాయని యజ్ఞ రూపంలో చెప్పటం జరిగింది.

సమస్త జగత్తు యజ్ఞమయమని కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇంకోసారి చెబుతారు. గీతలో ఒక కాల చక్రాన్ని (సైకిల్‌) ‌వర్ణిస్తారు. ‘అన్నాద్భవన్తి భూతాని’, మనిషి ఉత్పన్నమెందుకు అవుతాడు? అమ్మ-నాన్నల కలయికతో కదా.. అదెందుకు జరుగుతుందంటే అన్నం కారణంతో అని చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రాణుల ఉత్పత్తి అన్నం కారణంగా జరుగుతుంది. ‘పర్జన్యా దన్నసంభవః’ వర్షంతో అన్నం ఉత్పన్న మవుతుంది. ‘యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః’ – వర్షం (మేఘం) యజ్ఞం వల్ల సంభవిస్తుంది. యజ్ఞం సత్కర్మ వలన కలుగుచున్నది.

‘కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్‌
‌తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్‌’

వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగు చున్నది. కాబట్టి అంతా వ్యాపించియున్న బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానినిగా తెలుసుకొనుము.

ఒకవేళ సంపూర్ణ సృష్టికి సంబంధించిన చక్రాన్ని చూస్తే అందరు అందులోనే నిబిడీకృతమై ఉంటారు. ఒకరిపై మరొకరు ఆధారపడటం. ఒకరినొకరు పోషించుకోవటం వల్లే ప్రపంచం మనుగడ సాగుతోంది. ఒక్కసారిగా దాన్ని విడగొట్టి చూడండి, అందరూ సమాప్తమవుతారు. వనస్పతి జగత్తు కార్బన్‌ ‌డయాక్సయిడ్‌ ‌తీసుకొని ఆక్సిజన్‌ ఇస్తుంది. ప్రాణి జగత్తు మాత్రం ఆక్సిజన్‌ ‌తీసుకొని కార్బన్‌ ‌డయాక్సయిడ్‌ని వదులుతుంది. ఇదొక చక్రం (సైకిల్‌) అం‌దుకే జీవితమన్నారు. ఈ జీవితాన్ని మీరు తెగ్గొట్టండి, సమస్యలు ఒకదాని వెనుక మరొకటి ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అందుకనే యజ్ఞమే సర్వమని అంటారు. దీన్నే మరో రూపంలో కూడా చెప్పవచ్చు- యజ్ఞ భావనతో చేసిన కర్మ బంధనాలకు కారణం కాబోదని. స్వార్థంతో చేసిన కర్మ మనల్ని బంధనాల్లో పడ వేస్తుందని శాస్త్రం చెబుచున్నది. పరమార్థంతో చేసే కర్మ మనల్ని దైవత్వం వైపుగా తీసుకెళుతుంది, ముక్తివైపు తీసుకెళుతుంది. దైవత్వాన్ని అందరూ కోరుకుంటారు. అయితే అందుకు అవసరమైన

సాధనమేమిటి?

నిస్వార్థాన్ని పెంచండి. ఇదే సమయంలో స్వార్థాన్ని కొంత మేర తగ్గించండి. ఇలా చేస్తూ ఉంటే మీరు దైవత్వానికి దగ్గరలో చేరుకుంటారు.. ‘యజ్ఞార్థాత్‌ ‌కర్మన్యో అన్యత్ర లోకోయం కర్మ బంధనః’ అని కృష్ణ భగవానుడు అంటాడు. యజ్ఞ భావనతో మీరు చేసే కర్మలు మిమ్మల్ని ముక్తి పథం వైపు తీసుకెళతాయి. అందుకు భిన్నంగా స్వార్థంతో చేసే కర్మలు మీ బంధనాలకు కారణమవుతాయని అర్థం. ఈ విషయాన్నే అర్జునుడితో చెప్పాడు భగవానుడు.. దీన్ని అవగతం చేసుకొని మీరు మీ జీవితంలో వ్యవహరించండి.

ప్రాచీనకాలంలోకి తొంగి చూసినప్పుడు యజ్ఞానికి సంబంధించి పలు పేర్లు ప్రస్తావనకొస్తుంటాయి. నేను చెప్పిన ఆహుతి సంబంధిత యజ్ఞాల విషయంలో పెక్కు వర్ణనలు కనిపిస్తాయి. యుధిష్ఠిరుడు రాజసూయ యాగం (యజ్ఞం) చేశాడు. రాముడు కూడా రాజసూయ యాగం చేశాడు. నచికేతుడు – యమ ధర్మరాజు కథని మనం చదివినప్పుడు, అక్కడ కూడా యజ్ఞ ప్రస్తావన వస్తుంది. అశ్వమేధ యాగం, పుత్ర కామేష్ఠి యాగం, సోమ యాగం మొదలైన పలు యజ్ఞాలున్నాయి. వాటికి తగ్గట్టుగా అనేక విధాలైన యజ్ఞ శ్లోకాలూ ఉన్నాయి. కాని మనకిక్కడ ముఖ్య అంశం ‘పంచ యజ్ఞాలు’. ఈ పంచ యజ్ఞాలేమిటి? మిగతా యజ్ఞాలకు, ఈ పంచ యజ్ఞాలకు మధ్య ఉన్న తేడాలేమిటి? ఇక్కడ ప్రస్తావించిన పంచ యజ్ఞాలను ఎలాంటి భేదభావం లేకుండా ప్రతి గృహస్థుడు అనివార్యంగా చేయాలి. ప్రతి గృహస్థుడు, ప్రతి కుటుంబం ఈ పంచ యజ్ఞాలను చేస్తే మనం ఒక సుందరమైన, సమన్వయయుక్త, సమృద్ధ సృష్టి కల్పనని చవి చూడగలుగుతాం, అది సాకారమౌతుంది కూడా. మరో ప్రత్యేక విషయముంది, ఇంతకు మునుపు నేను పేర్కొన్న రాజసూయ యాగం, అశ్వమేధ యాగం మొదలైన యజ్ఞాల పేర్లన్నీ యజ్ఞ శబ్దాలే. అయితే ప్రాచీనకాలం నుండి ప్రతి ఇంట్లో పంచ యజ్ఞాలు జరిగేవి, కాని వీటిని యజ్ఞాలు అనేవారు కాదు, పంచ మహాయజ్ఞాలని పిలిచేవారు. ‘శతపథ బ్రాహ్మణ’మనే గ్రంథమొకటుంది. ప్రతి గృహస్థుడు అనివార్యంగా ఈ పంచ మహాయజ్ఞాలు చేయాలని ఈ గ్రంథం నిర్దేశించింది. వీటిని ప్రతి గృహస్థుడు, ప్రతి కుటుంబం గనుక పాటించినట్లయితే ఆశించిన అందమైన సమృద్ధివంతమైన సృష్టి సాకారమౌతుంది. వైదిక పరంపరలో ‘తైత్తరీయ ఆరణ్యక’ మనే గ్రంథం కానవస్తుంది. ఈ నిత్య పంచ మహాయజ్ఞాలు వృద్ధి పొందుతూ నిరంతరం ముందుకు సాగాలని ఈ గ్రంథం పేర్కొంది.

-అనువాదం :
విద్యారణ్య కామ్లేకర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram