కొవిడ్‌ 19 ‌సంక్షోభ తీవ్రత తరువాత పూర్తిస్థాయిలో పార్లమెంటు సమావేశాలు జరగడం మళ్లీ ఇప్పుడే. కానీ ఇవే సమావేశాలలో, అంటే ఈ వర్షాకాల సమావేశాలలో చర్చించవలసిన కొవిడ్‌ అం‌శం మాత్రం చర్చకు రానేలేదు. దేశంలో కొవిడ్‌ ‌సమస్య సమసిపోయిందని దీనర్ధం కాదు. ప్రతిపక్షాలకు పట్టిన బీజేపీ వ్యతిరేకత అనే దీర్ఘకాల రోగం ఇందుకు కారణం. మూడోదశ కరోనా మొదలయిందనీ, కర్ణాటక, మిజోరం వంటి ప్రాంతాల పిల్లలలో లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిసినా విపక్షాలు వ్యవహరించిన తీరు ఘోరం. కాబట్టి కొవిడ్‌పై చర్చకు ప్రతిపక్షాలు అవకాశం రానివ్వలేదనడమే సబబు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం తన వాణిని వినిపించాలి. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ పెద్దల సభ అంటూ ఎంతో సగర్వంగా చెప్పుకునే రాజ్యసభలో కాంగ్రెస్‌ ‌సభ్యుడు బాజ్వా బల్లపై నిలబడి నిబంధనల పుస్తకాన్ని చైర్మన్‌ ‌స్థానం మీదకు విసిరిన దుర్ఘటన చూసి దేశం ముక్కు మీద వేలేసుకుంది. ఇంత తీవ్రమైన అంశం మీద కూడా బాజ్వా పశ్చాత్తాపం ప్రకటించడానికి సిద్ధపడలేదు. ఇంకా వికృతం, అప్రజాస్వామ్యానికి ఉదాహరణలుగా గుర్తుంచుకోవలసిన ఈ పరిణామాలను సెల్‌ఫోన్‌లలో చిత్రించి దేశం మీదకు విడిచిపెట్టారు.

ఈ సమావేశాలు జరిగినంత కాలం బిల్లుల పత్రాలు చింపి అధ్యక్ష స్థానాల మీదకు విసరని రోజు లేదు. రంకెలు, వెల్‌లోకి దూసుకుపోవడం సర్వ సాధారణంగా కనిపించింది. ప్లకార్డులు ప్రదర్శించడం మరొక విపరిణామం. అన్నింటికి మించి మార్షల్స్ ‌పట్ల కొందరు సభ్యులు దురుసుగా ప్రవర్తించడం చూస్తే పెద్దల సభ ఇంత దిగజారిపోయిందా అన్న ప్రశ్న వేసుకోక తప్పనిసరి పరిస్థితి వచ్చిందనే అనిపించింది. పైగా బయటివారిని రప్పించి విపక్ష మహిళా ఎంపీల మీద దాడి చేయించారని ఆరోపించడం మరొకటి. ఈ ఆరోపణ అబద్ధమని సీసీ కెమెరా ఫుటేజ్‌ ‌సాక్ష్యం చెబుతోంది. దీనిని అన్ని జాతీయ వార్తా చానళ్లు ప్రసారం చేశాయి.

జూలై 19న ప్రారంభమైన వర్షాకాల సమా వేశాలు ఆగస్ట్ 13‌వరకు జరగవలసి ఉంది. కానీ రెండురోజుల ముందే అల్లర్ల మధ్య నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉభయ సభలలోను విపక్షాలు సృష్టించిన గందరగోళం గతంలో జరిగిన అల్లర్ల రికార్డును అధిగమించింది. సమావేశాలు ఆరంభమైన రోజు నుంచి విపక్షాల ఎంపీలు వెల్‌లోకి వెళ్లడం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, మంత్రులు ఏదైనా చదవబోతే కాగితాలు లాక్కుని చింపి గాల్లోకి విసరడం వంటి అప్రజాస్వామిక చర్యలతోనే సరిపెట్టారు. ఈ పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయనీ, అలాగే తమ సమస్యలు సభలో చర్చకు రాకపోవడం పట్ల దేశ ప్రజలు పడిన వేదనను కూడా తాను అర్ధం చేసుకోగలనని, ఇప్పటికైనా విపక్షాల ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శన, ప్రసంగాలకు అడ్డు పడుతూ నినాదాలు ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేక మన్న విషయాన్ని గుర్తించాలని కూడా లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా అన్నారు. రాజ్యసభ చైర్మన్‌ ఎం. ‌వెంకయ్యనాయుడు కన్నీటి పర్యంతమయ్యారు.

సమావేశాలు ప్రారంభమైన రోజునే విపక్షాల వైఖరి అర్ధమైంది. ఇటీవల ప్రమాణం చేసిన కొత్త మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ సభకు పరిచయం చేయడానికి కూడా అవకాశం లేకుండా రగడ జరిగింది. ఈ విస్తరణలో ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు మంత్రి మండలిలో సభ్యులయ్యారని, వారిని పరిచయం చేస్తే సభ్యులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారని తాను ఆశించానని కూడా ప్రధాని చురక వేశారు. అలాంటి వెనుకబడిన వర్గాల వారు మంత్రులు కావడం ఇష్టం లేకనే కొందరు సభ్యులు సభలో ఇలా వ్యవహరిస్తున్నారని భావించవలసి ఉంటుందని కూడా ప్రధాని విమర్శించారు. ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌పెగాసెస్‌ అం‌శం మీద మీడియాలో వచ్చిన నివేదికల మీద ప్రకటన ఇవ్వడానికి ప్రయత్నించడం దగ్గరే అల్లరి మొదలయింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి కొంచెం ముందు ఇలాంటి నివేదికలు మీడియాలో రావడం అంటే, కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికేనని మంత్రి చెప్పారు. కొద్దికాలంగా జరుగుతున్నది కూడా అదే. ఆ రోజే ఆయన చేతిలోని కాగితాలు కొందరు సభ్యులు లాక్కుని చింపి గాల్లోకి విసిరారు.

ఫోన్ల మీద నిఘాకు సంబంధించి పెగాసెస్‌ ‌వ్యవహారం మీద, రైతుల ఆందోళన, పెరుగుతున్న ధరలు ముఖ్యంగా చమురు ధరల గురించి చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షాలు నానా గందరగోళం సృష్టించాయి. ఈ వర్షాకాల సమావేశాలలో లోక్‌సభ 96 గంటలు పనిచేయవలసి ఉండగా 21 గంటల 14 నిమిషాలు పనిచేసింది. అంటే 74 గంటల 46 నిమిషాల సమయం వృధా. 13 బిల్లులను ప్రవేశపెట్టారు. 20 బిల్లులు ఆమోదం పొందాయి. 127వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఇన్సూరెన్స్ ‌బిల్లు కూడా వాటిలో ఉన్నాయి. రాజ్యసభ 97 గంటలు పనిచేయవలసి ఉంది. కానీ 28 గంటల, 21 నిమిషాలు మాత్రమే పనిచేసింది. 76 గంటల 26 నిమిషాలు వృధా. రాజ్యసభ 19 బిల్లులను ఆమోదిం చింది. నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు. గడచిన రెండు దశాబ్దాల పార్లమెంట్‌ ‌చరిత్రలో తక్కువ ఫలితం ఇచ్చిన మూడు సమావేశాలలో ఇదొకటిగా మిగిలింది. ఇంతకు ముందు జరిగిన బడ్జెట్‌ ‌సమావే శాలలో 114 శాతం ఫలవంతంగా వ్యవహరించిన లోక్‌సభ ఈసారి 22 శాతం ఫలితంతో చరిత్రలో నిలిచిపోనున్నది. బహుశా అంతటి మంచి పేరు మళ్లీ రాకూడదన్న ప్రయత్నం కూడా తాజా రగడ ఉద్దేశంలా కనిపిస్తుంది. అప్పుడు అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగాయి.ఈ సమావేశాలన్నీ వాయిదాల మయం.

ఆగస్ట్ 11 ‌రాజ్యసభ చరిత్రలో చీకటి రోజే అనాలి. అందుకు బాధ్యత విపక్షాలదే. కానీ ఆ వాస్తవం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆగస్ట్ 12‌న తమ మీదే దాడి జరిగిదంటూ, మమ్మల్ని మార్షల్స్ ‌చేత కొట్టించారంటూ విపక్ష ఎంపీలు అబద్ధాలు మొదలు పెట్టారు. వారంతా విజయ్‌చౌక్‌కు ఊరేగింపుగా వెళ్లి మీడియా ముందు ప్రతిదాడి చేశారు. దీనికి సమాధానంగానే కీలెరిగి వాత పెట్టినట్టు రాజ్యసభలో జరిగిన కొన్ని దృశ్యాల సీసీ ఫుటేజ్‌ను ప్రభుత్వం విడుదల చేసినట్టు కనిపిస్తుంది. వాస్తవాలతో పనిలేదన్నట్టు విపక్షాలు సభలోపల తమ ప్రవర్తనకు కొత్త భాష్యం చెప్పడం మొదలుపెట్టాయి. నిజం చెప్పాలంటే ఆ అనాగరిక ప్రవర్తనను నిస్సిగ్గుగా సమర్థించుకున్నాయి. తాము పాక్‌ ‌సరిహద్దులలో ఉన్నామని భావించవలసి వచ్చిందని శివసేన ఎంపీ (రాజ్యసభ) సంజయ్‌ ‌రౌత్‌ ఆరోపించడం నీచత్వానికి పరాకాష్ట. ఎంతో గౌరవంగా చూసే రాజ్యసభను పాక్‌ ‌సరిహద్దుతో పోల్చడం ఏం విజ్ఞత? బయటి వ్యక్తులను మార్షల్స్ ‌పేరుతో తీసుకువచ్చి దాడి చేయించారని ఆరోపించేటంత వరకు వెళ్లింది కూడా ఈయనే. పెగాసెస్‌, ‌మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలు వంటి వాటిని సభలో ప్రస్తావించే అవకాశం రాలేదు కాబట్టే మేం సభ వెలుపల ప్రస్తావిస్తున్నామని కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ అర్ధం లేని వాదన ముందుకు తెచ్చారు. చర్చలకు ఆ ‘రైతులు’ రారు. రైతుల అరాచకత్వానికి కాంగ్రెస్‌ ‌వత్తాసు పలుకుతున్నది. ఇదంతా చూస్తే తమకు పార్ల మెంటుతో, చర్చలతో పనిలేదు, రోడ్ల మీద తేల్చు కుంటాం అన్న రీతిలోనే ఉందన్నది బహిరంగ రహస్యం. దేశాన్ని అమ్మేసే పనిలో ఉన్నారంటూ రాహుల్‌ ‌సిగ్గు విడిచి మోదీ ప్రభుత్వం మీద నిందలు మోపారు. విపక్షాల సభ్యులే బల్లలు ఎక్కి, కాగితాలు చింపి విసిరివేసిన సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తుంటే ప్రభుత్వమే ప్రజాస్వామిక వ్యవస్థను పట్టాలు తప్పిస్తున్నదని విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. పైగా ఇంత అల్లరి తరువాత కూడా దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రాజ్యసభ చైర్మన్‌ ‌వెంకయ్యనాయడుకే తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఇజ్రాయెల్‌ ‌సంస్థ నుంచి స్పైవేర్‌ ‌ప్రభుత్వం కొనుగోలు చేసిందా లేదా, ఇదే మేం కోరుతున్నాం అని మొదట రాహుల్‌ ‌గాంధీ విలేకరుల సమావేశంలో అన్నారు. తాము ఎలాంటి స్పైవేర్‌ ‌కొనుగోలు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసిన తరువాత కూడా మోదీ ప్రభుత్వానికి జవాబుదారీ తనం లేదని ఆరోపించడం ఏం విజ్ఞత? ఇక ప్రజా స్వామ్యం ఖూనీ అయిపోయిందంటూ అరిగిపోయిన రికార్డు విమర్శ మామూలే.

విపక్షాలు గౌరవప్రదంగా వ్యవహరించడం, రాజకీయ పార్టీలుగా విలువను కాపాడుకోవడం తక్షణ కర్తవ్యం. అదే విషయాన్ని ఎనిమిది మంది మోదీ మంత్రివర్గ సభ్యులు వివరించి చెప్పారు. విపక్షాల ఊరేగింపు జరిపిన రోజునే మంత్రులు ప్రభుత్వ వివరణ ఇచ్చారు. దీని మొత్తం సారాంశం-ఈ ప్రవర్తనకు విపక్షాలు దేశానికి క్షమాపణ చెప్పాలన్నదే. ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందు రివాజుగా జరిగే రాజకీయ పక్షాలు సమావేశంలోనే ఈ అల్లర్లకు సంబంధించిన సంకేతాలు వెలువడ్డాయని ప్రహ్లాద్‌ ‌జోషి వెల్లడించారు. నిజానికి ఈ ఆరోపణను కొట్టిపారేయలేం. సరిగ్గా సమావేశాలకు ముందు రోజే ఒక వార్త సంస్థ పెగాసెస్‌ ‌వ్యవహారాన్ని దేశం మీదకు వదలడం కూడా అందులో భాగమే. అది వస్తుంది కాబట్టి, తాము రగడ సృష్టిస్తామని చెప్పక చెప్పాయి విపక్షాలు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌, ‌లెఫ్ట్, ‌టీఎంసీ తదితర పార్టీలు, అర్బన్‌ ‌నక్సల్స్ ‌షరీకై ఇదే వ్యూహం అనుసరిస్తున్నారు. సమావేశాలకు కాస్త ముందు ఒక వివాదాస్పద అంశాన్ని దేశం మీదకు వదిలిపెడతారు. దానితోనే సభా సమయమంతా వృధా చేయడానికి ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. చిత్రం ఏమిటంటే, ధరలు, కొవిడ్‌, ‌రైతు చట్టాలు వంటి వాటి గురించి చర్చించ డానికి రాజ్యసభ చైర్మన్‌ అనుమతించారు. మళ్లీ దానిని వదిలి పెగాసెస్‌పై చర్చకు పట్టుపట్టడం వ్యూహంలో భాగంగానే భావించాలి.

ఈ సమావేశాలు, పరిణామాలు అసలు పార్లమెంటు సమావేశాల గురించే కొత్త యోజన చేయవలసిన అవసరాన్ని చెబుతున్నాయని చాలామంది అభిప్రాయం. లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ ‌వెంకయ్యనాయుడు ఈ విషయం మీదే సమావేశమయ్యారు కూడా. ఇలాంటి ప్రవర్తనను సహించడం సరికాదని వారు అభిప్రాయం పడడం అసహజం కానేకాదు. సభాపతులు లేచి నిలబడి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికి సభ్యులు శాంతించకపోవడం దుష్ట సంప్రదాయానికి స్పష్టమైన సంకేతం. ఇలాంటి అప్రజాస్వామిక చర్యల నివారణ కోసం గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం అవసరమని కూడా సభాపతులు అభిప్రాయపడ్డారు. మూడు నాలుగేళ్ల క్రితం వేసిన ఒక అంచనా ప్రకారం పార్లమెంట్‌ ‌నిర్వహణ వ్యయం నిమిషానికి రూ. 2.5 లక్షలు. 90 గంటలు నష్టపోతే 144 కోట్లు నష్టం వస్తుంది. ఇందుకు సంబంధించిన స్పృహ అయినా, ఇంత ప్రజాధనం వ్యర్ధమవుతున్నదన్న ఇంగిత జ్ఞానమైనా అలాంటి సభ్యులకు ఉండవద్దా?

ఈ ఆర్థికకోణం పరిగణనలోనికి తీసుకోవలసినదే అయినా, నానాటికీ దిగజారుతున్న పార్లమెంటరీ విలువలు గురించి మరింత ఎక్కువ ఆలోచించవలసి ఉంటుంది.ఈ సమావేశాలలో వీరంగం వేసిన సభ్యుల మీద చర్యలు తీసుకోవడం అవసరమేనని పత్రికల వారి సమావేశంలో పాల్గొన్న ఎనిమిది మంది అమాత్యులు కోరడం తప్పుకాదు. గతంలో కేరళ అసెంబ్లీలో సీపీఎం సభ్యులు వ్యవరించిన తీరు మీద పెట్టిన కేసు సబబేనని ఇటీవల కోర్టు కూడా సమర్థించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రవర్తన అరికట్టడానికి కఠిన చర్యలకు ఆలోచించవలసిందే. పార్లమెంటు ఖర్చు నిమిషానికి రెండున్నర లక్షలు సరే, సభ్యుల కోసం సభ బయట చేస్తున్న ఖర్చు మాటేమిటి? భత్యాలు, భద్రత, ఇతర సౌకర్యాలు ఎన్ని వందల కోట్లలో ఉంటాయి?

దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకుని 75 సంవత్స రాలు పూర్తయిన సందర్భంలో మనమంతా ఉన్నాం. కాలం గడిచే కొద్దీ ప్రజాస్వామిక వ్యవస్థను బలోపేతం చేయవలసిన పార్లమెంటరీ వ్యవస్థ మీద, రోజురోజుకీ నమ్మకం పోగొట్టే విధంగా సభ్యులు వ్యవహరించడం సహించరానిదే. గర్భగుడి వంటి వెల్‌లోకి పదే పదే వెళ్లడం, కాగితాలు చింపి అధ్యక్ష స్థానం మీద విసరడం అనాగరిక చర్యలుగానే పరిగణించక తప్పదు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛగానో, ప్రజా స్వామ్యం ఇచ్చిన హక్కుగానో ఏ సభ్యుడు భావించినా అలాంటి వాళ్లకి సభలో ఉండే అర్హత లేదని తెలియ చేయడం, అందుకు చర్యలు తీసుకోవడం తప్పనిసరి. నాయకుల మెప్పు కోసమో, వ్యక్తిగత, తమ వర్గ ప్రయోజనాల కోసమో, తమ ప్రాంత అభీష్టాల కోసమో మొత్తం సభా కాలాన్ని వ్యర్థం చేయడం, అవమానించడం ఇంకా సాగడం సరికాదు. స్వేచ్ఛకు, క్రమశిక్షణకు మధ్య తేడాను, సమస్య లేవనెత్తడానికీ, ఘర్షణ పడడానికీ ఉన్న వ్యత్యాసాన్ని సభ్యులు గుర్తించేటట్టు చేయడం అవసరం. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు బీజేపీని అధికారం నుంచి తొలగించడమే పనిగా చర్చల మీద చర్చలు సాగించ డమే, పార్లమెంటులో అసలు చర్చలు జరగ కుండా చేయడమే వ్యాపకంగా ఉన్న విపక్షాల ఎత్తుగడ జాతికి తెలియనిది కాదు. బీజేపీని దింపాలంటే పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చడంతో సాధ్యమయ్యేది కాదు. అబద్ధాలు చెబితే అయ్యేదీ కాదు. అలాంటి ప్రవర్తనకు దిగిన సభ్యులంటే ఎంత రోత, బాధ ఉన్నా, పార్ల మెంటు మీద గౌరవంతో మీడియా, మేధావులు ఇంతకుమించిన భాషతో విమర్శించడానికి పూనుకో వడం లేదు. ఇది గమనించాలి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram