రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) ‌కోటా అమలుచేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టంగా తెలుస్తోంది. రెండేళ్లుగా ఈడబ్ల్యూఎస్‌ ‌కోటాను ఉద్యోగ నియామ కాల్లో అమలుచేయకుండా ఇప్పుడు హడావుడిగా హాస్యాస్పదమైన నిబంధనలు విధించి దీనిని అమలుచేయనున్నట్లు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం ఉన్నవారు ఆర్థికంగా వెనుక బడిన వర్గాలుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంటే నెలకు రూ.66,667 జీతం తీసుకునేవారన్న మాట. ఏడాదికి లక్ష ఆదాయం పొందేవారిని ప్రభుత్వం పేదలుగా పేర్కొని వారికి తెల్లరేషన్‌కార్డు ఇచ్చి రేషన్‌, ‌ప్రభుత్వ పథకాల్లో లబ్ధి చేకూరుస్తుంది. ఇప్పుడు 8 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పేదలే అని పేర్కొనడం దేనికి సంకేతమో చెప్పాలి. నెలకు పది నుంచి రూ.15 వేలు జీతం తీసుకునేవారు నిజమైన పేదలు. అంతేకాని రూ.66,667 వేలు తీసుకునేవారు ఏ రకంగా పేదలవుతారో ప్రభుత్వమే చెప్పాలి.

విద్యా, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్‌ ‌కోటా ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం 2019లో రాజ్యాం గాన్ని సవరించింది. దీనికి పలు నిబంధనలను విధించింది. ఈడబ్ల్యూఎస్‌ ‌కేటగిరీలోకి రావాలంటే.. ఏడాదికి రూ.5 క్షల లోపు ఆదాయం ఉండాలి. గ్రామాల్లో ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండరాదు. నగరాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మించి ఫ్లాట్‌ ఉం‌డరాదు. నగరాల్లో అయితే వంద గజాలు, గ్రామాల్లో రెండొందల గజాలకు మించి ఇంటి స్థలం ఉండరాదు. అయితే, అవన్నీ తీసేసి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించరాదనే ప్రాతిపదికను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇదే ఇప్పుడు అగ్రవర్ణాల్లోని పేదలను హతాశులను చేసింది. రెండేళ్లుగా ఈడబ్ల్యూఎస్‌ ‌కోటాను ఉద్యోగ నియామకాల్లో అమలుచేయాలనే ఉద్దేశం లేకనే ప్రభుత్వం ఉపయోగంలేని ఈ నిర్ణయం తీసుకుంది.

జాప్యంతో నష్టం

రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ ‌రిజర్వేషన్ల అమలుపై నిర్ణయంలో జరిగిన జాప్యం అగ్రవర్ణాల పేదలను వేల ఉద్యోగాలకు దూరంచేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన మొదట్లో 1.26 లక్షల గ్రామ సచివాలయ పోస్టులు భర్తీచేశారు. ఆ ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యూఎస్‌ అమలు చేయలేదు. దాంతోపాటు పలు శాఖల్లో చేపట్టిన నియామకాల్లో సుమారు 18 వేల రెగ్యూలర్‌ ‌పోస్టులు కోల్పోయారు. ప్రభుత్వం జాబ్‌ ‌క్యాలెండర్‌లో ప్రకటించిన లెక్కల ప్రకారం 19,701 కాంట్రాక్టు పోస్టులు; 3,99,791 ఔట్‌సోర్సింగ్‌ ‌పోస్టులు ఈ రెండేళ్లలో నింపారు. అప్పుడే ఈడబ్ల్యూఎస్‌పై నిర్ణయం తీసుకొంటే.. 10 శాతం అంటే సుమారు 42 వేల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ‌పోస్టులు అగ్రవర్ణ పేదలకు దక్కేవి.

జల వివాదాలకు చెక్‌

ఆం‌ధప్రదేశ్‌, ‌తెలంగాణ రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న జల వివాదాలను ఆపేందుకు కేంద్ర జలశక్తి సంఘం గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటుచేయడం హర్షణీయం. ఈ నిర్ణయంతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే కృష్ణా, గోదావరి నీటి ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణాధి కారాలను పూర్తిగా బోర్డులకే ఉంటాయి. అయితే కృష్ణానది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్యలో ఉండటం, ప్రాజెక్టుల నిర్వహణను రెండు ప్రభుత్వాలకు అప్పగించడంతో నీటి వనరులను రాజకీయ అవసరాలకు వాడుకునే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని దారి మళ్లించేందుకు ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించి నీటిని అక్రమంగా లాక్కుపోతుందనే సెంటిమెంటుతో భావోద్వేగాలను రెచ్చగొట్టింది. అంతేకాదు కృష్ణా ప్రాజెక్టులపై జలవిద్యుత్‌ ఉత్పత్తిని ప్రధాన అస్త్రంగా ప్రయోగించింది. దీంతో దాదాపు ఆరు టీఎంసీల కృష్ణా జలాలు కడలి పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను, కృష్ణాబోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయక పోవడంతో ఏపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోదీకి, జలశక్తి మంత్రికి రెండుసార్లు నేరుగా లేఖలు రాసి తక్షణం జోక్యం చేసుకోవాలని, కృష్ణా, గోదావరి నదుల ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుల పరిధిలోకి తెచ్చి, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరింది. దాంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్లు విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్‌ ‌ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించింది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను బోర్డుల పర్యవేక్షణ కిందికి తీసుకువచ్చింది. ప్రాజెక్టుల కార్యకలాపాలు, నిర్వహణ, నియమనిబంధనలను గెజిట్‌లో పొందుపరిచారు. బచావత్‌ ‌ట్రైబ్యునల్‌ ‌కేటాయింపులున్న ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయి. కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టు లను కేంద్రం బోర్డుల పరిధిలోకి తెచ్చింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలని, అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం స్పష్టంచేసింది. బోర్డులకు చైర్మన్లు, సభ్య కార్యదర్శి, చీఫ్‌ ఇం‌జినీర్లు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటారని, అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయని స్పష్టంచేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌ ‌మనీ కింద 60 రోజుల్లో డిపాజిట్‌ ‌చేయాలంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలని, ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుదుత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ గెజిట్‌ ‌నోటిఫికేషన్‌లో రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు బోర్డులకు అప్పగించడం వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల సమస్య దాదాపు పరిష్కారమైనట్లేనని భావించవచ్చు.

రైతుల దుస్థితి

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకున్నా అన్నదాతకు సొమ్ములు దక్కడంలేదు. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా.. నేటికీ డబ్బులు అందలేదు. మరోవైపు రబీ ధాన్యం కొనుగోళ్లనూ ఆపేశారు. ఏకంగా రూ.3,600 కోట్లు బకాయిలు రావాలి. ఖరీఫ్‌ ‌నాట్లు మొదలైనా చేతిలో చిల్లిగవ్వ లేదు. రబీ అప్పు తీర్చలేక, వడ్డీ పెరుగుతుంటే.. కొత్త అప్పు పుట్టే జాడే లేదు. ధాన్యం సొమ్ము కోసం ఎన్నడూలేని విధంగా రోడ్డెక్కాల్సిన దయనీయం. కాసులడిగిన కర్షకులను నిర్బంధించి, ఠాణాలకు తరలించి కేసులు పెడుతున్నారు. ముగిసిన రబీ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించవచ్చని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకూ 35.25 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దాని మొత్తం విలువ రూ.6,600 కోట్లు కాగా, ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.3200 కోట్లు మాత్రమే చెల్లించింది.

166వ  భంగపాటు

గ్రామ పాలన గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలోనే జరగాలని, కేంద్ర ప్రభుత్వం 12, 13 రాజ్యాంగ సవరణలను తెచ్చింది. కాని వైకాపా ప్రభుత్వం దానికి విరుద్ధంగా గ్రామ పంచాయతీల హక్కులను హరించేందుకు ప్రయత్నించి హైకోర్టు తీర్పుతో భంగపడింది. సొంత ప్రయాజనాల కోసమో లేక ఉపయోగకరం కాని ఉత్తర్వులు జారీచేసి కోర్టుల్లో భంగపడటం ఇది 166వ సారి. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ 2ను హైకోర్టు సస్పెండ్‌ ‌చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడను మరోసారి తెలియచేస్తోంది. పంచాయతీల ఆధ్వర్యంలోనే గ్రామ సచివాలయాల పాలనంటూ మొదట జాబ్‌చార్ట్ ‌రూపొందించి.. దానికి భిన్నంగా ఇప్పుడు పంచాయతీలు వేరు, గ్రామ సచివాలయాలు వేరన్న రీతిలో వీఆర్వోలను ప్రభుత్వం డీడీవోలుగా చేసింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ఏడాదిన్నర కాలం దాటినా.. దాని ఏర్పాటు లక్ష్యమేంటో ప్రభుత్వం చెప్పలేకపోయింది. వీఆర్వోల పెత్తనం కొనసాగిస్తే పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. హైకోర్టు అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ గ్రామ కార్యాలయాల కార్యదర్శులపై వీఆర్వో పెత్తనం వీలుకాదంటూ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్‌ 2‌ని రద్దు చేసింది. ఈ జీవో రాజ్యాంగంలోని అధికరణం 40, 243 (జీ)తో పాటు ఏపీ పంచాయతీరాజ్‌ ‌చట్టంలోని సెక్షన్‌ 4 (2) ‌కింద జారీ చేసిన 110, 149 జీవోలను ఉల్లంఘిస్తోంది. సమాజ అభివృద్ధిలో గ్రామాల భాగస్వామ్యం, స్థానిక సంస్థల ప్రాధాన్యం అత్యంత ప్రధానమైనవి. రాజ్యాంగంలోని 73, 74 సవరణలు స్థానిక సంస్థల స్వావలంబనకు పట్టం కట్టాయి. న్యాయస్థానాలు సైతం ఎన్నోసార్లు పంచాయతీలను పరిపుష్టం చేయాలని సూచించాయి. కాని పాలకులు స్వార్ధ ప్రయోజనాలకు, సంకుచిత ఆలోచనలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో గ్రామస్వరాజ్యం కాగితాలకు, నినాదాలకే పరిమితమైంది. పలు ప్రభుత్వాలు స్థానిక సంస్థలను కబ్జా చేయాలని ప్రయత్నించినా కోర్టులు రక్షణ కల్పించాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించక, హక్కులు, అధికారాలు బదిలీ చేయక అంతకు ముందున్న ప్రభుత్వాలు ఇదే బాటన నడిచాయి. పంచాయతీలకు ఇచ్చిన కొద్దిపాటి అధికారాలకు కోత విధించాలని చూడటం బాధాకరం. వైకాపా ప్రభుత్వం సచివాలయాల ఏర్పాటుతో గ్రామస్థాయిలో పాలనా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది ప్రజలు ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు పోటీగా లేదా వాటి హక్కులను, అధికారాలను హరించే విధంగా ఉంది. వాలంటీర్ల వ్యవస్థతో సంక్షేమం మొత్తం నడిపిస్తోంది. జన్మభూమి కమిటీల పేరుతో గత ప్రభుత్వమూ ఇదే బాట నడిచి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చివేసింది. గ్రామ సచివాలయాలను గ్రామ పంచాయతీలకు జవాబుదారీగా చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు అధికారాలను అప్పగించాలి. నిధులు విడుదల చేయడం ద్వారా తమను తామే పాలించు కునే విధంగా పంచాయతీలను ఎదగనివ్వాలి. ఆ దిశలో తీసుకునే చర్యలే గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తాయి. దీనికి భిన్నంగా వివాదాస్పద జీవోలో సాంకేతిక మార్పులు చేసి బయటపడాలని చూస్తే అది హ్రస్వదృష్టే అవుతుంది. గ్రామాల దీర్ఘకాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అడుగులు వేయాలి.

కష్టాల్లో పోలవరం నిర్వాసితులు

పోలవరం నిర్వాసితులు కష్టాల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. గోదావరికి ఎగువన వర్షాలు కురవడం, గోదావరిలోకి నీరు చేరడం, కాఫర్‌డ్యామ్‌ ‌కారణంగా బ్యాక్‌వాటర్‌ ‌పెరగడంతో వారిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం కాఫర్‌డ్యామ్‌ ‌బ్యాక్‌వాటర్‌ ‌కారణంగా దేవీపట్నం మండలంలో ఇప్పటికే 17 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 26 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో ఉండేవారంతా పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల భూములు కోల్పోయే గిరిజన నిర్వాసితులు. వారికి ప్రభుత్వం ఆర్‌ అం‌డ్‌ ఆర్‌ ‌ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా సరిగా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్ల నిధులిస్తే, అందులో 78 శాతం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చుచేసి, పునరావాసానికి 22 శాతం మాత్రమే గత, ఇప్పటి ప్రభుత్వాలు ఖర్చుచేశాయి. బాధితుల కోసం పదేళ్ల క్రితమే కాలనీలు కట్టారు. అయితే బాధితులకు ప్యాకేజీ ఇవ్వకపోవడంతో వారు వెళ్లలేదు. కొందరు రెండు నెలల క్రితం వెళ్లారు. ఇప్పుడు వరద నీరు రావడంతో మిగిలిన నిర్వాసితులు చేసేది లేక ప్రభుత్వం నిర్మించిన కాలనీల్లో తలదాచుకుంటున్నారు. పదేళ్ల క్రితం నిర్మించిన ఈ కాలనీల్లో ఇళ్లు సరిగా లేవు. కరెంటు, మంచినీటి సదుపాయం లేవు. మరుగుదొడ్లు నిర్మించలేదు. అవి ప్రస్తుతం విషపురుగులకు ఆవాసాలుగా మారాయి. వైద్య సదుపాయం కోసం రంపచోడవరం వెళ్తున్నారు. అధికారులు వచ్చినప్పుడల్లా సమస్యలు తెలుసు కుంటున్నారేగాని పరిష్కరించడం లేదు. దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మత్తులు చేయించాలని, కనీసం తాత్కాలికంగా అయినా కరెంటు సదుపాయం ఇవ్వాలని, మంచినీటి కోసం చిన్న ట్యాంకును అయినా ఏర్పాటు చేయాలని, వైద్య సదుపాయం అందించాలని బాధితులు దీక్షలు కూడా చేస్తున్నారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram