పేదల ఇంటి నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం సొమ్మొకరిది.. సోకు మరొకరిదిలా ఉంది. ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చేస్తున్నా.. తామే ఇళ్లు నిర్మించినట్లు ప్రచారం చేసుకుంటోంది, రాష్ట్ర ప్రభుత్వం. వ్యాక్సినేషన్‌ ‌పంపిణీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుండగా తామే చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ఫొటో పెట్టుకుని మరి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన పథకం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 28 లక్షల ఇళ్లను మంజూరుచేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయం చేస్తోంది. ఇందుకుగానూ రూ. 35 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇవి కాక ఆ ఇళ్ల మౌలిక సదుపాయాల కోసం రోడ్లు వేసేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి కల్పన పథకం (నరేగా) నిధులు రూ. 3 వేల కోట్లను కేటాయించింది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా పంచాయతీలకు నరేగా పథకాల ద్వారా డ్రేనేజి, కరెంటు, మంచినీటి సరఫరా కోసం కూడా నిధులు ఇవ్వనుంది.

ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 68,361 ఎకరాలు సేకరించింది. అందులో రూ. 10,150 కోట్లతో 25,359 ఎకరాలు కొనుగోలు చేసింది. వీటిలో అర్బన్‌ ‌ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నరతో మొత్తం 30లక్షల ప్లాట్లు వేశారు. వాటికి నరేగా పథకం ద్వారా వచ్చిన నిధులతో రోడ్లువేశారు. ఇటీవల మొదటి విడతలో 15.60 క్షల ఇళ్లను నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, మౌలిక సదుపాయాలకు రూ.1.50 లక్షలు ఖర్చుచేస్తామని చెబుతున్నారు. రెండో ఫేస్‌ ‌కింద 13 లక్షల ఇళ్లను 2023 కల్లా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ‌హామీ ఇచ్చారు. మొత్తం 28 లక్షల ఇళ్లకు మౌలిక సదుపాయాలకు రూ.34,109 కోట్లు ఖర్చవుతాయని వాటిని కేటాయించాలని కేంద్రానికి లేఖరాసారు.

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో కేంద్రమే రూ.1.50 లక్షలు ఇస్తోంది. అంటే, మిగిలిన రూ.30 వేలు మాత్రమే రాష్ట్రం ఖర్చు చేస్తున్నది. మౌలిక సదుపాయాల కోసం కూడా కేంద్రమే నరేగా నిధుల నుంచి ఖర్చు చేస్తోంది. నిధులన్నీ కేంద్రమే ఇస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమిటి? పైగా ఆ ఇళ్లకు ‘వైఎస్‌ఆర్‌ ‌జగనన్న కాలనీలు’గా రాష్ట్ర ప్రభుత్వం పేరుపెట్టుకున్నది. ఇళ్లపై జగన్‌ ‌ఫొటోలు కూడా అంటించారు. ఇళ్ల నిర్మాణంలో 75 శాతం నిధులిస్తోన్న కేంద్రానికే ఈ కాలనీలకు పేరు పెట్టుకునేందుకు అర్హత ఉంది. వీటికి ‘పీఎంఏవై’ కాలనీలుగా పేర్లు పెట్టి నరేంద్రమోదీ చిత్రాలను అమర్చాలి.

భారీ అవినీతి

పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంచనాలు రూపొందించినట్లు భావించవచ్చు. ఇప్పటికే స్థల సేకరణలో ఎకరా రూ. 5 లక్షల విలువైన భూములను రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షలకు కొనుగోలు చేశారు. ఎకరా రూ.7 లక్షల విలువైన భూములను రూ.60 లక్షల వరకు కొనుగోలు చేసినట్లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ వ్యవహారాన్ని చక్కదిద్ది సుమారు రూ.5 వేల కోట్ల వరకు లబ్ధి పొందినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. వర్షాలు వస్తే మునిగిపోయే లోతట్టు ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. నివాసానికి యోగ్యం కాని భూములు కూడా ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. రాజమండ్రిలో రూ.7 లక్షలు కూడా విలువ చేయని భూములను రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు కొనుగోళ్లు చేసిన వ్యవహారాన్ని తప్పుపట్టి, విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్‌ ‌చేశారు. ఉద్యమాన్ని కూడా చేపట్టారు. తెనాలి, నెల్లూరుతో పాటు అన్ని జిల్లాల్లో ఇలాగే జరిగింది. అంతేగాక, నరేగా నిధులతో నిర్మించిన రహదారుల విషయంలోను.. కొండలు తవ్వేసి ఆ మట్టిని వేసి రోడ్లుగా చెబుతున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. ఇప్పుడు ఇళ్ల నిర్మాణంలో మౌలిక సదుపాయాలకు మరో రూ. 31 వేల కోట్లు ఖర్చవుతాయంటున్నారు. అంటే ఇందులోనూ భారీగా అవినీతికి ప్రణాళికలు సిద్ధం చేశారని భావించవచ్చు.

అంతేకాదు, ప్రజలకు వైద్యం అందించే విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలంభి స్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలికసదుపాయాలు లేవు. కొవిడ్‌-19 ‌నియంత్రణ, రోగులకు అందించే చికిత్స బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదు. కొవిడ్‌ ‌నియంత్రణపై ఫిబ్రవరి, మార్చిల్లో రెండుసార్లు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి రెండోదశ కరోనా రావచ్చని, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, మౌలికసదుపాయాలు పెంచుకోవాలని హెచ్చరించారు. పీఎం కేర్‌ ‌ద్వారా రాష్ట్రానికి అత్యధికంగా 4,960 వెంటిలేటర్లు అందించారు. ఆక్సిజన్‌ ‌ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాని ముఖ్యమంత్రి జగన్‌ ఈ ‌విషయాన్ని తేలికగా తీసుకున్నారు. ఆక్సిజన్‌ ‌ప్లాంట్లను ఏర్పాటుచేసుకోలేదు. వెంటిలేటర్లు మూలన పడేశారు. మౌలిక సదుపాయాలు పెంచుకోలేదు. ప్రధాని హెచ్చరికలను బేఖాతరు చేశారు. దాంతో రెండో దశ కరోనాలో వేలాది మంది బలయ్యారు. వ్యాధిని గుర్తించే లోపే ప్రజలు పిట్టల్లా చనిపోయారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ‌లేక తిరుపతి, కదిరి, విజయనగరం ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో రోగులు మరణించారు.

వ్యాక్సిన్‌ ‌పంపిణీలో నిర్లక్ష్యం

వ్యాక్సిన్‌ల సేకరణ లోను రాష్ట్ర ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణే. అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్‌లను కొనుగోలు చేస్తుంటే ఏపీ మాత్రం ఒక్క వ్యాక్సిన్‌ను, ఒక్క ఇంజక్షన్‌ను కూడా కొనుగోలు చేయలేదు. వ్యాక్సిన్‌ల సేకరణకు గ్లోబల్‌ ‌టెండర్లను ఆహ్వానించినా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం తెలిసి ఒక్కరూ ముందుకు రాలేదు. కరోనా చికిత్సలో వాడుతున్న ఇంజక్షన్‌ను రూ.40 వేల నుంచి రూ.50 వేలకు నల్లబజారులో అమ్ముతున్నా చోద్యం చూసింది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేటు ఆసుపత్రులో 50 శాతం పడకలు కేటాయించినట్లు చెప్పినా అందులో పదిశాతం కూడా చేర్చలేదు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడికి స్థానిక ప్రజానిధు గూండాలు అండగా ఉన్నారు. ఇంత జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రిగాని, మంత్రులు గాని ఒక్క ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించలేదు.

వైద్యం, ఆరోగ్యం రాష్ట్ర జాబితాలోని అంశం. వైద్యం, ప్రజారోగ్యం, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి. కాని కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా వైద్యంకోసం ఎక్కువగా నిధులిస్తోంది. రూరల్‌, అర్బన్‌ ‌హెల్త్ ‌సెంటర్ల నిర్వహణకు కేంద్రమే నిధులిస్తోంది. 104, 108 సర్వీసులకు 60 శాతం నిధులు కేంద్రానివే. అంగన్‌వాడీ నడిచేది కేంద్ర నిధులతోనే. ఆశావర్కర్లకు కేంద్రమే జీతాలు ఇస్తోంది. ప్రజారోగ్యం విభాగంలో శానిటరీ సిబ్బందికి ఇచ్చే జీతంలో రూ.6 వేలు స్వచ్ఛభారత్‌ ‌పథకం ద్వారా కేంద్రం ఇస్తున్నవే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశాఖ నిర్వహణ రాష్ట్రానిదా? కేంద్రానిదా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

వ్యాక్సిన్‌ల కోసం పైసా ఖర్చుచేయని ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ‌సెంటర్లలో మాత్రం జగన్‌ ‌ఫొటోను పెట్టి మొత్తం ఖర్చుచేస్తున్న ప్రధాని ఫొటోను పెట్టలేదు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ 16 ‌బోధనాసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాటిని పూర్తిగా రాష్ట్ర నిధులతో నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటు న్నారు. కాని వాటిలో 3 బోధనాసుపత్రులకు 60 శాతం నిధులను కేంద్రం ఇస్తోంది. మరో ఏడు ఆసుపత్రులకు కూడా 60 శాతం నిధులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram