కొన్ని ఉద్యమాలు ఉంటాయి- తరం తరువాత తరం అందుకుంటూ ఉండవలసినవి. అవి మానుషధర్మానికి ఊపిరి పోస్తాయి. పరిసరాల పరిరక్షణ, చెట్లను బతికించుకోవడం, జలాలను కలుషితం కాకుండా చూసుకోవడం, మట్టి స్వభావం చెడిపోకుండా చూడడం, గోసంపదను నిలబెట్టుకోవడం అలాంటివే. వీటి మూలాలు భారతీయతలో ఉన్నాయి. కానీ అవి జన్మించిన ఈ భారతావనిలోనే ఆ మహా వాస్తవాలు లేదా రుషి ప్రోక్తాలు కొన్ని శతాబ్దాలుగా మరుగున ఉండిపోయాయి. అమృతోపమానమైన ఆ శాశ్వత సత్యాలను పునరుజ్జీవింపచేసేందుకు జీవితాన్ని అంకితం చేసిన వారిలో ఒకరు సుందర్‌లాల్‌ ‌బహుగుణ. పరిసరాల పరిరక్షణ అంటే ఆర్థిక వనరుకు శాశ్వతత్వం ఇవ్వడమేనని నినదించిన బహుగుణ (జనవరి 9,1927-మే 21, 2021) 94వ ఏట కరోనా కాటుకు గురయ్యారు.

నాటి ఉత్తర ప్రదేశ్‌లోని తేహ్రీ ప్రాంతంలో జన్మించారాయన. హిమసానువుల పాదాల చెంతనేనన్నమాట. భారత స్వాతంత్య్రోద్యమంలో, తరువాత వినోబా భావే సర్వోదయ ఉద్యమంలో పని చేసిన బహుగుణ, కొద్దికాలం కాంగ్రెస్‌ ‌రాజకీయాలలోనూ కొనసాగారు. ఆ తరువాతే ఆయన దృష్టి పర్యావరణ పరిరక్షణ అనే మహోన్నత ఆశయం వైపు మళ్లింది. తనలో తానే హిమాయ పరిసరాల పరిరక్షకుని దర్శించుకుని, ఆ మహా కర్తవ్యానికి తనను తాను అంకితం చేసుకున్నారు. అంత సంకల్పం, దీక్ష మరొక పర్యావరణ ఉద్యమకారునిలో  చూడలేమనిపిస్తుంది. 2018లో, అంటే 91వ ఏట కూడా అదే ఆయన ధ్యాస, శ్వాస. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ముఖాముఖీలో ఇలా అన్నారు, ‘పెద్ద పెద్ద నీటి పథకాలు ఉత్పాతాలకు దారితీస్తాయి. వాటి పేరుతో లక్షలాది చెట్లను నిర్మూలిస్తున్నారు. చార్‌ధామ్‌ ‌రోడ్డు, పంచేశ్వర్‌ ‌డ్యాంల పేరుతో ఇదే చేశారు’ అని ఆవేదన పడ్డారు. ఇది ఒక ప్రభుత్వానికీ, వ్యవస్థకూ వ్యతిరేకంగా చేసిన ప్రకటనగా, ధిక్కారస్వరంగా భావించలేం. ఇందులోని సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా రుషితుల్యుడైన ఒక పర్యావరణ ప్రేమికుడు చెప్పిన మాటగా మన్నించడమే మర్యాద.

బహుగుణ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చే మాట చిప్కో ఉద్యమం. చిప్కో అంటే వృక్షాలింగనం. అభివృద్ధి పేరుతో చెట్లను నాశనం చేయడానికి వచ్చిన వారికి గ్రామీణులు చెట్టు కంటే ముందు మా దేహం మీద గొడ్డలి వేటు వేయండి అని అహింసాయుతంగా విసిరే పెద్ద సవాలు ఇందులో ఉంది. లోక్‌నాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌, ‌సర్వోదయ ఉద్యమాల ప్రేరణతో గోపేశ్వర్‌ అనే చోట దషోలి గ్రామ స్వరాజ్య సంఘాన్ని గాంధేయవాది చండీప్రసాద్‌ ‌భట్‌ ‌స్థాపించారు. అటవీ ఉత్పత్తులతో వ్యవసాయ పనిముట్లు చేసి గ్రామీణులకు అందించడమే ఆ సంఘం లక్ష్యం. అదే అనుకోకుండా చెట్ల రక్షణకు నిలబడవలసి వచ్చింది. 1971లో తేహ్రీ ప్రాంతలోనే అలకనందకు పెద్ద ఎత్తున వరదలు రావడం, కకావికలైన ఆ ప్రాంతాలలో మామూలు పరిస్థితులు తెచ్చేందుకు సివిల్‌ ‌పనులు ప్రారంభించడం, ఆ పేరుతో చెట్లు కొట్టడం వంటి పరిణామాలు అంతిమంగా చిప్కో ఉద్యమాన్ని చిగురింపచేశాయి. విచక్షణా రహితంగా సాగుతున్న చెట్ల నరికివేతను మొదటిసారి ఏప్రిల్‌ 24,1973‌న స్వరాజ్య సంఘం మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. తరువాత ఎన్నో పర్యావరణ ఉద్యమాలకు చిప్కో మార్గదర్శకంగా నిలిచింది. క్రీస్తుశకం 1700 సంవత్సరం నుంచి రాజస్థాన్‌ అటవీ ప్రాంతంలో సాగుతున్న బిష్ణోయి చెట్ల రక్షణ ఉద్యమం, కొన్ని దశాబ్దాల క్రితం కేరళలోని సైలెంట్‌ ‌వ్యాలీలో సాగిన పర్యావరణ రక్షణ ఉద్యమానికి చిప్కో కొనసాగింపు. చిప్కో ప్రధానంగా మహిళల నాయకత్వంలో నడిచిన ఉద్యమం కావడం విశేషం. అత్యవసర పరిస్థితి (1975-77) కాలంలో ఆటంకాలు వచ్చినా, 1977 నుంచి బహుగుణ నాయకత్వంలో మళ్లీ ఊపందుకుంది. స్త్రీలను ముందువరసలో నిలబెట్టిన ఈ ఉద్యమంలోకి బహుగుణ ప్రవేశించడం కూడా ఆయన శ్రీమతి విమల సలహాతోనే కావడం గొప్ప వైచిత్రి. 1981-83 మధ్య ఆయన హిమాయల ప్రాంతంలో చేసిన ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర కారణంగానే చెట్ల కూల్చివేత మీద నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆంక్షలు విధించారు. అదొక విజయమే.

బహుగుణ జీవితంలో కనిపించేది చిప్కో ఒక్కటే కాదు. ఆయన  ఎస్‌సీల ఆలయ ప్రవేశం చేయించారు. మద్యపాన నిషేధం, ఎస్‌సీ ఎస్టీల సాధికారత కోసం కూడా ఉద్యమించారు. ఏరి కోరి ఎంచుకున్న  సిల్వారా అనే మారుమూల గ్రామంలో నిర్మించుకున్న ఆయన కుటీరం ఎందరో పర్యావరణ, సామాజిక ఉద్యమకారులకు ప్రేరణ. ‘హిమాలయం ఒక తపోభూమి. తపస్సు చేయకుండా ఏదీ సాధ్యం కాదు. మనం నివసిస్తున్న ఈ గ్రహం అంతరించిపోతోంది. నేను చేస్తున్న తపస్సంతా దీనిని రక్షించుకోవాలనే! మనం ప్రాణాలతో ఉంటూ; ఒక నది, ఒక పర్వతం, ఒక అడవి, ఒక సాగరం అంతరించిపోవడాన్ని చూస్తూ ఎలా ఊరుకోవాలి?’ ఒక మిత్రునికి రాసిన లేఖలో బహుగుణ రాసిన మాటలివి. ఆకుపచ్చని హృదయావిష్కరణ కదా!

తన జీవితంలో, సుదీర్ఘంగా చేసిన పాదయాత్రలలో ఆయన ఇచ్చిన సందేశ సారమంతా అదే. చెట్టుకి, నదికి, సాగరానికి, పచ్చదనానికీ; మనిషికీ ఉన్న బంధం ఎంత గాఢమైనదో, అనిర్వచనీయమైనదో, బలీయమైనదో, పవిత్రమైనదో, శాశ్వతమైనదో చెప్పడానికే ప్రయత్నించారు. పర్యావరణ పరిరక్షణకీ, మానవాళి మనుగడకీ మధ్య ఉన్న నిర్మాణాత్మక బంధం గురించీ, అది చెడిపోకుండా కాపాడుకోవడం గురించీ మనుషుల బుర్రకెక్కించడానికి తపించారు. ఆ సందేశం అవసరం ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. ఆ ఆశయానికి ఆకృతిని ఇవ్వడానికి స్వయంగా కదలడం లేదా అదే ఆశయంతో ఇప్పటికే ముందుకెళుతున్న వారితో భుజం భుజం కలపడం ఆయనకు నిజమైన నివాళి అవుతుంది.

About Author

By editor

Twitter
Instagram