విపత్కర పరిస్థితుల్లోనూ విధ్వంసక రాజకీయాలు

అది కరోనానే కావచ్చు. మరేదైనా కావచ్చు. ఆంధప్రదేశ్‌ ‌రాజకీయాలు మాత్రం ‘ఎడ్డెమంటే తెడ్డెం’ అన్నట్లుగా సాగుతాయి. గత ఏడేళ్లుగా ఇదే కథ నడుస్తోంది. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ధోరణి మరింతగా పెడదారి పట్టింది. ఇందుకు ఆయనను ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా అదే బోనులో ముద్దాయిగా నిలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టడం ప్రధాన ప్రతిపక్షం ప్రథమ కర్తవ్యం అన్న విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ  సీనియర్‌ ‌నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షం అన్న తర్వాత ఆ మాత్రం వికారాలు చూపకపోతే మనుగడ కష్టమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారేమో కానీ, కరోనా మహమ్మారి సృష్టించిన ఇలాంటి విపత్కర పరిస్థితులలోనూ అదే పెడ ధోరణి సాగిస్తే ప్రజలు ఛీ కొడతారు. అంతేకాదు, ఇలాంటి వికారాలు ప్రదర్శించడం అటు ప్రభుత్వానికి గానీ, ఇటు ప్రతిపక్షానికి గానీ మంచిది కాదు. విపత్తు సమయంలో ఎన్నికల రాజకీయాలు చేయడం ఎవరికీ క్షేమం కాదు. రాష్ట్రానికి అసలు మంచిది కాదు. దేనికైనా ఒక సమయం, సందర్భం ఉంటుంది. అది మరిచి గీత దాటితే విజ్ఞత అనుపించుకోదు.


దేశం, రాష్ట్రం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలోనైనా అధికార, ప్రతిపక్షాలు కొంతైనా సమన్వయంతో పని చేయాలని ఎవరైనా కోరుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో ముందుకు సాగాలని కూడా ఎవరైనా ఆశిస్తారు. అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని సమీక్షించిన సమయంలో జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సోరెన్‌ ‌వీడియో కాన్ఫరెన్స్‌లో తమకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని ట్వీట్‌ ‌చేశారు. అందుకు సమాధానంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ‘‌రాజకీయ పార్టీల మధ్య విబేధాలు ఉండవచ్చు. అయినా కొవిడ్‌ ‌మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రస్తుత సమయంలో మనమంతా ఏకమవ్వాలి. పార్టీలకు అతీతంగా కొవిడ్‌పై పోరాటాన్ని మరింతగా బలోపేతం చేద్దామ’ని హితవు పలికారు.

నిజానికి ఇదేమీ తప్పు కాదు. అందరూ అదే కోరుకుంటున్నారు. ఇటీవల పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతాబెనర్జీ కూడా, ఇంచుమించుగా అదే అభిప్రాయం వ్యక్తపరిచారు. కొవిడ్‌పై దేశం సాగిస్తున్న పోరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మమత వ్యాఖ్యలను ఎవరూ తప్పు పట్టలేదు. కానీ, జగన్‌ ‌చేసిన వ్యాఖ్యలపై మాత్రం టీడీపీ సోషల్‌ ‌మీడియా పెద్దఎత్తున దుమారాన్నే రేపింది. చివరకు చంద్రబాబు జాతీయ స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి జగన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ నాయకులైతే.. కేసుల భయం కారణంగానే జగన్‌ ‌కేంద్రం భజన చేస్తున్నారని అస్మదీయ మీడియాలో అరచి గోల చేశారు. సోరెన్‌తోనూ అదే మాట చెప్పించారు.

ఇప్పుడే కాదు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం.. బీజేపీ, వైసీపీల మధ్య లేని సంబంధాన్ని అంటగట్టి తమ ఉనికిని, రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎదగకుండా చాలాకాలంగా ప్రయత్నిస్తున్నది. అయితే.. జగన్మోహన్‌రెడ్డి అనే కాదు, చంద్రబాబు లేదా మరో నేతపై ఉన్న అవినీతి కేసుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం నిజమైతే.. ఈ పాటికి ఎప్పుడో చంద్రబాబు ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ ‌చేస్తారంటూ వ్యక్తపరిచిన భయం నిజం అయ్యేది. 2019 ఎన్నికలకు ముందు ధర్మ పోరాటం పేరిట చంద్రబాబు, టీడీపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాగించిన అసభ్య జాతరకు ఎప్పుడో జైల్లో ఉండేవారు. చంద్రబాబు అవినీతి అంటే ఎరగని జాతిరత్నం కాదు, ఆయన పైనా అనేక కేసులున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బెయిల్‌పై బండి నడిపిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు స్టే’లతో బండి లాగిస్తున్నారు. అవినీతి విషయంలో ఇద్దరూ సమాన ఘనులే. ఇది అందరికీ, మరీ ముఖ్యంగా ఆ ఇద్దరికీ బాగా తెలిసిన సత్యం. అందుకే, ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భయంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు.

కొవిడ్‌పై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎంత అవసరమో.. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సమన్వయం కూడా అంతే అవసరం. అయితే, ఇప్పుడు సోరెన్‌కు సుద్దులు చెపుతున్న జగన్‌ ‌రాష్ట్రంలో ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు. ఎన్నికల విషయంలో కానీ, ఇంటర్‌ ‌పరీక్షల విషయంలో కానీ, కొవిడ్‌ ‌కట్టడికి సంబంధించిన మరే ఇతర విషయంలో కానీ, అఖిలపక్ష సమావేశం నిర్వహించడమో, ప్రతిపక్ష నాయకులను సంప్రదించడమో చేయలేదు. పరీక్షలు వద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు అని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తులను అసలు పట్టించుకోలేదు. పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం ఒకటికి పదిసార్లు ప్రకటించింది. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి ‘ఇంటర్‌ ‌విద్య ప్రాధాన్యం’ గురించి చెప్పుకొచ్చారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థుల భవిష్యత్‌ అం‌ధకారం అయిపోతుంది అన్నంతగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మొత్తం సమాజంలో విజ్ఞాన వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆ విషయంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘ మాటల యుద్ధం జరిగింది. చివరకు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో పరీక్షల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఒక్క విషయం అనే కాదు, కొవిడ్‌ ‌విషయంగా అనేక అంశాలకు సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య ‘రాజకీయ పోరాటం’ సాగింది, సాగుతోంది. కొవిడ్‌పై పోరాటం కంటే.. వైరస్‌ ‌పరంగా సాగిన, సాగిస్తున్న రాజకీయమే ప్రమాదకరంగా మారిందని ప్రజలు భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.

ఇదిలా ఉంటే, జగన్‌ ‌ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, లోకేష్‌తో సహా ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకులపై కేసుల అస్త్రాన్ని సంధించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందులో కొన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలకు సంబంధించినవైతే.. మరికొన్ని కరోనా సంబంధిత కేసులు. కరోనా సెకెండ్‌ ‌వేవ్‌కు సంబంధించి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారంతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని కర్నూలుకు చెందిన న్యాయవాది సుబ్బయ్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై క్రిమినల్‌ ‌కేసు నమోదు చేశారు. నిజానికి చంద్రబాబు స్టేలు తెచ్చుకుని నడిపిస్తున్న కేసులతో పోలిస్తే ఇది అసలు కేసే కాదు. కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అదేదో చాలా ప్రమాదకర కేసు అన్నట్లుగా రాద్ధాంతం చేస్తున్నారు. వివరాల్లోకెళితే కరోనా సెకండ్‌వేవ్‌ ఎన్‌ 440‌కె వైరస్‌ అని, ఇది కరోనా కంటే పది రెట్లు ఎక్కువ ప్రమాదకరమని సీసీఎంబీ నిర్ధారించిందని, దీనిపై జాతీయ మీడియా చర్చపెడితే రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయడానికి మాత్రమే చంద్రబాబు మాట్లాడారని, దీనిపై న్యాయవాదిని అడ్డుపెట్టి క్రిమినల్‌ ‌కేసు నమోదు చేస్తారా? అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘మీడియాలో మాట్లాడినందుకే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం అసమర్థత వల్ల కొవిడ్‌ ‌బారినపడి వేలమంది ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలి’ అని నిలదీస్తున్నారు. ఇదంతా మీడియాలో రచ్చకు తప్ప మరెందుకు పనికొచ్చే విషయం కాదు. అయినా అధికార, ప్రతిపక్ష పార్టీలు అనవసర విషయాలపై దృష్టి పెట్టినంతగా అసలు సమస్యపై దృష్టిని కేంద్రీకరింక రించడం లేదు. నిజానికి, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి. రోజురోజుకి కొవిడ్‌ ‌కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగు తోంది. ఇలాంటి పరిస్థితిలో రాజకీయాలు చేయడం సమంజసం కాదు. సమర్ధ నీయమూ కాదు.

నిజానికి, రాజకీయంగానే చూసినా మీడియా దృష్టిని ఆకర్షించేందుకు. లేదంటే అస్మదీయ మీడియా ద్వారా ప్రత్యర్థులను విమర్శించి లబ్ధి పొందాలని అనుకోవడం వల్ల ఫలితం ఉండదు. కష్టకాలంలో ఆదుకున్న పార్టీలు, నాయకులనే ప్రజలు పది కాలాల పాటు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు, అందరికీ కావలసింది సానుకూల దృక్పథం, అంతే కానీ ఇలా ఎడ్డెమంటే తెడ్డెమనే ధోరణి కాదు.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram