కరోనా… సెకండ్‌ ‌వేవ్‌ ‌విశ్వరూపం చూపిస్తోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు చాలడం లేదు. బయట మార్కెట్లో తగినన్ని మందులు దొరకడం లేదు. కనీసం కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరమైన వారందరికీ చేయడం లేదు. చివరకు వ్యాక్సిన్‌ ‌విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ముఖ్యంగా తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తోంది. తొలిదశ పాఠాలను ప్రభుత్వం నెమరేసుకోకపోవడం, అత్యంత తేలిగ్గా తీసుకోవడం, కనీస సమీక్షలు కూడా నిర్వహించకపోవడం, మహమ్మారి రెండోదశ ఆనవాళ్లు స్పష్టంగా కనిపించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వంటి పరిణామాలు రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ ‌చుట్టుముట్టేందుకు కారణమయ్యాయి. చివరకు కోర్టు జోక్యం చేసుకుంటే గానీ సర్కారు మేలుకోని పరిస్థితి దాపురించిందంటే ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దేశంలో సెకండ్‌ ‌వేవ్‌ ‌మొదలైన తర్వాత.. కొన్ని రాష్ట్రాలు శీఘ్రంగా మేలుకొన్నాయి. ఎక్కడికక్కడ కట్టడికి చర్యలు చేపట్టాయి. అత్యధికంగా కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించాయి. ఢిల్లీలో అయితే ఏకంగా లాక్‌డౌన్‌ ‌పెట్టారు. చాలా రాష్ట్రాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. కంటైన్‌మెంట్‌ ‌జోన్లు ఏర్పాటుచేశాయి. ప్రభుత్వం, పోలీసులు కూడా సీరియస్‌గా చర్యలు తీసుకున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తూ ఉండిపోయింది. మన పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో విపరీతంగా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రాల నుంచి తెలంగాణకు భారీగా రాకపోకలు సాగించడం మొదటినుంచీ జరుగుతోంది. కానీ, రాష్ట్ర సరిహద్దుల్లో గానీ, అంతరాష్ట్ర చెక్‌పోస్టులలో గానీ, అవసరమైన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా తెలంగాణలోనూ రోజు రోజుకూ పాజిటివ్‌ ‌కేసులు, మరణాలు తీవ్రమయ్యాయి. దీంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణను ఒకరకంగా గాలికి వదిలేసిందన్న స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే హైకోర్టు కరోనా విషయంలో సర్కారుకు మొట్టికాయలు వేసింది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పిన వివరాలతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. అసలు కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేదంటే తామే ఆదేశాలు ఇవ్వమంటారా? అని కూడా ప్రశ్నించింది. పబ్‌లు, బార్లు, స్టేడియాలు అన్నీ తెరిచారని, ఫంక్షన్లు, ఉత్సవాలవంటి కార్యక్రమాలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులిస్తున్నారని, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇలాగే చేస్తుందా? కరోనా ఇలాంటి చర్యల వల్ల వ్యాపించదా? అని అడిగింది. 48 గంటల్లోగా ప్రభుత్వం స్పందించి కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ ‌గానీ, కర్ఫ్యూ గానీ ప్రకటించకపోతే.. తామే ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం హెచ్చరించింది.

హైకోర్టు పై వ్యాఖ్యలు చేసి, ప్రభుత్వాన్ని నిలదీసిన మరుసటిరోజే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ మరుసటి రోజే న్యాయస్థానానికి సమాధానం చెప్పాల్సిన అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం కర్ఫ్యూ నిర్ణయాన్ని ప్రకటించింది. అది కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, రైళ్లు, బస్సులు, విమాన ప్రయాణాలు, అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని ప్రకటించింది. దీంతో.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ సమయంలో కూడా బస్సులు తిరుగుతున్నాయి. అంతేకాదు.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా కర్ఫ్యూ సమయంలో కూడా బయల్దేరుతున్నాయి. ప్రయాణికులు రాత్రివేళ ప్రయాణాలు సాగిస్తున్నారు. రాత్రి పదిగంటలు దాటిన తర్వాత కూడా ఒకరకంగా కరోనా కర్ఫ్యూ పరిస్థితులు కనిపించడం లేదు. అంటే.. అధికారికంగా కోర్టుకు నివేదించాల్సిన అవసరం ఉంది కాబట్టే.. ప్రభుత్వం కర్ఫ్యూ పేరిట నివేదికను న్యాయస్థానానికి అందించిందని, ప్రభుత్వానికి కరోనా నియంత్రణపై నిజమైన చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి.

ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌యశోదా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన వెంట.. అధికారిక మందీ మార్బలం అంతా ఉంది. పదుల సంఖ్యలో అధికారులు, భద్రతా సిబ్బంది.. వ్యక్తిగత సిబ్బంది ఆయన వెంటే ఆసుపత్రికి వెళ్లారు. అదే సామాన్య పౌరులకు కరోనా సోకిందని తెలిసి.. అలా బయటకు వచ్చి.. బాహాటంగా పరీక్షలు చేయించుకుంటే అధికారులే అడ్డుకునేవారు. పోలీసులు కేసు పెట్టేవారు. కానీ, సీఎం కేసీఆర్‌ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే విధంగా ఇలా బయటకు వచ్చారన్న వ్యాఖ్యానాలు కూడా సోషల్‌ ‌మీడియాలో వినిపిస్తున్నాయి.

ఇక, కేంద్ర ప్రభుత్వం ప్రకటనలను, పథకాలను, ఉచితాలను తమ ఖాతాలో వేసుకోవడం, అది కూడా శరవేగంగా.. మరొకరు తేరుకునేలోగానే ప్రకటనలు చేయడం, జనంలో మార్కులు కొట్టేయడానికి ప్రయత్నించడం కేసీఆర్‌కు తప్ప మరెవరికీ సాధ్యం కాదన్న రికార్డ్ ఉం‌డనే ఉంది. ఇప్పుడు కరోనా విషయంలోనూ టీఆర్‌ఎస్‌ ‌సర్కారు రెండాకులు ఎక్కువే తిన్నది. క్షేత్రస్థాయిలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నా, స్పష్టమైన నివేదికలు ఉన్నా, ఆసుపత్రుల్లో సమస్యలు పెరిగిపోతూనే ఉన్నా.. ఏమాత్రం చలించని ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ ‌విషయంలో మాత్రం ఆగమేఘాల మీద ప్రకటన చేసింది. తాము ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఉచితంగా వేస్తామని ప్రకటించింది. జనమంతా.. రాష్ట్ర ప్రభుత్వం పెద్దమనసుకు ఎంతో సంబరపడిపోయారు. త్వరలో టీకా ధరలు భారీగా పెరగబోతున్నాయని, ఇకపై ఉచితంగా వ్యాక్సిన్‌లు వేయబోరని ప్రచారాలు షికార్లు చేస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన అందరికీ ఊరట కలిగించింది. అయితే, అసలు ఈ ఆలోచన కేంద్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవం జనం లోపలికి చొచ్చుకువెళ్లలేదు. ఎందుకంటే, కేంద్రమే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి.. ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తామని ప్రకటించింది. కేంద్రం ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సిన్‌ అం‌దరికీ ఉచితమే అని ప్రకటన చేసింది.

మే 1వ తేదీ నుంచి 18 యేళ్లు నిండిన వాళ్లందరికీ టీకా వేయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ ‌వేయించుకోవాలని సూచించింది. అయితే, అదే సమయంలో ఇకపై టీకా ఉచితంగా వేయబోరంటూ ప్రచారాలు జరిగాయి. వాటికి ఫుల్‌స్టాప్‌ ‌పెడుతూ కేంద్రమే ఉచితంగా అన్ని రాష్ట్రాలకు టీకాలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. అటు.. ఈ ప్రకటన వెలువడిందో లేదో, కేసీఆర్‌ ఉచిత టీకాల ప్రకటన చేశారు. అంతేకాదు.. దానికి అవసరమయ్యే ఖర్చు, కార్యాచరణ ప్రణాళికను కూడా విశదీకరించారు. అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి సుమారు రూ.2500 కోట్లకు పైగా ఖర్చవుతుందని, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని కేసీఆర్‌ అన్నారు. వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తామని కూడా ప్రకటించారు. అయితే, వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారు 2.62 కోట్ల మంది ఉన్నారు. వారిలో ఇప్పటికే 35 లక్షల మందికి టీకా వేశారు. దాంతో మిగిలిన 2.27 కోట్ల మందికే వ్యాక్సిన్‌ ‌వేయాల్సి ఉంటుంది. సీఎం ప్రకటన మేరకు అందరికీ ఉచితంగా ఇవ్వాలంటే ఇప్పుడున్న కేంద్రాల సంఖ్య సరిపోదని చెబుతున్నారు. అంటే.. షరా మామూలుగానే సీఎం కేసీఆర్‌ ఓ ‌ప్రకటన వదిలారని, తర్వాత వాస్తవ పరిస్థితి వేరేలా ఉంటుందన్న వాదనలు కూడా జనంలో తిరుగుతున్నాయి.

– సుజాత గోపగోని, 6302164048, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram