కశ్మీర్‌ ‌లోయలో ఎదురు కాల్పులు, తుపాకీ పేలుళ్ల మోతలు కొత్తకాదు. కానీ తాజాగా జమ్ము-శ్రీనగర్‌ ‌జాతీయ రహదారి మీద జరిగిన ఎదురు కాల్పుల ఉదంతం గురించి ప్రధాని నరేంద్ర మోదీయే వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పనిచేసే జైష్‌ ఏ ‌మహమ్మద్‌ ఉ‌గ్రవాద సంస్థ తలపెట్టిన అతిపెద్ద విధ్వంసక కుట్రను మన భద్రతాదళాలు ఈ ఎదురుకాల్పుల ద్వారా బట్టబయలు చేశాయని మోదీ ప్రకటించారు. ఇందులో నలుగురు ఉగ్రవాదులు చనిపోవడం, ప్రధాని వ్యాఖ్యలతో ఈ ఘటన గురించి ఒక్కసారి దేశం దృష్టి సారించవలసి వచ్చింది. జమ్ముకశ్మీర్‌లో కింది స్థాయి వరకు ప్రజాస్వామ్యబద్ధ పాలన ఆరంభం కావాలని జరుపుతున్న ప్రయత్నాకు విఘాతం కల్పించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు కుట్ర పన్నారని కూడా ప్రధాని వెల్లడించారు.


నవంబర్‌ 19 ‌వేకువన నగ్రోటా అనే గ్రామం దగ్గర ఈ ఘటన జరిగింది. ఆ ఉగ్రవాదులు నలుగురు ట్రక్కులోనే దాగున్నారు. అది శ్రీనగర్‌ ‌దిశగా వెళుతున్నది. కాల్పులు జరిగిన మరునాడు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు జాతీయ రక్షణ సలహాదారు అజిత్‌ ‌ధోవల్‌ ఎదురు కాల్పుల ఉదంతం గురించి ప్రధానికీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకూ వివరించారు. విదేశ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష్ ‌ష్రింగ్లా, నిఘా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో జమ్ము, కశ్మీర్‌లలోని పరిస్థితి గురించి సమీక్షించారు. ఉగ్రవాదుల ప్రవేశం గురించి పాకిస్తాన్‌పట్ల నిరసన తెలియచేయడానికి ఈ నెల 20న భారత ప్రభుత్వం దేశంలోని పాక్‌ ‌రాయబార కార్యాలయ అధికారులను పిలిచింది.

నగ్రోటా ఎదురు కాల్పులు నవంబర్‌లో జరగడం యాదృచ్ఛికమే అయినా, మన సైనిక దళాలకు సంబంధించి నగ్రోటా గతంలో ఒక చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. ఇక్కడి మన సైనిక శిబిరం మీద కూడా సరిగ్గా నవంబర్‌ (29)‌లోనే 2016లో ఉగ్రవాదులు దాడి చేశారు. భీకరంగా జరిగిన కాల్పులలో ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. ముగ్గురు ఉగ్రవాదులు కూడా చనిపోయారు. పైగా ఇది బుర్హాన్‌ ‌వాని అనే ముష్కరుడిని భారతీయ భద్రతాదళాలు హతమార్చిన నేపథ్యంలో జరిగిన హింసలో భాగంగా ఉగ్రవాదులు చేసిన ఘాతుకం. అప్పుడే యురి సెక్టార్‌ అం‌తా అల్లకల్లోమైంది. దీని ఫలితంగానే సర్జికల్‌ ‌స్ట్రయిక్స్ ‌జరిగిన సంగతీ గుర్తు చేసుకోవాలి. అప్పుడు మన సైనిక శిబిరం మీద జరిగిన దాడి కూడా వేకువనే జరిగింది. ఒక విధంగా ఇది ఉగ్రవాద మూకల మీద జవాన్లు సాధించిన ప్రతీకారం అని అనుకున్నా అనుకోవచ్చు. జమ్ము నగరానికి సమీపంగానే ఉండే నగ్రోటా గ్రామంలోని సైనిక శిబరం వద్దకు మన పోలీసు యూనిఫారాలతో వచ్చిన ఉగ్రవాదులు ఆనాడు కాల్పులకు తెగబడ్డారు.

నగ్రోటా వద్ద జరిగిన తాజా ఎదురుకాల్పుల ఘటన గురించి ప్రధాని మాట్లాడడం వెనుక పెద్ద ఆవేదనే కనిపిస్తుంది. దేశానికి ఇదొక సాంత్వన కూడా. అందుకే ప్రధాని భద్రతా బలగాలను ఎంతో శ్లాఘించారు. ఈ ఉదంతం గురించి నిఘా అధికారులు అందించిన ఆధారాలే విస్తుపోయేటట్టు ఉన్నాయి. జైష్‌ ఎ ‌మహమ్మద్‌ ‌రెండు లక్ష్యాలతో ఆ ఉగ్రమూకను పంపింది. ఒకటి- 26/11 ముంబై పేలుళ్ల ఘాతుకం జరిగి 12 సంవత్సరాలు గడిచిన సందర్భాన్ని చూసుకుని మళ్లీ ఒకసారి లోయలో ఘోర రక్తపాతం సృష్టించడం. రెండు, ఆ ప్రాంతంలో తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికల (డిస్ట్రిక్ట్ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌కౌన్సిల్‌ ఎన్నికలు) ముందు భయోత్పాతం కలిగించడం. నవంబర్‌ 28 ‌నుంచి డిసెంబర్‌ 22 ‌వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. డిస్ట్రిక్ట్ ‌డెవలప్‌మెంట్‌ ‌కౌన్సిల్‌ ఎన్నికలు ఎనిమిది దశలలో జరుగుతున్నాయి. 280 మంది ప్రతినిధులు ఈ ఎన్నికల ద్వారా వస్తారు. పంచాయతీలలో ఖాళీగా ఉన్న 12,000 స్థానాలకు, పట్టణ ప్రాంత పాలక సంస్థలలోని 230 స్థానాలకు కూడా ఎన్నిక జరపాలని నిర్ణయించారు. ఇప్పుడు కనుక విధ్వంసం సృష్టించగలిగితే జమ్ము, కశ్మీర్‌లలో ప్రజాస్వామ్య పక్రియ పునరుద్ధరణకు తలపెట్టిన పక్రియకు ఆదిలోనే భంగం వాటిల్లుతుంది. 2018 సంవత్స రంలో వీటికి జరిగిన ఎన్నికలను నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీడీపీ బహిష్కరించాయి. ఇప్పుడు గుప్కార్‌ అలయెన్స్ ‌పేరుతో ఆ పార్టీలే ఎన్నికలలో పాల్గొంటున్నాయి. గుప్కార్‌ అలయెన్స్ ‌పేరుతో ఆ పార్టీలు ఎన్నికలలో పాల్గొనడం ఇదే మొదటిసారి. నిజానికి 370 అధికరణం తరువాత స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలివి.ఈ ఎన్నికల మీద పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ తుపాకీ జాడ పడకుండా జాగ్రత్త పడడం కేంద్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేస్తే లోయలో కిందిస్థాయిలో ప్రజా నాయకత్వం ఏర్పడుతుందని కేంద్రం భావన. దీనితో ఉగ్రవాదానికి మంచి సమాధానం చెప్పవచ్చునని కూడా ఎన్‌డీఏ ఆశిస్తున్నది. పీడీపీ, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్‌ల కుటుంబ, అవినీతి పాలనకు అడ్డుకట్ట వేయడానికి కూడా స్థానిక సంస్థల ఎన్నికలతో సాధ్యమవుతుందని కూడా విశ్వసిస్తున్నారు.

దీనిని నిరోధించాలన్న రాక్షస తలంపుతోనే చనిపోయిన ఆ నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని చెప్పడానికి కావలసినన్ని ఆధారాలు దొరికాయి. పెద్ద మొత్తంలో పేలుడు సామగ్రి లభ్యమైంది. దీనితో ఆ ఉగ్రవాదుల ఉద్దేశం గురించి నిఘా వర్గాల అంచనాకు పెద్ద ఆధారమే దొరికింది. దీనినే మన భద్రతాదళాలు వమ్ము చేశాయి. 6 ఏకే 56 తుపాకులు, ఐదు ఏకే 47 తుపాకులు, మూడు పిస్టళ్లు దొరికాయి. 16 ఏకే మ్యాగజీన్లు ఉన్నాయి. ఆర్‌డిఎక్స్ ‌పొట్లం ఒకటి దొరికింది. ఎన్నో గ్రనేడ్లు దొరికాయి. ఉన్నది నలుగురు ఉగ్రవాదులు. కానీ తుపాకులు 11. స్పెషల్‌ ఆపరేషన్‌ ‌బృందానికి చెందిన ఇద్దరు కూడా తీవ్రంగానే గాయపడ్డారు. ఒక ట్రక్కులో వీళ్లు వస్తుండగా నిఘా వేసి భద్రతా దళాలు పట్టుకున్నాయి. బాన్‌ ‌టోల్‌ ‌ప్లాజా దగ్గర ఇది జరిగింది. ట్రక్కు డ్రైవర్‌ ‌పారిపోయాడు. దీనికి ఉన్న నెంబర్‌ ‌నిజమైనది కాదు. కొన్ని గ్రనేడ్లు పేలి పోవడంతో ట్రక్కు కూడా దగ్ధమైంది. వీటిని బట్టే ఈ ఎదురుకాల్పుల బీభత్సం గురించి ఊహించవచ్చు. సాధారణంగా భారతదేశంలోకి పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రవేశిస్తూ ఉండే షకార్‌గఢ్‌ ‌దగ్గర అబ్దుల్‌ ‌రవూఫ్‌ అన్గర్‌ (‌రవూఫ్‌ ‌లాలా) కనిపించాడు. ఇతడు జైషే వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ ‌సోదరుడే. షకార్‌గఢ్‌ అం‌తర్జాతీయ సరిహద్దులో, నరోవాల్‌ ‌జిల్లాలో (పాకిస్తాన్‌) ఉం‌ది. 2008, నవంబర్‌ 26 ‌నాటి పేలుళ్ల తేదీని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదులు కొత్త పథకం రచించవచ్చునన్న అనుమానంతోనే నిఘా వర్గాలు ఉన్నాయి. అదే జరిగింది. లోయలో స్థానిక ఎన్నికలు, ముంబై పేలుళ్ల ఘటన జరిగి పన్నెండు సంవత్సరాల ఏకకాలంలో సంభవించిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఈ అనుమానాలతో ఉన్నాయి. దీనితో కశ్మీర్‌ ‌పోలీస్‌, ‌స్పెషల్‌ ఆపరేషన్‌ ‌గ్రూప్‌, ‌సీఆర్‌పీఎఫ్‌ అ‌ప్రమత్తమయ్యాయి. మొత్తానికి బాన్‌ ‌టోల్‌ ‌ప్లాజా వద్ద ఈ వ్యాన్‌ ‌దొరికింది. లొంగిపోవాలని భద్రతాదళాలు హెచ్చరించాయి. కానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పెద్ద ఎత్తున మూడు గంటల పాటు అవి కొనసాగాయి. మందుగుండుతో పాటు కొన్ని మందులు కూడా ఉగ్రవాదుల దగ్గర దొరికాయి. అవన్నీ పాకిస్తాన్‌కు చెందినవే. కాబట్టి ఉగ్రవాదులు ఆ దేశ సరిహద్దు దాటి లోపలకి వచ్చారని నిఘా వర్గాలు విశ్వసిస్తున్నాయి. సరిహద్దు దాటినది ఈ నలుగురే అయినా, దేశంలో ఉన్న స్లీపర్‌ ‌సెల్స్ ‌సాయం మీద నమ్మకంతోనే వచ్చి ఉంటారని కూడా భద్రతా బలగాలు చెబుతున్నాయి. వీళ్ల దగ్గరే దొరికిన మొబైల్‌ ‌ఫోన్లు, రేడియోలను బట్టి కూడా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద పెద్దల కనుసన్నలలోనే వ్యవహరించారని అర్థమవుతుందని కూడా చెబుతున్నారు. ఇవి పాకిస్తాన్‌కే చెందిన మైక్రో ఎలక్ట్రానిక్స్, ‌క్యూమొబైల్స్ ‌సంస్థలు తయారుచేసినవే. రవూఫ్‌ అస్గర్‌ ఆదేశాలతోనే నడుచుకుని ఉంటారని భద్రతాదళాల అభిప్రాయం. ఆ ఫోన్‌లలో ‘మీరు ఎక్కడకి చేరుకున్నారు? పరిస్థితి ఏమిటి? మీకు ఏ ఇబ్బందీ లేదని భావిస్తున్నాను’ అన్న ప్రశ్నలతో కూడిన సమాచారం ఉంది. దొరికిన డిజిటల్‌ ‌మొబైల్‌ ‌రేడియోలో వచ్చిన సమాచారం కూడా పాక్‌లోని ఉగ్రవాద పెద్దలతో వీళ్లు మాట్టాడిన సంగతినే రుజువు చేస్తున్నదని భద్రతావర్గాలు చెబుతున్నాయి. ఆ మందులు కూడా కరాచీలో తయారైనవే. ఉగ్రవాదులు వేసుకున్న బూట్లు పాకిస్తాన్‌వే. ఒక వైర్‌లెస్‌ ‌సెట్‌, ‌జీపీఎస్‌ ‌కూడా దొరికాయి.

———————————————

పాక్ సైన్యంలో ఉగ్రవాద భక్తి

‘ఏ ప్రామిస్డ్ ‌ల్యాండ్‌’.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆత్మకథ ఇది. గతంలో ఆ దేశ అధ్యక్షులు రాసిన అన్ని ఆత్మకథల కంటే దీనికే ఎక్కువ ప్రాచుర్యం వచ్చిందట. రావాల్సిందే. ఇందులో అద్భుతమైన వాస్తవాలు ఉన్నాయి. కొన్ని దేవరహస్యాలు కూడా. పాకిస్తాన్‌ ‌గురించి కూడా చక్కని దేవ రహస్యం భావి తరాల కోసం అందిచారు, ఒబామా.

అబోటాబాద్‌ అనేచోట ఒసామా బిన్‌లాడెన్‌ ‌దాగున్నాడన్న సమాచారం అమెరికా తెలుసుకుంది. అబోటాబాద్‌ అనేది ఒకానొక పాక్‌ ‌సైనిక శిబిరానికి కూతవేటు దూరంలోనే ఉందట. అయినా లాడెన్‌ ‌మా దేశంలో లేడని అడ్డంగా బొంకింది ఆనాడు పాకిస్తాన్‌. అసలు లాడెన్‌ ‌బస మీద దాడికి పాకిస్తాన్‌ ‌సైన్యం ప్రమేయం వద్దేవద్దు అన్నారట బరాక్‌ ఒబామా. ఎందుకో ఆయనే చెప్పారు. ఒబామా తెలివైనవాడు మరి! పాకిస్తాన్‌ ‌సైన్యంలోను, నిఘా వర్గాలలోను కూడా లాడెన్‌ ‌విధేయులు ఉన్నారన్నది బహిరంగ రహస్యమే అని మొహమాటం లేకుండా రాశారు. పాకిస్తాన్‌ ‌సైన్యంలో అల్‌కాయిదా, తాలిబన్‌ ‌భక్తులు లెక్కకు మిక్కిలిగా ఉన్నా రన్నమాట. కానీ ముషార్రఫ్‌ ఆనాడు పిల్లి పాలు తాగిన చందంగా ఆ సంగతి అమెరికాకు తెలియదని అనుకున్నాడు. ఈ సామెత ప్రకారం పిల్లి కళ్లు మూసుకునే పాలు తాగుతుందట. తాను లోకాన్ని చూడలేదు. కానీ లోకమే తనను గమనిందని అనుకుంటుందట. ముషార్రఫ్‌ ‌చేసింది సరిగ్గా అదే. తాలిబన్‌, అల్‌ ‌కాయిదా ఉగ్రవాదులనే భారత్‌, అఫ్ఘానిస్తాన్‌ల మీద ప్రయోగించేందుకు  పాకిస్తాన్‌ ‌సైన్యం వాడుకునేదని కూడా ఒబామా రాసుకున్నారు. అంత అవినాభావ బంధం వారిది. ఎందుకో మరి, ఒబామా దగ్గర పనిచేసిన రక్షణమంత్రి రాబర్ట్ ‌గేట్స్, ‌నాటి అమెరికా ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం అధ్యక్షునిగా ఎన్నికైనా బైడెన్‌ ఆ ‌ముట్టడి వద్దని భావించారట. ఒబామా మాత్రం జరిపించారు.

అన్నట్టు పాక్‌ ఆ‌గ్రహం సంగతేమో కానీ, భారత్‌లో ఉత్తర ప్రదేశ్‌ ‌న్యాయవాది ఒకరికి ఒబామా పుస్తకం అభ్యంతరకరంగా కనిపించింది. జ్ఞాన్‌‌ప్రకాశ్‌ ‌శుక్లా అనే ఈ న్యాయవాది ఒబామా భారతీయ మహా నాయకులని అవమానించాడని చెబుతున్నారు. ఇంతకీ ఆ మహాపురుషులు ఎవరో అందరికీ తెలుసు. ఒకరు రాహుల్‌, ‌రెండు మన్మోహన్‌ ‌సింగ్‌. ‌పాపం, ఒబామాగారు ఎంతో సంయమనం పాటించారు గానీ, లేకపోతే చాలా దేవరహస్యాలు వచ్చి ఉండేవి. అవేవీ రాయకుండా తన పుస్తకం అమ్మకాలను ఆయన త్యాగం చేశారు కాదా! కాబట్టి ఒబామా రాసిన ఆ ఇబ్బందికర పుటల మీద పోలీసు చర్య తీసుకోవాలని శుక్లాగారు ఫిర్యాదు చేశారు. ఆ పుటలలో పార్లమెంట్‌ ‌సభ్యుడు రాహుల్‌ ‌గురించీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌గురించి రాసిన మాటలు వారి అభిమానుల హృదయా లను దహించే స్థాయిలో ఉన్నాయట. నేనిచ్చిన ఫిర్యాదు కనుక తీసుకోకపోతే ఢిల్లీలో ఉన్న అమెరికా రాయబార కార్యలయం ముందు నిరాహార దీక్ష చేసేస్తానంటున్నారాయన. అయ్యా! శుక్లాగారు. భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మీ పార్టీ వాళ్లకి తప్ప వేరొకరికి హక్కు లేదా?

About Author

By editor

Twitter
Instagram