జాతీయ ఏకాత్మతే శరణ్యం

3వ భాగం

సంఘ విస్తరణ,సామాజిక పరివర్తన సమాంతరంగా జరగాలని భాగయ్య ఆక్షాంక్షిస్తున్నారు. భారతీయతకు ఆటపట్టయిన కుటుంబం ద్వారానే విలువల పునరుద్ధరణ జరుగుతుందనీ, మతం మారిన వారు పునరాలోచించుకుని తిరిగి హిందూ జీవనంలోకి వస్తామంటే గౌరవ స్థానం ఇవ్వాలనీ అన్నారు. అయోధ్యలో భూమిపూజ అంటే కేవలం మందిర నిర్మాణం కాదనీ, జాతీయతకు మందిరం నిర్మించడమేనని చెప్పారు. సేద్యానికి వైభవం రావాలనీ, గ్రామాల నుంచి వలసలు ఆగిపోవాలనీ కోరుతున్నారు. వ్యవసాయ సంస్కరణలు రైతు ఆత్మగౌరవాన్ని పెంచేవని అన్నారు. విద్యా సంస్కరణలు చరిత్రలో మైలురాయి వంటివని స్పష్టం చేశారు. అలాగే ఆత్మనిర్భర భారత్‌ ‌స్వావలంబనకీ, ఆత్మ గౌరవానికీ పట్టం కడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖాముఖీ చివరిభాగంలో పలు కీలక అంశాల గురించి భాగయ్య విశ్లేషించారు.


సంఘ విస్తరణలో సాంస్కృతిక కోణం నుంచి చూడగలిగే గుణాత్మకమైన మార్పు ఏది? హిందూ జీవనవిధానం పరిధిలో సంఘం ఎలా విస్తరి స్తున్నది? భారతీయతకు ప్రతీకలుగా ఉండే గ్రామం, గుడి, బడి, కుటుంబం వంటివాటిని విస్తరణ దశలో ఎలా చూస్తున్నారు?

సంఘ విస్తరణ, సామాజిక పరివర్తన సమాంత రంగానే జరగాలి. సామాజిక పరివర్తన కోసం స్వయంసేవకులు పనిచేస్తున్నారు. ఇందులో కుటుంబం వస్తుంది. కుటుంబంలో ప్రేమ, త్యాగం, నిగ్రహం- మూడు గుణాలు వస్తాయి. కుటుంబ నిర్మాణం వీటితోనే జరగాలి. నీతి, నిజాయితీ కుటుంబం నుండే పుట్టుకొస్తాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఈ రీతిలో వికసించాలి. ఈ వ్యవస్థను స్వయంసేవకులు పటిష్టం చేస్తున్నారు. ఇందుకు పలు సంస్థల సహకారం తీసుకుంటున్నారు. అందరితో కలసి (గాయత్రీ పరివార్‌, ‌చిన్మయ మిషన్‌ ‌వంటివి) కుటుంబ ప్రబోధన్‌లో స్వయంసేవకులు పనిచేస్తున్నారు. ఎప్పుడైతే కుటుంబంలో ఇటువంటి జీవన విలువలు వస్తాయో, అప్పుడు గ్రామం మొత్తం కలిపి ఒక కుటుంబంలా అవతరించాలి. అందుకే గ్రామ వికాసం కోసం సంఘం శ్రమిస్తున్నది. గ్రామంలో చదువు, భూమి, నీటి సంరక్షణ, పర్యావరణ సంరక్షణ, చెట్లు పెంచటం, దేవాలయం ఆధారంగా సంస్కారం అందించడం లాంటివి చేయడం గ్రామ వికాసంలో భాగమే. దేవాలయం భక్తి కేంద్రం మాత్రమే కాకుండా సామాజిక, ఏకాత్మతకు కేంద్రం కావాలి. సామాజిక శక్తి కేంద్రం కావాలి. వేల గ్రామాలలో ఈ పని జరుగుతున్నది. ఇంకా జరగాలి.

ఇప్పటికీ చాలా గ్రామాలలో కనిపిస్తున్న వివక్షను ఎలా తొలగించాలి?

పుట్టుక ఆధారంగా వివక్షను సంఘం అంగీక రించదు. పెద్ద కులం, చిన్న కులం అన్నవి తప్పు, అధర్మం. మానవత్వం కాదు. రాజ్యాంగబద్ధం అసలే కాదు. కాబట్టి గ్రామం మొత్తం కుటుంబం ప్రాతిపది కగా, సామాజిక ఏకాత్మత సాధించాలి. ఆ దిశలో గ్రామ పునర్‌ ‌నిర్మాణానికి ప్రయత్నం జరుగుతున్నది.

మత మార్పిడులకు పరిష్కారం ఏమిటి?

దేశంలో సామరస్యాన్ని భంగపరుస్తూ విదేశీశక్తులు, స్వదేశీ స్వార్థపరులు మతమార్పిళ్ల పాల్పడుతున్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసే జీవించాలి. మతమార్పిడి జరగకూడదు. ‘మతమార్పిడి హింస’ అని చెప్పారు దయానంద సరస్వతి. ‘మతమార్పిడి జరిగితే ఒక వ్యక్తి శత్రువుగా మారుతాడు. ఇది మంచిది కాదు’ అన్నారు వివేకానందస్వామి. గాంధీజీ కూడా ఇదే చెప్పారు. అందుకే మత మార్పిడి నిరోధానికి స్వయంసేవకులు, భిన్నభిన్న ధార్మిక సంస్థలు పనిచేస్తున్నాయి. మతం మారడానికి కారణం పేదరికం. పేదరిక నిర్మూలనకీ, అందుకు అవసరమైన సేవ కోసం, కుల వివక్షను దూరం చేయడానికీ సమరసత దిశలో స్వయం సేవకులు పనిచేస్తున్నారు. ప్రలోభంతో, అమాయ కత్వంతో ఎవరు మతం మారినారో అలాంటివారికి మళ్లీ హిందూ సమాజంలో గౌరవ స్థానాలను ఇవ్వడం కోసం ప్రయత్నం జరుగుతున్నది.

వేదం, ఉపనిషత్తులు, యోగ, భగవద్గీతలను నేడు ప్రపంచమంతా అంగీకరిస్తున్నది. అంతేకాదు, అవి ప్రవచించే విలువల మేరకు జీవించే సమాజం ఎక్కడుందని అడుగుతోంది. ఆ రకంగా మన సమాజం జీవించాలి. సుఖంగా జీవించటం వేరు. భోగం వేరు. భోగలాలసత మన సంస్కృతి కాదు. నిరాడంబరతే మన జీవనశైలి. అహంకారం, విద్వేషం భారతీయత కాదు. ఏకాత్మత, సంయమనం భారతీయత. పరస్పర సహకారం, సహనం, వికాసం పరిఢవిల్లాలి. ఇందుకోసమే సంఘం ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు సమాజం సంఘం వెంట నడుస్తున్నది. ఇది పెద్ద విజయం. మన పరంపరకు విజయం. సంఘం విజయం.అంతిమంగా జాతీయతకు విజయం.

రామజన్మ భూమి ఉద్యమం ఆధునిక భారత సమాజం మీద సానుకూల ప్రభావం కలిగించింది. వీటి నేపథ్యం నుంచి అయోధ్యలో జరిగిన భూమి పూజ కార్యక్రమాన్ని ఎలా చూడాలి?

అయోధ్యలో భూమిపూజ కార్యక్రమం రాష్ట్ర అంటే జాతీయతకు మందిర నిర్మాణం చేపట్టడం వంటిదే. కోట్లాదిమంది రామభక్తులు అత్యంత ఆనందోత్సాహంతో ఇటు దేశంలోను, ఇంకా అనేక దేశాలలో భక్తితో శ్రద్ధలతో జన్మభూమిలో పూజా కార్యక్రమం దూరదర్శన్‌ ‌ద్వారా తిలకించారు. స్వాభిమాన అనుభూతితో పులకించిపోయారు. ఇంగ్లండ్‌ ‌ప్రధాని, ఆయన సతీమణి శ్రీరాముడి విగ్రహానికి అభిషేకం చేశారు. అంతగా కదిలించిందా ఘట్టం. అయోధ్యలో భూమిపూజ అంటే జాతీయ స్వాభిమాన భావనకు ప్రతీక. ఎందరో చేసిన బలిదానాలతో లభించిన సత్ఫలితం. రామ మందిరానికి పునాది అంటే మన సాంస్కృతిక జీవన మూల్యాలైన కరుణ, త్యాగం, సత్యవాక్పరిపాలన, మానవులందరిలో దైవత్వాన్ని దర్శించే ఏకాత్మభావన, పశుపక్ష్యాదులలో, ఈ చరాచర సృష్టితో ఏకాత్మతను పొందే భావనకు పునరుజ్జీవనమే.

ఇంతేకాదు. రామమందిర నిర్మాణంతో పాటు, మన మొత్తం సమాజంలో జీవన విలువల నిర్మాణమూ జరగాలి. ఇది మనందరి బాధ్యత. అంటే సామాజిక కార్యకర్తల బాధ్యత పెరిగింది. ఒక దేశ పురోగతి ఆ సమాజంలో ప్రతిఫలించే ప్రేమ, కరుణ, త్యాగం, జాతీయ ఏకాత్మతా భావనలపైనే ఆధారపడి ఉంటుంది. భూమిపూజ కార్యక్రమాన్ని ఇంతటి సమున్నత దృష్టిలో చూడాలనీ, జాతిని ఈ దిశగా సవీకరించాలనీ సర్‌సంఘచాలక్‌, ‌మన ప్రధానమంత్రి కార్యక్రమం వేళ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాలలో గుర్తు చేశారు కూడా.

విద్యా సంస్కరణల గురించి ఏమంటారు?

చిరకాలం తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం చరిత్రలో మైలురాయి. విద్యావేత్తలూ, సామజికకార్యకర్తలూ, ప్రభుత్వాధి కారులూ, జాతీయ స్థాయి రాజకీయ నాయకులూ అందరు ఎంతో శ్రమించి ఈ విధానాన్ని రూపొందించారు. భారతీయ సంస్కృతీ పరంపర ప్రతిబింబించే విధానంగా, మన ప్రాచీన వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించే విధంగా, వైజ్ఞానికంగా, కాలానుగుణంగా, విద్యార్ధికి అనుకూలమైన వాతావరణం నిర్మించేదిగా ఈ విధానం ఉంది. మన షెడ్యూల్డ్ ‌కులాలు, తెగల బంధువులకు నూతన విద్యావిధానంలో యోగ్యమైన ప్రాతినిధ్యం కలిగించారు. ఇది జాతీయ ప్రగతికి శుభ సూచకం. నూతన విద్యావిధానం అమలులో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉంది.

గ్రామీణ జీవితం సుస్థిరంగా, సుభిక్షంగా ఉండాలంటే ఇప్పటికి ఉన్న పరిష్కారం సేద్యమే. ఆధునిక జీవనాన్నీ, సేద్యాన్నీ  సంఘం ఎలా సమన్వయం చేయాలనుకుంటున్నది?

గ్రామానికి పట్టుగొమ్మ వంటి వ్యవసాయం మీద స్వయంసేవకులు దృష్టి సారించారు. గో-ఆధారిత వ్యవసాయంలో పనిచేస్తున్నారు. రసాయనాలు వాడని, విషపూరితం కాని ఆహారం తేవాలి. వ్యవసాయం, రైతు బతకాలి. ఇదే ఆశయంతో పనిచేస్తున్న అనేక ఇతర సంస్థలతో కలసి స్వయంసేవకులు పనిచేస్తు న్నారు. రాబోయే రోజుల్లో గ్రామంలో వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు, చిన్న పరిశ్రమలతో స్వావలంబన జరగాలి. విధిలేక గ్రామం నుంచి వలసలు సాగుతున్నాయి. ఇవి ఆగిపోయేందుకు గట్టి కృషి మొదలుపెట్టాం. ఇందులో చాలామంది చేయూత అవసరం. పెద్దల సాయం కోసం సంఘం ప్రార్థిస్తున్నది అందుకే. వాళ్ల వాళ్ల సంస్థల పేరుతోనే గ్రామంలోనే ఉత్పత్తి జరగాలి. అవి ఎగుమతి కావాలి. గ్రామ స్థాయిలో వృత్తులు విస్తరించాలి. మార్కెటింగ్‌ ‌సదుపాయం ఉండాలి. అలాంటి ప్రయత్నం పెద్దలు మొదలుపెట్టారు.

ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణలు భారతీయ సమాజంలో ఎలాంటి మార్పు తెస్తాయని భావించవచ్చు?

వ్యవసాయం, రైతుల సంక్షేమం గురించి కరోనా- లాక్‌డౌన్‌ ‌సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తున్నది. ఇది సంతోషకరం. లాక్‌డౌన్‌ ‌సమయమనే కాదు, మొత్తంగా ఈ 130 కోట్ల మందిని పోషిస్తున్నదీ, కాపాడుతున్నదీ వ్యవసాయమూ, రైతాంగమే కదా! రైతు ఎప్పుడూ ఈ దేశానికి కీలకమే. అందుకే కొత్త వ్యవసాయ సంస్కరణలు వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించాయి. రైతులు సంఘాలుగా ఏర్పడి, రైతు ఉత్పాదక సంఘం పేరిట (Farmers Producers Organisation) నమోదు చేసుకొని తమ ఉత్పత్తిని తగిన ధరకు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం వారి పరం చేసుకోవడం ఈ సంస్కరణలలో ప్రధానమైనది. పంట పండించడమే కాదు, ఆ ఉత్పత్తిని అమ్ముకోవడానికి కావలసిన వ్యాపార దక్షతను రైతు సంఘాలలో పెంపొందించ డానికి కేంద్ర ప్రభుత్వం కావలసిన ధనం మంజూరు చేస్తున్నది. ఇలాంటి పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలి.

దీనికి నాబార్డ్ ‌సహకరిస్తోంది. Cluster Based Business Organisation ద్వారా రైతులు క్రమంగా గిట్టుబాటు ధర పొంది, మెరుగైన ఆదాయం సంపాదించుకునే అవకాశం ఈ సంస్కరణలతో దక్కుతుంది. సేంద్రియ వ్యవసాయాన్ని కూడా నేడు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ వ్యవసాయం ద్వారా కూడా రైతులకు రెంటింపు ఆదాయం లభిస్తుంది. అయితే ఈ దిశగా రైతాంగాన్ని సుశిక్షితులను చేయవలసిన అవసరం ఉంది. మానసిక పరివర్తన కూడా ఎంతో అవసరం. ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే రసాయనిక ఎరువులు పూర్తిగా మానేసి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లడం ఒక్కటే శరణ్యం. అన్ని రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయ విస్తరణకు ప్రయత్నాలు విజయవంతంగా జరుగు తున్నాయి కూడా. సామాజిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని కలసి పనిచేస్తే రాబోయే పదేళ్లలో ఈ రంగంలో ఎంతో ప్రగతిని సాధించగలం. రైతేరాజు అన్న నానుడి నిజమవుతుంది. పలు ప్రత్యేక సంచికలు తెచ్చిన ‘జాగృతి’ సేంద్రియ వ్యవసాయం అంశంగా ఒక విశేష సంచిక తీసుకురావడం అవసరమనిపిస్తుంది.

ఒక సంక్షుభిత వాతావరణంలో, క్లిష్ట పరిస్థితు లలో దేశం ఉన్నప్పుడు ఆత్మనిర్భర భారత్‌ అనే చరిత్రాత్మక ఉద్యమానికి భారత ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం, దాని వెనుక ఉన్న ఆలోచన భారతీయ సమాజంలో ఎలాంటి మార్పు తీసుకువస్తాయని ఆశించవచ్చు?

ఆత్మనిర్భర భారత్‌ ‌మన దేశ ఆర్థిక స్వావ లంబనకీ జాతీయ స్వాభిమానానికీ సంబంధించినది. Made in India కాకుండా Made by India కావాలి. మన దగ్గర యువశక్తి ఉంది. కౌశలం- స్కిల్‌ ఉం‌ది. యోజన బాగుంది. ఇవి అమలులో పెట్టాలి. వీటికి కార్యరూపం ఇవ్వాలి. కష్టపడే గుణం పెరగాలి. సులువుగా డబ్బు సంపాదించాలన్న తత్త్వం బాగా పెరిగింది. సులభంగా వచ్చే డబ్బుకు చాలా మంది అలవాటు పడ్డారు. ఇది మారాలి. మానసిక మార్పు రావాలి. బ్యాంకర్లు, విధానాలూ, నిర్ణయాలూ అమలుపరిచే ప్రభుత్వ అధికారులలో సక్రియత పెరగాలి. సాచివేత ధోరణి, కాలక్షేపం చేసిపోయే దుర్గుణం పోవాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. ఒక భవన ప్రాంగణ నిర్మాణం అత్యంత ఆలస్యంగా 11 సంవత్సరాలకు పూర్తయింది. దీనితో కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరి ఈ జాప్యానికి బాధ్యులైన ప్రభుత్వాధి కారుల ఫోటోలు వ్రేలాడదీయాలని, ఇది అత్యంత శోచనీయమని హెచ్చరించారు. ఈ వీడియో దేశ మంతా చూసింది. ఇది ఎవరినో బాధ పెట్టడానికి కాదు. కానీ జాతికి జరుగుతున్న నష్టం గురించి కఠినంగా ఉండాలి. అందరిలోను సంవేదన జాగృతం కావాలి.

నాబార్డ్ ‌సంస్థ OFPO Off Farmers Production Organisation – అంటే గ్రామాలలో రైతులు మినహా వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, చేనేత, శిల్పులు ఇలా అందరు సంఘంగా ఏర్పడితే, వారి నైపుణ్యం పెంచడానికీ, చిన్న చిన్న యంత్రాలు ఇచ్చి సహకరించడానికీ నాబార్డ్ ‌ముందుకొస్తుంది. సబ్సిడీ ఇస్తుంది. చేతివృత్తులు, కులవృత్తుల వారి ద్వారా మాత్రమే దేశానికి చైనా నుండి రక్షణ ఉంటుంది. కొత్తగా వచ్చిన నాబార్డ్ ‌ఛైర్మన్‌ ఈ ‌దిశలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇవన్నీ సమాజానికి తెలియాలి. గ్రామీణ విద్యావంతులైన యువకులు పట్టణాలకు తరలిపోకుండా ధైర్యంగా నిలబడాలి. ఇదే పెద్ద మార్పుకు నాంది కాగలదు. మొత్తం సమాజ స్వభావం లోనే మార్పు రావాలి. స్వాభిమానం, కష్టపడే గుణం, జాతీయ ఏకాత్మత- ఇవే నేడు కావాలి.

(సమాప్తం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram