‘‌నేను’ కాదు.. ‘మనం’

దత్తోపంత్‌ ‌ఠేంగ్డీజీ భారతీయ మజ్దూర్‌ ‌సంఘ స్థాపించిన సమయంలో  ప్రపంచమంతా సామ్యవాదం మోజులో ఉంది. ప్రతిచోటా ఆ విషయమే, దాని ప్రభావమే. అలాంటి సమయంలో జాతీయభావాలతో, స్వచ్ఛమైన భారతీయ ఆలోచనా విధానం ఆధారంగా మజ్దూర్‌ (‌కార్మిక) ఉద్యమాన్ని ప్రారంభించడం, అనేక అరోధాలూ, అడ్డంకులూ ఎదురైనప్పటికి దానిని నిరంతరాయంగా ముందుకు తీసుకుపోవడం (herculean taskకప్టమే. శ్రద్ధ, విశ్వాసం, నిరంతర పరిశ్రమ లేనట్లయితే అది సాధ్యం కాదు. ఆనాటి ఠేంగ్డీజీ మానసిక స్థితి ఎలాంటిదో అర్థంచేసుకోడానికి ఉపకరించే ఒక కథ జ్ఞాపకం వస్తుంది.

‘ఇంకా వసంత రుతు పవనం వీచడం ప్రారంభించనేలేదు

మామిడిచెట్టుకు చిగురు రానేలేదు

చల్లగాలి అలల దెబ్బలను సహించుకుంటూ

ఒక జంతువు తన బిలం నుండి బయటకు వచ్చింది.

బంధుమిత్రులు దానికి చాలా నచ్చజెబుతూ –

 బిలంలోనే ఉండి విశ్రాంతి తీసుకో,

ఈ సమయంలో బయటకు వస్తే చనిపోతావు.’ అన్నారు.

అది ఎవరి మాటా వినలేదు.

కష్టపడుతూ మామిడిచెట్టు ఎక్కడం ప్రారంభించింది.

పైన కొమ్మమీద ఊయల ఊగుతూ ఒక చిలుక జంతువును చూసింది.

 తన ముక్కును క్రిందికి వంచుతూ అడిగింది, ‘ఓ జంతువూ! ఈ చలిలో ఎక్కడికి బయలు దేరావు?

‘మామిడిపండును తినడానికి!’ జంతువు సమాధానం.

చిలుక నవ్వింది. జంతువు మూర్ఖులకే మూర్ఖునిలాగుందని అనుకున్నది.

చిలుక తిరస్కార భావంతో ‘‘మూర్ఖుడా! ఈ చెట్టు మీద మామిడిపండ్ల జాడలే లేవు, నేను పైనా క్రిందా అంతటా చూడగలను కదా!’’ అంది.

‘‘నీవు చూడగలవు నిజమే!’’ తప్పటడుగులు వేస్తూనే, ‘‘నేను అక్కడికి చేరే సరికి తప్పకుండా మామిడిపండ్లు సిద్ధంగా ఉంటాయి’’ అన్నది జంతువు.

 ఆ జంతువు జవాబులో ఒక సాధకునికుండే దృష్టి ఉంది.

 తన ధ్యేయం జాడ ఏదో కూడా స్పస్టంగా కనపడనప్పటికి సాధకుడు తన బలహీనత వైపు మాత్రం చూడడు. ప్రతికూల పరిస్థితులకు భయ పడడు. ఆ జంతువుకు తన లక్ష్యసాధన విషయంలో సంపూర్ణమైన శ్రద్ధ ఉంది. తన ఒక్కొక్క అడుగుతో పాటు ఫలాలు కూడా పక్వానికి వస్తాయనడంలో దానికి ఏ మాత్రం సందేహం లేదు. దాని బంధువులు, చిలుక, లేదా- పండితుడు ఎవరైనా కావచ్చు. వాళ్ల గురించి చింత కూడా లేదు. మనసులో అదే శ్రద్ధ, అదే ధ్యేయ చింతన.

‘‘హరిని (భగవంతుని) నమ్ముకో సోదరా! కోరుకున్నది జరిగిపోతుంది.’’

ఇప్పుడు భారతీయ మజ్దూర్‌ ‌సంఘం దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా  మనందరం చూస్తున్నాం.

సంఘటనా సామర్థ్యం ఉన్న మంచి కార్యకర్త గుణమేమిటంటే, తాను ఎంత ప్రతిభావంతుడైనప్పటికి తనకు ఉపయోగపడే ఆలోచనలను, సలహాలను అవతలివారి నుంచి మన్ఫూర్తిగా స్వీకరించడం. యోగ్యమైన సలహాలను అందుకోవడం. అలాంటి గుణసంపన్నుడైన కార్యకర్త ఠేంగ్డీ. కార్మికరంగంలో పని చేయాలని నిర్ణయించి నప్పుడు ‘భారతీయ కార్మిక సంఘం’ అన్న పేరుతో సంస్థ ఉండాలని భావించారు. కానీ, ‘మనం ఏ సమాజంలోని ఏ వర్గంలో పని చేయాలనుకున్నామో వాళ్ల విసయంలో ‘శ్రమిక’ శబ్దం వాడటం సరియైనది కాదు. కొన్ని ప్రాంతాలలో దీనిని ఉచ్చరించడలో ఇబ్బందీ కలుగవచ్చు. అందుకే శ్రమిక బదులుగా ‘మజ్దూర్‌’ ‌శబ్దాన్ని వాడడం సబబుగా ఉంటుంది, ఉపయోగ కరంగా ఉంటుందని కార్యకర్తల మొట్టమొదటి సమావేశంలో అభిప్రాయపడ్డారు. దానినే స్వీకరించారు. అలా సంస్థ పేరును ‘భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌’ అని నిర్ధారించారు.

సంఘటనా కార్యం నిర్వర్తించడం అంటే ‘నేను నుండి మనం’అనే యాత్ర సాగాలి. కర్త్త్వత్వశక్తి గల కార్యకర్తకు ఇది సులభమైన విషయం కాదు. అతడు ‘నేను’ అనే దాని ప్రేమలో పడిపోతాడు. ఏదో రూపంలో ‘నేను’ అనే భావన వ్యక్తమౌతూనే ఉంటుంది. అందుకే సాధుసంతులు, ‘నేను’ అనేది విచిత్రమైనది. ఇది అజ్ఞానులను అంటుకోను కూడా అంటుకోదు. కాని జ్ఞానుల గళాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే, వదలించుకోవడం కష్టమైన పని’ అంటారు. కాని సంఘటనా కార్యంలో, సంఘటనతో పాటు, ఆ కార్యంలో పనిచేసే వాళ్లు దీని నుండి బయటపడవలసి ఉంటుంది. ఠేంగ్డీ అందులో నుంచి బయపడినట్టు   ఉండేవారు. వారు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక లోతైన విషయం గాని, ఒక ప్రధాన దృష్టికోణం గాని లేదా పరిస్కారం (solution) ఇచ్చేటప్పుడు ‘నేను’ ఈ విధంగా చెప్పాను అనకుండా ‘మేము’ ఈ విధంగా చెప్పామని అనడం నేను విన్నాను. ఈ ‘నేను’ అనే దానిని తొలగించడం సులభమేమి కాదు. కాని ఠేంగ్డీ ఇందులో మహారథులయ్యారు. ఈ గుణం ఒక సంఘటన కార్యానికి అత్యవసరం.

ఠేంగ్డీజీలో మరో విశేషమేమిటంటే అతి సామాన్యమైన కార్మికునితో కూడా  ఆత్మీయతతో మాట్లాడేవారు. అతని భుజం మీద చేయి వేస్తూ, అతనితో పాటు నడుస్తూ మాట్లాడేవారు. అలాంటప్పుడు ఏ కార్మికునికి కూడా ఒక అఖిల భారతీయ స్థాయి నాయకునితో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్తతో మాట్లాడుతున్నానని అనిపించకుండా ఆత్మీయుడైన పెద్దతో, కుటుంబ పెద్దతో మాట్లాడుతున్నాననే అనుభూతి కలిగేది. ఇలా వ్యవహరిస్తున్నప్పుడు ఠేంగ్డీ కూడా చాలా సహజంగానే కనపడేవారు. ఆయనది విస్తృతమైన, లోతైన అధ్యయనం. మాట్లాడుతున్నప్పుడు అనేక గ్రంథాలను, ఎందరో నాయకుల (anecdotes) జీవిత ఘట్టాలను, అనుభవాలను, అభిప్రాయాలను ఉటంకించేవారు. హృదయాన్ని హత్తుకునే మరొక విషయం ఉంది. ఠేంగ్డీజీ తన ఉపన్యాసాలలో అనేక ఉదాహరణలు, చిన్నచిన్న కథలు చెప్పేవారు. వాటిని నాలాంటి అనుభవం తక్కువగా ఉన్న కార్యకర్త చెబుతూవుంటే ఇది నాకు తెలుసుననే భావనను వ్యక్తపరుచేవారు కాదు. ఇలాంటి సంయమనం పాటించడం సులభం కాదు. ఇది నాకు తెలుసని చెప్పే మోహం ఎంతో అనుభవజ్ఞలైన  కార్యకర్తలకు కూడా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు గమనించాను. కాని ఠేంగ్డేజీ వాటిని మొదటిసారి వింటున్నట్లు శ్రద్ధగా (Intent listening) వినేవారు. వాటిపై భావయుక్తంగా స్పందించేవారు. ఆ తర్వాత దానికి సంబంధించిన మరో చిన్నకథ కూడా చెప్పేవారు. ఒక సామాన్య కార్యకర్తతో ఇంత సన్నిహితంగా ఆత్మీయతతో ఉండటం ఒక గొప్ప కార్యకర్త లక్షణం.

 పనిని విస్తరించే తపనలో ఉత్కంఠతో, దీక్షతో,ఆ  ప్రయత్నంలో తలమునకలై ఉన్నప్పటికి తొందరపాటును ప్రదర్శించకుండా ఉండటం కూడా ఉత్తమ కార్యకర్త లక్షణమే. ‘మెల్లమెల్లగా తొందరగా చెయ్యి’ (hasten slowly) అని పూజనీయ గురూజీ చెబుతుండేవారు. ఏ పనిలోనైనా తొందరపడకూడదు. నా రైతు మిత్రుడు ఒకాయన మహారాష్ట్రలో ‘శేత్కారీ సంఘటన్‌’ అనే రైతు ఉద్యమంలో విదర్భ ప్రాంత ప్రముఖ నాయకుడు. ఆ తర్వాత ఆ ఉద్యమానికి దూరమయ్యాడు. మా చిన్న తమ్మునితో చర్చించడం ప్రారంభించాడు. ఆ సమయంలో మా తమ్ముడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. కిసాన్‌ ‌సంఘ పని అప్పుడిప్పుడే ప్రారంభమైంది, కాబట్టి ఈ కర్సక ( రైతు) నాయకుడిని కిసాన్‌ ‌సంఘానికి జోడించాలని మా తమ్ముడు నాతో అన్నాడు. నాకు ఈ సలహా నచ్చింది. ఈయన పెద్ద రైతు నాయకుడు. ఠేంగ్డీ నాయకత్వంలో కిసాన్‌ ‌సంఘ పని ప్రారంభమైంది. అందుకు ఈయన ఉపయోగపడుతాడన్న ఉద్దేశంతో మా తమ్మునితో కలసి నాగ్‌పూర్‌లో వున్న ఠేంగ్డీని కలిశాం. ఆ రైతు కూడా ఠేంగ్డీకి తెలుసు. కిసాన్‌ ‌సంఘం కోసం పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు లభించినందువల్ల కిసాన్‌ ‌సంఘానికి ఊతం లభిస్తుందనీ, ఠేంగ్డీజీ వెంటనే ఆనందంగా ఆయన్ను స్వీకరిస్తాడనీ నాకు పూర్తి విశ్వాసముంది. ఉపోద్ఘాతం తర్వాత ఈ ప్రస్తావన వారి ముందుంచాను. ఠేంగ్డీజీ వెంటనే తిరస్కరించారు. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత నాతో ‘మన కిసాన్‌ ‌సంఘ పని చాలా చిన్నది, అది ఇంత పెద్ద నాయకుడిని భరించలేదు. ఈ నాయకుడు కిసాన్‌ ‌సంఘాన్ని తనతో పాటు లాక్కొనిపోతాడు. ఇలాంటిది మనం కోరుకోవడం లేదు’ అని చెప్పారు. అప్పుడు నేనన్నాను, ఒకవేళ కిసాన్‌ ‌సంఘం ఆయనను స్వీకరించనట్లయితే భారతీయ జనతా పార్టీ వాళ్లు కలుపుకొని ఎన్నికలలో పోటి చేయించగలరు కదా! అని. దానికి ఠేంగ్డీజీ శాంతమైన స్వరంలో ‘భాజపాకు తొందర ఉండవచ్చు, మనకు లేదు’ అంటూ సుస్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చారు. ఇది నాకొక మంచి గుణపాఠం. గురూజీ చెప్పిన ‘మెల్లమెల్లగా తొందరగా చెయ్యి’ అనే వాక్యం నిగూఢార్థం అర్థమైంది.

ఉత్తముడైన సంఘటనా కార్యకర్తేకాక, ఠేంగ్డీ దార్శనికుడు (visionary) కూడా. వారితో మాట్లాడుతున్నప్పుడు భారతీయ చింతనకు సంబంధించిన లోతైన విషయాలు  వ్యక్తమయ్యేవి. మజ్దూర్‌ ‌క్షేత్రంలో సామ్యవాదుల ప్రభావం, పెత్తనం ఉండేవి. అందువలన అన్ని కార్మిక సంస్థల ఉపన్యాసాలు, నినాదాలు సామ్యవాదుల శబ్దావళినే అనుసరించి ఉండేవి. అటువంటి సమయంలో వారు సామ్యవాద నినాదాల స్థానంలో భారతీయ ఆలోచనా శైలిని వ్యక్తపరిచే కొత్త నినాదాలను అందించారు.

 భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌, ‌భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ‌సంస్థలే కాకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌, ‌స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌, ‌ప్రజ్ఞా ప్రవాహ, విజ్ఞాన భారతి మొదలగు సంస్థల పునాదులు కూడా ఠేంగ్డీజీ సహాయ సహకారాల వల్లనే పడినాయి. వారు భారతీయ కళాదృష్టి మీద రాసిన వ్యాసం ఆతర్వాత సంస్కారభారతికి మార్గదర్శకమైంది.

ఠేంగ్డీజీ లాంటి సమున్నత మేధావి, సంఘటనా కార్యకర్త, దూరదృస్టి కలిగిన (legendary) నాయకునితో పాటు చర్చిస్తూ, వారి నడక, లేవడం కూర్చోవడం, వారు సలహాలివ్వడం ఇదంతా ప్రత్యక్షంగా అనుభవించడం, నేర్చుకునే భాగ్యం లభించడం నా అదృష్టం. ఠేంగ్డీ ఈ జన్మ శతాబ్ది సందర్భంలో వారి పావన స్మృతికి నా వినమ్ర శ్రద్ధాంజలి.

– మన్మోహన్‌ ‌వైద్య:  ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహ సర్‌కార్యవాహ, ఢిల్లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram