కమ్యూనిజం మునిగే ఓడ, కేపిటలిజం పేకమేడ

ఈ సంవత్సరం మనం దేశవ్యాప్తంగా దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ శతజయంతి  ఉత్సవాలను జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా నేను మీ అందరినీ వారి ఆలోచనలతో నిండిన ఒక పెద్ద దిగుడు బావిలోకి తీసుకొని పోవాలనుకుంటు న్నాను. విశాల భారతదేశంలో వివిధ రంగాలలో ఎన్నెన్ని సమస్యలు ఎంతకాలంగా తిష్ఠవేసుకొని ఉన్నాయో లెక్కలేదు. వాటిని లోతైన అధ్యయనంతో పరిశీలించి పరిష్కారాలను చూపటం ఎవరికైనా సాధ్యమవుతుందా? బహుముఖమైన, వివేకవంతమైన  ఆలోచనలతో ఆ సమస్యల పరిష్కారానికై, ఒకటి రెండింటిని గాక, అనేక సంస్థలను నెలకొల్పటమూ, అవి స్థిరంగా, ప్రభావవంతంగా, ప్రయోజనకరంగా పనిచేసేటట్లు చూడటమూ దత్తోపంత్‌జీలోని ప్రత్యేకత. స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌, ‌భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌, అధివక్తా పరిషత్‌, ‌సర్వపంథ సమాదర మంచ్‌, ఇలా ఎన్నో సంస్థలు ఆయన ప్రారంభింపజేశారు. సమాజం సజావుగా నడవడానికి కావలసిన శక్తి ప్రభుత్వాల నుండి కాక, సమాజం నుండే లభిస్తుందని, సమాజం నుండి రాబట్టిన శక్తితోనే సమాజాన్ని నడిపించుకోవాలని ఆయన గాఢంగా విశ్వసించారు. వారు దర్శించిన వైభవోపేత భారతదేశంలో కమ్యూనిజానికే కాదు, పెట్టబడిదారీ విధానాలకు కూడా చోటులేదు.

2019 నవంబర్‌లో ప్రారంభించి 2020 నవంబరు వరకు దత్తోపంత్‌జీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని అనుకొన్నాం. ఆ సమయంలో కేవలం ఊరేగింపులు, కొలువులు, యజ్ఞాలు, జాతరలు చేయటమే మనం పనిగా పెట్టుకోలేదు. ఆయన ఏ విధమైన ఆశయాలను విశ్వసించారో, తన విశ్వాసాలకు ఏ విధంగా నిబద్ధుడై దృఢంగా నిలబడినాడో, దానిని మనం అందరం గ్రహించటం ద్వారా ఈ ఉత్సవాల నిర్వహణకు పరమ ప్రయోజనం చేకూరుతుంది. కొన్ని వందల పుస్తకాలు చదవడానికో, కొన్ని పదుల పుస్తకాలను రాయడానికో పరిమితమైన మేథ కాదు ఆయనది. తన జీవితంలో వాటిని సాకారం చేసుకోవడానికి ఆయన పడిన శ్రమనూ, చేసిన సాధననూ మనం అర్థం చేసుకోవలసి ఉంది.

ఆలోచనాశీలి దత్తోపంత్‌జీ

దత్తోపంత్‌ ఎన్నో పుస్తకాలు చదివేవారు. ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటిలో ది థర్డ్‌వే, సంకేతరేఖా, కార్యకర్త అనేవి ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా బహుముఖీనంగా ఆయన ఎటువంటి సమస్యలను స్వీకరించి, ఎలా అధ్యయనం చేశారో, ఆ సంక్లిష్టతను పరిచయం చేస్తాయి. కేవలం సమస్యలలోని అనేక చిక్కుముడులను ఎత్తిచూపి వదిలి వేయటం గాక, ఆ సమస్యల నుండి సుఖసంతోషాలకు, సమృద్ధికి నెలవైన భవిష్యత్తులోకి నడిపించడానికి మార్గం చూపేవిగా ఆ రచనలు ఉంటాయి. కొన్ని సమస్యలు పైపైన చూసేవారికే ఎంతో భీతిగొలిపేవిగా ఉంటాయి. గుండెలు అవిసిపోయేటట్లుగా ఉండే సమస్యలను సైతం వదిలిపెట్టక వాటిలోకి దిగి, దేశ సరిహద్దు ప్రాంతాల నుండి దూరప్రాంతాల సమస్యలైనా, బాగా లోతట్టు ప్రాంతాలలో, గహనారణ్యాలలో ఉండే నిరుపేదల సమస్యలైనా, వాటికి పరిష్కారం కనుగొని తీరవలసిందేనన్న దీక్ష ఆయనలో ఉండేది. ప్రపంచంలోని వనరులను చేజిక్కించుకొనడానికి అగ్రరాజ్యాలవైపు నుండి డంకెల్‌ ‌ప్రతిపాదనను వచ్చినప్పుడు ‘అర్ధ్ ఔర్‌ అనర్థ్’ అనే పుస్తకాన్ని డా।। మురళీ మనోహర్‌ ‌జోషీతో కలసి రాసి ప్రచురింపజేశారు. ఆ ప్రతిపాదనలోని దుర్మార్గపుటాలోచనలను ఎండగట్టారు. ఆ విధంగా స్వదేశీ ఆలోచనలకు, స్వదేశీ ఆర్థిక నీతికి దత్తోపంత్‌జీ యోగదానం అసామాన్యమైనది.

 కార్యరంగంలోనూ దక్షత

దేశంలోని ఇతర మేధావుల నుండి, రచయితల నుండి దత్తోపంత్‌జీని  వేరుచేసి ప్రత్యేకంగా నిలబెట్టే అంశమేమిటంటే, ఈయన కార్యశూరుడు. కేవలం పత్ర సమర్పణలకూ, సంగోష్ఠి సభామంటపాలకూ పరిమితమైన వ్యక్తికాదు. సమస్య స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవటం, వాటికి పరిష్కార మార్గాలను చూపించటం మాత్రమేగాక, తన సంసిద్ధతను తగిన స్థాయికి తెచ్చుకోగానే, సమాజంలోకి దూసుకుపోయి, స్థితిగతులను మార్చడానికి యత్నించినవాడాయన. తన ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి, ఈ నేలమీద తదనుగుణమైన పరివర్తనలు సాధించడానికి జీవితంలోని క్షణక్షణమూ, ప్రతిదినమూ వెచ్చించిన కర్మయోగి. స్వదేశీ ఉద్యమం గురించిన తన ఆలోచనలు కార్యరూపం సంతరించుకొనడానికి స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ని స్థాపించి, చిన్న మొలకగా ఉన్న స్థితి నుండి ఒక మహోద్యమంగా మారేవరకు నిర్విరామంగా, దేశవ్యాప్తంగా తిరుగుతూ కృషి చేసినవాడాయన. ఆ కృషి ఫలితంగానే మనదేశం ఏళ్ల తరబడి డంకెల్‌ ‌ప్రతిపాదనలకు గుడ్డిగా సంతకాలు పెట్టే ఉచ్చు నుండి బైటపడింది.

జాతీయవాది, సంఘటనా కర్త

స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లలో దేశంలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టుల కార్మిక సంఘాలే కనబడుతూ ఉండేవి. కార్ఖానాలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలూ వారి గుప్పిట్లో ఉండేవి. ఆ రోజుల్లో వారి నినాదం ‘చాహే జో మజ్‌బూరీ హో, మాంగే హమారీ పూరీకరో!’ (మీ సమస్యలు, ఇబ్బందులతో  మాకు పనిలేదు, మా కోర్కెలు నెరవేర్చ వలసిందే!). మనదేశం చైనాతో యుద్ధం సాగిస్తున్న రోజుల్లో కూడా వారు కార్మికుల ఆందోళనలను ఆపలేదు. అటువంటి సమయంలో దత్తోపంత్‌జీ కార్మికవర్గాలలో తన గొంతును బలంగా  వినిపిం చారు. సమస్య కేవలం కార్మికులకూ, యజమానులకూ పరిమితమైనదే కాదు. మధ్యలో నలిగిపోతున్న మరో ప్రధానమైన సముదాయం ఉంది. అది రాష్ట్రం (జాతి). రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. ఈ విధమైన ఆలోచనలను వ్యాపింపజేస్తూ 1955లో నెలకొల్పిన భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ను 1981 నాటికి దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘటన స్థాయికి తీసుకొచ్చారు. భారతీయ మజ్దూర్‌ ‌సంఘం – రాష్ట్ర హితాన్ని, పరిశ్రమల హితాన్ని, కార్మికుల హితాన్ని కోరుతుందని, ఇది ఏమాత్రం అభివృద్ధి నిరోధకమైనది కాదని నచ్చజెప్పటం ద్వారానే ఇది సాధ్యమైంది.

మొదట్లోనే చెప్పినట్లుగా దత్తోపంత్‌జీ భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌, ‌భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌, ‌స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌లనే గాక, అఖిల భారతీయ అధివక్తా పరిషత్‌, అఖిల భారతీయ గ్రాహక్‌ ‌పంచాయత్‌, ‌సర్వపంథ సమాదర మంచ్‌, ‌పర్యావరణ్‌ ‌మంచ్‌లను కూడా ప్రారంభించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌, ‌భారతీయ విచార్‌ ‌కేంద్ర (కేరళ), సమాలోచన (ఆంధప్రదేశ్‌)‌లను ప్రారంభించటం లోనూ దత్తోపంత్‌జీ కృషి ఎంతో ఉంది. ఆజ్ఞాపత్రాలను జారీ చేయటం ద్వారా ప్రభుత్వం సమాజాన్ని నడిపించటం కాదు, మేధావులు చేయిపట్టి ఈ సమాజాన్ని నడిపించాలి అనే ఆలోచనే ఈ సంస్థల స్థాపనలో ఉన్న మూలభావం. ఈ సంస్థలు సమాజంలో మార్పులకు ఉత్ప్రేరకాలైనాయి. ఈ సంస్థలకు ఉపదేశికుని స్థాయిలోనో, మార్గదర్శకుని స్థాయిలోనో ఆయన ఉండిపోలేదు. చాలా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనేవారు. చర్చలను సక్రమ మార్గంలో నడిపించేవారు. ఎందరో మేధావులక• కనువిప్పు కలిగించి, ఈ సంస్థలకు సన్నిహితులను చేసేవారు. ఆ విధంగా తాను ఒక గొప్ప మేధావిగా గుర్తింపు పొందే పాత్రకు పరిమితం కాకుండా, సంఘటనా కార్యంలో ముందు వరుసలో నిలబడి నడిపించేవారు. బంగారు ఆభరణంలో పొదిగిన రత్నం లాగా ఆయన సంస్థలో ఇమిడి పని చేసేవారు. మార్పు అనేది మస్తిష్కంలో మొదలైతేనే, సమాజంలో, అనుదిన జీవనంలోనూ, అది ప్రతి ఫలించటం సాధ్యమౌతుందని గ్రహించి, తదనుగుణంగా వ్యవహరించిన కార్యదక్షుడు దత్తోపంత్‌జీ.

భవిష్యత్తును అంచనా వేయటంలో దిట్

కమ్యూనిజం, పెట్టుబడిదారి విధానం – ఈ రెండు రాక్షసాకార నరభక్షక శక్తులు ప్రపంచాన్ని ఆక్రమించుకొని ఉన్న రోజులలో, ఎవరైనా మూడవ మార్గాన్ని గురించి మాట్లాడటమనేది ఊహకు అందని విషయం. కాని ఈ సవాలును స్వీకరించగల వివేకవంతమైన అవగాహన గల స్వతంత్ర ఆలోచనాపరుడు దత్తోపంత్‌జీ. థర్డ్‌వే (మూడవ మార్గం) అని ఆయన సూచించినది హిందూ మార్గం. కమ్యూనిజం, కేపటలిజం కుప్పకూలనున్నవని ఆయన వినిపించిన భవిష్యవాణి మనమందరం చూస్తూ చూస్తూ ఉండగానే వాస్తవమైంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తితో భారతదేశం వైపు చూస్తున్నది. రుషితుల్యుడైన స్వయంసేవకునిగా ‘థర్డ్‌వే’ అనే గ్రంథంలో అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రపంచాన్ని ఒక హరితవనంగా, నందనోద్యానంగా నిలబెట్టుకోవాలనే ఆలోచనలు ప్రపంచవేదికలపై వినబడడానికి ముందే, ఆయన పర్యావరణ్‌ ‌మంచ్‌ ఏర్పరిచారు.  తమ భవితత్యం అయోమయంలో పడ•బోతున్నదని భయపడుతున్న ప్రపంచ ప్రజానీకానికి ఆశావహమైన – స్థిరమైన సమృద్ధి మార్గం సాధ్యమేనని భరోసా ఇచ్చారు.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ప్రచారక్‌ అం‌టేనే ఒక సామాన్యమైన అసాధారణ వ్యక్తి. నేటి సమాజపు స్థితిగతుల గురించి, భవిష్యత్‌లో రూపొందగల చిత్రం గురించి అతనికి అవగాహన ఉంటుంది. అటువంటి అవగాహనతో వ్యవహరించాలని ఆశించే సంస్థ ఎటువంటి మార్పులు తీసికొని రాగోరుతున్నదో గ్రహించుకొని, తత్కార్యసిద్ధికై తన జీవితంలో దినదినం శ్రమించిన కర్మయోగి దత్తోపంత్‌. ఆలోచనలతో, కార్య ప్రణాళికలతో, వాటిలో సాధించిన విజయాలతో పైకి ఎదిగిన కొద్దీ, వినయంతో ఒదిగిన మనిషి ఆయన. రాజ్యసభ సభ్యునిగా ఆయనకు ప్రభుత్వం కేటాయించిన నివాస గృహానికి వచ్చిన కార్యకర్తలతో నిండుగా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా కార్పెట్‌పై ఒక ప్రక్కన పడుకొని నిద్రించినవాడాయన. అలా జీవితాంతం ఆయన దేశం కోసం, ప్రజల కోసం ఆరాటపడుతూ నిరాడంబరంగానే జీవించారు.

మనం కూడా ఆయనలాగే మామూలుగా జీవిస్తూనే, ఆయన వలె ఎదగవలసి ఉన్నది. మంచి సమాజం, మెరుగైన సమాజం నిర్మాణం కావాలంటే, మన ప్రియతమ నాయకునిలోని విశిష్టగుణాలను వెలుగులోకి తీసికొని రావలసి ఉన్నది. స్పష్టమైన ఆలోచనలతో ఒక కల్పనకు శ్రీకారం చుట్టటం, రాగల పరిణామాలను అంచనా వేసుకోవటం, ఆపైన తడబడకుండా చక్కనైన మార్గంలో ముందుకు సాగిపోవటం మనం ఆయన నుండి నేర్చుకోవలసి ఉన్నది. మన ఈ దేశాన్ని మనం కలలుకన్న భాగ్యసీమగా, ఈ సమాజాన్ని ఒక మెరుగైన సమృద్ధమైన సమాజంగా తీర్చిదిద్దుకోగల మార్గమదే!

దత్తోపంత్‌జీ అమర్‌ ‌రహే! భారత్‌మాతాకీ జయ్‌!

– ‌విరజేశ్‌ ఉపాధ్యాయ :  బీఎంఎస్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ

One thought on “కమ్యూనిజం మునిగే ఓడ, కేపిటలిజం పేకమేడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram