సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి అధిక ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి – 28 సెప్టెంబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‘ఎవరో కొద్దిమందిని చూసి మొత్తం పరిశ్రమనే అవమానపరచవద్దు’ అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ ‌నటి జయా బచ్చన్‌. ‌బాలీవుడ్‌, ‌శాండల్‌వుడ్‌లను ప్రస్తుతం కుదిపేస్తున్న మత్తుమందుల వ్యవహారం మీద మాట్లాడుతూ జయ రాజ్యసభలో ఈ మాట అన్నారు. అంతకు ముందు ‘సినీ పరిశ్రమ మత్తుమందుల సమస్యతో సతమతమవుతున్న మాట నిజం’ అని భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌ ‌వ్యాఖ్యానించారు. ఈ మాటకే జయకు తీవ్ర ఆగ్రహం కలిగింది. అన్నం పెట్టిన చేతినే కొందరు కొరుకుతున్నారంటూ ఉపన్యాసం సందర్భంగా ఆమె అన్న మాట చాలామందికి నచ్చలేదు. ప్రస్తుతం దేశంలో సినీ పరిశ్రమలో ఆ ‘కొద్దిమంది’దే మెజారిటీ అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అక్కడ అన్నం దొరుకుతున్న మాట నిజమే అయినా, అది ఎవరూ ఉచితంగా, దానంగా పెట్టడం లేదనీ, కళాకారులు, సాంకేతిక నిపుణలు కష్టపడితేనే నోట్లోకి ముద్ద వెళుతున్న సంగతినీ సీనియర్‌ ‌నటి గుర్తించాలంటూ ముఖేశ్‌ ‌ఖన్నా వంటి నటులు స్పందించవలసి వచ్చింది. దేశంలోని సినీ పరిశ్రమ ప్రత్యక్షంగా యాభయ్‌ ‌లక్షల మందికీ, పరోక్షంగా మరొక యాభయ్‌ ‌లక్షలమందికీ ఉపాధి కల్పిస్తున్నదని, ఆ రంగం మీద ఇలాంటి నిందలు వేయడం అపచారమని జయ వాదన. వీరెవరిదీ అక్కడ వడ్డించిన విస్తరి కాదని గుర్తు చేస్తున్నారు చాలామంది సినీ కార్మికులు, కళాకారులు.

సుశాంత్‌సింగ్‌ ‌రాజ్‌పుత్‌ అనే నటుడి అంతుచిక్కని మరణం, ఆ దుర్ఘటనతో కదిలిన తీగ ఇప్పుడు రంగుల ప్రపంచం అనే ఆ డొంకను కదుపుతున్న మాట నిజం. ఈ క్రమంలోనే దర్యాప్తు తిరిగి తిరిగి మత్తుమందుల వాడకం అనే విషయం దగ్గరకొచ్చి మజిలీ చేసింది. ఇది ఏదో కొందరు సినీ ప్రముఖుల వ్యవహారంగా ఇప్పుడు భావించే అవకాశం లేదు. సుశాంత్‌ ‌మరణం అనేక ప్రశ్నలకు తావిచ్చిన తరువాత ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ‌కొన్ని ఆరోపణలు గుప్పించారు. ఈ విషయాలు ఆమె ప్రముఖ ఆంగ్ల టీవీ చానెల్‌ ‌రిపబ్లిక్‌ ‌టీవీకి ఇవ్వడం వివాదం విస్తరించడానికి కారణమైందనిపిస్తుంది. అంతకు ముందే మహారాష్ట్ర ప్రభుత్వానికీ, రిపబ్లిక్‌ ‌టీవీ చానెల్‌కూ వైరం ఉంది. అదే అంతిమంగా కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వ వైరంగా రూపాంతరం చెందింది. మహారాష్ట్ర పోలీసులు కావాలనే సుశాంత్‌ ‌మరణానికీ, మత్తు మందులకూ లంకె తెచ్చారన్నది ఒక ఆరోపణ. ఆ క్రమంలోనే కంగన కూడా మత్తుమందులు వాడినట్టు స్వయంగా అంగీకరించారని పోలీసులు ఒక వీడియో తెచ్చారు. దీనితో కంగన మీద వచ్చిన మత్తుమందుల ఆరోపణల గురించి కూడా దర్యాప్తు చేయిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి చాలా పెద్ద ట్విస్టే కంగన ఇచ్చారు. అసలు, ముఖ్యమంత్రి కుమారుడు ఆదిత్య ఠాక్రేకూ, సినీ రంగంలోని మత్తు మందుల రవాణాదారులకు సంబంధాలు ఉన్నాయని బాంబు పేల్చారు. సుశాంత్‌ ‌మరణం మీద బిహార్‌లో (ఆయన సొంత రాష్ట్రం) కేసు నమోదు కావడం, దర్యాప్తు కోసం అక్కడి పోలీసులు ముంబై రాగా, వారి పట్ల అత్యంత హేయమైన రీతిలో ఆ రాష్ట్ర పోలీసులు వ్యవహరించడంతో వివాదం రెండు రాష్ట్రాల మధ్య రగడగా కూడా మారింది. ఇప్పుడు దేశ అత్యున్నత చట్టసభలో, అందునా పెద్దల సభలో ఈ విషయం చర్చకు వచ్చింది. కాబట్టి ఇది ఏదో సినిమా వాళ్ల ‘ఫైట్‌’‌గా ఇక ఎవరూ భావించలేరు. నిజానికి సినిమా రంగం మీద మత్తు ఆరోపణలు కొత్తకాదు. బాలీవుడ్‌లో కొన్ని అరెస్టులు జరిగాయి. తరువాత వంతు శాండిల్‌వుడ్‌కు వచ్చింది. కొద్దికాలం క్రితం టాలీవుడ్‌ ‌కూడా ఈ ఆరోపణలతో ఇబ్బంది పడింది.

సుశాంత్‌ ‌మరణం వెనుక ప్రముఖుల బంధుప్రీతి, ఏ అండా లేని కొత్తవారి పట్ల వివక్ష ఉందని చెబుతున్నారు. జయా బచ్చన్‌ అభిప్రాయం ప్రకారం ఈ దేవ రహస్యాలనే బయటకు చెప్పకూడదు. అలాగే మత్తుమందుల గొడవ ఉన్నా, సినీ ప్రముఖుల విషయంలో ఎవరూ నోరెత్త కూడదు. అందుకే జయ ఉపన్యాసం మీద తీవ్రమైన దాడే జరిగింది. మీది వడ్డించిన విస్తరి కావచ్చు, కానీ అక్కడ చాలామందిది నిత్య సమరమేనని పలువురు అంటున్నారు. అయినా సినీరంగం గురించి ఎవరు ఏ మాట అన్నా సరే, చాలామంది విరుచుకుపడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ‘సినీ ప్రముఖుల పరువు తీయకండి’ అని మాత్రమే గొంతు చించుకుంటూ ఉంటారు. కళను కించపరచవద్దు అన్నమాట ఒక్క గొంతు నుంచి కూడా రాదు. ఇప్పుడు కూడా అంతే. కళా దృష్టి అడుగంటి పోయిందని ఇలా వారే ఒప్పుకున్నారు. కళ గురించి, కళ ప్రయోజనం గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చే ప్రగతిశీల కాముకులు సైతం ఈ విషయంలో ‘జాగ్రత్తగా’ ఉంటున్న సంగతి గుర్తించాలి. పరోక్షంగా యాభయ్‌ ‌లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగమే కావచ్చు. కానీ సినిమా నుంచి తీసుకున్న ప్రతికూల ప్రభావంతో నాశనమవుతున్న జీవితాలు ఎన్ని? సినీ నిర్మాణం ఇవాళ పూర్తిగా వ్యాపార ధోరణితోనే ఉందనీ, సామాజిక బాధ్యత నుంచి నానాటికీ దూరం జరుగుతున్నదనీ వస్తున్న విమర్శలలో నిజం లేదని అనగలరా? మత్తుమందుల ఆరోపణలు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, వేటకు వెళ్లడం వంటి వాటి గురించి సమాజం ప్రస్తావించకుండా ఉండాలా? అలాగే హిందూ దేవుళ్లనూ, ఆచారాలనూ హీనంగా చిత్రించడం, దీనికి క్రియేటివ్‌ ‌లిబర్టీ వంటి పెద్ద పేరు పెట్టడం తెలిసినదే. సినీ ప్రముఖులు రాజ్యాంగానికీ, వ్యవస్థకీ అతీతులు కారు.

సినీ మాధ్యమానికి ఉన్న ప్రభావం అసాధారణమైనది. దానికి కళాదృష్టినీ, సామాజిక బాధ్యతనీ జత చేస్తే గొప్ప ప్రయోజనమే ఉంటుంది. లేకుంటే కళ మాటున మరేదో జరుగుతోందని ఇంకాస్త స్పష్టం కావడం ఖాయం. కాబట్టి ఈ వివాదానికే కాదు, అసలు ఆ రంగాన్ని పీడిస్తున్న ఇతర జాడ్యాలు కూడా వదిలి, కథ సుఖాంతమై శుభం కార్డు పడాలని ఆశిద్దాం.

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram