ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రాతఃవిధులు, ఏకాత్మతాస్తోత్రము, సమావేశాలు, కార్యకర్త లతో మాట్లాడుట, మధ్యాహ్న భోజనము అయిన తర్వాత సోమయ్యగారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేవారు. ఆ సమయంలో తప్ప జీవితంలో ఏ రోజు వారు నడుము వాల్చలేదు. ఎవరైనా కాలాంశము మధ్యలో నడుమువాలిస్తే అది అత్యంత దరిద్ర గుణము అని చెప్పేవారు. నడుము నిటారుగా ఉండేది. సంఘ శిక్షావర్గలో, అన్ని సమావేశాలలో వారు కిందనే  కూర్చునేవారు.

చాలామందికి సోమయ్యగారంటే గంభీరంగా ఉంటారని కొద్దిగా భయంగా ఉండేది. కారణం, వారు నిక్కచ్చిగ ఉండేవారు. అనుశాసన పాలనలో చాలా గట్టిగా ఉండేవారు. కానీ వారి మనస్సు వెన్నలాంటిది. ఇది నా జీవితాంతము అనుభవము వారితో. పరిస్థితిని గురించి కార్యక్షేత్రము గురించి కార్యకర్తల గురించి వారు చాలా ప్రశాంతంగా ఓపికగా వినేవారు. శ్రద్ధగా వినేవారు. అది వారి ప్రత్యేకత. మనం మాట్లాడుతుంటే మధ్యలో తాను ఎన్నడూ మాట్లాడేవారు కాదు. అందువల్ల వారి దగ్గర పూర్తి సమాచారం ఉండేది.

సమావేశాలు – కార్యకర్తలకు మార్గదర్శనం

శాఖల విస్తరణ విషయంలో కార్యకర్తలు సంఖ్య ఉత్సాహంగా చెప్పేవారు. తర్వాత సోమయ్యగారు అడిగేవారు; ఈ లక్ష్యము ఎలా సాధిస్తారు? ఇప్పుడు 30 శాఖలు 50 చేస్తామని చెప్పేవారు; ఎలా ఆధార మేమిటి? అని అడిగేవారు సోమయ్యగారు. అప్పుడు వారు చెప్తూ, ‘‘మీ దగ్గర ఎంతమంది పనిచేసే కార్యకర్తలున్నారు? వారి సామర్థ్యమెంత? వారు ఎంత సమయం ఇవ్వగలుగుతారు? కష్టపడే గుణము ఉందా? అందరితో వ్యక్తిగతంగా మాట్లాడారా? అన్ని కలిపి ఆలోచించి లక్ష్యం నిర్ణయం చేస్తే సాధారణంగా చేరుకోగలుగుతారు అని వివరించేవారు.

ఆ రోజులలో యువ కార్యకర్తలతో రెండు రోజులపాటు సోమయ్యగారు ప్రశాంతంగా గడిపేవారు. ఆ రెండు రోజులు ఎంతో లోతుగా సకారాత్మకముగా, సిద్ధాంతపరంగా, కార్యపద్ధతి పరంగా చర్చలు జరిగేవి. ఆవేశానికి లోనుకాకుండా చాలా ప్రబోధాత్మకంగా జరిగేవి. స్వయంసేవకత్వం కార్యకర్త గుణగణములు, జీవితానికి లక్ష్య నిర్ణయం, అన్ని ఆలోచించి నిర్ణయించుకోవాలని మార్గదర్శనం లభించేది. మూఢనమ్మకాలు ఉండగూడదు కదా అని ఒక కార్యకర్త ప్రశ్న అడిగితే సోమయ్యగారు, మూఢనమ్మకం మంచిది కాదు కానీ సరియైన దాని మీద నమ్మకము లేకపోతే ప్రమాదమే అన్నారు అంతే. బాగా ప్రభావము చూపింది. ఖాళీ సమయంలో యువ కార్యకర్తలతో వారు తీరిగ్గా మాట్లాడేవారు. అందువల్ల ఆనాటి యువ కార్యకర్తలలో మంచి అవగాహన ఏర్పడేది.

ప్రముఖులపై ప్రభావం

విశాఖపట్నంలో ఊటి హోటల్‌లో పెద్దల సమావేశం జరిగినది. ప్రపంచ ప్రఖ్యాతులైన డాక్టర్‌ ‌వ్యాఘ్రేశ్వరుడు, డాక్టర్‌ ‌బ్రహ్మయ్య శాస్త్రి లాంటి పెద్దలు అందులో పాల్గొన్నారు.

సంఘ జాతీయతా సంస్కృతీ ఆధారముగా సమాజ సంఘటన చేస్తున్నదని సోమయ్యగారు వివరంగా చెప్పారు. అందరు ప్రభావితులయ్యారు. ప్రొఫెసర్‌ ‌బ్రహ్మయ్య శాస్త్రి గాంధీజీ విషయంలో సంఘ దృష్టికోణం అడుగుతూ మొత్తము మీద సంఘం గాంధీజీని సరిగ్గా గౌరవించదేమో అని ప్రశ్నించారు. సోమయ్యగారు సమాధానం చెప్తూ, పూజ్యులు గాంధీజీ శ్రేష్టమైన హిందువు. సత్యము, అహింసా వ్రతమును జీవితాంతము పాటించినవారు, మద్యపాన నిషేధము కావాలన్నారు, గోవధ నిషేధము చట్టము చేయాలన్నారు. హింద్‌ ‌స్వరాజ్య పుస్తకములో మన దేశము వ్యవసాయము ఆధారంగా గ్రామములు కేంద్రముగా అభివృద్ధి జరగాలన్నారు. స్వదేశీ చింతన కలవారు. వారు మనందరికీ ఆదర్శం అని సంఘం భావిస్తోంది. రాజకీయ ఆలోచనలలో వారి దృష్టి- దానివలన కలిగిన, కలుగబోయే ఫలితాలకు చరిత్రయే సాక్ష్యం.రాజకీయ ఆలోచనల్లో అభిప్రాయభేదమున్నంత మాత్రాన మహాపురుషుల విషయములో శ్రద్ధ తగ్గరాదు. అందువల్లనే సంఘము పూజ్యులు గాంధీజీ పేరు ప్రాతఃస్మరణలో ఉంచింది. ప్రతిరోజు స్వయంసేవకులు స్మరిస్తుంటారు. స్వరాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ని రద్దుచేయ మన్నారు గాంధీజీ. స్వరాజ్యము కొరకు అందరు పనిచేశారు. కాంగ్రెస్‌ని రద్దుచేసి తమకిష్టమైన రాజకీయ పక్షము ఏర్పాటు చేసుకొని ఎన్నికలలో పోటీ చేయవచ్చని గాంధీజీ సూచించారు. కాంగ్రెస్‌వారు వినలేదు. అది వేరే సంగతి అని సమాధానము చెప్పగానే పెద్దలందరూ పూర్తిగా ప్రభావితులయ్యారు.

ఆ తర్వాత డాక్టర్‌ ‌వ్యాఘ్రేశ్వరుడు వివేకానంద మెడికల్‌ ‌ట్రస్ట్‌కి అధ్యక్షులయ్యారు. వారు జీవితాంతము సంఘ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మిగతా పెద్దలంతా కూడా అలానే సంఘానికి దగ్గరయ్యారు.

విజయవాడలో శిబిరం సమారోప్‌లో సోమయ్యగారు మాట్లాడారు. అనేకమంది ప్రొఫెసర్లు, పెద్దలు వచ్చారు. సోమయ్యగారు ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ అని అడిగారు పెద్దలంతా. ఎందుకంటే సోమయ్యగారు దేశ చరిత్ర, హిందూ సంఘటన విషయమై మాట్లాడారు.

వారు నిలబడి మాట్లాడుతుంటే గంగా ప్రవాహమే. చేతులు ఊపుట, హావభావాలు ఏమి ఉండవు. ప్రశాంతంగా మాట్లాడేవారు. ఒక్కొక్క శబ్దము తూచి తూచి వాడేవారు. పూర్తిగా తెలుగులోనే మాట్లాడేవారు. మనము ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు కానీ ఆంగ్లభాషకు బానిసలం కాకూడదు అని చెప్పేవారు. వారు స్వయంగా మామూలుగా మాట్లాడే సందర్భములోను ఉపన్యాసములోను స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడిన మహాసాధకులు వారు.

దూరదృష్టి- వివిధ సంస్థల నిర్మాణం

1970లో అఫ్జల్‌గంజ్‌ ‌కార్యాలయములో మండల కార్యవాహల సమావేశము వారు తీసుకున్నారు. రాబోయే 20సంవత్సరాలలో సంఘ కార్యానికి సమాజము పూర్తి మద్దతు ఇస్తుంది. అందరూ సంఘ కార్యకర్తలు కావాలని అడుగుతారు. మంచి హెడ్మాస్టర్‌, ‌మంచి డాక్టర్‌, ‌యోగ్యమైన ప్రాజెక్ట్ ‌మేనేజర్‌ ‌కావాలంటారు. అప్పుడు మనము ఇవ్వ గలగాలి. అందుకని కార్యకర్తల నిర్మాణము జరగాలి అన్నారు. 1990 తర్వాత అదే పరిస్థితి వచ్చింది కదా!

1971లో విశాఖ భారతీయ విద్యా కేంద్రములో జూనియర్‌ ‌కళాశాల ప్రారంభమునకై చర్చ జరిగినది. ప్రభుత్వము వారే మన సంస్థ వారిని పిలిచి కాలేజీ పెట్టమన్నారు. మన సంఘ పెద్దలు పెట్టాలా వద్దా అని సంకోచిస్తున్న సమయంలో సోమయ్యగారు పెడితేనే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇప్పుడది పిజి కోర్స్ ‌కూడా నిర్వహిస్తోంది.

విశాఖలో వివేకానంద మెడికల్‌ ‌ట్రస్ట్ ‌వైద్యశాల కూడా వారి అనుమతి, ప్రోత్సాహముతోనే ప్రారంభమై ఈ రోజు ఒక ఉన్నతమైన ఆసుపత్రిగా సేవలందిస్తున్నది.

అత్యవసర పరిస్థితి తర్వాత ఒక ఆవాస విద్యాలయం ప్రారంభిస్తే బాగుంటుందని విశాఖలోని పిళ్లారామారావు, శివప్రసాద్‌రావు సోమయ్య గారితో ప్రస్తావించారు. తప్పకుండా ప్రారంభించాలని చాలా వివరంగా సోమయ్యగారు చర్చించారు.

ప్రతిభాసంపన్నులు

గణితం, వాస్తు నిర్మాణం, వ్యవస్థా, తెలుగుభాష, చరిత్రలలో వారు ఎంతో ప్రతిభ గలవారు. ప్రాంతంలోని విభాగ్‌ ‌ప్రచారకులకు సంవత్సరానికి ఒకసారి సంఘ జమా ఖర్చుల విషయంలో రెండు సమావేశములు జరిగేవి. సోమయ్యగారు పూర్తిగా ఉండేవారు. ఒక్కొక్క విభాగ్‌ ‌ప్రచారకుని పిలిచి పత్రములు చూసేవారు. నేను కూడా లెక్కలలో బియస్సీ చదివానని పిసరంత అహంకారము నాకు ఉండేది. సోమయ్యగారి పెన్సిల్‌తో కూడికలు సరి చూసేవారు. 5 ని.లలో 10 చోట్ల తప్పులు గమనించి పెన్సిల్‌తో సున్నా పెట్టేవారు. నవ్వుతూ స్నానము చేసారా అని అడిగేవారు. ఇంకా లేదండి అంటే స్నానము చేసి మళ్లీ కూడికలు పూర్తి చేయ్యమనేవారు. ప్రశాంతంగా శ్రద్ధతో పూర్తి చేయమని చెప్పేవారు. తర్వాత ఏ తప్పులు లేకుండా పూర్తి చేసేవారము.

ఒక స్థలము నుండి ఇంకొక స్థలమునకు ఎంత సమయము పడుతుంది అని అడిగేవారు. అరగంట లేదా గంట అని చెప్పగానే దూరం ఎంత అని అడిగేవారు. మాకు ఖచ్చితంగా తెలిసేది కాదు. దూరము మైళ్లలో లేదా కిలోమీటర్లలో ఖచ్చితంగా తెలుసుకోవాలని నేర్పారు. ఒకసారి సమయం విషయంలో చెప్పిన విధంగా జరుగకపోతే వారికి చాలా బాధ వేసేది.

వారి తల్లిగారు తెనాలిలో ఒక్కరే నివసిస్తూ ఉండేవారు. అమ్మ ఒక కర్రల అడితి నడిపేవారు. అమ్మ చాలా స్వాభిమానం కలవారు. మమ్మల్ని ఎంతో ప్రేమతో చూసేవారు. సంవత్సరంలో ఒక్కసారి సోమయ్యగారు విజయవాడ నుండి వెళ్లివచ్చేవారు. అన్నవరపు మాణిక్యాలరావు, సోమయ్యగారి సహాధ్యాయి. సంఘ స్వయంసేవక్‌. అమ్మ వ్యవహారాలు చూస్తుండేవారు. అమ్మ జలోదరము వ్యాధితో చాలా బాధపడ్డారు. చివరికి అంతిమశ్వాస విడిచేముందు సోమయ్యగారికి మాణిక్యారావు ద్వారా తాను కూడబెట్టిన కొంత డబ్బుని ఇమ్మని చెప్పినది. ఒక లక్ష రూపాయలు సోమయ్యగారు నూతక్కి స్కూల్‌కి సమర్పించారు. జీవితాంతము వారి ప్రేమని, ఆత్మీయతను పొందడం నా అదృష్టము.

అడుగడుగునా కార్యము, కార్య పద్ధతి, కార్య విస్తరణ ఎన్నో ప్రాజెక్టు లలో పనిచేయడము వారు చూపిన దారియే. అనకాపల్లి వరదల సమయంలో, దివి సీమలో వారు సహాయ కార్యక్రమాల్లో మునిగిపోయి ఉన్నారు. అయినా అనాకపల్లి శ్రీరాంనగర్‌లో 110 ఇండ్ల నిర్మాణం, దానిలో సంపాదించిన అనుభవము వారి నిర్ణయ ఫలితమే.

1986లో గోదావరి వరదల్లో బలహీనవర్గాల ప్రజలకు కట్టే ఇల్లు బలహీనంగా ఉండకూడదు అని  విజయసారథి చెప్పి ఎక్కువ ఖర్చయినా దృఢమైన ఇళ్లు నిర్మించేలా ప్రోత్సహించారు.

ఆంధప్రదేశ్‌ ‌విషయంలో వారు కొన్ని సమస్యలు గుర్తించి, వాటిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. దృష్టి పెట్టవలసిందిగా సూచించారు.

  1. సాహిత్యంలో వామపక్ష ప్రభావము బాగా ఉంది. ఆ దృష్ట్యా తెలుగులో జాతీయ సాహిత్యం విషయమై వారు చాలా శ్రద్ధ వహించారు. ఈ రోజున హిందీ తర్వాత అధికంగా పుస్తకాలు తెలుగులోనే సంఘలో ముద్రణ అవుతున్నాయి. విశేష ప్రయత్నంవల్లనే మన కార్యకర్తలు ఎంతోమంది సాహిత్య రంగంలో ఉన్నత స్థానాన్ని సంపాదించారు. పోరాడారు, విజయం సాధించారు. భండారు సదాశివరావు, ముళ్లపూడి సూర్యనారాయణమూర్తి మొదలు ఎందరో కీర్తిశేషులు వారిలో కొందరు. ఈ తరములో కూడా కొందరు ఉన్నారు. వారు ఎప్పుడూ చెప్తుండేవారు, చూడండి మన ప్రాంతంలో సాహిత్య రంగానికి వనరులు కేటాయించాలి అని.
  2. నిజమైన సముద్ర తీరప్రాంతం: ఆంధప్రదేశ్‌ ‌సమగ్ర తీరప్రాంతం దాదాపు 1000 కి.మీ. ఉంది. అక్కడ ఉండే మత్స్యకారులలో పని జరిగే ఆ దిశలో చాలా ప్రోత్సహించారు. వసతి గృహాల మీద దృష్టి పెట్టడంవలన ఎంతోమంది మత్స్యకార కుటుంబాల నుండి కార్యకర్తలు ప్రచారకులుగా వచ్చారు. దాని ఫలితమే నేటి మత్స్యకార సంక్షేమ సమితి.
  3. సామాజిక వివక్షత వలన మన సమాజం బలహీనపడుతుంది. సేవాబస్తీలలో విశేషంగా పనికై వారు ప్రోత్సహించారు. అప్పటికి దేశములో సమరసత వేదిక ప్రారంభం కాలేదు. కానీ మన ప్రాంతంలో వారు మాననీయ యాదవరావుజీ ప్రేరణతో సామాజిక సమరసత వేదికను ఏర్పాటు చేయించారు. సమత, సమరసత శబ్దములపై చర్చకై మాననీయ యాదవరావుజీతో మమ్మల్ని కూర్చోబెట్టి చర్చింపచేసి సమరసతయే నేడు కావలసింది. సమరసత వల్లనే సమత కూడా సాధించవచ్చును అని నిర్ణయము జరిగింది.

సేంద్రియ వ్యవసాయం

ఉంగుటూరులో సేంద్రియ వ్యవసాయం.  సుంకవల్లి పర్వతరావు తమ స్వంత ఊరు ఉంగుటూరులో 27 ఎకరాల వ్యవసాయ భూమిని దానముగా సమర్పించారు. దానిలో సేంద్రియ వ్యవసాయము ప్రారంభించడంలో సోమయ్యగారి మార్గదర్శనం ఉంది. ఆ క్షేత్రము ఈ రోజున దక్షిణ భారతదేశంలో ఒక ఆదర్శవంతమైన సేంద్రియ వ్యవసాయ క్షేత్రముగా నిలిచింది. మనందరికీ సేంద్రియ వ్యవసాయము లాభసాటి అని విశ్వాసము కలిగినది.

దివిసీమ ఉప్పెన సమయంలో సోమయ్యగారి మార్గ•దర్శనం మన ప్రాంతానికేకాక దేశము మొత్తానికి ఆదర్శముగా నిలిచింది. 1981లో దివిసీమ ఉప్పెన సేవా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్కడ పనిచేసిన డాక్టర్‌ ‌సుబ్రహ్మణ్యశాస్త్రి తమ స్వంత ఊరికి వెళ్తున్న సమయంలో నాగాయలంకలో ఒక శాశ్వతమైన హాస్పిటల్‌ ‌ప్రారంభించాలని ఆలోచించి నప్పుడు సోమయ్యగారు ఒకే మాట చెప్పారు. ‘‘చూడు నాయనా! మీ విజయవాడ టీం అంతా కలసి నిర్ణయం చేయగలిగితే, నడవగలమని విశ్వాసముంటే ముందుకెళ్లండి’’ అని ధైర్యము చెప్పారు. ఆ మాటలనే శిరోధార్యంగా భావించిన కార్యకర్తలు దీనదయాళ్‌ ఆసుపత్రిని ప్రారంభించారు.

నూతక్కి పాఠశాల 

విజయవాడ అప్పటికి విభాగ్‌ ‌కేంద్రమే కానీ రాకపోకల దృష్ట్యా పెద్ద కేంద్రము. అందుకని అక్కడ ఒక ఆవాస విద్యాలయము ఉండాలని, స్థలం సేకరించాలని 1988లో సోమయ్యగారు చెప్పి నప్పుడు, మన విజయవాడ కార్యకర్తలకు ఆశ్చర్యం వేసింది. ఇది అయ్యే పనేనా? అని మొదట్లో అనిపిం చినా, వారి ప్రోత్సాహము వలన అది సాధ్యమైంది.

– వి.భాగయ్య
అఖిల భారత కార్యకారిణి సదస్యులు
(‘స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య పుస్తకం నుండి)

About Author

By editor