లలిత; కుసుమ, సుమన్.
వీరందరూ లాల్‌బహదూర్‌శాస్త్రి కుటుంబ సభ్యులు.
ఆయన సతీమణి లలితాదేవి.
లాల్‌బహదూర్, లలితాదేవి దంపతుల తనయులు కుసుమశాస్త్రి, సుమన్‌శాస్త్రి.
‘భారతరత్న’ శాస్త్రీజీ.
జై జవాన్, జై కిసాన్ అని నినదించిన భరతమాత ముద్దుబిడ్డ.
అంతటి మహనీయ, మాననీయ నేత జీవిత భాగస్వామిని లలితా శాస్త్రీజీ. భర్త గురించిన భార్య విపులీకరణ అప్పట్లోనే పుస్తకంగా వెలువడి అపార పాఠకాదరణ అందుకుంది.
‘నవ వధూ! రాగమధూ!
పుట్టింటికి శుభగౌరవ పుష్పమాల పంపించగ
మెట్టినింట శ్రీసుఖ సంప్రీత గీతి వినిపించగ
రావమ్మా లలితామయీ!
ముద్దులొలుకు నిరతము నీ ముఖఫలక శ్రీ తిలకము
కాంతులొలుకు సతతము నీ గళసూత్రము సముదాత్తము’
అని వనితాలోకం సంభావించిన భాగ్యశాలిని లలితా లాల్‌బహదూర్ శాస్త్రి. ఏప్రిల్ తొలిపక్షంలోనే ఆమె సంస్మృతి.
83 సంవత్సరాల జీవితకాలం.
మరెంతో విశేషం, విశిష్టం; సహజసిద్ధంగా తను గీత రచయిత్రి.
‘దేశమాత’ పదానికి విస్తృత నిర్వచనం అందించడమే తనదైన ఘనత, అగ్రగణ్యత. రెండే రెండు మాటల్లో ‘సార్థక జీవని.’
అసలు పేరు లాలామణి.
స్వస్థలం – ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్. వింధ్యాచలదేవి ఆలయమున్న పవిత్ర స్థలం. వారణాసికి, ప్రయాగ్‌రాజ్‌కి అక్కడి నుంచి దూరం 80 కిలోమీటర్ల లోపు.
ప్రకృతి సుందరత్వానికి నెలవు ఆ పురం.
అక్కడ పుట్టిన ఆ మణి నలుగురు అన్నల ముద్దుల చెల్లి. ఆమెకి ఇద్దరు అక్కలు.
తండ్రి ఆమె బాల్యంలోనే కన్నుమూశారు. అప్పటి నుంచీ తల్లి ఆలనా పాలనలోనే జీవిత మంతా.
తొలి నుంచీ లాలామణి (లలితాదేవి)కి ప్రత్యేక అభిరుచులు. అవి : చుట్టుపక్కల గల స్త్రీలకు దుస్తుల అల్లిక పనులు నేర్పడం. ఇరుగు పొరుగువారికి భారతీయ ధార్మిక అంశాలను చదివి వినిపించడం. నిత్యమూ ఆలయాన్ని సందర్శించి కీర్తనలు ఆలపించడం.
ఈ మూడూ పరస్పర అనుబంధాలు. ప్రత్యేకించి విద్యార్థినులకు కళలు బోధిస్తూనే ఉపాధి మార్గం చూపడం ఒకటి.
పుస్తక పఠనం ద్వారా ఉన్నత విలువలు అలవరచడం రెండోది.
దైవ దర్శన రీతితో మనసును సదా ప్రశాంతంగా ఉంచడం మూడోది.
ఇవన్నీ ఆమె ధీశక్తికి సూచికలు.
ఒకరోజున ఆమె పొరుగున ఉన్న ఒక ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. పరామర్శకు వచ్చారు. రామ్‌దులారీదేవి. లాల్‌బహదూర్‌కి మాతృమూర్తి. ఇద్దరూ వచ్చారక్కడికి.
సరిగ్గా అదే సమయానికి అక్కడికే వెళ్లారు లాలామణి. అప్పుడు మొదటిసారిగా చూశారు లాల్‌బహదూర్‌ని.
బక్కపలచని వ్యక్తి. ఆ ముఖంలో తేజస్సు, కళలో ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం. మాట సుతిమెత్తగా ఉన్నా, పలికే తీరులో ధాటితనం.
వీటన్నింటినీ ఆయనలో గమనించారామె. సౌమ్యత, గంభీరత కలగలిసి ఉండటం ఎంతగానో ఆకట్టుకుంది.
ఇరు కుటుంబాలకీ కొంత పరిచయమైతే ఉంది. ఆ ప్రభావమూ లాలామణి హృదయం మీద ఎంతో పనిచేసింది.
లాలామణి తల్లి కౌసల్యాదేవి అప్పటికే లాల్‌బహదూర్ గురించి విని ఉన్నారు. ఆ విధంగా కాలక్రమంలో అన్ని విషయాలూ తెలిశాయి. విస్తృతమయ్యాయి.
అప్పటికి ఆయనకి సంబంధించి:
భారత స్వాతంత్య్ర సమరంలో క్రియాశీలంగా ఉన్నారు లాల్‌బహదూర్. దేశమాత సేవకే కంకణం కట్టుకున్నారు. లాల్‌బహదూర్, లాలామణి మనసులు కలిశాయి. పెళ్లి మాటలు జరిగాయి.
వివాహ సందర్భంలో మీకు ఏం కావాలి?
– అమ్మాయి తరఫువారి ప్రశ్న.
జవాబుచెప్పింది మాత్రం ఆయన ఒక్కరే!
‘ఏం కావాలంటే – ఒక చరఖా. రెండు జతల ఖద్దరు వస్త్రాలు’.
వధువు తరఫువారు ఇచ్చిందీ, వరుడి తరఫువారు పుచ్చుకుందీ అవే! పెళ్లి ప్రమాణం వధూవరులిద్దరూ చేశారు.
వివాహమయ్యాక లాలామణి ‘లలితాదేవి’ అయ్యారు. ఆ పేరుకీ ఆమె లలితత్వానికి అంతా సరిపోయింది.
కల్యాణమైన సంవత్సరానికి దంపతుల మకాం అలహాబాద్‌కి మారింది. కారణం…. లాలాలజపతిరాయ్ నేతృత్వంలోని సంస్థలో కీలక బాధ్యతని లాల్‌బహదూర్ వహించాల్సి రావడం.
కాపురం పెట్టారు. ఆ కాలంలో (దరిదాపు శతాబ్ది క్రితం) లాల్‌బహదూర్ నెల జీతం వంద రూపాయలు!
అతి చిన్న ఇంట్లో నివాసం.
అక్క, ముగ్గురు పిల్లల పోషణనీ ఆయనే చూసుకోవాల్సి వచ్చింది. పని భారం పెరిగింది లలితాదేవికి.
తక్కువ ఆదాయం, ఎక్కువ శ్రమ.
కుటుంబ నిర్వహణను సమర్థంగా చేపట్టారు లలితాదేవి శాస్త్రి.
భర్త, అత్త, ఆడపడుచు- ఏ ఒక్కరినీ నొప్పించకుండా ఎంతగానో మెప్పించారు.
ఇంటా బయటా శాస్త్రిగారికి అండదండగా నిలిచారు.
(ఆయన కాశీ విద్యాపీఠంలో చదివారు. జాతీయోద్యమంలోకి దూకేందుకు సిద్ధమైన విద్యార్థులకు అక్కడ ప్రత్యేక శిక్షణ! అదే విద్యాలయానికి రోజూ పదిమైళ్లు నడిచివెళ్లే వారాయన. నాలుగు సంవత్సరాల పర్యంతమూ అక్కడే విద్యాభ్యాసం. పరీక్షల్లో ప్రథమ శ్రేణి ఆయనకే. శాస్త్రి అనే డిగ్రీ కారణంగా లాల్‌బహదూర్‌శాస్త్రి అయ్యారు).
ఉప్పు సత్యాగ్రహంలో ఉత్తేజభరితంగా ప్రసంగాలు చేసిన ఆయనను ఆంగ్ల పోలీసులు నిర్బంధించారు. ఫైజాబాద్ కారాగారానికి తరలించారు. దరిదాపు ఎనిమిది నెలలు ఆయన జైలులోనే!
లలితాశాస్త్రికి ఆడపిల్ల జన్మించింది. ఆమె కుసుమ.
ఉద్యమంలో ఆయన పాత్ర నానాటికీ పెరిగింది. ఊరూరా పాదయాత్రలు సాగించేవారు. ఆంగ్ల పాలకుల దమనకాండ పెచ్చుమీరింది. అరెస్టులు ఎక్కువయ్యాయి. లాల్‌బహదూర్‌శాస్త్రిని మళ్లీ నిర్బంధించి, ఫైజాబాద్ జైలులో ఉంచారు.
అక్కడ కారాగారంలో ఉన్నప్పుడూ భారత జాతీయత వెల్లివిరిసేలా పుస్తక అనువాదాలు చేశారు.
విడుదలయ్యాక, ముఖ్యమైన పరిణామం:
లలితాశాస్త్రి నాయకత్వ బాధ్యతలు అందుకోవడం. తను ముందు నిలిచి, మిగతా స్త్రీలందరినీ ముందుకు నడిపించారామె.
మరో తనయ సుమన్ జననం.
నైనీ జైలుకి తరలించుకెళ్లారు. కొన్నాళ్లకు లాల్‌బహదూర్‌శాస్త్రి అనారోగ్యం బారిన పడిన కూతురును చూడాలని కారాగార అధికారులను అడిగితే; ‘ఉద్యమం నుంచి విరమించుకుంటేనే…’ అని సమాధానం!
వెనక్కి తగ్గలేదాయన. ఇంకా కొన్ని రోజులయ్యాక ఎలాగో అనుమతి లభించినా, ఆయన ఇంటికి చేరేసరికి కుమార్తె మరణం!!
అంతటి విషాదంలో పతికి ధైర్యం చెప్పి కర్తవ్యం నిర్దేశించింది సతీమణి లలితాశాస్త్రే! ఆ దంపతులకి ఉన్న గుండె దిటవు ఇంతా అంతా కాదు.
ఆయన తన జీవితంలో పలు సంవత్సరాలు జైళ్లలోనే ఉన్నారు. కాలం ఎన్ని విషమ పరీక్షలు పెట్టినా, భర్తకి అండదండగా ఉండి అర్థాంగి అనిపించుకున్నారామె.
క్విట్ ఇండియా ఉద్యమవేళ, లాల్‌బహదూర్‌శాస్త్రీజీని అజ్ఞాత ప్రదేశానికి తరలించుకుపోయారు ఆంగ్ల పోలీసులు. ఇలా ఎన్నెన్ని కంటక స్థితిగతులు ఎదురైనా, మొక్కవోని ధైర్యం ఆమెది. ఆ సాహసం అనుపమానం.
స్వాతంత్య్రం తర్వాత, మంత్రి పదవులు చేపట్టిన జీవిత సహచరుడికి మరిన్ని సహాయ సహకారాలందించారు ఆమె. ఆయన కేంద్రమంత్రి కావడంతో, కుటుంబ నివాసం దేశరాజధానికి మారింది. అప్పటి నుంచీ అదే నివాస గృహంలో ఉన్నారు లలితా శాస్త్రి. అటు తర్వాత ప్రధానిగా శాస్త్రీజీ.
ఆగని కాలచక్రం మరెన్నో పరిస్థితులను మోసుకొచ్చింది. ఆయన దివంగతులయ్యాక, తనకు తానే గుండె నిబ్బరం చేసుకున్నారు. భర్త పేరిట సేవానికేతన్ స్థాపించి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి కొనసాగించారు.
జీవిత అనుభవాలను వివరించిన లలితాశాస్త్రి… వాటన్నింటినీ పుస్తకరూపంలో చూసుకున్నారు. తన మనోభావనలకు దీటైన పద్యాలు, గేయాలు, ఇతర వాటినీ రచించి ప్రచురింపచేశారు. చివరిదాకా ఆదర్శప్రాయ జీవితం గడిపారు.
ఆమె శాశ్వతంగా కునుమరుగై ఇప్పటికి 32 ఏళ్లు. అయినా, నేటికీ ఆ స్మృతి అందరి మనోపథంలోనూ ఉంటూ వస్తోంది.
లాలామణి, లాల్మణి, లలిత…ఈ పేర్లన్నింటికీ తగిన ధీశక్తి లలితా శాస్త్రిది. ఆ స్ఫూర్తి ఎన్నటికీ తరగనిది. నిత్యమూ వర్థిల్లేది!

జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్