సంపాదకీయం

శాలివాహన 1948 శ్రీ పరాభవ చైత్ర శుద్ధ ద్వాదశి – 30 మార్చి 2026, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


యుద్ధం ప్రతికూలతనే కాదు, ప్రత్యామ్నాయాన్నీ తప్పనిసరి చేస్తుంది. కీలక రంగాల్లో సరికొత్త మార్గాల అన్వేషణకు దారులు వేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్‌యుద్ధం భారత ఇంధన రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఇంధనవనరుల వేట అనివార్యంగా మారింది. దిగుమతుల భారాన్ని తగ్గించే పునరుత్పాదక వనరుల ప్రాధాన్యత పెరుగుతోంది. సౌరశక్తి, పవన శక్తి, హైడ్రోజన్ శక్తిని పెంచేందుకు ఇదే సరైన సమయమని భావించాలి. యుద్ధానికి ముందే భారతదేశ ముడిచమురు దిగుమతి విలువ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండింతలు పెరిగింది. దేశ ముడి చమురు దిగుమతి విలువ వంద మిలియన్ అమెరికన్ డాలర్లు దాటిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గత ఫిబ్రవరిలో ప్రకటించింది. గత సెప్టెంబర్‌లో జీఎస్టీ హేతుబద్ధీకరణ ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చేరిన డబ్బంతా యుద్ధం కారణంగా ఆవిరయింది.

యుద్ధం ప్రభావంతో చమురు ధరలు ప్రపంచంపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశం. వర్ధమాన దేశాల్లో కంటే చమురు వినియోగం భారత్‌లోనే అధికమని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. శిలాజ ఇంధన వినియోగం విపరీతంగా పెరుగుతున్న సమయంలో పశ్చిమాసియా సంక్షోభం వచ్చి పడింది. దేశంలో కేవలం 74 రోజులకు సరిపడ చమురు నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇలాంటి స్థితిలో శిలాజ ఇంధనాల వాడకానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపై ప్రజలు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మార్పువల్ల మాత్రమే చమురు సంక్షోభాన్ని నివారించలేం. 140కోట్ల మంది ప్రజలు సంప్రదాయ, ప్రత్యామ్నాయ వనరుల వినియోగాన్ని పెంచడం, పొదుపు చర్యలు పాటించడం వల్ల మాత్రమే దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు. దిగుమతుల భారాన్ని తగ్గించడంతో పాటు చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రయోగం చేసి అద్భుత ఫలితాలు సాధించింది. పెట్రోల్‌లో 10శాతం మేర ఇథనాల్ కలపాలని 2014లో అధికారం చేపట్టినప్పుడే కేంద్రం నిర్ణయించుకుంది. 2022 నవంబర్ నాటికి కేంద్రం ఈ లక్ష్యాన్ని సాధించింది. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలపడం ద్వారా గత ఏడేళ్లలో సుమారు రూ.50వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కేంద్రం ఆదా చేసింది.

శిలాజ ఇంధనాల వాడకం మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. పర్యావరణానికి హాని చేస్తోంది. దుబాయి వేదికగా 2023లో ఐరాస వాతావరణ మార్పుల సదస్సు-కాప్ 28 జరిగింది. శిలాజ ఇంధనాల వాడకానికి స్వస్తి పలకాలని ఆ సదస్సు తీర్మానించింది. దేశీయ అవసరాలు తీర్చడానికి శిలాజ ఇంధన వనరులు ఉపయోగిస్తూనే, పునరుత్పాదక ఇంధన శక్తి వనరుల అన్వేషణలో భారత్ వేగం పెంచింది. ఇదే విషయాన్ని కాప్-28 సదస్సు వేదికగా స్పష్టం చేసింది.

2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరులను మూడు రెట్లు పెంచాలని కేంద్రం విధాన నిర్ణయం చేసింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యవస్థల ఏర్పాటు, పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. శిలాజ ఇంధన రహిత విద్యుత్ ఉత్పత్తిలో 2030 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని కేంద్రం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

చమురు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త తరహా ఇంధన వనరులను సృష్టించి వినియోగించడం అలవాటు చేసుకోవాలి. నీరు, బొగ్గు, కలప, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటివి తరిగిపోయే ఇంధన వనరులు. భూమాతను తొలిచి వెలికితీసే చమురు, గ్యాస్‌లను పొదుపుగా వాడాలి. వాయు శక్తిని, సూర్యకాంతినీ ఆధారం చేసుకుని ఉత్పత్తి చేసే నవీన ఇంధన శక్తులను వినియోగించాలి. అప్పుడే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని, యుద్ధాల కారణంగా ఏర్పడే సంక్షోభాలను అధిగమించవచ్చు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ పశ్చిమాసియా ఉద్రిక్తతలు – దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై పార్లమెంటులో మాట్లాడారు. స్థూలంగా ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వ ఉద్దేశ్యం, ప్రత్యామ్నాయ అన్వేషణలపై కేంద్రం దీర్ఘకాలిక దృష్టి నిలిపినట్లు బోదపడుతుంది. ప్రపంచంలో 5వ వంతు ఇంధన వనరుల రవాణా జరిగే హార్మోజ్ జలసంధిని దిగ్భింధించడం వల్ల సంక్షోభాలను తీవ్రతరం చేస్తుంది. సరఫరాలోని అనిశ్చితి కారణంగా దేశీయ ఉత్పతిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి నిలిపింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని ఆమూలాగ్రం పరిశీలిస్తే కేంద్రం దౌత్యాన్ని, లౌక్యాన్ని కలగలిపిన ‘పరుసవేది’ని యుద్ధ సమయంలో అనుసరిస్తుందని అర్థమవుతుంది. యుద్ధానికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్ సహా యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ భారత్‌కు మిత్ర దేశాలు. ఇరాన్‌కు ప్రత్యక్ష సాయం చేస్తున్న రాష్యా, పరోక్ష సాయం చేస్తున్న చైనాతో సహితం భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న గల్ఫ్ దేశాలతో కూడా భారత్ సుదీర్ఘ కాలం మైత్రి ఉంది. దీంతో భారత ప్రభుత్వం ఆచీతూచి వ్యహరిస్తున్నది. ప్రతిపక్షాలు, కొంతమంది మేధావులు ఆరోపిస్తున్నట్లు యుద్ధ విషయంలో భారత్ మౌనంగా ఉందనడం విచారకరం. ఆ వైఖరిని బాధ్యత గల రాజనీతిగా అర్థం చేసుకోవాలి.

About Author

By editor

Twitter
YOUTUBE