ప్రథమ ప్రధాని నెహ్రూ వలెనే ఆయన భారతీయతకు బద్ధ వ్యతిరేకి.

ఇందిరాగాంధీ నియంత పోకడలను పుణికిపుచ్చుకున్నవారు.

రాజీవ్‌గాంధీ మాదిరిగానే ప్రధాని కుర్చీ దక్కే వరకు రాజకీయాలు ఆయనకు కేవలం హాబీ.

ఇంటిపేరు గాంధీగా చలామణీ అవుతున్నా, నెహ్రూ కుటుంబ వారసత్వమే రాహుల్‌లో అణువణువునా కనిపిస్తుంది.

ఈ బడ్జెట్ సమావేశాలలో లోక్‌సభలో రాహుల్ గాంధీ అంత రంగం పూర్తిగా బయటపడింది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించినట్టు ఆయన దేశంలో అంతర్యుద్ధాన్ని కోరుకుంటున్నారు.

పార్లమెంట్‌కు ఉండే అత్యున్నత చట్టసభ గౌరవాన్ని ధ్వంసం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

దేశ గౌరవాన్ని భంగపరచడానికి ఇంతకాలం విదేశాలలో వేదికలను వెదికిన రాహుల్ ఇప్పుడు మన పార్లమెంట్‌లోనే అలాంటి ఏహ్యమైన చర్యకు పాల్పడ్డారు. బీజేపీ సభ్యుడు రవినీత్ బిట్టును ద్రోహి మిత్రుడా అని పిలిచి అవమానించాలని, దేశద్రోహివి అని బిట్టు తిట్టినా, ముఖం తుడిచేసు కుని వెళ్లిపోగల సిగ్గులేనితనం ఆయన సొంతం. ఇందుకు తిరుగులేని నిదర్శనం ‘అమ్మకాల’ గురించి పేలడం. 

‘భారతమాతను అమ్మేశారు!’ అన్న మాట ఎంత విధ్వంసకర రాజకీయ నాయకుడైతే అనగలడు! ఆ మాట రాహుల్  అలవోకగా అన్నారు.


ఈ బడ్జెట్ సమావేశాలు రెండు దశలుగా ఏర్పాటు చేశారు. తొలి దశ పూర్తయింది. జనవరి ఆఖరు నుంచి ఫిబ్రవరి మధ్య వరకు సాగిన ఆ పదహారు రోజులు పార్లమెంట్ చరిత్రలోనే చీకటియుగం. వివిధ విన్యాసాలతో గతంలోను రాహుల్, ఆయన పార్టీ పార్లమెంట్‌ను స్తంభింప చేశాయి. కానీ ఇప్పుడు చేసిన పని మాత్రం అత్యంత హేయమైనది. రాహుల్ అధికార కాంక్షను, పార్ల మెంట్‌ను వీధి పోరాటాలకు బరిగా మార్చేయాలన్న దురద కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపించాయి. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని, ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా శాశ్వతంగా బహిష్కరించాలని బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబె ఫిబ్రవరి 12న ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. నిజానికి అంతకు ముందే ప్రతిపక్ష నేత మీద హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అధికారపక్షం భావించింది. ఇన్‌స్టింటివ్ మోషన్ ప్రవేశపెడుతూ దూబె తీర్మానం తెచ్చారు కాబట్టి కేంద్రం తన ప్రయత్నాన్ని నిలిపివేసింది. మొదట రాష్ట్రపతి ప్రసంగం మీద విపక్షం స్పందన గురించి మాట్లాడడానికి సమయం కేటాయిస్తే, భారత సైనిక దళాల మాజీ ప్రధాన అధికారి జనరల్ ఎంఎం నరవణె పుస్తకం గురించి సభలో ప్రస్తావించి రాహుల్ పెద్ద రభస సృష్టించారు. ఇందుకోసం దాదాపు ఆరురోజులు సభా సమయం గాలిలో కలసి పోయింది. తరువాత బడ్జెట్ 2026`27 మీద ప్రసంగించడానికి సమయం కేటాయించినప్పుడు భారత్` అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి లేవనెత్తి హీనమైన ధోరణిని ప్రదర్శించారు. భారతమాతను, దేశాన్నీ అమ్మేశారు, సిగ్గులేదా వంటి తీవ్ర పదజాలంతో ఒళ్లు తెలియకుండా అధికార పక్షం మీద దాడికి దిగారు. ఈ మధ్యలో జరిగిన సంఘటనలు కూడా పార్లమెంట్ గౌరవాన్ని, భారత్ ప్రతిష్టను మంట గలిపేవి గానే ఉన్నాయి. అందులో మొదటిది, ప్రధాని స్థానాన్ని ఎనిమిది మంది కాంగ్రెస్ మహిళా ఎంపీలు చుట్టుముట్టడం. ఇది ముమ్మాటికీ ప్రధాని నరేంద్రమోదీ మీద దాడి కోసం జరిగిన కుట్రేనని బీజేపీ ఆరోపించింది. రెండు, స్పీకర్ చాంబర్‌లోకి 20 మంది వరకు కాంగ్రెస్ ఎంపీలు చొరబడి ఆయనను దుర్భాషలాడడం, బెదిరించడం; బీజేపీ సభ్యుడిని పార్లమెంట్ ప్రాంగణంలోనే ద్రోహి మిత్రుడా! అని రాహుల్ పలకరించడం, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి మాట్లాడు తున్న విలేకరుల సమావేశంలోకి అడ్డంగా చొరబడి కేంద్రమంత్రులతో వెకిలిచేష్టలు చేయడం వరసగా జరిగిపోయాయి. 2024 ఎన్నికల తరువాత రాహుల్ విపక్షనేత అయిన నాటి నుంచి పార్లమెంట్‌లో విపక్ష నేతగా కాకుండా, ప్రజాస్వామ్య వనంలో విషక్రిమి వలె ప్రవరిస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ మహిళా ఎంపీల వైఖరి చూసిన తరువాత స్పీకర్ ఓం బిర్లా ప్రధాని సభకు రావడం మంచిది కాదని సూచించ వలసి రావడం నిశ్చయంగా ఒక దౌర్భాగ్యమే. ఆ పార్టీ ఎంపీలను అందుకు ప్రోత్సహించినవారే రాహుల్ అని బీజేపీ సభ్యులు నిర్ద్వంద్వంగా చెబుతు న్నారు. ఈ పరిణామాలన్నీ రాహుల్ మీద వేటు వేయక తప్పని పరిస్థితిని కల్పించాయి. మొదట హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అనుకున్నా, అంతిమంగా బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే ప్రవేశపెట్టిన ఇన్‌స్టింటివ్ మోషన్ చివరి అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తున్నది.

తానో గంభీర అంశాన్ని ఈ జాతికి వివరించ దలుచుకున్నట్టు రాహుల్ హావభావాలు ప్రదర్శించ వచ్చు. కానీ దేశంలో ఎక్కువ మంది ఆయనను ఒక స్టాండప్ కమేడియన్‌గానే పరిగణిస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలలో రాహుల్ ధోరణి అత్యంత అనాగ రికంగా, అప్రజాస్వామికంగా ఉందని సభలోనే పలువురు బీజేపీ సభ్యులు ఆరోపించడం కూడా సత్యదూరం కాదు. ఒక ఉన్మాదం ఆయనలో దేశమంతా చూసింది. సభా కార్యక్రమాలను అడ్డు కోవడానికి ఆయన తోటి ఎంపీలను ప్రేరేపించారని కూడా అధికార పార్టీ ఆరోపించింది. స్పీకర్‌ను కూడా ‘యార’ అంటూ పిల్ల భాషతో మాట్లాడడం, స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్‌ను మీరు ఒకప్పుడు మా పార్టీయే కదా, నేను దూకుడుగా పోను లెండి అనడం రాహుల్‌లోని అత్యంత చౌకబారుతనాన్ని బయటపెట్టాయి. ఈ బడ్జెట్ సమావేశాలక రెండు దశలు ఉన్నాయి. తొలిదశ సమావేశాలు జనవరి 28 నుంచి, ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో దశలో మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వరకు జరుగుతాయి.

పార్లమెంట్ సభ్యునిగా అనర్హునిగా రాహుల్‌ను ప్రకటించాలని, జీవితకాలం పోటీకి కూడా అనర్హత ప్రకటించాలన్న తన వాదనకు బీజేపీ సభ్యుడు నిశికాంత్ ఫిబ్రవరి 13న పదును పెంచారు. రాహుల్ అనైతిక ప్రవర్తన దృష్ట్యా, దేశ వ్యతిరేక శక్తుల ప్రయోజనాల కోసం పని చేస్తూ ఉండడం వల్ల లోక్‌సభ ఈ చర్య తీసుకోవాలని ఆయన కోరారు. తనపై పార్లమెంట్‌లో ఎలాంటి తీర్మానం తెచ్చినా, తన వైఖరి నుంచి అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని రాహుల్ గాంధీ బీరాలు పలికారు. మా అన్నను మీరు బెదిరించలేరంటూ ఆయన సహోదరి ప్రియాంకా వాద్రా కూడా గప్పాలు కొడుతున్నారు.

 రాహుల్ విపక్ష నాయకుడు కాదని, దొంగల నాయకుడు (థగ్గరీ గ్యాంగ్) అని నిశికాంత్ తీవ్ర విమర్శ చేశారు. ఈ దొంగల ముఠా ధ్యేయం దేశంలోనే ఉంటూ, దీనిని విచ్ఛిన్నం చేయడమేనని కూడా ఆరోపించారు. అసలు అధికారం కోసం రాహుల్ దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్ను తున్నారా? అని కూడా దూబె ప్రశ్నించారు. రాహుల్ టుక్డే టుక్డే ముఠా నాయకుడని ఎక్స్ వేదికగాను దుయ్యబట్టారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి ఆయన లోక్‌సభలో చేసిన ప్రసంగం జాతీయ ప్రయోజనాలను ఫణంగా పెట్టిందని కూడా అధికార పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ రాహుల్ లేవనెత్తిన అంశాల మీద చర్చకు రాలేక అధికార పక్షం ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నదని విపక్షం ఆరోపిస్తున్నది. రాహుల్ దేశ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని, జార్జ్ సారోస్, ఆయన సంస్థ ఫోర్డ్ ఫౌండేషన్‌తో రాహుల్‌కు సంబంధాలు ఉన్నాయని దూబె బాహాటంగానే ఆరోపించారు. రాహుల్ అనైతిక వర్తనపై పార్లమెంటరీ దర్యాప్తు సంఘం ద్వారా విచారించాలని కూడా కోరారు.

స్పీకర్‌కు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాహుల్ సభలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రవర్తనను దేశం ఈసడించుకుంటున్నా, సొంత పార్టీ శ్లాఘించక తప్పదు. అందులో భాగమే, రాహుల్ పార్లమెంట్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని, ఏనాడూ అన్ పార్టమెంటరీ భాష ఉపయోగించలేదని ఆ పార్టీ ఎంపీ గుర్జీత్ సింగ్ వెనకేసుకొచ్చారు. కానీ కాంగ్రెస్‌లోనే, అందులోను ముస్లిం సభ్యుల నుంచి రాహుల్ వ్యవహార సరళి పట్ల సణుగుడు మొదలయిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. పార్టీలో సీనియర్ ముస్లిం నాయకులు షకీల్ అహ్మద్, రషీద్ అల్వీ రాహుల్ ఒక అహంకారి అనే భావిస్తున్నారు. ఆయన ధోరణితోనే బిహార్‌లో 243 స్థానాలు ఉంటే తమ పార్టీకి ఆరు మాత్రమే వచ్చాయని అంటున్నారు. ఇక ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గుండు సున్న రావడానికీ ఇదే ధోరణి కారణమని కూడా వారు భావిస్తున్నారు.

 భారత్ ప్రతిష్టను విదేశాలలో భంగపరచడమే కాదు, లోక్‌సభలో ప్రధాని స్థానాన్ని చుట్టుముట్ట వలసిందని మహిళా ఎంపీలను కూడా రాహులే ప్రేరేపించారని సీనియర్ బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సైనిక దళాల మాజీ ప్రధాన అధికారి జనరల్ నరవణె పుస్తకాన్ని ఇంకా అచ్చు వేయలేదని సాక్షాత్తు ప్రచురణ సంస్థ వెల్లడించిందని, కాబట్టి నరవణె రచన రాహుల్‌కు ఎలా వచ్చిందో ఆయనే చెప్పాలని రవిశsకర్ ప్రసాద్ కోరారు. సిక్కు ఎంపీని ద్రోహి అనడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు ప్రసంగిస్తున్న విలేకరుల సమావేశం లోకి రాహుల్ చొరబడడం మరీ దారుణమని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

రాహుల్ మీద హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ కిశోర్ అభిప్రాయ పడ్డారు. విపక్షనేత మీద ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ దేశంలో అంతర్యుద్ధŠ్దం తీసుకు రావాలన్న దురాలోచనతో ఉన్నారని ఆయన అన్నారు. అతడిని మించిన అబద్ధాలకోరు ఉండరు. ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్న ఆయన మీద చర్య అవసరమేనని, సత్యం కోసం నిర్మించిన ఆలయంలో ఆయన అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు.

సభలో తాను ఏం మాట్లాడదలుచుకున్నారో అదే మాట్లాడతానంటారు రాహుల్. సభా నిబంధనలు ఆయనకు వర్తించవు. అచ్చుకాని పుస్తకం, కేంద్ర రక్షణశాఖ ఇంకా అనుమతించని పుస్తకం గురించి సభలో ప్రస్తావించరాదని స్పీకర్ ఓం బిర్లా రూలింగ్ ఇచ్చినా ఆయనకు పట్టలేదు. ‘నేనేం మాట్లాడాలో మీరే చెప్పండి పోనీ’ అంటూ హెచ్చులకు కూడా పోయారు. బడ్జెట్ మీద తప్ప మరొక అంశాన్ని తేవద్దని స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికాపాల్ పదే పదే శాసించినా రాహుల్ పట్టించుకోలేదు. టీవీల ముందు ఉన్న దేశ ప్రజలు ఏమనుకుంటారో అనేది కూడా ఆయనకు అసలే అనవసరం. అందుకే ఎన్నోసార్లు వాయిదా పడిన తరువాత, అపారమైన ప్రజాధనం దుర్వినియోగమైన తరువాత కూడా ఎట్టకేలకు బడ్జెట్ మీద చర్చ జరగాలని అంతా నిర్ణయం జరిగాక కూడా రాహుల్ ధోరణి మారలేదు. బడ్జెట్ మీద ప్రసంగానికి అవకాశం ఇస్తే, భారత్ అమెరికా ఇంటెరిమ్ వాణిజ్య ఒప్పందం గురించి ఆయన ప్రస్తా వించారు. ఆ సందర్భంలోనే దేశాన్ని అమ్మేశారని, ఇంత సిగ్గులేని పనా అని నిస్సిగ్గుగా అత్యున్నత చట్టసభలో నోరు పారేసుకున్నారు. ఈ సందర్భంలోనే మార్షల్ ఆర్ట్స్ గురించి విశేషజ్ఞానం పార్లమెంట్ ద్వారా జాతికంతటికీ సరఫరా చేయాలని కూడా ఆశించి, అందులో తనకు ఉన్న ప్రవేశం గురించి చాటుకున్నారు. గ్రిప్ (పట్టుకోవడం), చోక్ (గొంతు పట్టడం), ట్యాప్ (ఓడినట్టు ప్రతీక చూపడం) అంటూ చాలా జ్ఞానం పంచారు. ఇది మార్షల్ ఆర్ట్స్‌లో తెలుస్తుందట గాని, రాజకీయాలలో రహస్యంగా ఉంటుందట. హావభావాలతో రాహుల్ చూపిన ఈ ఒక్క విన్యాసానికి దేశంలో లక్షలలో ట్రోల్స్ వచ్చాయి. ఇందులో ఆయన కవి హదయం ఒక్కటే. అలా పీక పట్టుకున్నప్పుడు బరిలో ఉన్న ప్రత్యర్తి ముఖంలో కనిపించే భయం గురించి తనకు తెలుసునని, ఇప్పుడు మోదీలో అలాంటి భయమే ఉందని ఆయన చెప్పదలిచారు. అంటే మోదీ పీక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ఇరుక్కుపోయిందని చెప్పదలిచారు. ఇంకా, బడ్జెట్‌కు ఏమాత్రం సంబంధం లేని ఎపిస్టిన్, అంబానీ, ఆదానీ అందరి పేర్లు ఏకరువు పెట్టారాయన. ఆ తరువాత అమెరికా విధించిన ప్రతీకార సుంకాల గురించి మొదలుపెట్టారు.

జగదంబికాపాల్‌తో ఆయన చేసిన అనవసర ప్రసంగం కూడా చాలా విమర్శల పాలైంది. ఇవాళ స్పీకర్ స్థానంలో మీరు కూర్చున్నారు కాబట్టి,నేను దూకుడుగా వ్యవహరించను అన్నారు రాహుల్.

అందుకు స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల స్పీకర్ బాధ్యతలకు ఓం బిర్లా దూరంగా ఉన్నారు) మీరు నా మాటలు పెడచెవిన పెట్టకుంటే ఆ స్థానంలో (ప్రతిపక్ష నేత) కూర్చోవలసిన అవసరం ఉండేది కాదు అన్నారు. కీలెరిగి వాత పెట్టడం అంటే ఇదే. ఫిబ్రవరి 11న ఎట్టకేలకు ప్రారంభమైన బడ్జెట్‌పై చర్చ సందర్భంగా లోక్‌సభలో ఈ సంభాషణ ఆ ఇద్దరి మధ్య జరిగింది.

బడ్జెట్ మీద మాట్లాడబోతున్న రాహుల్‌కు జగదంబికా పాల్ ఒక విషయం స్పష్టం చేశారు. బడ్జెట్‌కు సంబంధం లేని ఏ విషయాన్ని మీరు ప్రస్తావించరాదు అని స్పీకర్ స్థానంలో ఉన్న పాల్ ముందే చెప్పారు. అదీ పట్టించుకోలేదు.

‘మీరు ఒకప్పుడు మా పార్టీ సభ్యులే. మీ పట్ల మాకు అభిమానం ఉంది. కాబట్టి ఇవాళ నేను దూకుడుగా వెళ్లను’ అన్నారు రాహుల్. అక్కడితో ఆగితే రాహుల్ ఎందుÅ£వుతారు? ‘మీ మనసు అక్కడ (బీజేపీ) లేదని నాకు తెలుసు’ అంటూ మనో విశ్లేషకుడి అవతారం కూడా ఎత్తారు. దీనికి పాల్, ‘నేను అధ్యక్ష స్థానంలో ఉన్నాను. మీరు (రాహుల్) నా మాటలు విని ఉంటే, అక్కడ (విపక్ష స్థానంలో) కూర్చోవలసిన అవసరం ఉండేది కాదు. మీరు నా మాట వినకపోవడం వల్లనే అక్కడ కూర్చున్నారు’ అన్నారాయన. మళ్లీ చెబుతున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సరైన తీరులో వెళ్లండి అని కూడా చురక వేశారు. జగదంబికా పాల్ 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి (యూపీ) గెలిచారు. 2014లో, ఆపై 2019, 2024లలోను బీజేపీ నుంచి గెలిచారు.

స్పీకర్ కార్యాలయంలో

దీనికి ముందు జరిగిన సంఘటన లోక్‌సభ అధ్యక్ష స్థానం మీద కాంగ్రెస్‌కు ఉన్న గౌరవం ఎంతో తెలియచేస్తుంది. స్పీకర్ ఓం బిర్లా చాంబర్‌లోకి చొరబడిన 20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు లోపల ఎంత అప్రజాస్వామికంగా, సంస్కారహీనంగా.. ఇట్లాంటి మాటల కంటే ఎంత గూండాయిజం చేశారో ఫిబ్రవరి 12న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలియచేశారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు. ఒక కాంగ్రెస్ ఎంపీయే చట్టవిరుద్ధంగా చిత్రించిన వీడియో ఇది. స్పీకర్ వైపు వేలు చూపిస్తూ ఒక మహిళా మాట్లాడుతున్నట్టు అందులో స్పష్టంగానే ఉంది. స్పీకర్‌ను వీరంతా దూషించారు, బెదిరించారు అన్న కిరెన్ రిజిజు ఆరోపణలకు తగ్గినట్టుగానే ఆ వీడియో కనిపిస్తున్నది. లోక్‌సభ లోపల, బయట ఒకే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార సరళి ఉన్నది. ఇలాంటి ప్రవర్తన పట్ల ఆ పార్టీ సగర్వంగా భావిస్తున్న దని కూడా ఆయన విమర్శించారు. జనరల్ నరవణె పుస్తకానికి సంబంధించి రాహుల్, కాంగ్రెస్ చర్యల పట్ల స్పీకర్ తీవ్ర మనస్తాపం చెందారని కిరెన్ తెలియ చేశారు. స్పీకర్ చాంబర్‌లోకి చొరబడిన వారిలో ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నా, మిగిలిన సభ్యులను కట్టడి చేయకుండా, ప్రేరేపిస్తున్నట్టు వ్యవహరించారని అన్నారు. కానీ ప్రియాంక తనదైన శైలిలో దీనిని కొట్టి పారేశారు. తాము స్పీకర్ చాంబర్‌లో శాంతియుతంగా తమ ఇబ్బందులు చెప్పుకున్నామని ఆమె సమర్థించు కోవడమే విచిత్రం. తెలిసో తెలియకో మరి, కిరెన్ ఆరోపణకు ఊతం చేకూరే విధంగానే ప్రియాంక వివరణ ఉండడమే వింత. ఒకరిద్దరు కాస్త ఆవేశంతో తమ బాధలు చెప్పుకున్నారు, నేను చివరి వరకు మౌనంగానే ఉన్నాను అని ఆమె చెప్పారు. ప్రతిపక్షం నోరు నొక్కమని స్పీకర్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని కేసీ వేణుగోపాల్ చెబుతున్నారు. రాహుల్ మాటలలో ఎలాంటి తప్పు లేదని, అధికార పక్షం తమ మీద హక్కులు తీర్మానం ప్రవేశపెట్టినా తాము వెరవబోమని కూడా ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

బీజేపీ సభ్యులు కాంగ్రెస్ వైఖరికి కుక్కకాటుకు చెప్పు దెబ్బ తీరులో జవాబు ఇచ్చారు. భారత సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ ఎంఎం నరవణె రాసిన ఫోర్‌స్టార్ డెస్టినేషన్ పుస్తకం గురించి మాట్లాడదలిచిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని (ఫిబ్రవరి 2వ తేదీ, ఆ రోజే రగడకు నాంది) అనుమ తించలేదు. స్పష్టమైన నిబంధనావళి ఆధారంగానే రాహుల్‌కు అనుమతి రాలేదు. తరువాత కాంగ్రెస్ ప్రధానులను, నేతలను విమర్శిస్తూ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబె కొన్ని పుస్తకాల గురించి ప్రస్తావిస్తే, అందుకు అనుమతించడం అంటే స్పీకర్ పక్ష పాతంగా వ్యవహరించినట్టేనని కాంగ్రెస్ ఆరోపణ. ఇక్కడ ఒక అంశాన్ని కాంగ్రెస్ సౌకర్యంగా విస్మరిం చింది. అచ్చుకాని పుస్తకాల ప్రస్తావనను సభ ఆమోదించదు. అచ్చయిన వాటిని అమోదిస్తుంది. రాహుల్ మాట్లాడుతుంటే స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దానిని రాహుల్ తోసిరాజన్నారు. తాను మాట్లాడా లంటే ఎవరి అనుమతి అవసరం లేదని, తన ఇష్టం మేరకు తాను మాట్లాడతానని రాహుల్ చెప్పిన సంగతిని కూడా కిరెన్ గుర్తుచేశారు. స్పీకర్ అనుమతి లేకుండా ఏ సభ్యుడు ప్రసంగించరాదన్నది కనీసం పాటించాల్సిన నిబంధన అని కిరెన్ వ్యాఖ్యానించారు.

ఇంతకీ నరవణె పుస్తక వివాదం ఏమిటి? నిజానికి దీనిని రాహుల్ వివాదంగా మలుచు కున్నారు.ఈ క్రమంలో సభా నిబంధనలు బల య్యాయి. భారత సైనికదళాల మాజీ ప్రధానాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె `ఫోర్‌స్టార్ డెస్టినీ’ పేరుతో పుస్తకం రాశారు. రక్షణ వ్యవహారాలలో అనుభవం ఉన్నవారు ఇలాంటి పుస్తకాలు రాయడం సర్వసాధారణం. భారత్ – చైనా సరిహద్దులలోని గల్వాన్ లోయలో పొరుగు దేశ సైనికులను తిప్పికొట్టి, (2020) మన జవాన్లు సాధారణ పరిస్థితులు తెచ్చారు. కానీ నాడు కాంగ్రెస్, రాహుల్ ఈ ఉదంతం మీద దుర్వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం గల్వాన్ ఘర్షణ మీద నిర్ణయం తీసుకోకుండా సైన్యం మీదకు బాధ్యతను నెట్టేసిందని రాహుల్ ఆరోపిస్తు న్నారు. ఆయన ఈ సమాచారం కోసం ఆధారపడినది మాత్రం కార్వాన్ అనే ఆంగ్ల వారపత్రికలో వచ్చిన వ్యాసం మీదనే. జనరల్ నరవణె పుస్తకంలో కనిపించిన ఒక వాక్యానికి పూర్తిగా వక్రభాష్యం చెప్పిన రాహుల్, మరో అవాంఛ నీయ చర్చకు కారణ మయ్యారు. సరిహద్దుýను కాపాడే సైనికులను నాడు అవమానించి, వారి విజయానికి కారణమైన ప్రభుత్వాన్ని నేడు పార్లమెంట్‌లో దోషిగా నిలిపే యత్నం చేస్తున్నారు.

ఆ పుస్తకం సభలోకి తేవడం, వాక్యాలు చదివే ప్రయత్నం చేయడం వంటి చర్యలకు స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరు ఎంత వారిస్తున్నా, సభా నిబంధనలను గాలికి వదిలి, జనరల్ నరవణె పుస్తకంలోని కొన్ని వాక్యాలను రాహుల్ చదివారు. ఇంకా అచ్చుకాని పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడం నిబంధనలకు వ్యతిరేకమని స్పీకర్, మంత్రులు పదే పదే చెప్పారు. అక్కడి పరిస్థితికి తగిన విధంగా మీరే నిర్ణయం తీసుకోవలసింది అంటూ ప్రభుత్వం తనను ఆదేశిం చిందని జనరల్ నరవణె తీర్పు కూడా ఇచ్చారు. దీనికే మోదీ ప్రభుత్వం సైన్యం మీదకు బాధ్యతను నెట్టివేసి చేతులు దులిపేసుకుందని రాహుల్ భాష్యం వెలగబెడుతున్నారు. రాహుల్ చర్యలో తప్పు లేదంటూ, విపక్షం ఇస్తున్న వివరణ మరీ హేయమై నది. అదంతా ఇది సైనిక వ్యవహారాలలో పారదర్శ కత కోసం ప్రయత్నమట. దేశ అత్యున్నత చట్టసభలో దేశ రక్షణ రహస్యాలను చర్చించడమే అందుకు సరైన పద్ధతట. అవి రక్షణ వ్యవహారాలన్న స్పృహ కూడా లేదన్నమాట.

జనరల్ నరవణె, పుస్తక ప్రచురణకు పూనుకున్న పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఇచ్చిన వివరణ కూడా రాహుల్‌ను చెంపదెబ్బ కొట్టిన విధంగానే ఉన్నాయి. తన పుస్తకం ప్రచురణ గురించి చర్చలు నడుస్తున్నాయని జనరల్ నరవణె ప్రకటించారు. నరవణె రచన ఏ రూపంలోను వెలువడలేదని పెంగ్విన్ ర్యాండమ్ ఫిబ్రవరి 9న వివరణ ఇచ్చింది. అసలు అచ్చుకాని ఈ పుస్తకం రాహుల్ చేతికి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు దీనితో పదును పెరిగింది. ఇది ఇప్పటికే చైనా, సింగపూర్ వంటి దేశాలకు పీడీఎఫ్ రూపంలో వెళ్లిపోయింది. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రఖ్యాత భారత ప్రతిపక్షనేతకు మాట్లాడే అవకాశం ఇవ్వనిది ఈ అంశం మీదనే సుమా! ఇక రాహుల్ మాట చూడండి! పుస్తకం ఇంకా అచ్చుకాకుంటేనేమి? ఇలాంటి ఒక పుస్తకం ఉన్నదీ అని దేశ యువతకు తెలియచేయడానికే పార్లమెంట్‌లో ప్రదర్శించానని భారీ గƒప్పా కొట్టారాయన. ఈ అబద్ధాల కోరును నమ్మి సభలో అల్లర్లకు దిగిన ఎనిమిది మంది ఎంపీలు బహిష్కరణకు గురయ్యారు. బడ్జెట్ చర్చకు సమాధానం ఇవ్వవలసిన ప్రధాని మోదీ మీద ఫిబ్రవరి 4న అవాంఛనీయ చర్యకు దిగడానికి కొందరు ప్రయత్నించారని, అందుకే ప్రధాని సభకు హాజరు కాకుంటే మంచిదని సలహా ఇవ్వవలసి వచ్చిందని స్పీకర్ ప్రకటన కూడా దీని కొనసాగింపు. ఫిబ్రవరి 10వ తేదీన కూడా మరొక ఎనిమిది మంది కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని స్థానం దగ్గరకు వచ్చి రచ్చ చేసి, స్పీకర్‌కు అందిన సమాచారం అబద్ధం కాదని రుజువు చేశారు. దీనికి పరాకాష్ట స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం.

భద్రతాదళాల అధికారులు విలువైన తమ అనుభవాలకు చెందిన వివరాలతో రచనలు చేయడం పాతదే. అవి రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలన తరువాత మాత్రమే అచ్చుకు వెళతాయి.కానీ జనరల్ నరవణె పుస్తకం కొన్ని వెబ్‌సైట్‌లలో, విదేశాలలోను పీడీఎఫ్ రూపంలో ఎలా దర్శనమిచ్చిందో తప్పక దర్యాప్తు చేయవలసిందే. ఈ పని చేసింది అర్బన్ నక్సల్స్ అని ఒక వాదన తెర మీదకు వచ్చింది. అయినా ఇందులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల బాధ్యత ఎంత, ప్రచురణకర్తల సంజాయిషీ వంటివి తప్పనిసరిగా జాతికి తెలియవలసిందే. పైగా రక్షణ రంగం, సరిహద్దులు, అగ్నిపథ్ పథకం, కొన్ని సైనిక, రాజకీయ నిర్ణయాల గురించిన ప్రస్తావనలు ఉన్న పుస్తకం. ఈ పుస్తకాల ప్రాధాన్యం కాదనలేనిది. కానీ వీటికి వక్రభాష్యాలు వెలగబెట్టి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడమే అసలైన ద్రోహం. ఈ ధోరణికి సరైన తీరులో బీజేపీ సభ్యులు వాత పెట్టారు. రాహుల్ జనరల్ నరవణె పుస్తకం లోక్‌సభలో ప్రదర్శించారు. బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబె పలు పుస్తకాల పేర్లు చెప్పారు. మధ్యలో నిశికాంత్ నాలుగైదు పుస్తకాలు సభలో ప్రదర్శించారు. నెహ్రూ కార్యదర్శి మత్తయ్, 1962 నాటి చైనా మీద రాసిన రెండు పుస్తకాలు, నెహ్రూ ఎడ్వినా సంబంధాల మీద ఒకటి ఉన్నాయి. అందులో ఒక పుస్తకాన్ని ఘనత వహించిన నెహ్రూ నిషేధించారు. ఆ పుస్తకాన్ని దూబే చదవడం మొదలుపెట్టారు. అప్పుడు కాంగ్రెస్ సభ్యులకు నిబంధనలు గుర్తుకు వచ్చాయి. దూబేను బహిష్కరించాలని గోల చేశారు. అయితే ఇదే నియమాన్ని మీ నేతకు కూడా వర్తింపచేయడం అనివార్యమని దూబే కీలెరిగి వాత పెట్టారు. ఇది అక్షరాల కుక్క కాటుకు చెప్పు దెబ్బ వ్యూహమే. ఇంకా అచ్చుకానప్పటికీ నరవణె పుస్తకం మీద హక్కులు తమవే కాబట్టి, అందులో ఒక్క వాక్యమైనా తమ అనుమతి లేకుండా వినియోగించుకుంటే చట్ట బద్ధమైన చర్యలు తప్పవని పెంగ్విన్ ఇండియా ప్రకటించింది. అదెలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి. చర్య తీసుకుంటే సరే. లేకుంటే ఈ కుట్రలో, దేశాన్ని బాధించిన ఇంతటి రగడలో ఆ ప్రచురణ సంస్థకీ భాగం ఉన్నట్టే. పార్లమెంట్ సమా వేశాలు ప్రారంభమయ్యే రోజుకి అంతర్జాతీయ మీడి యాలో ఒక వివాదాస్పద వార్తాకథనం ప్రచురించే ఏర్పాటు చేసి, సభా కార్యకలాపాలకు అడ్డంపడే దుశ్చ ర్యను కొన్నేళ్ల పాటు సాగించిన చరిత్ర కాంగ్రెస్‌ది. ప్రతి సందర్భంలోను అవన్నీ అబద్ధాలనే తేలాయి.

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సబ్‌స్టేంటివ్ మోషన్ అంటారని విశ్లేషకులు చెబుతున్నారు. హక్కుల కమిటీ మొదట దీనిమీద నిర్ణయం తీసుకుంటుంది. తరువాత సభలో ఓటింగ్ పెడతారు. అప్పుడే రాహుల్ భవితవ్యం మీద తుది నిర్ణయం జరుగుతుంది. బీజేపీ సభ్యులు ఆరోపించినట్టు ఈ బడ్జెట్ సమావేశాల తొలి భాగంలో రాహుల్ నిస్సం దేహంగా అన్ని హద్దులను చెరిపేశారు. ఏ వ్యవస్థలో అయినా కొన్ని నియమాలు ఉంటాయి. నిబంధనలు ఉంటాయి. అలాంటిది ఒక దేశ అత్యున్నత సభకు ఉండవా? అయిన వాటిని నిరంతరం వ్యతిరేకిస్తానని బాహాటంగా చెప్పడం వ్యవస్థను అత్యంత హీనంగా అవమానించడం కాదని ఎవరైనా అనగలరా? కానీ మొదటి రోజు నుంచి రాహుల్ అదే పనిగా వ్యవహ రించారు. అడుగడుగునా నిబంధనలను తోసిరాజ నడం. స్పీకర్‌ను అవమానించడం, యార్ అంటూ సంబోధించడం. పార్లమెంట్ లోపల ఉప రాష్ట్రపతిని, కోర్టులని, భారత రక్షణదళాలను అవమానించా రాయన. వీటి మీద ఎవరూ ఫిర్యాదు చేయలేరు. సభలో చేసిన విమర్శలు కాబట్టి. కానీ బయట కూడా అదే ధోరణి.

మొదట రాష్ట్రపతి ప్రసంగం మీద మాట్లాడ మంటే రాహుల్, విపక్ష నేత నవరణె పుస్తకం గురించి ప్రస్తావించి రచ్చ రచ్చ చేశారు. ఈ అంశం దగ్గర రాహుల్ వ్యవరించిన తీరు పూర్తిగా నిబంధనలకు విరుద్ధమేనని విశ్లేషకులు నిష్కర్షగా చెబుతున్నారు. అచ్చుకాని ఒక పుస్తకం పట్టుకొచ్చి అందులో వాక్యాలను సభకు వినిపిస్తానని పట్టుపట్టడం అవివేకమే. అది సాధ్యం కాదని స్పీకర్ ఓం బిర్లా రూలింగ్ ఇచ్చారు. స్పీకర్ మాటను లెక్కపెట్టలేదు. ఇక్కడ రాహుల్ ప్రదర్శించినది తిరుగులేని అజ్ఞానమే. ఇలాంటి పుస్తకం లేదా, ఇతర ఆధారం అనుకున్న దానిని సభలో ప్రవేశపెట్టాలంటే ముందుగా అందుకు స్పీకర్ అనుమతి కావాలి. దీనిని ఆథంటికేషన్ అంటారని విశ్లేషకులు అంటున్నారు. ఈ సంగతి రాహుల్‌కు తెలియదనడం ఒక చేదు వాస్తవం. ఆథంటికేషన్ అంటే తాను సభలో ఇస్తున్న సమా చారం వాస్తవమైనదని పూచీపడుతూ స్పీకర్ ఎదుట సంతకం చేయాలి. అది జరగలేదు. నీకు నిబంధనలు తెలియవని స్పీకర్ తీవ్రంగా హెచ్చరించిన తరువాత, సాయంత్రం ఇస్తానని రాహుల్ తప్పించుకున్నారు. దీనితో రాహుల్ సభలో మాట్లాడినదంతా రికార్డుల నుంచి తొలగించడం స్పీకర్‌కు అనివార్యమైంది. ఏమిటి ఫలితం, సభా సమయం వృథా. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా. నరవణె పుస్తకం మీద రాహుల్ అనుసరించిన వైఖరి దాదాపు ఆరు రోజులు సభా కార్య కలాపాల స్తంభనకు దారి తీసింది. నరవణె పుస్తకం మీద నిబంధనలకు విరు ద్ధంగా తమ నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు ఒక వెర్రి అల్లరికి దిగారు. ఏ నిబంధనా వీళ్లకి పట్టలేదు.

తరువాత బడ్జెట్ మీద విపక్ష నేత అంటే, రాహుల్ ప్రసంగించడానికి సమయం కేటాయిం చారు. ఇక్కడ కూడా రాహుల్ మతి చలించినట్టే ప్రవర్తించారు. నిజానికి బడ్జెట్ మీద చర్చను కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ ప్రారంభించవలసి ఉంది. కానీ రాహుల్ లేచి, తాను అత్యవసరంగా రక్షణకు సంబం ధించిన ఒక అంశం సభలో లేవనెత్తాలని అనుకుంటు న్నానని, అవకాశం ఇవ్వాలని మొండి పట్టుపట్టారు. దీనితో శశిథరూర్ కూడా కూర్చున్నారు. స్పీకర్ మాత్రం రాహుల్‌ను అనుమతించ లేదు. తరువాత రాహుల్ వంతు వచ్చినప్పుడు, బడ్జెట్ మాట ఎత్తకుండా భారత్`అమెరికా ఒప్పందాన్ని తూర్పార పట్టే పని మొదలుపెట్టారు. ఈ సందర్భంలోనే ఒళ్లు తెలియకుండా రాహుల్ వాడిన మాట` భారత మాతను అమ్మేశారు. అప్పుడు స్పీకర్ స్థానంలో జగదంబికా పాల్ ఉన్నారు.

ఈ సమావేశాలలో రాహుల్ అనైతిక, అసంబద్ధ వైఖరికి మరొక మచ్చుతునక హర్దీప్ పురీ మీద చేసిన ఆరోపణ. హర్దీప్ పురి పేరు ఎప్‌స్టీన్ పత్రాలలో ఉన్నది కాబట్టి ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని రాహుల్ కోరారు. తీరా హర్దీప్ పురి సభలో వివరణ ఇస్తుంటే, రాహుల్ సభ నుంచి వెళ్లిపోయారు. ఆరోపణలు చేశారు కాబట్టి, హర్దీప్ పురి వివరణ విని తీరాలని స్పీకర్ ఆదేశించినా రాహుల్ పట్టించుకోలేదు.

ఇప్పుడు దూబే ప్రవేశపెట్టిన సబ్‌స్టేంటివ్ మోషన్ 1951లో కాంగ్రెస్ సభ్యుడు ఎస్‌జీ ముడుక్కల్ మీద సాక్షాత్తు నెహ్రూయే తీసుకువచ్చారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ముడుక్కల్ మీది ఆరోపణ` పార్లమెంట్‌లో ప్రశ్న వేయడానికి బొంబాయి వర్తకుల నుంచి అతడు ఆనాడు రూ.1000 వంతున రెండు సార్లు లంచం తీసుకున్నాడు. అతడిని పార్లమెంట్ తొలగించింది. తరువాత 2005లో ఇదే ఆరోపణ మీద ఒక రాజ్యసభ ఎంపీ, 10 మంది లోక్‌సభ ఎంపీల సభ్యత్వాలను రద్దు చేశారు. ఇది ఆజ్‌తక్ చానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ ఫలితం. చివరిది టీఎంసీ సభ్యురాలు మహువా మొయిత్రా మీద పెట్టారు. ఆమె సభ్యత్వం కూడా పోయింది. ఇప్పుడు అదే రకమైన తీర్మానం రాహుల్ మీద ప్రయో గిస్తున్నారు.

ఒకసారి సభ నుంచి మెడ పట్టుకుని గెంటించు కున్న అనుభవం రాహుల్ గాంధీకి ఉంది. అయినా మరొకసారి అందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రతిపక్ష నేతగా ఆయన పక్షమైనా ఆయనను పూర్తిగా గౌరవిస్తున్నదా? అంటే అదీ అనుమానమే. కొన్ని కొన్ని మాటలకు అధికార పక్ష సభ్యులే కాదు, సొంత పార్టీ సీనియర్లు కూడా నవ్వు ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేయవలసి వస్తున్నది. స్పీకర్ మీద ఇంతకు ముందు అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించిన ఘటనలు ఉన్నాయి. కానీ అవన్నీ వీగిపోయాయి. కానీ సభలో సభ్యుని మీద వచ్చిన బహిష్కరణ తీర్మానాలు విజయవంతంగానే పనిచేశాయి. ఇది రాహుల్ గమనించాలి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE