ఆర్‌ఎస్‌ఎస్‌తో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. 1988లో ముంబైలో నా ఆయుర్వేద టీచర్‌ ‌డా. బీఎల్‌ ‌వసిష్ట తాను చురుగ్గా పాలుపంచుకొంటున్న ఒక హిందూ సామాజిక సంస్థను నాకు పరిచయం చేశారు. ఉదయాన్నే నా సూట్‌ ‌కేసు తెరిచి చూస్తే అందులో ఆశ్చర్యం కలిగించే రీతిలో ఖాకీ రంగు షార్ట్‌లు మాత్రమే ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారు ధరించేవి అవే అన్న సంగతి నాకు తెలియకుండానే ఒక షార్ట్‌ను తొడుక్కున్నాను. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సమూహాన్ని కలిశాను. వారిలాంటి దుస్తులను ధరించి వచ్చిన నన్ను చూసి అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు విస్తుపోయారు. ఎలాంటి సందేహం లేదు. కర్మ అంటే ఇదేనేమో అని నాకు అనిపించింది.

నేను కొన్నేళ్ల పాటు శ్రీ అరబిందో, స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదువుకున్నాను కాబట్టి సమాజంలో యోగ-వేదాంత విషయాలకు సంబంధించి ఆ మహానుభావాల అడుగుజాడల్లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ముందుకు సాగుతున్న వైనాన్ని గమనించాను. కాలం గడుస్తున్న కొద్దీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సాహిత్యాన్ని ఒంటపట్టించుకున్నాను. గురూజీ గోల్వాల్కర్‌ ‌రచించిన బంచ్‌ ఆఫ్‌ ‌థాట్స్ ‌చదివాను. ఆ రచన భారత్‌ ‌పట్ల విస్తృతమైన దృక్పథాన్ని అందించింది. శ్రీ అరబిందో తరహాలో స్ఫూర్తిని ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌పై భారీ జరుగుతున్న దుష్ప్రచారం నా దాకా రాకముందే అదృష్టవశాత్తు ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయభాగ్యం కలిగింది. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న కథనాలను చదివినప్పుడు అవి మరీ నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. ఆ క్రమంలో పురాతన చరిత్ర, ఆర్యుల చొరబాటుపై అపోహలు లాంటి అంశాలపై నేకు కూడా పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. కొద్దికాలానికే కేవలం ఆర్య సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కారణానికే ఒక ప్రముఖ భారతీయ వారపత్రిక నన్ను ‘‘పేరొందిన ఫాసిస్టు విలియం ఫ్రాలే’’ అని సంబోంధించింది. అమెరికాలో యోగ, వేదాంతం, నేచురల్‌ ‌హీలింగ్‌, ఎకోలజి బోధించే నన్ను ఇలా సంబోంధించడం నాకు వింతగా అనిపించింది. అతితక్కువ కాలంలోనే భారత్‌లో రాజకీయ వికృతులను అవగతం చేసుకోగలిగాను.
ఆ తర్వాతి కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అనేక సమూహాలు, అనేక మంది నేతలతో పని చేశాను. మరీ ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘ్‌చాలక్‌ ‌కేఎస్‌ ‌సుదర్శన్‌తో నాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఏర్పడింది. దేశమంతటా పర్యటించాను. అనేక ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సమూహాలను కలుసుకున్నాను. ఆ సమూహాల ఎదుట ప్రసంగాలు చేయగలిగాను. దీనికి తోడు, వీహెచ్‌పీతో ఇదే తరహా సంబంధాన్ని ఏర్పరుచుకున్నాను. ఇందులో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి నేను చెబుతున్న విషయాలు నా స్వానుభవం నుంచి వచ్చినవే. శతాబ్ద కాలంగా భారత జాతీయ ఆలోచన ధార, సమష్టి కార్యాచరణకు రూపకల్పన చేయడంలో అత్యంత ప్రభావితం చేసిన సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిలిచింది. ఇక్కడ మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రాజకీయ లేదా విద్యాసంబంధిత లేదా మీడియాకు చెందిన సంస్థ కాదు. అది నూటికి నూరు శాతం సేవాసంస్థ. భారత్‌ ‌వారసత్వ సంపద పరిరక్షణలోనూ, భారతీయ సాంస్కృతిక విలువలను ప్రోత్సహించడంలోనూ, భారతీయ సమాజపు బలాన్ని నిలకడగా ఉంచడం లోనూ ఒక కీలకమైన ఉద్యమంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవహరిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశంలో ప్రతీ ప్రాంతానికి, ప్రతీ వృత్తికి చెందిన ఆలోచనాపరులు, శ్రామికుల నుంచి పుట్టుకొచ్చింది. యావత్‌ ‌భారతావనికి ప్రముఖంగా ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశంలో క్షేత్ర స్థాయిలో అంటే గ్రామాల్లో రోజువారీ కార్యకలాపాలతో అక్కడివారితో సంబంధాలను కలిగి ఉన్నది. అక్కడేం జరుగుతున్నదీ తెలుసుకుంటున్నది.
వేలాది సంవత్సరాల భారతీయ సంప్రదాయా లను పుణికిపుచ్చుకున్న ధార్మిక విలువలు పునాదిగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వెలుగొందుతున్నది. భగవద్గీత సంప్రదాయానికి లోబడి ఒక ఆధ్యాత్మిక మార్గంలో సామాజిక సేవను ఒక కర్మయోగిలా చేసుకుంటు పోతున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వేదాల కాలం నాటి గొప్ప నేతలు, సాధువులు, ఆలోచనాపరులు నుంచి స్వరాజ్య ఉద్యమంలో ఆధునిక గురువుల వరకు ఇలా గొప్ప గొప్ప వారందర్నీ అనుసరిస్తోంది. వారి జాతి, మతం, తెగ, కులం, ఆర్థికపరమైన, సాంస్కృతిక పరమైన నేపథ్యానికి అతీతంగా దేశంలో పౌరులందరి సంక్షేమాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆకాంక్షిస్తోంది. ఏదేని ఒక భావజాలం లేదా సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికన్నా కూడా క్షేత్రస్థాయిలో ఇతరులకు సాయపడటానికే అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. స్వీయ క్రమశిక్షణ, వ్యక్తి నిర్మాణం కేంద్రంగా కార్యాచరణ సాగిస్తోంది. నిస్వార్థమైన సేవను ప్రోత్సహిస్తోంది. ఇతరులను మార్చవద్దు. బదులుగా స్వీయ ఆకాంక్షలను తెలుసుకోవడంలో వారి సాయపడాలని కోరుతోంది.
గత శతాబ్దంలో జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుద్ధరణ దిశగా ఒక పిలుపునకు నిదర్శనంగా భారత స్వరాజ్య ఉద్యమం నిలిచింది. దురదృష్టవ శాత్తూ, స్వరాజ్యం సిద్ధించిన తర్వాత దేశ రాజకీయాలు బ్రిటీషు వారి విభజించు, పాలించు వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఈ విపరీత ధోరణి జాతి ఐక్యతను పణంగా పెడుతూ, సమాజంలో ఒక వర్గాన్ని మరో వర్గంపైకి ఎగదోస్తూ, కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికగా ఓటు బ్యాంకులకు పురుడుపోసింది. ఈ కొరవడిన జాతీయ సమైక్యతకు ఏకీకృతమైన భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలు కారణం కాదు. భారత్‌ ‌సహా యావత్‌ ‌ప్రపంచంలో విఫలమైన పాశ్చాత్య సామ్యవాదము, మార్క్సిజము లకు చెందిన వేర్పాటు దృక్పథాలు కారణమయ్యాయి. భారత్‌లో సోషలిస్టు, లెఫ్టిస్టు మూకలు ఆర్‌ఎస్‌ఎస్‌ను అదేపనిగా కించపరుస్తున్నాయి. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భారతీయ దృక్కోణంతో నెహ్రూ సామ్యవాదం, దాని పాశ్యాత్య దృక్పథాన్ని అంతే ధీటుగా ఎదుర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లేని పక్షంలో భారత్‌లో కమ్యూనిజాన్ని ఎదిరించే శక్తి ఉండేదికాదు. అప్పుడు చైనా, సోవియట్‌ ‌యూనియన్‌లో జరిగినట్టుగా సాంస్కృతిక పతనంతో భారత్‌ ‌సైతం కునారిల్లి ఉండేది.
భారతీయులందరికీ ఒక జాతీయ, సాంస్కృతిక ఐక్యతా శక్తిగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఉం‌ది. అది అనేక దశాబ్దాలుగా యావత్‌ ‌దేశాన్ని జాగృతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. నానాటికి బలపడుతోంది. భారత్‌లో వచ్చే శతాబ్ద కాలానికి తగ్గట్టుగా తనను తాను కొత్తగా మార్చుకుంటూ, తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది. అది గతానికి నీడ ఏ మాత్రం కాదు. కానీ భవిష్యత్తుకు దారి చూపే దీపం. ఆర్‌ఎస్‌ఎస్‌ అటు లౌకిక స్థాయుల్లోనూ, ఇటు ఆధ్యాత్మిక స్థాయుల్లోనూ జాతీయ పురోగతి, అభివృద్ధితో కూడిన నవభారతానికి మార్గం సుగమం చేస్తోంది.


– డా. డేవిడ్‌ ‌ఫ్రాలే,

డైరెక్టర్‌, అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ‌ఫర్‌ ‌వేదిక్‌ ‌స్టడీస్‌

About Author

By editor

Twitter
YOUTUBE