ప్రపంచంలోనే అత్యధిక జనాభా (148 కోట్లు) కలిగిన దేశం భారత్. శరవేగంతో దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన దేశం కూడా. మిగిలిన అంశాలు ప్రాధాన్యం వహిస్తున్నప్పటికి, భారత్ అభివృద్ధి ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. గ్రామాభ్యుదయంతో దేశప్రగతి ముడిపడి ఉందన్నదీ మరొక వాస్తవం. ఆహార అవసరాలకే కాదు, గ్రామ వికాసానికీ, గ్రామీణ యువతకు తగిన ఉపాధి కల్పనకూ, దేశ ఆర్థిక ప్రగతికీ ఇప్పటికి కీలకమైనది వ్యవసాయరంగమే. ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన గత బడ్జెట్‌ల మాదిరిగానే, తాజా బడ్జెట్‌లోను ఇందుకు సంబంధించి స్పృహ సుస్పష్టంగా కనిపిస్తున్నది.
పై వాస్తవాల ఆధారంగానే గత కొన్ని సంవత్స రాలుగా వ్యవసాయరంగానికి ఏటా బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకుపోయేందుకు వీలుగా బడ్జెట్‌లో ఏటా కొన్ని ప్రాధాన్యతా రంగాలను గుర్తించి, వాటికి తగిన కేటాయింపులు జరిపి, ఆయా విశిష్ట విభాగాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇలా సముచిత రీతిన బడ్జెట్ కేటాయింపులు చేయడం, ప్రాధాన్యతా రంగాలతో దిశానిర్దేశం చేయడం వల్లనే నేడు దేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించింది. మన ప్రజల ఆహార అవసరా లను తీర్చటమేగాక, పలు దేశాలకు అవసరమైన ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి చేరడం ముదావహం. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలలోను ప్రగతిని సాధించేందుకు గతంలోను తగిన విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. దీనితో ఆయా పంటల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలు మొదలైనాయి. ఫలితం, ఆయా పంటల్లో స్వయంసమృద్ది సాధించే దిశగా వ్యవసాయం రంగం సాగుతున్నది. ఈ సంవత్సరం బడ్జెట్ (2026-27)లోను వ్యవసాయ రంగవృద్ధినీ, గ్రామీణాభివృద్ధినీ ద్విగుణీకృతం చేసేందుకు దోహదంచేసే విధంగా వ్యవసాయరంగా నికి రూ.1,62,671 కేటాయిం చారు. ఇది గత సంవత్సరం కన్నా 7% (2025-26 రూ. 1,51,853) మిన్న.
పంటల వైవిధ్యంతో పాటు, హెచ్చు విలువ గల పంటల ఉత్పత్తులను పెంపొందించేందుకు వీలుగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపుతో పాటు, అవసరమైన కార్యాచరణ, దిశా నిర్దేశం కనిపిస్తాయి. రైతుల ఆర్థిక పరిపుష్టికి, ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన వ్యూహమిది. గత సంవత్సరపు కేటాయింపులతో పోల్చితే 5.4 శాతం పెంపుతో బడ్జెట్ ఉన్నప్పటికి రివైజ్‌డ్ బడ్జెట్‌లో సూచించిన గణాంకాలను విశ్లేషిస్తే పెరుగుదల గణనీయంగా లేదనే భావించాలి. కాని హెచ్చు విలువలతో కూడిన పంటల విస్తృతికి, అదనపు విలువలతో కూడిన ఇప్పటి ఉత్పత్తులకు అవసరమైన వసతుల కల్పనకు తగిన విధంగా ఈ బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండడం ముదావహం. ఈ కేటాయింపుల వల్ల అధిక విలువలు కలిగిన పంటలకు సమగ్ర సాంకేతిక తను జోడించి, వాటి ఉత్పత్తులను ఉచిత రీతిలో పెంచాలన్న ఉద్దేశం రైతుల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించి నదే. బడ్జెట్‌లో ప్రస్తావించిన పలు అంశాలు క్లుప్తంగా:
– కొబ్బరి ఉత్పాదకతను పెంపొందించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు. ఉప ఉత్పత్తులకు మరింత విలువను తెచ్చేందుకు రైతుల• లాభాలను ఆర్జించేందుకు తగిన ప్రణాళిక(లను) ప్రతిపాదించారు.
– అనువైన ప్రదేశాల్లో జీడిమామిడి, కోకా (Coca) శ్రీగంధం, కొన్ని గింజల (almonds) సాగుకు ప్రోత్సాహకాలు. వాటి ఉత్పత్తులను, ఉప ఉత్పత్తులను పెంపొందించడం.
– పశు సంవర్ధక శాఖలో పలు విభాగాలలో, ఉత్పత్తుల స్థాయి పెంపొందించేందుకు నిధులు, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం హర్షదాయకం. ఈ పక్రియలోనే రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించటం ద్వారా ఆశించిన వృద్ధి జరుగుతుందని ఆశించవచ్చు. ఈ పక్రియలను సముచిత రీతిలో అమలు చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశించవచ్చు.
– పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, ఇతర సేవలను ఇతోధికంగా విస్తరించి, అందజేసే ప్రతిపాదన కూడా చేశారు. తగిన మౌలిక సదుపాయాలు, రుణ సదుపాయంతో కూడిన సబ్సిడీ విధానం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెడ తారు. ఈ సదుపాయాలు కల్పనకు అంతర్జాతీయ సంస్థల సహాయాన్ని, సాంకేతిక సలహాలు తీసుకుంటారు.
– కోళ్ల పెంపకాన్ని విస్తృతం చేసి, ఉద్యోగా వకాశాలను మెరుగుపరిచేందుకు ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహిస్తారు.
– పశువుల ఉత్పత్తులు, కోళ్లు, పాలు వంటి ఉత్పత్తులను, ఉప ఉత్పత్తులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించేందుకు తగిన సిబ్బంది, మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూతనిస్తారు.
– చేపలు, మత్స్య ఉత్పత్తుల వృద్ధికి దేశవ్యా ప్తంగా 500 జలాశయాలను, అమృత్ సరోవరాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో ప్రోత్సహిస్తారు.
– వీటిని మార్కెట్ సదుపాయాలతో జతపరచి, ఔత్సాహిక కంపెనీలను(Start-ups) మహిళా సంఘాలను, చేపల పెంపకం దారుల సంఘాలను అనుసంధానించి, మంచి ఉత్పత్తులను / ఉప ఉత్పత్తులను పెంపొందించినట్టయితే రైతులకు లబ్ది చేకూరుతుంది. ఆయా రంగాల్లో ఉత్పాదకత పెరగడం వల్ల రైతుల ఆదాయం 16 శాతం వరకు వృద్ధి అవుతుందని అంచనా.
– పంట మార్పిడిని, హెచ్చు విలువ గల్గిన పంటల సాగును ప్రోత్సహించి అందుకు సంబంధిం చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రంగా ఉపయోగించుకుని రైతుల• లబ్ది పొందడానికి కొబ్బరి, జీడిమామిడి, కోకా, శ్రీగంధం మొదలైన వాటిని, గింజల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముంద డుగు వేసేందుకు నిధులను కేటాయించాలి.
– ప్రపంచంలోనే కొబ్బరి ఉత్పత్తులకు మన దేశం పెట్టింది పేరు. కొబ్బరి సాగును ప్రోత్సహించే పనిలో ముదిరి, నిరుపయోగంగా ఉన్న చెట్లను మార్చేందుకు సమగ్ర ప్రోత్సాహక పథకాలను అమలుచేస్తారు. సుమారు రూ.350 కోట్ల వరకు ఇందుకు కేటా యింపులు జరిగాయి. తద్వారా ఒక కోటి మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి చేయూతనివ్వాలని సంకల్పించటం హర్షదాయకం. ఇందుకు ఎంపిక కాబోతున్న కోటి మంది కొబ్బరి రైతుల్లో 90% మంది దక్షిణాది రాష్ట్రాల వారే కావటంతో ఈ ప్రాంత కొబ్బరి రైతులను ఆనందింప చేస్తున్నది.
– జీడిమామిడి, కోకా పంటల ఉత్పత్తులలో కూడా గణనీయమైన ప్రగతిని సాధించడం, నాణ్యమైన ఉప ఉత్పత్తులను పెంచి ఎగుమతులను ద్విగుణీకృతం చేసి రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలన్న సంకల్పం కూడా ప్రభుత్వానికి ఉంది.
– మన ఆచార వ్యవహారాలలో కీలకంగా ఉండే, సాగుదారుల కుటుంబాల ఆర్థిక వెసులు బాటుకు ఉపయుక్తమైన శ్రీ గంధం సాగును, విలువలతో కూడిన దేశీయ బ్రాండ్‌లను ప్రోత్సహిం చాలని ప్రతిపాదించడం కూడా స్వాగతించదగిన చర్య.
– వాలనట్స్, ఆల్మోండ్స్, పైన్‌నట్స్ వంటి గింజల సాగును ప్రోత్సహించి రైతు ఆదాయాన్ని పెంపొం దించేందుకు బడ్జెట్ సాయపడుతుంది. అందుకు తగిన సదుపాయాలను కల్పించేందుకు కేటాయింపులు జరగటం సంతోషదాయకం.
– భారత్-విస్తార్ కార్యక్రమం మరొకటి. దీని ద్వారా సేద్యం గురించి, అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి రైతులందరికీ సకాలంలో పరిజ్ఞానం అందించే సమగ్ర సమాచార వ్యవస్థ ఇది. A1 సాంకేతికతను ఉపయోగించి, రైతులతో పలు భాషల్లో సంభాషించి, వారికి అవసరమైన పరిజ్ఞానం అందించేందుకు చర్యలు తీసుకొనడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలు బడ్జెట్‌లో చేర్చడం స్వాగతించవలసిన విషయం. ఇది రైతులకు ఎంతో మేలు చేసేదే. వన్యవసాయ సాంకేతికతను భారత వ్యవసాయ పరిశోధనా మండలి, అగ్రి స్టాక్ సహకారంతో సకాలంలో రైతులందరకి సమాచారాన్ని అందజేసి, ఆచరణలో పెట్టేందుకు సహకరిస్తారు. దీనితో సిబ్బంది పనితనం, చురుకుదనం 46 శాతం పెరిగి, ఉత్పాదక•త గణనీయంగా పెరుగుతుందని అంచనా.
ఇంతవరకు ఆహార పంటలు, పప్పు, నూనె గింజలలో ప్రోత్సహించినట్లు ఇప్పుడు అధిక విలువలు కల్గిన పంటలపై ప్రత్యేక శ్రద్ధ చూపటం వల్ల సన్న చిన్నకారు రైతులు లబ్ది పొందగలరు. ఉద్యాన పంటలు, హెచ్చు విలువల గల పంటల సాగులో హెచ్చుమంది (70% వరకు) సన్న, చిన్నకారు రైతులో ఉండటం మరొక అంశం.
– ఉద్యానవన పంటలైన కూరగాయలు, పండ్లతోటల సాగును ప్రోత్సహించేందుకు గతం నుండి ప్రభుత్వం పలు పథకాలను రూపొందించింది. ఈ నేపథ్యంలో దశాబ్దకాలంలో సాధ్యమైన ఉద్యాన వన దిగుబడి, పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వాటిని పలు ప్రాంతాలకు ఎగుమతులు చేసి ఆదాయం పెంపొందించుకోవచ్చని అంచనా.
– ఈ ప్రతిపాదనలతోపాటు రైతులకు ఉపయుక్తమైన సంక్షేమ పథకాలు :
ప్రధానమంత్రి-కిసాన్ పథకం కేటాయింపులలో (రూ.63500) మార్పులేదు. దీనితో సన్నచిన్నకారు రైతులకు నేరుగా లబ్ది చేకూరుతుంది.
– పశుగణాభివృద్ధి ఆసరా: ఈ రాయితీలు రైతులకు, రైతు ఉత్పత్తిదారు సంఘాలకు, (పాలు/కోళ్ల ఉత్పత్తిదారులకు) అందుబాటులో ఉండి మేలు చేస్తాయి. గ్రామీణులకు ఉపాధి లభ్యత అవకాశాలు మెరుగవుతాయి.
– పంటల బీమా పథకం ద్వారా నష్టపోయిన రైతులు లబ్ధి పొందే అవకాశం మున్ముందు కూడా కొనసాగుతుంది.
– అలాగే భూసార ఆరోగ్యకార్డుల జారీ, తుంపర్ల సాగునీటి పథకం (100 l.ha) మొదలైనవి కొనసాగుతాయి.
పలు పథకాలతో వ్యవసాయాభివృద్ధికి గత బడ్జెట్‌లోను ప్రతిపాదనలు చేశారు. ఆహారధాన్యాల అధికోత్పత్తికి ధన ధాన్య కృషియోజన; పప్పుధాన్యాల ఉత్పత్తికి ఆత్మనిర్భర భారత్, అధికోత్పత్తి వంగడాలకు జాతీయ మిషన్, పత్తి ఉత్పత్తులు పెంచేందుకు ప్రత్యేక పథకం, కూరగాయలు, పండ్ల సాగుకు నూతన పథకం, మఖన్ అభివృద్ధికి (బీహార్‌లో) బోర్డు ఏర్పాటు చేశారు.
యూరియా కొరత నివారణకు బిహార్‌లో కర్మాగారం ఏర్పాటు, పశుపోషణ, డైరీ రంగాల వృద్ధి కొనసాగిస్తూనే, ప్రస్తుతం అధిక విలువలు కలిగిన పంటలు, పశుపోషణ, పాడి, కోళ్ల పెంపకం పథకాలతో పాటు మత్స్యసంపద పెంపు వంటి వాటికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు సూచనలు ఇచ్చేందుకు, A1 తో కూడిన సమాచార వ్యవస్థ ఏర్పాటు ఈ బడ్జెట్‌లో ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ సమాచార సాంకేతిక విభాగాల సహకారంతో పలు భాషల్లో రైతులకు ఆ పరిజ్ఞానం చేర్చి, పథకాలను చిత్తశుద్ధితో ఆచరణలోకి తెచ్చి, ఆయా పంటల ఉత్పాదకత, నాణ్యమైన పద్ధతిలో ఉప ఉత్పత్తులను గణనీయంగా పెంచి ఇటు దేశీయంగాను, అంతర్జా తీయంగాను సరఫరా చేసి, రైతులకు, వ్యవసాయాభి వృద్ధికి, దేశ ఆర్థిక పరిపుష్టికి ప్రతిపాదనలను కొనసాగించిన బడ్జెట్ ఇది.
ప్రొ. పి.రాఘవరెడ్డి
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
మాజీ ఉపకులపతి