సంధ్యా సమయం. ప్రభువులు శ్రీమన్మహామండలేశ్వర కఠారి సాళ్వరాజు పెరుమాళ్లు దర్బారులో ఆశీనులై, చప్పట్లు చరిచారు! తెర తొలగింది. నృత్యం ప్రారంభమైంది- క్షీరసాగర మథనం. అమృత కలశం చేబూని మోహిని.. ఓ వైపు సురులు, మరోవైపు అసురులు. ఆమె నర్తనం అపూర్వం. నవరసాలను ఒలికిస్తున్నది. నిజంగా జగన్మోహిని. కన్నార్పడం లేదు, గుటకలు వేస్తున్నాడు, సాళ్వరాజు. నృత్యం అయిపోయింది.
రాజావారి మనసు చెదిరిపోయింది. నిద్ర, ఆకలి లేవు. సుర గిట్టదు. దుర్భర విరహవేదన, ఆ నర్తకి కోసం. అంత మోహించాడు కాబట్టే అంతఃపురానికి రమ్మని ఆదేశించాడు. క్షణమొక యుగంగా గడుస్తున్నది. ఇంతలో అందెల రవళి. ఆ నర్తకి వచ్చి రాజు ముందు నిలిచింది. ఇంతటి అపూర్వ సౌందర్యరాశిని మునుపెన్నడూ చూడలేదు అన్నాడు రాజు. మందహాసం చేస్తూ ఇకముందు కూడా చూడలేరు అన్నది. సవరం తీసింది. ఆశ్చర్యం ఆమె స్త్రీ కాదు, సారంగపాణి. పదకీర్తనాచార్యుడు.
రాజావారు కంగుతిన్నారు, ఆనక తేరుకున్నారు. ‘మీరు పురుషులా?! ఇంత భ్రాంతి కలిగించిన మీరు మహానటులు’ అంటూ మెడలోని ముత్యాలహారాన్ని బహూకరించాడు. రాణిని పిలిపించాడు, ‘చూశారా మహారాణీ! ఆయన మోహినిగా మారిపోయి మా మనసు దోచుకున్నారు? మా జీవితంలో ఇదొక మధుర ఘట్టం.’ అన్నాడు.
‘నా జీవితంలో కూడా!’ మనసులో అనుకుంది మహారాణి.
గేయాలు, కీర్తనలు రాసేవారినే వాగ్గేయకారు లనీ, పదకర్తలనీ పిలుస్తారు. దక్షిణ దేశంలోని వాగ్గేయకారులలో తాళ్లపాక అన్నమాచార్యుడు, జయదేవుడు, లీలాశుకుడు, నారాయణతీర్ధులు, కంచర్ల గోపన్న, క్షేత్రయ్య, సారంగపాణి ముఖ్యులు. సారంగపాణి జీవితం, పదాల గురించి కొంచెం చర్చిద్దాం.
తెలుగులో పదమే పప్రథమంగా పుట్టింది. పదం అంటే సామాన్యార్థంలో పాట. రాగతాళ సహితమై ఉండవచ్చు. పద కవితా పితామహుడు, సంకీర్త నాచార్యుడని ప్రసిద్ధి పొందిన తాళ్లపాక అన్నమాచార్యుడు సంస్కృతంలో ‘సంకీర్తన లక్షణం’ రచించాడు. తాళ్లపాక వారి కాలంలో సంకీర్తనానికే పదమని వ్యవహారం. దానికే గేయమని, కీర్తన, గీతం అని పేర్లు. దివ్యశక్తిని కీర్తిస్తూ పాడేది కీర్తన లేక సంకీర్తన. ఇలా గేయరూపంలోని కీర్తన భక్తుని హృదయాన్ని పరమాత్ముని పాద సన్నిధికి తీసుకువెళుతుందని నమ్ముతారు. అన్నమాచార్యులతో ఆరంభమైన సంకీర్తన కవిత శృంగార ఆధ్యాత్మిక పదాలుగా రూపు దిద్దుకొని పెద, చిన్న తిరుమాలాచార్యులతో కొనసాగి క్షేత్రయ్యతో సుస్థిరమై సారంగపాణితో విస్తరించింది. శృంగారపదాలకు ప్రసిద్ధులుగా అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి(1680-1750)లను చెప్పుకోవడం పరిపాటి.
సారంగపాణి చిత్తూరు మండలంలోని కార్వేటి నగరం సంస్థానంలో ప్రసిద్ధ వాగ్గేయకారుడు. చెన్నపురి సమీపంలో పొన్నేరులో పుట్టి, కార్వేటినగరంలో స్థిరపడ్డాడు. కార్వేటినగరం ఆంధప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో ఉంది. తిరుపతికి 42 కి.మీ. ఈ ప్రాంతాన్ని 1830లో యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తమ కాశీయాత్రలో భాగంగా కార్వేటి నగరంలోని కనకమ్మ సత్రంలో విడిది చేశారు. ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయం గొప్ప దర్శనీయ స్థలం. ఈ సంస్థానాన్ని నూకరాజు వేంకట పేరుమాళ్ళ రాజు 1717-1732 అతని సోదరుని పుత్రుడు నూకరాజు కార్వేటిరాజు 1733-1752గా పరిపాలన కొనసాగించారు. వారి ఆస్థాన విద్యాంసుడు సారంగపాణి.
సారంగపాణి విద్యాభ్యాసం గురించి అంతగా తెలియదు కానీ, సంస్కృత భాషా కోవిదుడని, సంగీతాభినయాల్లో పరిపూర్ణ జ్ఞానం కలవాడని ఆయన పదాలను బట్టి తెలుస్తున్నది. సారంగపాణి పదాలు అన్న పేరుతో లభించిన కీర్తనలు 201. అందులో క్షేత్రయ్య పదాలు ఆరు చేరాయి. అంటే వాస్తవంగా 195. ఇవి నాలుగు రకాలు. ప్రథమ భాగం శృంగార పదాలు, ద్వితీయ భాగం దేశీయ పదాలు, తృతీయ భాగం జాతీయ పదాలు, చతుర్థ భాగం కీర్తనలు. ఇవి నీతి, వైరాగ్య, తత్త్వ ప్రబోధా లతో ఉన్నాయి. ఆరంభంలో శృంగార పద రచన చేసినా, క్రమంగా ఉత్తమభక్తుడై తాత్వికుడై, నీతి వైరాగ్య తాత్త్విక ధోరణులతో కీర్తనలు రచించాడు. 1731లో నూకరాజు వెంకట పేరుమాళ్లురాజు ఆయనకు దుర్గరాజపురమనే అగ్రహారం దాన మిచ్చాడు. అంత్యదశలో రాజాశ్రయం కోల్పోయి శ్రీనాథుని వలెనే, సారంగపాణి అష్టకష్టాలు అనుభ వించినట్లు రజనీకాంతరావు అభిప్రాయపడడం వాస్తవమనిపిస్తుంది.
‘సారంగపాణి పదాలు’ పేరుతో నేలటూరి సుబ్రహ్మణ్యం విద్యా విలాస ముద్రాక్షరశాలలో 1867లో పుస్తకం ముద్రించారు. ఆ పదాలు ఎంత దూరం ప్రయాణం చేశాయంటే నేడు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతంలో భాగవతులు, సాతాని వారు, వయసులో పెద్దవారు, బిచ్చగాళ్లు, సారంగ పాణి పదాలను భర్తృహరి సుభాషితల్లాగా పాడుకుంటున్నారు.
శృంగార పదాలకు వస్తే 92-పంతువరాళి-ఆది
పల్లవి-వారస్త్రీ నీ పక్కలో యూరకవచ్చునా
అను-తేరకు దొచ్చేనని జూచేవో పోరాపో వేణుగోపాల సారంగపాణి పదాలు (పేజీ-78)
88-పంతువరాళి – చాపు
పల్లవి-నిష్కర్షగా రాత్రికి వచ్చేవాడవైతే నిష్కాలు గొంచు రారా నేనా
అను-ముష్కరి వినను యీ శుష్క ప్రియాలు తురుష్కులు దిగివుండే లష్కర్‌లో నుండి (సా.పి.పేజీ.74).
మండపాక పార్వతీశ్వరశాస్త్రి తన చిన్నతనంలో బొబ్బిలిలో గల వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లగా అక్కడ భాగవతులు పవ్వళింపు సేవలో పదాలు పాడడం విన్నారు. అందులో ఓ ముసలాయన ‘‘లాలనుచు వూచేరు లలన లింపునను, శ్రీల చెన్నలరు నుయ్యాలపాన్పుననూ’’ అని పూర్వకాలపు బాణీతో లాలిపాట పాడుతూ ఉండేవారు. ఆ పాట నాకు చాలా ఆనందం కలిగించేది, రోజూ వింటున్న తనివి తీరేది కాదు. ఆ పాట విందామనే తరుచుగా వెళుతూ ఉండేవాణ్ణి. మా నాయనమ్మ శ్రావ్యమైన కంఠంతో భక్తిరసమైన పాటలు పాడుతూ ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలా-
హరినారాయణ గోవిందా యని
స్మరణ సేయవే ఓ మనసా
పురుషోత్తమ దామోదర కేశవ
భోగి శయన వేణుగోపాల హరి
అనిన్నీ ఎంత పేదవాడే – వేణుగోపాలుడెంత పేదవాడే
అంత పేదవాడు గాకుంటే – అలనాడు కుచేలుని
అటుకులకు చేసాచునా – ఓ చెలులారా
ఎంతపేదవాడే
పండ మంచమే యుంటే భావజ జనకుడూ
పాముపై నిద్రించునా
అనిపాడుతూ ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
పొట్ట నిండితే శౌరి – పొరుగిండ్లు చొరబడి
పొంచి వెన్న మ్రుచ్చిలునా-ఓ చెలులారా
అన్న మాటలు వచ్చే సరికి నా ఒళ్లు గగుర్పొడిచి మరోసారి పాడమనే వాడిని అని రాశారాయన.
శాస్త్రి గారి మనస్సుకు బాగా ఆనంద కలిగించిన పాట.
కఱ్ణపూనుకొని తిరగక మునుపే
కంఠ ధ్వని తగ్గిపోవక మునుపే
అఱ్ఱు ముందరికి వంగక మునుపే
అంగము, తల, వణ కెత్తక మునుపే
హరినామ స్మరణ చేయక వుంటే
అవతల గతి యేమీ–
అప్పు కాపులు కలియక మునుపే
అన్న మొకరు తినిపించక మునుపే
దొప్పలోన చైగడగక మునుపే
దోవతి బరువై తోచక మునుపే
హరినామ స్మరణ సేయకవుంటే
అవతలగతి యేమీ
అని పాడుతూ ఉంటే, ఇంట్లో ఉన్న ముసలమ్మల అవస్థ కళ్లకు కట్టేది.
బొబ్బిలిలో సాతాని ఒకరు అక్షయ పాత్ర పట్టుకొని
అక్షయ పాత్రకు పోతే – కలదని – వొక
భిక్షము వేయరయా – మూల
నిక్షేపము త్రవ్వి నెత్తిన బెట్టేరా
ఈ పాట నాకు చాలా ఆనందం కలిగించేది. ఇందులో ‘నిండు కొన్నదని కొందరు, అరువు, నీయబ్బ తోడని కొందరు’ అనిన్నీ, అలాగే ‘కడుపా నీవింత ఘనమైతివా’, ‘భక్తి లేని వ్రతము లెన్ని చేసిన ఫలము లేదు సుమ్మి’, ‘పాత, కాని వస్త్రములు కట్టిన నేమి కండ్లు మూసుకొని గోణిగిన నేమి, లావుగ తిరుమణి మెత్తిన నేమి లక్ష తులసి నర్చించిన నేమి’ బాగా వినేవార పార్వతీశ్వర శాస్త్రి.
అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య సంకీర్తనలు, పదాలు, కృతులు స్వర సహితంగా కొన్నైనా ముద్రణకు నోచుకున్నాయి. సారంగపాణి పదాలు అందుకు నోచుకోలేదు. ఈ విషయాన్నే రజనీకాంతరావు ఇలా పేర్కొన్నారు. ‘‘కాని క్షేత్రయ్య పదాలు నేర్చుకొని, పరంపరాగతంగా పాడుకొంటూ నేటికి కొందరు మిగిలినట్లుగా, సారంగపాణి పదాలకు అంత ప్రచారం కలిగినట్లు లేదు. దానికి కారణం చిరకాలంలోనే అతనికి రాజాస్థానంలో ప్రాపు లేకపోవడమూ శిష్య పరంపరం లేక పోవడమూ కావచ్చు. అతని పదాలను స్వర ఫణితులనన్వేషించి సేకరించవలసియున్నది. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానములు చొరవ తీసుకోవలసియున్నది. అయితే ఈ విషయంలో శ్రద్ధ వహించి ప్రతీ సంవత్సరం క్రమం తప్పక సారంగపాణి ఉత్సవాలు కార్వేటి నగరం వేణుగోపాలస్వామి ఆలయంలో నడుపుచున్న ఆచార్య పి.వి.అరుణాచలం గారి కృషి అభినందనీయం’ అని రాశారు.
ఇంతకీ ఆయన అంత్యదశ అంత దుర్భరం కావడానికి కారణం-
రాజావారి పిలుపు అనంతరం అక్కడ నుంచి మరొక పిలుపు వచ్చింది. వెళ్లి నిలబడవలసిన ప్రదేశం రాణీవారి అంతఃపురం. రాజావారితో కలసి సారంగపాణిని మోహిని ఆహార్యంలో చూసిన రాణికీ నిద్రలేదు. కలగకూడని కోర్కె కలిగింది మహారాణికి. అంతరంగిక చెలికత్తెతో కబురు పెట్టింది. ఫలితమే సారంగపాణి రాక.
రాజావారు మళ్లీ పిలిపించారని తెలియగానే అమాయకంగా అంతఃపురానికి అడుగుపెట్టాడు సారంగపాణి. ఎదురుగా రాణి, కోర్కెతో కాగి పోతున్నది. కామం కలిపి కళ్లు విచిత్రంగా మండు తున్నాయి. కోర్కె తీర్చమని చెయ్యి పట్టుకోబోయింది రాణి. కాళ్ల మీద పడ్డాడు సారంగపాణి!
‘తల్లీ నీవు రాజుగారి భార్యవి, అమ్మతో సమానము… నీకిది తగదు’ అని బతిమాలాడు.. వాపోయాడు. ఈలోగా రాజావారు రావడం, రాణి ప్లేటు పిరాయించడం.. తనని మోహించి బలవంతం చేయడానికి వచ్చాడని, లేని నేరం మోపడం జరిగి పోయాయి. విచక్షణా రహితుడైన రాజు ముందు వెనుకలు ఆలోచించకుండా, ‘కళాకారుడవు కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను’ అని చెప్పి సారంగపాణి యావదాస్తిని లాగుకొని… కట్టుబట్టలతో దేశ బహిష్కరణ విధించాడు. సారంగపాణి దుర్భర దారిద్య్రం అనుభవిస్తూ… గత్యంతర లేక… పదాలు పాడు కుంటూ ఉంఛవృత్తి చేసుకునేవాడు. ఆయన భిక్షమెత్తి బతికినా… తెలుగుజాతికి అక్షరభిక్ష పెట్టి… సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహాను భావుడు సారంగపాణి.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు