ఆధ్యాత్మిక, యోగసాధనలకు కార్తిక పౌర్ణమి విశిష్టమైనదని,ఆనాటి ధ్యానం, దేవతార్చన విశేష ఫలితాలనిస్తాయని పారమార్థిక సాధకుల భావన. ఆనాడు దీపాలు వెలిగించడాన్ని ‘దేవ దీపావళి’ అంటారు. మహేశ్వరుడు త్రిపురాసు రుడిని సంహరించిన ఉదంతాన్ని స్మరించుకుంటూ ఆనాటి రాత్రి దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ పూర్ణిమను ‘త్రిపురి/త్రిపురారి పూర్ణిమ’ అనీ అంటారు.రోజుకు ఒక్కటి వంతున మూడు వందల అరవై వత్తులను ఆ రోజున శివకేశవుల సన్నిధిలో వెలిగిస్తారు. పున్నమి నాటి వెన్నెల ఆరోగ్యకరమనే భావనతో, ము్య•ంగా కార్తిక పున్నమి నాడు వెన్నెల్లో పరమాన్నం వండుకొని పూజాదికాలు నిర్వర్తించి, ప్రసాదాలు స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

దీపారాధన ద్వారా మనలోని అజ్ఞానం, అహంకారం, ఆగ్రహం, స్వార్థం,అసూయ, ద్వేషం వంటి ప్రతికూల పరిస్థితులు నశిస్తాయని, ప్రత్యేకించి కార్తిక పున్నమి నాడు దీపారాధనతో ఆత్మజ్ఞానం అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. నిత్య దీపారాధన విశేషం కాగా కార్తిక దీపం,అందునా కార్తిక పౌర్ణమి దీపారాధనను సర్వపాపహరం, సకలార్థ సాధకంగా చెబుతారు.

‘దీపదో లభతే విద్యాం దీపదో లభతే శ్రుతం

దీపదో లభతే చాయుః దీపదో లభతే దివమ్‌’

(‌దీపం వెలిగించినవారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులు అవుతారు.మోక్షాన్ని పొందుతారు) అని శాష్ట్రవాక్కు. ఆత్మ చెడు కర్మల నుంచి శుద్ధి పొంది, పరమాత్మతతో అనుబంధాన్ని పెంచు కుంటుందని పెద్దలు అంటారు. ఈ పౌర్ణమి నాడు వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ వత్తులను (గుత్తి వత్తులను) ఆలయాలలో, తులసికోటల వద్ద వెలిగించడం ఆచారంగా వస్తోంది. ‘కారణాంతరా లతో కార్తిక మాసమంతా దీపాలు పెట్టలేకపోయినా, శుద్ధ ద్వాదశి, చతుర్ధశి, పౌర్ణమినాడుదీపం వెలిగించినా కైవల్యం సిద్ధిస్తుందంటారు. శని త్రయోదశి కన్నా కార్తిక పౌర్ణమి వందరెట్లు పుణ్య ఫలితాలను అను గ్రహిస్తుంది’ అని శాష్ట్రం.

దీపారాధనకు సంబంధించి కార్తిక మాసానికి, ఈ నెలలోని పూర్ణిమకు మరింత ప్రాధాన్యం ఉంది.ఆనాడు తప్పనిసరిగా దీపాలు పెట్టడం సంప్రదాయం. దామోదరుడిని కానీ, ఉమాదేవీ సహిత త్య్రంబకమూర్తిని కానీ ఆవాహన చేస్తారు. దీపదర్శనంతో మానవులకే కాక సృష్టిలోని సకల జీవరాశి పాపపరిహారం కావాలని ఆకాంక్షిస్తారు.

‘కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః / దృష్ట్యా ప్రదీపం నచ జన్మభాగినః భవన్తి నిత్యం శ్వపచాహి విప్రాః:’… ఈ దీప(జ్వాలా) దర్శనంతో జనుల పాపాలే కాక కీటకాలు, పక్షులు, దోమలు, వృక్షాల జన్మనివృత్తి కావాలి. నీటిలోని చేపలు, ఇతర జలచరాలు, ఇతర జంతు జాలం పాప నివృత్తి కావాలి’ అని భావం.

పూర్ణచంద్రుడు ప్రకాశించే వేళ..కార్తిక పున్నమి రేయిలో చంద్రశేఖర దర్శనం, అభిషేకం, మారేడు దళాలు, జిల్లేడు పూలతో అర్చనతో విశేష ఫలితాలు సిద్ధిస్తాయంటారు. ఆ రోజున పరమేశ్వర ప్రీత్యర్థం భక్తేశ్వర్‌ ‌వ్రతం పాటిస్తారు. పగలంతా నిరాహారంగా గడపి సాయంత్రం శివుడిని అభిషేకించి, మారేడు దళాలతో అర్చిస్తారు. అరటి దొప్పలలో దీపాలను ఉంచి నీటిలో వదులుతారు. క్షేత్రదర్శనం తరువాత నదీదేవలతకు దీపం వెలిగించి హారతి ఇస్తారు.

జ్వాలాతోరణం

కార్తిక పౌర్ణమి నాటి సాయంత్రం ఇళ్లలో, ఆలయాలలో ఆవునేతితో దీపాలను వెలిగిస్తారు. శివాలయాల ఎదుట జ్వాలాతోరణాలు వెలిగిస్తారు. దీని దర్శనం సరపాపహరణం, అనంత పుణ్యఫలం అని విశ్వసిస్తారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తయిన కర్రలు నాటి, ఆ రెండింటినీ కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు. దానికి ఎండుగడ్డిని చుట్టి చంద్రదర్శనం తరువాత దానిపై నెయ్యి వేసి మంట వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరుల ఉత్సవమూర్తులు అధిష్టించిన పల్లకినీ ఈ జ్వాలా తోరణం కింద నుంచి భక్తులు మూడుసార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణగా వెళతారు. జ్వాలాతోరణంలో ఆహుతికాగా మిగిలిన గడ్డిని సేకరించి పశువుల మేతలో కలుపుకుంటే మంచిదని, తోరణంలో కాలిన గడ్డికి సంబంధించిన భస్మాన్ని నుదుట ధరిస్తే సకల ఐశ్వర్యప్రదం, సర్వరక్షాప్రదమని భావిస్తారు.

జ్వాలాతోరణ సంప్రదాయం వెనుక అనేక పురాణ గాథలు ఉన్నాయి. పాలకడలి మథనవేళ పుట్టిన హాలాహాలాన్ని లోకహితం కోసం స్వీకరించవ లసిందిగా జగన్మాత శివుడిని ప్రార్థించిన సందర్భానికి సంకేతంగా ఈ ఉత్సవం జరుపుకుంటారు. గరళాన్ని గళంలో నిలిపిన పతికి ఎలాంటి హాని కలుగ•కూడ దని, అలా క్షేమంగా బయడపడితే చిచ్చులతోరణం కింద నుంచి నడిచివస్తామని పార్వతీదేవి మొక్కు కుందట. అలా శివపార్వతులు మూడుసార్లు దాని కింద నుంచి దాటి వెళ్లారట. మరో కథనం ప్రకారం, దానవ సంహారానికి వెళ్లిన శివుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో పార్వతీదేవి పతీవియోగ విరక్తితో అగ్ని ప్రవేశానికి సిద్ధంకాగా, శివుడు ప్రత్యక్షమై ఆమె ప్రయత్నాన్ని నివారించాడు. ఆ చితిని జ్వాలా తోరణంగా మార్చి, వారిద్దరు విలాసంగా దానికి మూడుసార్లు ప్రదక్షిణ చేశారు.

అరుణాచలేశ్వరంలో…

తమిళనాడులోని అరుణాచలంలో అగ్నిలింగంగా వెలుగొందుతున్న ఆదిదేవుడి ఉత్సవాలలో కార్తిక పౌర్ణమి నాటి దీపారాధన అత్యంత విశిష్టమైనది. ఈ కృత్తికా దీపోత్సవం జగత్ప్రసిద్ధం. దీనిని ‘కుమార దర్శనం’ అనీ అంటారు. ఆ రోజు వేకువజామున అరుణాచలేశ్వరుడి ఆలయంలో భరణీదీపం, సాయంత్రం ఆరు గంటలకు కొండ శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. అక్కడి పెద్ద రాతిపై గల భారీ ప్రమిదలో నూనె పోసి భారీ వత్తిని వెలిగిస్తారు. కార్తిక మాసంలో కృత్తికా నక్షత్ర వేళ అరుణగిరిపై దర్శనమిస్తానని పరమేశ్వరుడు భక్తులకు అభయమిచ్చారట. అందుకు భక్తిపూర్వక కృతజ్ఞతతతో ఈ మహాదీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హిమాల యాల గుహల్లోని తాపసులు కూడా దానిని సందర్శించి పరవశులవుతారట. పార్వతీమాత శివుడిలో ఐక్యమయ్యేం దుకు అరుణగిరిపై తపస్సు చేసిందని, కార్తిక పూర్ణిమ నాడు ఉజ్వల దీపస్తంభలా ప్రత్యక్షమైన ఆయన అమ్మవారిని ఐక్యం చేసుకున్నాడని పురాణగాథ. శక్తీ, శివుడు ఏకత్వమే అర్ధనారీశ్వర తత్త్వంగా చెబుతారు. ఈ కేత్రంలో ఏడాది పొడుగుతా గిరి ప్రదక్షిణలు ఉన్నా, పౌర్ణమినాడు విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక కార్తిక పున్నమి నాడు భక్త జన సంద్రమే. ఈ క్షేత్రంలో చైత్ర,కార్తిక పౌర్ణమి నాడు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయం రాజగోపురం ఎదురుగా ఆ రెండు రోజులూ పెద్ద మంటలు వేయడం సంప్రదాయం. అదే సమయంలో స్వామి వారిని గిరి వలయ మార్గంలో ఊరేగించడం విశేషం.

దీపదానం

కార్తిక పౌర్ణమినాడు శివకేశవుల సన్నిధిలో దీప•దానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీపదానంతో జ్ఞానం, ఆయుర్వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతా యని, వెయ్యి సోమయాగాలు, అగ్నిష్టోమ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతు న్నాయి. ఈ కాలంలో దీపదానం చేసిన వారి ఆజ్ఞానం పటాపంచలవుతుందని చెబుతారు.

‘ఏకతస్సర్వ దానాని దీపదానం తథైక్తతః

కార్తికే దీపదానస్య కలాంనార్హంతి షోడశీమ్‌’ (‌లోకంలో అన్ని దానాల్లో దీప దానం శ్రేష్ఠమైనది). బియ్యం పిండితో చలిమిడి చేసి, దానిలో వత్తివేసి వెలుగుతున్న దీపాన్ని ఉసిరికాయపై నిలబెట్టి దానం చేస్తారు.బ్రాహ్మణులతో పాటు ముత్తయదువలకు కూడా దీపదానం చేయవచ్చని, ఒకవేళ స్వీకరించే వారు లభ్యంకాని పక్షంలో ఆలయాలలో స్వామి సన్నిధిలో లేదా ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించ వచ్చని పెద్దలు చెబుతారు. దీపదానంతో జ్యోతిర్లిం గాల సందర్శన ఫలితం సిద్ధిస్తుందని ఆర్యోక్తి. శివపాదసేవతో భక్తి భావంతో ఉత్సవం చేయడం ద్వారా అనంత పుణ్యం లభిస్తుంది. ఈ తిథినాడు దీపాల నోము నోస్తారు. ఇది మూడు సంవత్సరాల పాటు కొనసాగించాల్సిన నోము. ఈ మాసంలో అన్న,విద్య, వస్త్ర దానాలు కూడా చేస్తారు.

దేవ దీపావళి

మానవులకు వేడుకు దీపావళి కాగా,దేవతలు జరుపుకొనే దీపోత్సవం దేవదీపావళి. భువిపై పాపవినాశనానికి ఆనంద సూచకంగా దేవతలు దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు. త్రిపురాసురులు అనే దుష్ట రాక్షసులను దునిమి శంకరుడు త్రిపురాంతక రూపంతో లోకక్షేమం చేశాడు.ఆ సందర్భంగా దేవతలు స్వయంగా దీపాలు వెలిగించి ‘పోత్సవం జరుపుకుంటారు.అందుకే దీనికి ‘దేవదీపావళి’ అనే పేరు వచ్చింది. కాశీ విశ్వనాథ క్షేత్రంలో దేవదీపావళి (కాశీ దేవదీపావళి)ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.గ•ంగా ఘాట్‌లు అసంఖ్యాక దీపాలతో ప్రకాశిస్తాయి.

కార్తిక పున్నవి విశిష్టత

కార్తిక పున్నమి శివరాత్రితో సమానమైనదిగా చెబుతారు. హరిహర అభేదకంగా అర్చించడం ఈ మాసం విశిష్టతకాగా,దీనిని పురుషోత్తమ మాసం అంటారు. అందుకే, తిరుమలేశుడు ఉభయదేవేరులతో అరుణాచలేశ్వరుడి మహాజ్యోతిని దర్శిస్తాడట. వేదోద్ధరణకు శ్రీమహా విష్ణువు కార్తిక పున్నమినాడే మత్స్యావతారం దాల్చాడు. బృందాదేవి తులసీ మొక్కగా అవతరించారు. ఆషాఢ పూర్ణిమ నాడు ప్రారంభించిన చాతుర్మాస్య దీక్ష ఈ తిథినాటితో పరిసమాప్తమవుతుంది. తులసి, ఉసిరికి పూజలు చేస్తారు. తులసి విష్ణువుకు అత్యంత ప్రియమైనది, పరదేవతా స్వరుపమని, ఉసిరిలో లక్ష్మీదేవి ఆవాసమై ఉంటుందంటారు. కృష్ణభక్తులు ‘రాసపూర్ణిమ’ ఉత్సవం జరుపుకుంటారు. చాలా ప్రాంతాలలో ఈ తిథినాడు సత్యనారాయణస్వామి వ్రతం జరుపుకుంటారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ ఈ ‌తిథినాడే జన్మించారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE