ప్రపంచ పటం పురిటినొప్పులు పడుతున్నది. ఒక కొత్త దేశం ఆ పటం మీదకు రావడానికి ఘడియలు దాదాపు దగ్గర పడినాయి. దాని పేరు బెలూచిస్తాన్‌. ఏడున్నర దశాబ్దాలుగా స్వాతంత్య్రం కోసం పరితపిస్తున్న బెలూచ్‌లు ఆపరేషన్‌ సిందూర్‌ ఘర్షణ మధ్య ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ బెలూచిస్తాన్‌’ అని తమ దేశం పేరును ప్రకటించారు. తమను పాకిస్తానీలుగా పిలవవద్దనీ, బెలోచ్‌లని సంబోధించాలని కోరుతున్నారు. ఇది పాకిస్తాన్‌ స్వయంకృతాపరాధం. తూర్పు బెంగాల్‌ను అణచివేసి బాంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి పాకిస్తానే ఆస్కారం కల్పించింది.  బెలూచిస్తాన్‌లో అదే పునరావృతమవుతున్నది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బనుంచి ఇంకా తేరుకోని పాక్‌పై బెలూచ్‌ వీరులు తీవ్రస్థాయి దాడులు చేస్తున్నారు. ఇంతకంటే మంచి అవకాశం లభించదన్న రీతిలో వారు అంతిమ పోరాటానికి దిగారు.  ఈ నేపథ్యం లోనే మీర్‌ యార్‌ బెలూచ్‌తో సహా ప్రముఖ బెలూచ్‌ స్వాతంత్య్ర పోరాట వీరులు బెలూచిస్తాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించి ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ బెలూచిస్తాన్‌’గా పేరుపెట్టారు. తమ దేశాన్ని గుర్తించాల్సిందిగా భారత్‌, ఐక్యరాజ్య సమితులను వారు కోరుతున్నారు. పాకిస్తాన్‌ ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ, తమ సార్వభౌమాధికారాన్ని తిరిగి చేజిక్కించుకున్నామన్న సంతోషం వారిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు బెలూచిస్తాన్‌లోకి ప్రవేశించాలని, పాక్‌ సైన్యం వైదొలగాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. బెలూచ్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సెక్రటరీ రజాక్‌ బెలూచ్‌ మాట్లాడుతూ, ఇక ఎంతోకాలం బెలూచ్‌ ప్రావెన్స్‌లో పాకిస్తాన్‌ ఆధికారం చెల్లబోదని సంచలనాత్మక ప్రకటన చేశారు.


మార్చి 11,2025న జఫార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును 36 గంటలపాటు హైజాక్‌ చేయడం ద్వారా బెలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ, పాక్‌ సైన్యంపై ఆధిపత్యం సాధించింది. ఇది వారి పోరాటంలో కీలక ఘట్టం. ఆపరేషన్‌ గ్రీన్‌ బొలాన్‌ పేరుతో పాకిస్తాన్‌ చేపట్టిన ప్రతిచర్య అభాసుపాలైంది. ఇందులో ఉన్న పాకిస్తాన్‌ ప్రాంత పంజాబీలను, సైనికులను ఎంపిక చేసుకుని నిర్దాక్షిణ్యంగా బలోచ్‌ వీరులు చంపారు. దీనితో బెలోచ్‌ వీరుల పోరాట సామర్ధ్యం, పాకిస్తాన్‌ నిస్సహాయత ఒక్కసారిగా ప్రపంచం దృష్టికి వచ్చాయి. ప్రస్తుతం బెలూచిస్తాన్‌లో పాక్‌ సైన్యం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చీకటి పడిన తర్వాత పాక్‌ సైనికులు భద్రతా కారణాల రీత్యా క్వెట్టా (బెలూచిస్తాన్‌ ప్రాంత రాజధాని) నుంచి బయటకు రావడంలేదు. పాక్‌ ప్రజా ప్రతినిధులు కూడా అంగీకరిస్తున్న సత్యమిది. ప్రస్తుతం క్వెట్టా పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలనుంచి ఉదయం 5గంటల వరకు గస్తీ లేదు. బెలూచ్‌ ప్రావెన్స్‌లో 70`80శాతం వరకు భూభాగం పాక్‌ నియంత్రణలో లేదని చెబుతున్న రజాక్‌ బలూచ్‌ భారత్‌, యు.ఎస్‌.ల మద్దతు కోరుతున్నారు. మద్దతు ఆలస్యమైన కొద్దీ, రాక్షసులైన పాక్‌ సైనికుల దారుణకృత్యాలకు హద్దు ఉండదని చెబుతున్నారు. పాకిస్తాన్‌ సైన్యం సగౌరవంగా వెనక్కి వెళ్లాలని లేకపోతే బాంగ్లాదేశ్‌లో మాదిరి కేవలం బూట్లు మాత్రమే మిగులుతాయని హెచ్చరించారు. కొద్దిరోజుల ముందు మీర్‌ యార్‌ బలూచ్‌, బెలూచిస్తాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించడమే కాకుండా, ఇక నుంచి బెలూచిస్తాన్‌ అంటే పాకిస్తాన్‌ కాదని స్పష్టం చేశారు. ఇది సామాజిక మాధ్యమాలలో వైరలైంది. ఇదేకాక బషీర్‌ జెయిబ్‌ నాయకత్వంలో బలూచ్‌ వీరులు పాక్‌ సైన్యం, చైనా ప్రాజెక్టులపై ప్రధానంగా తీవ్రస్థాయి దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ బలూచ్‌ ఉద్యమ నాయకురాలు మారంగ్‌ బలూచ్‌ జైల్లో ఉన్నారు. ఆమె అరెస్ట్‌కు నిరసనగా బెలూచిస్తాన్‌ వ్యాప్తంగా పెద్దస్థాయిలో నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. సర్దార్‌ అక్తర్‌ మెంగాల్‌ వంటి స్థానిక నాయకులు చేస్తున్న ప్రయత్నాలను రజాక్‌ బలూచ్‌ అంగీకరించినప్పటికీ, అంతర్జాతీయంగా కలుగ జేసుకోవడం తక్షణావసర మన్నది వారి ఉద్దేశం. మరో బలూచ్‌ నాయకుడు మీర్‌ యార్‌ బలూచ్‌ మాట్లాడుతూ, దశాబ్దాలుగా వైమానిక దాడులు, బలవంతంగా ఎత్తుకుపోవడం హత్యలకు పాల్పడటం వంటి పాక్‌ సైనికుల దుష్కృత్యాలతో బలూచ్‌ ప్రజలు తీవ్ర అగచాట్లు అనుభవిస్తున్నారని, అయినప్పటికీ స్వాతంత్య్ర కాంక్ష వారిని ముందుకు సాగేలా చేస్తున్నదన్నారు. మీర్‌ యార్‌ బలూచ్‌ మంచి రచయిత మాత్రమే కాదు, బలూచ్‌ హక్కుల కోసం పోరాటం సాగిస్తున్న నేత. తమను పాకిస్తాన్‌ ప్రజలుగా పరిగణించవద్దని ఆయన భారతీయ మీడియాను అభ్యర్థించారు. తమ ప్రస్తావన వచ్చినప్పుడు బెలూచిస్తానీలని పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి ఆగస్టు 11, 1947 నే తాము స్వాతంత్య్రం ప్రకటించుకున్నామన్న సంగతి గుర్తుచేశారు. తాము స్వాతంత్య్రం ప్రకటించు కున్నందున న్యూఢల్లీిలో బలూచ్‌ రాయబార కార్యాలయం ఏర్పాటుకు అనుమతించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించిన తర్వాత ఆయన ‘‘చైనా పాకిస్తాన్‌కు సహాయం చేస్తున్నది. నరేంద్రమోదీజీ మీరు ఒంటరి కాదు. 60మిలియన్ల బలూచ్‌ దేశభక్తుల మద్దతు మీకుంది’’ అంటూ ట్వీట్‌ చేశారు. దేరాభుక్తిలోని వంద గ్యాస్‌ బావులపై దాడులు చేశామని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ వారంలో బలూచ్‌ వీరులు పాక్‌ సైన్యంపై 51 ప్రదేశాల్లో 71 దాడులు నిర్వహించి తీవ్ర నష్టం కలిగించడమే కాదు బలూచ్‌ పట్టణాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇదే సమయంలో పాక్‌ సైన్యం వీరిపై చర్యలను తీవ్రం చేసినా ఫలితం ఉండటంలేదు. బలూచ్‌ వీరులు ప్రస్తుతం చైనా` పాకిస్తాన్‌ ఆర్థిక నడవాపై ఉన్న చైనా ఆస్తులు, ఇంజినీర్లు, చైనా వర్కర్లపై దాడులు కొనసాగిస్తున్నారు. గత నాలుగేళ్ల కాలంలో 62 మంది చైనా వర్కర్లను బలూచ్‌ ఆర్మీ చంపేసింది. చైనా నిర్వహించే గ్యాస్‌పైప్‌లైను ఇటీవల పేల్చివేశారు. గతవారం కలాత్‌ పట్టణాన్ని బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. బలూచ్‌ ఆర్మీ దాడులు ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే 2024లో వీరు నిర్వహించిన దాడుల్లో వెయ్యిమంది పాక్‌ సైనికులు మరణించారు. కేవలం ఒక్క నవంబర్‌ నెలలోనే 68 మంది సైనికుల మరణాలు చోటుచేసుకున్నాయంటే బలూచ్‌ ఆర్మీ ఎంతటి సమన్వయంతో, శాస్త్రీయంగా దాడులు నిర్వహిస్తున్నదీ అర్థం చేసుకోవచ్చు.

తీవ్రస్థాయిలో మానవహక్కుల ఉల్లంఘన

బెలూచిస్తాన్‌లో మానవహక్కుల ఉల్లంఘన తీవ్రంగానే ఉంది. పాక్‌ సైన్యం చట్టానికి విరుద్ధంగా హత్యలు చేయిస్తూ, అసంతృప్త గళాలను దారుణంగా అణచివేస్తోంది. దశాబ్దాలుగా వేలాది బలూచ్‌ మహిళలపై ఆత్యాచారాలు చేసింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణ తీవ్రత వల్ల కలుగుతున్న ప్రతికూల ఫలితాలను బలూచ్‌ ప్రజలు నిస్సహా యంగా అనుభవిస్తున్నారు. ఒకవైపు పేదరికం మరోవైపు సంఘర్షణ వారిని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తున్నాయి. పాక్‌ ప్రభుత్వ దమననీతి వారిని ఎదగనీయడంలేదు. వారి వనరులను కొల్లగొట్టుకు పోతున్న పాకిస్తాన్‌, ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించు కోవడంలేదు. వీరిని పేదరికంలోనే మగ్గేలా చేస్తున్నది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం ద్వారా మాత్రమే తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని బలూచ్‌ ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు భారత్‌ సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నారు.

తొలి అసిస్టెంట్‌ కమిషనర్‌గా హిందూ యువతి

ప్రస్తుతం సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌లో కషిశ్‌ చౌదరి (25) ప్రకంపనాలు సృష్టిస్తున్నారు. మొట్టమొదటి మహిళా అసిస్టెంట్‌ కమిషనర్‌గా నియమితులు కావడం ఈ ప్రకంపనాలకు కారణం. బలూచ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలను పూర్తిచేసిన హిందూ మైనారిటీ వర్గానికి చెందిన ఆమె ఈ పోస్టుకు ఎంపికయ్యారు. చాగాయ్‌ జిల్లాలోని నోష్కి అనే మారుమూల ప్రాంతం ఈమె స్వస్థలం. బెలూచిస్తాన్‌లో చాగాయ్‌ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. పాకిస్తాన్‌లోని పురుషాధిక్య సమాజంలో హిందూ మైనారిటీకి చెందిన మరో యువతి ఈ కీలక పోస్టుకు ఎంపిక కావడం విశేషం. 2022 జులైలో మనేష్‌ రోపెత అనే హిందూ మైనారిటీ వర్గానికి చెందిన యువతి కరాచీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమితులయ్యారు. ఇటువంటి కీలక బాధ్యతకు ఎంపికైన మొట్టమొదటి హిందూ యువతిగా ఆమె పాక్‌లో రికార్డు సృష్టించారు.

బలూచ్‌ల స్నేహశీలత

బ్రిటిష్‌ వలస పాలన కాలంలో పూర్తి సార్వ భౌమాధికారంతో కొనసాగిన దేశమే బెలూచిస్తాన్‌. నిజం చెప్పాలంటే బలూచ్‌ సంస్కృతి, ఇక్కడి ప్రజల పరమత సహనం, స్నేహశీలత వంటి అంశాల గురించిన ఎటువంటి రచనలు లేదా బోధనలు భారత్‌లో కనిపించవు. మత ఛాందస పాకిస్తాన్‌కు పూర్తి విరుద్ధంగా ప్రజల్లో పరమత సహనశీలత అద్భుతంగా ప్రదర్శితమవుతుంది. ప్రముఖ శక్తిపీఠం హింగ్లాజ్‌ మాత దేవాలయం ఉంది. ఇక్కడి గిరిజన ప్రజలు ఈ ఆలయాన్ని ఇప్పటికీ భద్రంగా కాపాడు కుంటూ రావడం విశేషం. ఏటా ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలకు వేలాదిమంది భారతీయ యాత్రికులు హాజరవుతారు. వీరిని ఇక్కడి గిరిజన ప్రజలు ఎంతో మర్యాదగా చూస్తారు. ఆధునిక కాలానికి వస్తే భారత్‌ పరంగా బెలూచిస్తాన్‌ పేరు మొట్టమొదట ప్రస్తావనకు వచ్చింది 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హయాంలో! ‘మేం బెలూచి స్తాన్‌లో ఏ విధంగాను కల్పించుకోవడంలేదు’ అని మన్మోహన్‌ సింగ్‌ నాటి పాక్‌ ప్రధాని యూసుఫ్‌ రాజా జిలానీకి హామీ ఇచ్చారు. అప్పట్లో ఈజిప్టులో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో మన్మోహన్‌ సింగ్‌` గిలానీలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా ‘బెలూచిస్తాన్‌ వ్యవహారాల్లో భారత్‌ ఏవిధంగాను కల్పించుకోవడంలేదు’ అని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

అత్యధిక విస్తీర్ణం

నిజానికి మొత్తం పాకిస్తాన్‌లో బెలూచిస్తాన్‌ విస్తీర్ణం 44%. బెలూచిస్తాన్‌ లేని పాకిస్తాన్‌ను ఊహించలేమని నాటి బ్రిటిష్‌ పాలకులు గుర్తించారు. ఎందుకంటే ఖనిజాలు ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న ప్రదేశమది. కాకపోతే జనాభా చాలా తక్కువ. నాటి బ్రిటిష్‌ పాలకులు భారత ఉపఖండానికి సంబంధించిన భౌగోళిక రాజకీయాలను లండన్‌ నుంచే నియంత్రించేవారు. అయితే తమ వాణిజ్య, వ్యూహాత్మక ప్రయోజనాలకు నాటి సోవియట్‌ యూనియన్‌ నుంచి ప్రమాదం పొంచి వుందన్న భయం బ్రిటిష్‌ పాలకులను పీడిస్తుండేది. ఈ నేపథ్యంలో గిల్గిట్‌ నుంచి బెలూచిస్తాన్‌ వరకు విస్తరించిన పొడవైన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడం వ్యూహాత్మకంగా అవసరమని నాటి బ్రిటిష్‌ సైన్యాధికారి ఆర్‌.సి. మనీ ప్రభుత్వానికి సలహా ఇచ్చాడు. నాటి కాలంలో భారత్‌లో వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పనకు ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాడు. అయితే 1947లో బ్రిటిష్‌ ప్రభుత్వ ఆలోచన మారింది. ముఖ్యంగా బలహీనమైన బెలూచిస్తాన్‌లో తమ బేస్‌ను ఏర్పాటు చేసుకునేదాని కంటే, పాకిస్తాన్‌లో నెలకొల్పితే తమకు చాలా అనుకూలమని భావించారు. ఆ విధంగా బెలూచిస్తాన్‌, పాకిస్తాన్‌లను ముడిపెట్టడం ద్వారా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం తన ప్రయోజనాలను కాపాడుకోవాలని యత్నించింది. ఆ విధంగా బెలూచిస్తాన్‌ తన ప్రత్యేక గుర్తింపును కోల్పోయింది.

1947 నుంచి జరుగుతున్న సంఘర్షణ ఇటీవలి కాలంలో గొప్ప మలుపు తిరిగింది. ప్రపంచ దేశాల దృష్టికి వెళ్లింది. ప్రస్తుతం బెలూచిస్తాన్‌ ఉద్యమం మొత్తం వ్యాపించడంతో పాకిస్తాన్‌కు పెద్ద సమస్యగా మారింది. ఉద్యమాన్ని ఆదిలోనే తుంచడానికి పాకిస్తాన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుత బెలూచిస్తాన్‌ విముక్తి ఉద్యమం అత్యంత ఆధునిక శాస్త్రీయవిధానంలో కొనసాగుతున్నదిగా మేధావులు, నిపుణులు పరిగణిస్తున్నారు. వేలాదిమంది బలూచ్‌లను పాక్‌సైన్యం అపహరించి దారుణంగా హతమార్చి, కుళ్లిపోయిన వారి దేహాలను బయటపెట్టడం ద్వారా భయపెట్టాలని చూసినా బలూచ్‌ ఉద్యమం మరింత బలపడిరదే తప్ప తగ్గిపోలేదు. అఫ్ఘానిస్తాన్‌, భారత్‌లలో పాకిస్తాన్‌ కొనసాగిస్తున్న ఉగ్రవాద చర్యలకు ప్రస్తుత బలూచ్‌ ఉద్యమం ఒక ప్రతిక్రియగా రూపొందింది. బలూచ్‌ ఉద్యమం ఊపందుకోవడానికి ముందు అంటే 1987`1999 మధ్యకాలంలో కశ్మీర్‌లో వేర్పాటు వాద ఉద్యమం పతాకస్థాయిలో కొనసాగింది. అప్పట్లో ఈ కశ్మీరీ ఉద్యమానికి పాకిస్తాన్‌ తన పూర్తి మద్దతు ప్రకటించింది. బలూచ్‌ యువకులను రాడికల్స్‌గా మార్చి కశ్మీర్‌ సరిహద్దులకు తరలించింది. కలత్‌, మస్తుంగ్‌, జమ్రాన్‌, పంజ్‌గూర్‌ ప్రాంతాలనుంచి ఎక్కువ సంఖ్యలో బలూచ్‌ యువకులను రిక్రూట్‌ చేసింది. వీరందరికీ ఐఎస్‌ఐ మతఛాందసత్వాన్ని నూరిపోసి కశ్మీర్‌, అఫ్ఘానిస్తాన్‌ల లోకి జిహాదీ ఉగ్రవాద కార్యకలాపాలకోసం పంపేది. ఈ జిహాదీ పోరాటంలో అధికసంఖ్యలో అసువులు బాసింది బలూచ్‌ యువకులే! వీరి మృతదేహాలను పాక్‌ ప్రభుత్వం వారి స్వగ్రామాలకు పంపేది.

కశ్మీర్‌ సమస్యకు కొంతకాలం విరామం

ఎప్పుడైతే బలూచ్‌ ఉద్యమం ఊపందుకుందో పాక్‌ ప్రభుత్వం దీనిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి, కశ్మీర్‌ సమస్యను కొంతకాలం పాటు పక్కన పెట్టింది. ముఖ్యంగా బెలూచిస్తాన్‌లో మానవహక్కుల ఉల్లంఘన సమస్యలపై అంతర్జాతీయ ఒత్తిడి ఎదుర్కొనాల్సి వస్తుందని కూడా పాక్‌ భయపడిరది. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బలూచ్‌ ఉద్యమానికి మద్దతు ప్రకటించినా, పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించలేకపోయారు. అఫ్ఘానిస్తాన్‌కు కూడా బలూచ్‌ ఉద్యమం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ అది కూడా సంపూర్ణంగా సహాయం అందించ లేని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇదే సయమంలో అమెరికా, నాటో దేశాల ఒత్తిడితో పాకిస్తాన్‌ తాలిబన్లకు మద్దతు కొనసాగిస్తూ, వారికి ఆశ్రయం కల్పించడం మొదలుపెట్టింది.

ఉద్యమం చేస్తున్న బలూచ్‌లు భారత్‌కు సహజ మిత్రులుగా మారారు. ఎందుకంటే ఇద్దరి ఉమ్మడి శత్రువు పాకిస్తాన్‌ కావడమే! గత 23 సంవత్సరాలుగా బలూచ్‌ ఉద్యమం భారత్‌కు ఎంతో మేలు చేకూర్చింది. పాకిస్తాన్‌ తన వనరులన్నింటినీ బలూచ్‌ ఉద్యమంపై కేంద్రీకరించడంవల్ల కశ్మీర్‌ సమస్యను పట్టించుకునే సమయం దానికి చిక్కలేదు. తాలిబన్లను అరికట్టేందుకు యు.ఎస్‌.నుంచి బిలియన్ల కొద్దీ సహాయాన్ని పొందిన పాక్‌, తాలిబన్లకే మద్దతివ్వడం మొదలుపెట్టింది. ఆవిధంగా అఫ్ఘానిస్తాన్‌లో యు.ఎస్‌. ఓటమికి, ఆ దేశ నిధులతోనే తాలిబన్లను ఉసిగొల్పిన దుష్ట చరిత్ర పాక్‌ది. ఫలితంగా అఫ్ఘాని స్తాన్‌లో యు.ఎస్‌. సైన్యాలు పదిమంది తాలిబన్లను హతమారిస్తే, పాకిస్తాన్‌ వారిస్థానంలో మరో 20మంది తనవద్ద శిక్షణ పొందిన వారిని అఫ్ఘాని స్తాన్‌కు పంపేది. కశ్మీర్‌లో మాదిరిగానే ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా పాక్‌ రాజ్యేతర శక్తుల సహాయంతో తన జిహాదీ ఉద్యమాన్ని కొనసాగించింది. ఈ విధంగా పాకిస్తాన్‌ ‘దయ్యాల’ యుద్ధాన్ని కొనసాగించడంవల్ల, అఫ్ఘాన్‌లో యు.ఎస్‌, కశ్మీర్‌లో భారత్‌ పూర్తి విజయాన్ని సాధించలేకపోయాయి. ఈ ఆధునిక కాలంలో యుద్ధాలు గెలవాలంటే ఆధునిక ఆయుధ సంపత్తి వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదన్నది, వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. కేవలం రాజ్యేతర శక్తులదే కీలకపాత్ర!

భౌగోళికంగా కీలకం

 బెలూచిస్తాన్‌ గురించి పూర్తిగా తెలిసినవారు దాన్ని అభిమానించకుండా ఉండలేరు! ఇది భౌగోళికంగా అత్యంత కీలక ప్రదేశంలో ఉంది. మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలను ఇది అనుసంధానిస్తుంది. అదీకాకుండా హార్ముజ్‌ జలసంధికి సమీపంలో గ్వాదర్‌ పోర్టు ఉండటం మరో కీలకాంశం. ప్రపంచం మొత్తం మీద చమురు రవాణాలో 20% ఈ జలసంధి గుండానే సాగుతుంది. 21వ శతాబ్దంలో వివిధ దేశాలకు రక్షణపరంగా పోర్టులు కీలకపాత్ర పోషించడం మొదలైంది. బెలూచిస్తాన్‌, సింధ్‌ ప్రాంతాలు లేకపోతే కజకిస్తాన్‌, తజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌ దేశాల మాదిరిగా పాకిస్తాన్‌ కూడా సముద్ర తీరప్రాంతం లేకుండా, చుట్టూ భూ పరివేష్టిత ప్రాంతంగా మిగిలిపోయివుండేది. ప్రస్తుతం పాకిస్తాన్‌, చైనాతో కలిసి బెలూచిస్తాన్‌ను పూర్తిగా దోపిడీ చేస్తోంది. ఇక్కడి గ్వాదర్‌ పోర్టు ద్వారా అరేబియా, హిందూమహాసముద్ర ప్రాంతాలను పాకిస్తాన్‌ పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా గ్వాదర్‌లో ‘జివానీ నౌకా స్థావరాన్ని’ నెలకొల్పుతోంది. అంతేకాదు బెలూచిస్తాన్‌లో ఒక సైనిక స్థావరాన్ని నెలకొల్పి ఇక్కడే తిష్టవేయాలని చూస్తున్నది. ఆ విధంగా భారత్‌ను దిగ్బంధించి, ఈ ప్రాంతం నుంచి యు.ఎస్‌.ను పూర్తిగా తరిమివేయాలన్నది చైనా బృహత్‌ ప్రణాళిక. ఇందులో భాగంగానే గ్వాదార్‌లో 50వేలమంది చైనీయులకు నివాసాలు ఏర్పాటు చేసింది. అదేవిధంగా మరో 200మిలియన్ల మంది చైనీయులు, పంజాబీలకు బెలూచిస్తాన్‌లో స్థిరనివాసాలు కల్పించింది. ప్రస్తుతం బెలూచిస్తాన్‌ ఆర్మీ సభ్యులు పంజాబ్‌ ప్రాంత సైనికులు లేదా వ్యక్తులు కనిపిస్తే హతమారుస్తున్నారు. 1947లో పంజాబ్‌ సైన్యం బెలూచిస్తాన్‌పై దాడిచేసి పాకిస్తాన్‌లో కలిపేసింది. ఆ కోపం ఇప్పటికీ బలూచ్‌లల్లో చల్లారలేదన్న సంగతి ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ భారత్‌ సిందూర్‌`3 ఆపరేషన్‌ చేపడితే బెలూచిస్తాన్‌ పూర్తిగా పాక్‌నుంచి విడిపోవడం ఖాయం.


ఖనిజ  వనరులు  పుష్కలం

నేడు మొత్తం పాకిస్తాన్‌లో ఉత్పత్తి అయ్యే సహజవాయువులో 36% బెలూచిస్తాన్‌నుంచే లభిస్తుంది. బొగ్గు, రాగి, బంగారం, వెండి, ప్లాటినం, అల్యూమినియం, యురేనియం నిక్షేపాలు బెలూచిస్తాన్‌లో అపారం. రెకో డిక్‌, సెయిన్‌డాక్‌, సూయి, చామలాంగ్‌ ప్రాంతాల్లో రాగి, బంగారం, సహజవాయువు, బొగ్గు ఇతర ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి. ఛాగై జిల్లాలోని రెకో డిక్‌లో రాగి గని ఉంది. ఇక్కడ 54 బిలియన్‌ పౌండ్ల రాగి, 41 మిలియన్‌ ఔన్స్‌ల బంగారం ఉన్నదని అంచనా. మరి ఈ వివరాలన్నింటిని పరిశీలిస్తే, బెలూచిస్తాన్‌ లేకపోతే పాకిస్తాన్‌ విలువ ‘జీరో’! జిన్నా దగ్గరినుంచి తర్వాత పాక్‌ను పాలించిన వారు, బెలూచిస్తాన్‌ ప్రజలు నిరంతరం పేదరికంలో ఉండేవిధంగా తమ జిమ్మిక్కు రాజకీయాలు  కొనసాగించారు. ఇక ఫుట్‌బాల్‌ ఆట గురించి ప్రస్తావించాల్సి వస్తే బెలూచిస్తాన్‌ తప్పక గుర్తుకువస్తుంది. బెలూచిస్తాన్‌కు చెందిన మక్రాన్‌ యునైటెడ్‌, మక్రాన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లు కేరళలోని కోజిక్కోడ్‌లో నిర్వహించిన ‘సెయిట్‌ నాగ్జీ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌’లో పాల్గొనడం విశేషం. మలబార్‌ ప్రాంతంలోని ఫుట్‌బాల్‌ ప్రేమికులు, బలూచిస్తాన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లను గొప్పగా అభిమానిస్తారు.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE