తన గాత్రంతో నాస్తికుడిని కూడా ఆధ్యాత్మిక, అలౌకిక భావనలో ముంచెత్తిన మహా సంగీతకారిణి ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి. ఆమె పాట వినని వారు మన దేశంలో అరుదుగానే ఉంటారు. ఆమె పేరు తెలిసినా, తెలియకపోయినా ఆమె గాత్రం మాత్రం పిల్లలు సహా అందరికీ పరిచితమే. అంతటి మహాకళాకారిణి, సంగీత కళానిధి అయిన ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి 20వ శతాబ్దపు అతిపెద్ద బూటకమని, సెయింట్లీ బార్బీ బొమ్మ అని  అవమానిస్తే, సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ  ఆగ్రహావేశాలు కలగడం సహజమే. వామపక్ష సంగీతకారుడు టి.ఎం. కృష్ణ ఆమెను తక్కువ చేసి మాట్లాడి, తన గొప్పదనాన్ని ప్రదర్శించు కోవాలనుకొని, అంతిమంగా చతికిలపడ్డాడు.

చెన్నైలోని మ్యూజిక్‌ అకాడెమీ టిఎం కృష్ణకు ప్రతిష్ఠాత్మక సంగీత కళానిధి అవార్డు ఇవ్వాలని ప్రకటించినప్పటి నుంచీ సంగీతకళాకారుల్లో అసంతృప్తి ప్రారంభమైంది. అకాడెమీ ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన గానకోకిలను అవమానించిన వ్యక్తికి అవార్డు ఎలా ఇస్తారంటూ అనేకమంది కళాకారులు ప్రశ్నించి, కృష్ణతో కలసి కచేరీలు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ఈ క్రమంలోనే అతడికి ఆ అవార్డు ఇవ్వడానికి వీలు లేదంటూ ఎమ్మెస్‌ మనుమడు వి. శ్రీనివాసన్‌ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ పై మద్రాసు హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి పేరిట ప్రతిష్టాత్మక మ్యూజిక్‌ అవార్డు  కృష్ణకు ఇవ్వడానికి వీలులేదంటూ పేర్కొంది.

అకాడెమీ అవార్డు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు కానీ, దానిని ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి పేరిట ఇవ్వడానికి వీలులేదని జస్టిస్‌ జి. జయచంద్రన్‌ తన తీర్పులో స్పష్టం చేశారు. అటువంటి చర్య ఆమె కోరికను, ఆదేశాలను ఉల్లంఘిస్తుందని ఆయన పేర్కొన్నారు. కృష్ణకు ఆ అవార్డు ఇవ్వడం అంటే, ఆమె బహిరంగంగా కోరుకున్న దానికి వ్యతిరేకంగా వెళ్లడమేనంటూ ఆమె మనుమడు వాదనతో కోర్టు ఏకీభవించింది. తన పేరు మీద ఎలాంటి స్మారక చిహ్నాలు, ట్రస్టులు లేదా ఫౌండేషన్లను ఏర్పాటు చేయవద్దంటూ ఆమె రాసిన విల్లులో కోరిన కోరికను గౌరవించాలని పేర్కొంది.

కాగా, కృష్ణకు అవార్డు ప్రదానాన్ని సవాలు చేస్తూ శ్రీనివాసన్‌ వేసిన పిటిషన్‌ను  తిరస్కరించాలని మ్యూజిక్‌ అకాడెమీ దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు తోసి పుచ్చింది. సుబ్బులక్ష్మి వారసత్వాన్ని నిజంగా గౌరవించినవారెవరూ కూడా ఆమె కోరికలకు వ్యతిరేకమైన చర్యలు చేపట్టరంటూ జస్టిస్‌ జయచంద్రన్‌ తన తీర్పులో పేర్కొనడం విశేషం. ‘‘ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి పట్ల నిజమైన గౌరవం ఉండి, ఆమె కోరిక ఏమిటో తెలిసివారు ఎవ్వరూ ఆమె పేరుతో అవార్డు ఇవ్వడాన్ని కొనసాగించరు/రాదు’’ అని ఆయన అన్నారు.

సుబ్బులక్ష్మి విల్లులో లబ్ధిదారుడైన శ్రీనివాసన్‌ను గుర్తిస్తూ, అతడు అవార్డు ప్రదానాన్ని సవాలు చేసేందుకు హక్కు కలిగి ఉందని కోర్టు భావించింది. అంతేకాకుండా, మరణించిన ఆమె కోరికలను, సెంటిమెంట్లను ‘నిజంగా, నిజాయితీగా గౌరవించే వారు, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన అవార్డులను అందుకోకూడదు,’ అని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి పేరు ఉపయోగించకుండా అవార్డును ప్రదానం చేయడాన్ని పరిగణించ వలసిందిగా మ్యూజిక్‌ అకాడెమీని కోర్టు ఆదేశించింది. తద్వారా కీర్తిశేషురాలైన గాయనీమణి వారసత్వం నుంచి టిఎం కృష్ణ సాధించిన విజయాలను విడిగా గుర్తించవలసిందిగా పేర్కొంది.

టిఎం కృష్ణ ఎమ్మెస్‌ గురించిన వ్యాఖ్యలు అత్యంత అవమానకరంగా ఉండటమే కాదు, ఆమె కుటుంబానికి అత్యంత వేదనను కలిగించాయని, ఈ క్రమంలో కృష్ణకు ఆమె పేరిట ఏర్పాటు చేసిన అవార్డు ప్రదానం చేయడం అసమంజసం అని శ్రీనివాసన్‌ కోర్టులో వాదించాడు. కాగా, అవార్డుకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, అవార్డు అందుకునేవారి ఎంపికలను గవర్నింగ్‌ బాడీ ప్రభావితం చేయదని మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడెమీ నిస్సిగ్గుగా వాదించింది. అవార్డును స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకూ సుబ్బులక్ష్మి కుటుంబం అభ్యంతరాలను తెలపలేదని కూడా అకాడెమీ స్పష్టం చేసింది.

2005లో ఏర్పాటు చేసిన ఈ అవార్డును ప్రతి ఏడాదీ మద్రాసు సంగీత అకాడెమీ ప్రదానం చేసే అత్యున్నత అవార్డు సంగీత కళానిధితో పాటు కలిపి ఇస్తారు.

  • జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE