వైద్యుడిని నారాయణ స్వరూపంగా (‘వైద్యో నారాయణో హరిః’) భావించడం మన సంప్ర దాయం. ఆ ఆది వైద్యుడే ధన్వంతరి. శ్రీమన్నారాయ ణుడి 21 అవతారాల పరంపరంలో ఆయనది పన్నెండవదిగా చెబుతారు. క్షీరసాగర మధన వేళ వెలువడిన హాలాహలం, కల్పవృక్షం, ఐరావతం, కామధేనువు, ఉచ్ఛైశ్రవం, శ్రీమహాలక్ష్మి తదితరాలలో ధన్వంతరి ఉన్నారు. సాక్షాత్తు శ్రీహరి అంశంతో శంఖుచక్రాలు,ఓషధులు, అమృతకలశం ధరించి చతుర్భుజాలతో ‘ఆదివైద్యుడు’గా ఉద్భవించాడు. సముద్ర జలాలపై నిలిచి తనను అర్చిస్తుండగా, ‘అబ్జుడు’ అని నామకరణం చేశాడు హరి. అతను విష్ణుదేవుని అంశ వలన పుట్టిన వాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని గ్రహించిన బ్రహ్మాదులు ‘ధన్వంతరి’’అని వ్యవహరిం చారు. ధన్వంతరి అంటే ఆరోగ్య దేవత అని అర్థం. పతంజలి ఆయన అంశ అని పెద్దల మాట. ఆహారం, నిద్ర వ్యవహారాలలో మితం పాటిస్తూ, యోగాభ్యాసం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని పతంజలి యోగశాస్త్రం చెబుతోంది.

ఆయుర్వేద వైద్యం తెలిసిన మహా మేధావి ధన్వంతరి, దేవతలకు వైద్యుడు. వారికి అజరామర మైన అమృతాన్ని అందించిన ఆయన మానవులకు జరావ్యాధి మరణాలు నివారించే ఔషధాలను ప్రసాదించాడు. చెట్ల వేర్లు, కాండం, ఆకులు, పూవులతో అనేక ఔషధాలు తయారుచేశాడు. జలుబు, జ్వరం లాంటి చిన్న చిన్న అనారోగ్యాలు మొదలు పక్షవాతం, కామెర్లు, రాచపుండు (కాన్సర్‌) లాంటి అనేక పెద్ద వ్యాధుల నివారణకు మందులు కనిపెట్టాడు. పసుపును క్రిమిసంహారిణిగా (యాంటీ బయాటిక్‌) ఉపయోగించాడు. ప్రపంచంలోనే తొలి శస్త్ర చికిత్స చేసిన ఘనత ఆయన సొంతం. ఆనాడే ధన్వంతరి ప్లాస్టిక్‌ సర్జరీ చేసినట్లు చెప్పే కథనాలు అనేకం ఉన్నాయి.

ధన్వంతరి వైద్య విధానాన్ని, అందులోని సూత్రాలను ఆయన శిష్యులు పాటించేవారు. యుద్ధ సమయంలో గాయపడినవారికి తక్షణ చికిత్స అందించేవారు. అవసరమైనవారికి శస్త్ర చికిత్స చేసేవారు. ఇప్పటిలా సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందక ముందే, అత్యాధునిక వైద్య పరికరాలు అమరకముందే ధన్వంతరి శస్త్రచికిత్స అబ్బురపరిచే అంశంగా నేటి వైద్య నిపుణులే చెబుతారు.

బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, సూర్యుని వద్ద ధన్వంతరి ఆయుర్వేదం నేర్చుకున్నట్లుగా తెలుస్తోంది. సూర్యుని 16 శిష్యుల్లో ఆయన ఒకరు.తాను ఆర్జించిన విద్యతో ఎందరికో ప్రాణం పోశాడు. ఒకసారి శిష్యబృందంతో కైలాసం వెళుతున్న ధన్వంతరిపై తక్షకుడు (సర్పం)విషం చిమ్మడంతో ఒక శిష్యుడు మూర్ఛపోయాడు. ధన్వంతరి తన వనస్పతి ఓషధితో శిష్యుడు తేరుకునేలా చేయగా, మరో శిష్యుడు తక్షకుడి తలపై గల మణిని లాగి కిందకు కొట్టాడు, ఆ సమాచారం తెలిసిన సర్పరాజు వాసుకి పెద్ద సంఖ్యలో సర్పాలను పంపగా, అవి విషం చిమ్మాయి. ఆ ప్రభావంతో అస్వస్థు లైన వారికి ధన్వంతరి వనస్పతి ద్వారా స్వస్థత చేకూర్చి సర్పాలు మూర్ఛిల్లేలా చేశారు. ప్రతిగా వాసుకి, శివుని శిష్యురాలు సర్వదేవత మానసాదేవిని పంపి ధన్వంతరి శిష్యులను పడగొట్టగా, ధన్వంతరి తన విష నివారణ విద్య ద్వారా వారిని సజీవులను చేశారు. ఆగ్రహించిన మానసాదేవి ఆయనపై త్రిశూలం విసరబోగా బ్రహ్మ రుద్రులు ప్రత్యక్షమై ఆమెను శాంతపరిచారు.

‘మీ అంశంతో పుట్టిన వాడిని కనుక యజ్ఞ భాగాన్ని పంచండి’ అన్న ధన్వంతరి విన్నపాన్ని విష్ణువు మృదువుగా తిరస్కరిస్తూ, ‘నీవు దేవతల తరువాత జన్మించావు కనుక వారిలా పరిగణంచలేం. యజ్ఞభాగాన్ని దేవతలందరికి పంచేశాను. పునర్జన్మలో గర్భస్థ శిశువుగానే అనిమా, గనిమా జ్ఞానం పొంది, దేవతాంశంతో జన్మించి ఆయుర్వేద గ్రంథం రాస్తావు’ అని వరమిస్తాడు.

కేరళలో, గురువాయూర్‌- త్రిస్సూర్‌ మధ్య ‘నెల్లువాయ’ అనే గ్రామంలోని ధన్వంతరి ఆలయాన్ని చాలా మంది ఆయుర్వేద వైద్యులు చికిత్స వృత్తి ప్రారంభానికి ముందు దర్శిస్తుంటారు. దూరప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆయనను విష్ణుసహస్రనామ పారాయణంతో అర్చించి, ‘ముక్కుడి’ అనే ప్రసాదాన్ని నివేదిస్తారు. ఈ స్వామిని సేవించిన వారు ఉదర వ్యాధుల నుంచి విముక్తులవుతారని ప్రజల విశ్వాసం.ఆ రాష్ట్రంలోనే కాలికట్‌ పరిసరా లలో, తమిళనాడు శ్రీరంగంలోని రంగనాథ ఆలయ ప్రాంగణంలో, కర్ణాటకలో బెంగళూర్‌ యశ్వంత పురలో, ఆంధ్రప్రదేశ్‌లోని చింతలూరులో ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి. శ్రీరంగంలో గరుడవాహన భట్టార్‌ అనే ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఈ మూర్తిని ప్రతిష్ఠించి నట్లు సాధారణ శకం 12 వ శతాబ్ది నాటి శాసనం బట్టి తెలుస్తోంది. ఆ ఆలయంలో కొన్ని మూలికల రసం (కషాయం) తీర్థంగా ఇస్తారు. ఢల్లీిలోని ‘‘ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం’’ (Central council for Research in Aurveda and Siddha)లో, వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం ప్రదర్శన శాలలో ధన్వంతరి విగ్రహాలు ఉన్నాయి.,

ధన్వంతరి తన వైద్య విధానాన్ని కాయచికిత్స, బాలచికిత్స, గ్రహ చికిత్స, శలాకృతంత్ర, శల్యతంత్ర, విషతంత్ర, రసాయన తంత్ర,వాజీకరణ తంత్ర..అని ఆయుర్వేద వైద్యాన్ని ఎనిమిది భాగాలుగా విభజిం చాడు. ఇవి మనిషి సర్వావయవలకూ వచ్చే వ్యాధుల గురించి చర్చించాయి. అంటే మనిషిని పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉంచగలిగే సంపూర్ణ వైద్యవిధా నాన్ని ఆయుర్వేదం ద్వారా అందించారు ధన్వంతరి. అందుకే ఆయనను ఆయుర్వేద స్రష్ట- అపర నారాయణ స్వరూపుడుగా శ్లాఘిస్తారు.

‘అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృతః

రోగాన్‌ మే నాశయాశేషాన ఆశు ధన్వంతరే హరే’

– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి

About Author

By editor

Twitter
YOUTUBE