జూన్‌ 12 ‌ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినం

నేటి బాలలే రేపటి పౌరులు.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ నినాదం వినపడుతూనే ఉంది. దీనిని సాకారం చేయడానికి ప్రభుత్వాలు, పాలకులు, స్వచ్ఛంద సంస్థలు, కొన్ని ప్రైవేట్‌ ‌సంస్థలు, సమాజంపై అనురక్తి గల కొంతమంది పౌరులు పాటుపడుతూనే ఉన్నారు. అయితే ఈ ప్రయత్నాలు నేటికీ పరిపూర్ణం కాలేదు. ఫలితంగా బాధ్యతాయుతమైన రేపటి పౌరులు కావాల్సిన బాలలు బాలకార్మికులుగా మిగిలిపోతున్నారు. అక్షరాస్యతకు దూరమవుతున్నారు. తల్లితండ్రుల ఆలనపాలనకు నోచుకోలేకపోతున్నారు. పోషకాహారానికి దూరమవుతున్నారు. పలకా బలపం పట్టాల్సిన చేతులు పలుగులు, పారలు పడుతున్నాయి. అందమైన బాల్యం వారికి అందనంత దూరంలో ఉంటోంది. కొన్ని సందర్భాల్లో అవాంఛనీయశక్తులుగా వక్రమార్గం పడుతున్నారు. కొంతమంది సంఘ విద్రోహశక్తులుగా మారుతున్నారు. దీనివల్ల వారి జీవితాలు దారితప్పుతున్నాయి. కొంతమంది జీవితాలు మధ్యలోనే ముగిసిపోతున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులన్న నినాదం సాకారమైతే వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి సమాజ ప్రగతికి దోహదపడతారు. తద్వారా సమాజానికి తమ వంతు మేలు చేసినవారవుతారు. అందువల్ల నేటి బాలలను రేపటితరం బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ తమవంతు పాటుపడాలి. ఇది ప్రభుత్వాలు, పాలకులకు సంబంధించిన విషయం అని, తమకు సంబంధం లేదని ఎవరైనా భావిస్తే పొరపాటవుతుంది.

ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ పరిస్థితిని నివారించేందుకు తన వంతుగా కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐరాస అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌.ఒ-ఇం‌టర్నేషనల్‌ ‌లేబర్‌ ఆర్గనైజేషన్‌) 2002‌లో ఒక అడుగు ముందుకేసింది. అప్పటి నుంచి ఏటా జూన్‌ 12‌వ తేదీని అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినంగా గుర్తించింది. ఈ సంద ర్భంగా ఏటా ఒక ప్రత్యేక నినాదాన్ని తీసుకుని అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కార్యక్రమంలో అనేకమందిని భాగస్వామ్యం చేస్తోంది. సదస్సులు, సమావేశాలు, సభలను ఏర్పాటు చేస్తోంది. 2010లో ది హేగ్‌లో, 2013లో బ్రెసిలియాలో, 2017లో బ్యూనస్‌ ఎయిర్స్‌లో సదస్సులు నిర్వహించింది. 2021లో సదస్సు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ దేశాలు, ఐక్యరాజ్య సమితి, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం ప్రతి నిధులు పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ ‌రమఫోసా ప్రసంగిం చారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అన్నది ఏ ఒక్క దేశానికో, సంస్థకో సంబంధించిన విషయం కాదని, దీనిని సమూలంగా నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని కోరారు. తమ వంతుగా దక్షిణాఫ్రికా పాటుపడుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘డర్బన్‌ ‌కాల్‌ ‌టు యాక్షన్‌’ అనే పిలుపిచ్చారు. పిల్లలు పొలాల్లో పని చేయకూడదు, కలల మీద పని చేయాలని డర్బన్‌ ‌సదస్సు పిలుపి చ్చింది. ఈ సందర్భంగా ‘యాక్ట్ ‌నౌ…ఎండ్‌ ‌ది చైల్డ్ ‌లేబర్‌ ’ అనే నినాదం కూడా ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌ 12‌న జరిగే బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం థీమ్‌ ‌కూడా ఇదే. ఈ పిలుపును సాకారం చేసేం దుకు, బాలకార్మిక వ్యవస్థను అంతం చేసేందుకు అందరూ తమవంతుగా పాటుపడుతున్నారు.

బాల కార్మికులు ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. వారి సంఖ్యలోనే తేడా తప్ప ప్రతి దేశమూ ఈ సమస్య ఎదుర్కొంటోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న, వెనుకబడిన దేశాల్లోనూ బాలకార్మికులు ఉన్నారు. అగ్రరాజ్యమైన అమెరికా నుంచి చీకటి ఖండంగా పేరుగాంచిన ఆఫ్రికాలోనూ బాల కార్మికులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. స్థూలంగా చూస్తే ప్రతి పదిమంది బాలల్లో ఒకరు బాలకార్మికుడిగా మిగిలిపోతున్నారు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలో అత్యధికంగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గల బాలకార్మికుల్లో అయిదో వంతు ఇక్కడే ఉండటం గమనార్హం. ఆఫ్రికా తరవాత ఆసియా, పసిఫిక్‌ ‌ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 నాటికి 218 మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నట్లు అంచనా. వీరిలో 72 మిలియన్ల మంది ఆఫ్రికా ఖండంలోనే ఉన్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. 62 శాతం మంది ఆసియా, పసిఫిక్‌ ‌ప్రాంతాల్లో ఉన్నట్లు అంచనా. ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేసియాలో ప్లాంటేషన్‌ ‌కంపెనీల్లో ఎక్కువ మంది బాలకార్మికులు పని చేస్తున్నారు. ఆ దేశంలో 1.7 మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నట్లు అంచనా. బాలలను పనిలో పెట్టుకుంటే నాలుగేళ్ల జైలుశిక్ష, 28 వేల డాలర్ల జరిమానా విధించవచ్చని అక్కడి చట్టాలు చెబుతున్నాయి.

మనదేశంలో బాలకార్మికుల్లో 5 నుంచి 11 సంవత్సరాల మధ్య గల వయసు వారే ఎక్కువ. వీరిలో అత్యధికంగా వ్యవసాయ రంగంలో ఉన్నారు. దేశంలోని మెజార్టీ ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. దీంతో సహజంగానే ఈ రంగంలోనే ఎక్కువ మంది బాలకార్మికులు ఉన్నారు. పలకా బలపం పట్టి పాఠశాలల వైపు అడుగేయాల్సిన బాల్యం పొలాల వైపు నడుస్తోంది. రోజూవారీ పొలం పనుల్లో పసిబిడ్డలు భాగస్వాములవుతూ పాఠశాలలకు దూరమవుతున్నారు. తద్వారా తమ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయం తరువాత కర్మాగారాలు, మైనింగ్‌, ‌చిన్నతరహా కుటీర, భారీ పరిశ్రమల్లో బాలలు పని చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న బాలకార్మికులు పరిశ్రమలు, కర్మగారాల్లో పని చేయడం ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అందరిలాగా తామూ పాఠశాలలకు వెళ్లాలని, వారికున్నా కుటుంబ పరిస్థితులు వారిని దూరంచేస్తున్నాయి. తల్లితండ్రులు సంపాదన పరులు కాకపోవడం, వారు అనారోగ్యం పాలవడం, తల్లితండ్రుల్లో ఎవరో ఒకరు లేకపోవడం, ఉన్నా అనారోగ్యానికి గురవడం, వయసుమీద పడిన వారు కావడం.. తదితర కారణాల వల్ల రేపటి పౌరులు బలవంతంగా బాలకార్మికులుగా మారు తున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ ‌వీరిపై తీవ్రంగా ప్రభావం చూపింది. అసలే అంతంత మాత్రంగా ఉండే పేదల జీవితాలను కరోనా కాటేసింది. కరోనా మహమ్మారి వల్ల పెద్దయెత్తున ఉపాధి కోల్పోయారు. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. పరిశ్రమలు, కర్మాగారాల మూత అనివార్యంగా ఉపాధిపై ప్రభావం చూపింది. దీని ప్రభావం వల్ల బాలకార్మికుల సంఖ్య మరింతగా పెరిగింది. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను అంతం చేయాలని 2015లో ఐక్యరాజ్య సమితి తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డీజీ- సస్టెయినబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌గ్రోత్‌) ‌భాగంగా నిర్ణయించుకుంది. అయితే ఈ దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో మందగమనం నెలకొందన్న అభిప్రాయం ఉంది.

ఏ ఒక్క వ్యక్తి, సంస్థ, ప్రభుత్వం, పాలకుడూ బాలకార్మిక వ్యవస్థను మార్చలేరు. రాత్రికి రాత్రి ఈ సమస్యను పరిష్కరించడం అసాధ్యం. దీనికి కలసి కట్టుగా ప్రయత్నం చేయడం అవసరం. సామాజిక, రాజకీయ సంస్కరణలు తప్పనిసరి. అయితే ప్రభుత్వాల పాత్ర అన్నింటికన్నా కీలకం. ప్రభుత్వాలు ఉచిత విద్యా సౌకర్యం, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ ఈ కార్యక్రమాల అమలులో లోటుపాట్ల వల్ల పూర్తిస్థాయిలో ఫలితాలు సమ కూరడం లేదు. ఒక పేదవాడు తన పిల్లలను పాఠశాలకు పంపడం కన్నా పొలం పనికి పంపితేనే మేలన్న భావనను దూరం చేయనంత కాలం బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితి మారాలంటే మంచి విద్య, పౌష్టికాహారం, నాణ్యమైన వైద్యం అందజేయాలి. ఇవన్నీ పూర్తిగా ప్రభుత్వాల బాధ్యతే.

ఇతర దేశాలతో పోలిస్తే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు భారత్‌ ‌మెరుగైన పోరాటమే చేస్తోంది. భారత రాజ్యాంగమే బాలకార్మికులు ఉండరాదని పేర్కొంటోంది. 14 ఏళ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించాలని నిర్దేశిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అనేక చట్టాలు చేశాయి. అదే సమయంలో పిల్లలను పాఠశాలకు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ముందుగా బాలలను పనుల్లో పెట్టుకునే పక్రియను అడ్డుకునేందుకు చట్టాలు చేశాయి. ఫ్యాక్టరీల చట్టం-1948, చైల్డ్ ‌లేబర్‌ ‌యాక్టు- 1986, జువైనల్‌ ‌జస్టిస్‌ ఆఫ్‌ ‌చిల్డ్రన్‌ ‌యాక్టు, విద్యాహక్కు చట్టం- 2009 రూపొందించాయి. చట్ట ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలను ఎలాంటి పనుల్లో పెట్టుకోరాదు. 18 ఏళ్ల లోపు పిల్లలను కొన్ని మినహాయింపులకు లోబడి పెట్టుకోవచ్చు. 2009 నాటి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు సైతం ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులకు కొన్ని సీట్లను కేటాయించాలి. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘డ్రాపౌట్స్’ ఉం‌టారు. డ్రాపౌట్స్ అం‌టే మధ్యలో బడి మానేయడం. కుటుంబ అవసరాల కోసం, జరుగుబాటు కోసం కొంతమంది తల్లితండ్రులు చదువుకుంటున్న పిల్లలను మధ్యలో మాన్పించి పనులకు పంపిస్తుంటారు. దీనిని నివారించేందుకు, పిల్లలు బడి మానేయకుండా మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. పథకానికి ఎక్కువగా నిధులు సమకూర్చేది కేంద్ర ప్రభుత్వమే కావడం గమనార్హం. కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు పరిశ్రమలు, కర్మాగారాలపై అకస్మాత్తుగా సోదాలు జరుపుతూ బాల కార్మికులను గుర్తిస్తున్నారు. వారు తిరిగి పాఠశాలలకు వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో బాల కార్మికులతో పని చేయిస్తున్న ఆయా సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కూడా తక్కువేమీ కాదు. అవి ప్రజల నుంచి, వివిధ సంస్థల నుంచి విరాళాలు సేకరించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. నోబెల్‌ ‌బహుమతి గ్రహీత కైలాష్‌ ‌సత్యార్థి వీటి ప్రయత్నాన్ని వివిధ సందర్భాల్లో అభినందించారు. 2021 నాటి లెక్కల ప్రకారం భారత్‌లో బాలకార్మికులు 9 మిలియన్లు ఉన్నట్లు అంచనా. పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌‌ప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నారు. దేశంలోని మొత్తం బాలకార్మికుల్లో 20 శాతం మంది ఇక్కడే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది సిల్క్ ‌పరిశ్రమల్లో పని చేస్తున్నారు. మన పొరుగున గల బంగ్లాదేశ్‌లో అయిదు మిలియన్లు, పాకిస్తాన్‌లో 3.4 మిలియన్లు, నేపాల్లో రెండు మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నట్లు అంచనా. సోమాలియా, ఎరిట్రియా, ఉత్తర కొరియా, దక్షిణ సూడాన్‌, ‌చాద్‌, ‌సిరియా, వెనిజులా తదితర దేశాల్లో బాల కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ దేశాల్లో బాల కార్మికులు అధిక సంఖ్యలో ఉండటానికి ప్రధాన కారణం పేదరికం. అయా దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధాలు, సంక్షోభాలు కూడా కారణమని చెప్పవచ్చు. కేవలం సదస్సులు, సమావేశాలు, సభలు జరుపుకోవడం, తీర్మానాల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాదు. ప్రతి ఒక్కరూ తమ వంతు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే బాలకార్మికులు లేకుండా చేయగలమన్నది సత్యం. ఆ దిశగా అడుగలు వేయాల్సిన అవసరం ఉంది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram