– తురగా నాగభూషణం

పేదలకు కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు చెల్లించాల్సిన పాత బకాయిలను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద రుణమాఫీ చేసి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలు వివాదంగా మారింది. డిసెంబర్‌ 20 వరకు గడువు విధించిన ఈ పథకాన్ని నిర్భందంగా అమలుచేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ పథకం అమలు చేసుకోకుంటే లబ్ధిదారులకు అందుతున్న ఇతర సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని కూడా బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. పేదలకు ఉపయోగ పడేందుకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా రూ.4,400 కోట్లు డబ్బు వసూలు చేయడమే అంతిమ లక్ష్యంగా పేర్కొంటున్నారు.

ఆదాయ మార్గాలు లేక డబ్బు పంచడానికి నిధుల సేకరణకు ఒటీఎస్‌ అమలు చేస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. పథకాల సొమ్ము ఇచ్చినట్లే ఇచ్చి మద్యం అమ్మకాల ద్వారా లాగేసుకుంటున్నారు. ఈ పథకం అమలయ్యేవారిలో సగం మంది నిర్మాణరంగ కార్మికులే. మద్యం అలవాటుగా ఉండి ప్రభుత్వం చేత నిలువుదోపిడి చేయించుకుంటున్నవారే. ఎవరికో చెల్లించడం కోసమే తమ నుంచి డబ్బు లాక్కోవడానికి ప్రభుత్వం వేసిన పన్నాగంగా వారు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. డబ్బు చెల్లించలేమని ఎదురు తిరుగుతున్నారు. ప్రభుత్వానికి తమపై ప్రేమ ఉంటే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరుతున్నారు. కాని ప్రభుత్వం మాత్రం డబ్బు వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తోంది. కలెక్టర్‌ నుంచి వాలంటీర్ల వరకు ఈ పథకం అమలుపై దృష్టిపెట్టారు. అన్ని ప్రాంతాల్లో అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ పోస్టర్లు, కరపత్రాలు పంచుతున్నారు. దినపత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు జారీ చేసి ప్రచారం చేస్తున్నారు. నవరత్నాలు పేరుతో డబ్బు పంచుతూ తిరిగి తమ నుంచే ఏదొక పేరుతో డబ్బు వసూలుచేయడం పట్ల ప్రజలు తీవ్ర వ్యతి రేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని భావించవచ్చు.

నవరత్నాల అమలుకు ప్రభుత్వానికి నిధులు సరిపోవడంలేదు. అవకాశానికి మించి అప్పులు తీసుకోవడంతో ఇక కొత్తగా అప్పులు పుట్టడం లేదు. నెలకో పథకానికి డబ్బు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం 3 నెలలుగా చెల్లింపులను వాయిదాలు వేస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చే చేయూత పథకాన్ని మరో నెలకు పొడిగిస్తే, విద్యాదీవెన పథకంలో వాయిదా మాత్రమే చెల్లించారు. వసతి దీవెన గురించి మాట్లాడటం లేదు. అమ్మఒడి పథకాన్ని జూన్‌ నెలకు పొడిగించారు. క్షురకులకు, దర్జీలకు, రజకులకు ఆర్ధిక సహాయం కింద ఇచ్చే చేదోడు, డ్రైవర్లకు ఇచ్చే వాహన మిత్ర పథకాల్లో చెల్లింపులు కూడా వాయిదాలు వేశారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు తమకు పీఆర్‌సీ, డీఏలు, ఇతర ఇన్‌సెన్‌టివ్‌లు కావాలని కోరుతున్నారు. వీటికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ప్రతినెలా వచ్చే జీఎస్టీ వసూళ్లు వీటికి సరిపోవు. అందువల్ల అదనపు నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రజల నుంచే సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు పేదలకు ఇచ్చినట్లు పేర్కొంటున్న 52 లక్షల ఇళ్లకు పాత బకాయిలు రూ.14,400 వేల కోట్లు ఉండగా, వాటిని వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద పంచాయతీల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ల పరిధిలో రూ.20 వేలు చెల్లిస్తే బకాయిలు రద్దుచేసి రిజిస్ట్రేషన్‌ కూడా చేస్తామని ప్రకటించింది. ఇలా వసూలుచేయడం ద్వారా రూ.4,400 కోట్లు సమకూర్చుకోవాలనేది లక్ష్యం. అలాగే మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సి పాలిటీలు, పంచాయతీల్లో ప్లాన్‌లు లేకుండా నిర్మించిన భవనాలకు కూడా జరిమానాలు విధిం చడం ద్వారా కొంత మొత్తం వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులపై విధించారు.

రిజిస్ట్రేషన్‌పై అనుమానాలు

ప్రభుత్వం చేస్తామన్న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై లబ్ధిదారులకు అనుమానాలున్నాయి. రిజిస్ట్రేషన్‌ సబ్‌ రిజిస్ట్రార్లతో చేయించడం లేదు. గ్రామ సచివాల యాల్లోనే పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్‌లు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారట. చట్ట ప్రకారం ఇవి ఎంతవరకూ చెల్లుబాటు అవుతాయన్నది ప్రశ్నార్ధకమే. కానీ ప్రభుత్వం మాత్రం వారిని తాత్కాలిక రిజిస్ట్రార్లుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసి పత్రాలు పంపిణీ చేసింది. పంచాయతీ కార్యదర్శులు చేసే రిజిస్ట్రేషన్‌ చెల్లుతుందా అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇవ్వబోతున్న రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు వాస్తవ రూపానికి దూరంగా ఉన్నాయి. మొత్తం ఏడు పేజీలు ఉండే రిజిస్ట్రేషన్‌ డాక్యు మెంట్‌లో అసలు నిజమైన డాక్యుమెంట్‌ అని చెప్పుకునే ఒక్క లక్షణం కూడా లేదని నిపుణులు అంటున్నారు. ఆస్తి లావాదేవీకి చెందిన వ్యవహారం మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసే డాక్యుమెంట్లలో ఉండాలి. స్టాంప్‌ ప్రధాన పేజీతో పాటు ఇతర పేజీలన్నీ తెల్లగా ఉండాలి. కానీ ప్రభుత్వం ఇచ్చే పుస్తకంలో వైకాపా ఉపయోగించే రంగులు, ముఖ్యమంత్రి జగన్‌ చిత్రం ప్రింట్‌ చేశారు. ఇదో వైకాపా పాంప్లెట్‌లా కని పిస్తోంది. రిజిస్టర్‌ డాక్యుమెంట్‌కు ఉన్న నిబంధనలు దీనికి లేవు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డాక్యు మెంట్‌ పేపర్లు ఎలా చెల్లుతాయని కూడా కొందరు ఆలోచిస్తున్నారు. గతంలో పంపిణీ చేసిన 30 లక్షల ఇళ్ల పట్టాల వ్యవహారంతో ఒకసారి భంగపడిన ప్రజలు దీనిని కూడా ప్రభుత్వ ప్రచార పటాటోపంతో పాటు డబ్బు గుంజే వ్యవహారంగా భావిస్తున్నారు. సబ్‌ రిజిస్ట్రార్లతో.. ఒర్జినల్‌ డాక్యుమెంట్లతో చేయించని రిజిస్ట్రేషన్లకు ఆ స్థలంపై సంపూర్ణ హక్కులు రావని, ఇలా తాత్కాలిక రిజిస్ట్రార్లతో, రిజిస్ట్రేషన్లతో పనులు చేయిస్తే వివాదాలు తప్పవని అంటున్నారు. నిబంధనలకు అనుగుణమైన డాక్యుమెంట్లతో సబ్‌ రిజిస్ట్రార్లతోనే రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తే పేదల్లో నమ్మకం ఉంటుంది. కాని ప్రభుత్వం మాత్రం ఎవరి మాట వినడం లేదు. అందుకే లబ్ధిదారులు సహకరించడం లేదు.

ప్రభుత్వం ఒత్తిడి

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఎలాగైనా అమలుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. తహసీల్దారు, ఎంపీడీవో, గృహ నిర్మాణశాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌, వీఆర్వో, వాలంటీర్ల వరకు అందరికీ ఓటీఎస్‌ వసూలు బాధ్యత అప్పగించారు. అయితే లబ్ధిదారుల్లో స్పందన కనిపించడం లేదు. తమకు గత ప్రభుత్వాలు ఇళ్లు లేదా స్థలాలు ఇచ్చాయని, ప్రభుత్వం ఇచ్చిన అరకొర నిధులకు తాము అప్పులుచేసి ఇళ్లు నిర్మించుకున్నామని, ఇప్పుడొచ్చి గృహ నిర్మాణసంస్థకు ఉన్న అప్పులు చెల్లించమనడం సరికాదంటున్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నామని, ఈ దశలో వచ్చి డబ్బు చెల్లించమంటే ఎక్కడి నుంచి తెస్తామం టున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. అన్నిరకాల దమననీతిని ప్రయోగిస్తోంది. బకాయిలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించినట్లు ఆరో పణలు వస్తున్నాయి. మహిళల నుంచి ప్రతిఘటన ఉన్నచోట్ల మహిళా పోలీసులనూ వినియోగిస్తున్నారు. ఈ బలవంతపు వసూళ్ల వ్యవహారంపై రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో ఇది స్వచ్ఛందంగా చేసే కార్యక్రమమని, ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని అధికారులు అంటున్నారు. పథకాలు ఆపుతామని ఉత్తర్వుల్విచ్చిన ఒకరిద్దురు కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకున్నారు.

అధికారుల తాపత్రయం

మరోవైపు ఓటీఎస్‌ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న సమయంలో పూర్తిచేయాలని అధికారులు తాపత్రయ పడుతున్నారు. ఎవరు త్వరగా పూర్తిచేస్తే వారికి ఎక్కువ మార్కులు పడతాయని ప్రభుత్వం హెచ్చరించ డంతో ఎవరికివారు ఒత్తిడి పెంచారు. లబ్ధిదారులకు ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. గోడపత్రికలను, కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛందం అంటూనే వివిధ మార్గాల్లో లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పథకం ద్వారా వడ్డీ, అసలు రెండిరటికి రాయితీ ఇచ్చి నిర్ణీత మొత్తాలు చెల్లించిన వారి ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఆస్తిని అమ్ము కునేందుకు, తనఖా పెట్టుకునేందుకు వీలుగా 22(1) (ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించి ఎలాంటి యూజర్‌, స్టాంప్‌ చార్జీలు లేకుండా రిజిస్టర్‌ చేస్తా మంటున్నారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకు రుణాలకు జామీను కింద దఖలు పరుచుకునే వీలు ఉందన్నారు. త్వరపడాలని నానా విధాలుగా హెచ్చరిస్తున్నారు. నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించిన వారికి రుణమాఫీతో పాటు ఇంటి రిజిస్టర్‌ దస్తావేజులు డిసెంబర్‌ 21 నుండి అందిస్తామన్నారు.

ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఉన్న ఏకైక లక్షం ఓటీఎస్‌ పథకంలో డబ్బు వసూలు చేయడమే. పర్యవేక్షణకు సచివాలయాల వారీగా మండలస్థాయిలోని ఇతర అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఉన్నతాధికారులు జిల్లాస్థాయిలో రోజుకు పలుదఫాలుగా టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రతి సచివాలయం నుంచి రోజుకు కనీసం పది మంది లబ్ధిదారులతో డబ్బులు కట్టించాలని లక్ష్యంగా పెట్టారు. ఇవన్నీ మౌఖిక ఆదేశాలుగానే అధికారులు ఇస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యంలో రోజుకు 10% సొమ్మును వసూలు చేయాలని ఆదేశాలున్నాయి. లబ్ధిదారుల నుంచి మూకుమ్మడిగా వ్యతిరేకత వ్యక్తంకాకుండా ఓటీఎస్‌ జాబితాను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. డబ్బులు లేవని చెబుతున్న వారికి డ్వాక్రా సంఘాల ద్వారా అప్పు ఇప్పించి మరి వసూలు చేస్తున్నట్లు కొన్ని ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. లబ్ధిదారుల్లోని డ్వాక్రా మహిళల నుంచి ఓటీఎస్‌ రుసుం కట్టించే బాధ్యతను వెలుగు సిబ్బందికి అప్పగించారు. కొన్నిచోట్ల ఆసరా కింద ఇచ్చిన మొత్తాన్ని ఓటీఎస్‌కు కట్టిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆసరా మొత్తంతోపాటు మరికొంత బయట నుంచి అప్పు తెచ్చి కట్టారు. జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాల ప్రజలు, గ్రామకంఠం, పోరంబోకు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు మాత్రం ఓటీఎస్‌ చెల్లించేందుకు ముందు కొస్తున్నారు. పట్టణాల పరిధిలోని వారూ కొంతమేర స్పందిస్తున్నారు.

ఒటీఎస్‌ వసూలు చేయని ప్రభుత్వ సిబ్బందిని అధికారులు, ప్రజాప్రతినిధులు అవమానిస్తున్నారు. చేతకాని వారిగా ఎంచి అగౌరవపరుస్తున్నారు. ముందుగా వసూళ్ల బాధ్యతను వీఆర్వోలకు అప్పగిస్తే వారు లబ్ధిదారులతో మాట్లాడినా ప్రయోజనం లేదు. డబ్బు కట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో అధికారులే కాదు, స్వయానా మంత్రి అప్పలరాజు కూడా ఆగ్రహించారు. వీఆర్వోలపై ఇష్టారీతిన దుర్భాషలాడారు.

నియంతృత్వ ధోరణి సరికాదు

దశాబ్దాల క్రితం కూలీ నాలీ చేసుకొని కట్టుకున్న పేదల ఇళ్లకు ఇప్పుడు వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ అంటూ ఒక్కొక్కరి నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేయడం శోచనీయం. ఎవరైనా కట్టకపోతే వారి కుటుంబ సభ్యుల పింఛన్లు ఆపేస్తామని బెదిరించడం, ఆ ఇంట్లో డ్వాక్రా మహిళల ఖాతాల నుంచి మినహాయించుకుంటామనడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం. ఒకపక్క తమ వద్ద డబ్బులు లేవంటున్న ప్రజలను ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారో ప్రభుత్వ పెద్దలు అలోచిం చాలి. ప్రభుత్వానికి పేదలపై చిత్తశుద్ధి ఉంటే వారి అప్పులు మాఫీ చేసి ఆ ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి. పేదల నుంచి వసూలుచేసి మరల పేదలకే ఇవ్వడం సరికాదని అందరి వాదన.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram