పోచంపల్లి… చారిత్రక ప్రాధాన్యం ఉన్న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ గ్రామం. ఇప్పటికే జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు పొందిన ఘనత ఉంది. ఇటీవలే మున్సిపాలిటీగానూ అవతరించింది. సిల్క్ ‌సిటీగా కూడా పేరొందింది. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. వినోబాభావే భూదానోద్యమంతో భూదాన్‌ ‌పోచంపల్లిగా పేరు మార్చుకుంది.  ఇన్ని ఘనతలు సాధించిన ఈ గ్రామం తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యునైటెడ్‌ ‌నేషన్స్ ‌వరల్డ్ ‌టూరిజం ఆర్గనైజేషన్‌) ‌పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. 2021 డిసెంబర్‌ 2‌వ తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్‌ అసెంబ్లీ 24వ సెషన్‌ ‌సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేయనున్నారు.

పోచంపల్లి.. భూదాన్‌ ‌పోచంపల్లిగానే కాదు, చేనేత వస్త్రకళల నిలయంగానూ ప్రసిద్ధి. 1910లో అసఫ్‌జాహీల కాలంలో పోచంపల్లిలో చీరల పరిశ్రమ ఏర్పడింది. భూదానోద్యమంతో భూదాన్‌ ‌పోచంపల్లిగా గుర్తింపు పొందింది. పోచంపల్లి చీరకి మగువల మనసులో ప్రత్యేక స్థానం ఉంది. తమదైన ప్రత్యేక శైలితో పోచంపల్లి నేత కార్మికులు వస్త్రాలు నేస్తారు. ఈ తరహా నేత భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ‘పోచంపల్లి ఇక్కత్‌’ అని పిలిచే ప్రత్యేక శైలి వస్త్రాలు ఇక్కడ లభిస్తాయి. ప్రత్యేకమైన శైలి ద్వారా నేసిన సున్నితమైన చీరలు ఇక్కత్‌ ‌చీరలు. ఈ వైవిధ్యానికి గుర్తింపు కూడా లభించింది. ఫలితంగా 2004లో పోచంపల్లి ఇక్కత్‌కు భౌగోళిక సూచిక (GI) పేటెంట్‌ ‌లభించింది. ఈ ప్రత్యేకమైన కళ, నైపుణ్యం కారణంగా పోచంపల్లిని భారతదేశ సిల్క్ ‌సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కత్‌ అనేది మలేషియా, ఇండోనేషియాలలో వాడే పదం. దీని అర్థం ‘టై అండ్‌ ‌డై’. ఇక్కత్‌లో కట్టిన నూలు విభాగాలను నేయడానికి ముందుగా నిర్ణయించిన రంగు నమూనాకు చుడతారు లేదా కడతారు. ఆ తర్వాత రంగులువేసే పక్రియ చేపడతారు. ఈ రంగు వస్త్రం అంతటా కాకుండా.. కొంత ప్రాంతంలోకే చొచ్చుకుపోయి వెరైటీగా కనిపిస్తుంది. ఈ టై అండ్‌ ‌డైతో వస్త్ర ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారు ఇక్కడి నేతన్నలు. తేలియా రుమాళ్లు, గాజులు, పూసలు ఇక్కడి నుంచి అరబ్‌ ‌దేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర ఉంది.

 చేనేతే జీవనాధారం

గ్రామీణ వాతావరణం, కులవృత్తులకు నిలయ మైన పోచంపల్లి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి జీవన స్థితిగతులను తెలుసు కోటానికి ప్రపంచ దేశాల పరిశోధకులు క్షేత్ర స్థాయి పర్యటనలకు గ్రామాన్ని సందర్శిస్తుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,294 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్‌ ఉం‌టే, అందులో సగం భూదాన్‌ ‌పోచంపల్లి లోనే ఉన్నాయి. ఈ గ్రామ జనాభాలో 65శాతం మంది నేత కార్మికులే ఉన్నారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల్లో అత్యధికంగా పోచంపల్లిలోనే ఉన్నారు. పోచంపల్లి చేనేత కళాకారులు నేసిన అనేక రకాల ఇక్కత్‌ ‌వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సాంప్రదాయ, చేనేత, వ్యవసాయ అనుబంధ రంగాలను ఇక్కడి ప్రజలు జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు.

పోచంపల్లికి అంతర్జాతీయ పురస్కారం దక్కడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా భవిష్యత్తులో ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడింది.

భూదానోద్యమానికి నాంది

1951, ఏప్రిల్‌ 18‌న పోచంపల్లి నుంచే ఆచార్య వినోబాభావే భూదాన్‌ ఉద్యమం ప్రారంభించారు. ఆయన చేపట్టిన పాదయాత్ర దేశంలో ఓ కొత్త శకానికి నాంది పలికింది. దానికి పోచంపల్లి వేదికగా నిలిచింది. వినోబాభావే పిలుపుతో ఈ గ్రామానికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి హరిజనులకు తనకున్న వంద ఎకరాల భూమిని పంచేశారు. అంతేకాదు.. అనంతరం ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దాతల నుంచి స్వీకరించి భూమి లేని పేదలకు పంచిపెట్టారు. భూదానోద్యమంతో ఈ గ్రామం భూదాన్‌ ‌పోచంపల్లిగా మారింది. గ్రామంలో ఓ మ్యూజియం కూడా ఉంది. పర్యాటక శాఖ దీన్ని నిర్వహిస్తుంది. గ్రామంలో ఇప్పటికీ వినోభాభావే మందిరం ఉంది, ఇది గతంలో వినోభా గ్రామాన్ని సందర్శించడానికి వచ్చినపుడు బస చేసిన ప్రదేశం.

ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ పైలట్‌ ‌కార్యక్రమంలో భాగంగా తొమ్మిది మూల్యాంకన ప్రాతిపదికలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలను విశ్లేషించి ఉత్తమ పర్యాటక గ్రామాలను ఎంపిక చేస్తుంది. ఎంపికైన గ్రామాలకు అవార్డులను అందజేస్తోంది. గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాంఘిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో సుస్థిరాభివృద్ధి, గ్రామీణ సంస్కృతిని ఎలా పరిరక్షిస్తున్నారు, గ్రామీణ పర్యాటకానికి ఎంత ప్రాధాన్యం ఉంది? గ్రామీణ పర్యాటకానికి ఊతం ఇచ్చేలా వాటి అభివృద్ధి, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవనశైలి, నూతన పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఈ ప్రాజెక్టులో భాగంగా పలు గ్రామాలను విశ్లేషించింది. పర్యాటక రంగానికి ప్రోత్సాహకం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన, సంప్రదాయాల పరిరక్షణ, వాటిని భావితరాలకు అందించటంతోబాటు ఆర్థిక అసమానతల తొలగింపు ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. శిక్షణ, అభివృద్ధికి సంబంధించి అవకాశాలను పొందడం ద్వారా గ్రామీణ పర్యాటక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి గ్రామాలను ప్రోత్సహించడం కూడా దాని లక్ష్యాల్లో ఓ భాగం. భారతదేశం నుండి యుఎన్‌ ‌డబ్ల్యుటీవో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసేందుకు గానూ పర్యాటక మంత్రిత్వశాఖ మూడు గ్రామాలను సిఫార్సు చేసింది. మేఘాలయాలోని ‘కాంగ్‌థాన్‌’, ‌మధ్యప్రదేశ్‌లోని చారిత్రాత్మక గ్రామం ‘లాద్‌పురా ఖాస్‌’, ‌తెలంగాణలోని ‘పోచంపల్లి’ పోటీలో ఉన్నాయి. వీటిని పరిశీలించిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పోచంపల్లి ప్రముఖంగా వస్త్ర వ్యాపార కేంద్రం. ఇక్కడ యాభై నుంచి ఎనభై దుకాణాలు ఉన్నాయి. మూడు షాపింగ్‌ ‌కాంప్లెక్స్‌లూ ఉన్నాయి. హైదరాబాద్‌కు యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉండటం వల్ల ఇది కొనుగోలుకు సుప్రసిద్ధ కేంద్రంగా మారింది. అయితే, పోచంపల్లితో పాటు.. చుట్టుపక్కల ఉన్న సుమారు నలభై గ్రామాల ప్రజలు కూడా చేనేతనే ప్రధాన ఉపాధిగా జీవనం సాగిస్తున్నారు. వీటన్నింటిని కలిపి పోచంపల్లి పర్యాటక సముదాయంగా చూడాలన్న డిమాండ్లు, ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా కొయ్యలగూడెం (కోయాస్‌ ఇక్కత్‌), ‌సిరిపురం (సిరికో ఫ్యాబ్రిక్స్), ‌వెల్లంకి, పుట్టపాక, గట్టుప్పల్‌ ‌కూడా సందర్శించవలసిన గ్రామాలని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామాలు ఒక్కో రకానికి ఒక బ్రాండ్‌గా భావించ వచ్చంటున్నారు. ఈ గ్రామాలు సందర్శిస్తే కాటన్‌, ‌సిల్క్ ‌చీరలే కాదు, డ్రెస్‌ ‌మెటీరియల్‌తో పాటు, బెడ్‌ ‌షీట్లు, కండువాలు, టవల్స్, ‌కర్టెన్లు, దీవాన్‌ ‌సెట్లు, టేబుల్‌ ‌టాప్స్ ‌తది తరాలన్నీ పర్యాటకులను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. పైగా.. ఇవన్నీ ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయంటున్నారు. ఇదంతా కలిసే సిల్క్ ‌సిటీగా భావించాలంటున్నారు. యునెస్కో పురస్కారం లభించిన సందర్భంగా వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం గుర్తింపు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ఇప్పుడు పోచంపల్లికి కూడా ప్రపంచస్థాయి గుర్తింపు దక్కడంతో ప్రపంచపటంలో తెలంగాణకు మరింత ప్రాధాన్యం పెరిగినట్టు అయింది.

– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram