ఈ వేగవంతమైన జీవితంలో పని ఒత్తిడి, బాధ్యతలు, నిరంతర స్క్రీన్ వినియోగం మధ్య మనం కోల్పోతున్న ముఖ్యమైన అంశాల్లో నిద్ర ఒకటి. చాలామంది నిద్రను కేవలం విశ్రాంతిగా భావించినప్పటికీ, వాస్తవానికి అది మన శరీరం, మనస్సుకు అత్యంత ముఖ్యమైన జీవ ప్రక్రియ. ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, రోజంతా ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు సరైన నిద్ర లేకపోవడాన్ని సూచిస్తాయి. నిద్ర మన శరీరానికి పునరుజ్జీవం అందించే అత్యంత సహజమైన, కీలక ప్రక్రియ. ఈ సమయంలో మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించి నిల్వచేస్తుంది. దాంతో జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం గణనీయంగా మెరుగుపడతాయి. ఇదే సమయంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హార్మోన్ల సమతుల్యం కొనసాగడం వల్ల బరువు నియంత్రణలో కూడా నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా, సమృద్ధిగా నిద్రపోవడం మనసుకు ప్రశాంతతను అందించి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది.

ఈ నేపథ్యంలో మన దేశంలో నిద్ర సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక సర్వే ప్రకారం, గతంలో సుమారు 59 శాతం మంది రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారని వెల్లడైంది. తాజా గణాంకాలు ఈ సంఖ్య 46 శాతానికి తగ్గిందని సూచిస్తున్నప్పటికీ, ఈ మెరుగుదల పరిమితంగానే ఉంది. ఇంకా గణనీయమైన జనాభా సరిపడ నిద్ర పోŠకపోవడం ఒక ఆందోళనకర వాస్తవం. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాకుండా, నిద్రపై మన సమాజ దృక్పథాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. నిద్రను ఇప్పటికీ చాలామంది విలాసంగా భావించడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపి స్తోంది. అయితే, నిద్రను ఒక ఎంపికగా కాకుండా, ఆరోగ్యానికి అత్యవసరమైన అవసరంగా గుర్తించడం సమాజానికి అత్యంత అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెద్దవారు రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర పొందడం అత్యవసరం. అంతే కాకుండా, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం, లేవడం వంటి అలవాట్లు మన జీవ గడియారం సక్రమంగా పనిచేయడానికి సహాయ పడతాయి.

నిద్రలేమి అనేది కేవలం అలసటకు మాత్రమే కారణం కాదు. అది అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే కీలక అంశం. ప్రస్తుతం Insomnia, Sleep Apnea, Restless Leg Syndrome, Narcolepsy వంటి నిద్ర సంబంధిత వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయి. మనదేశంలో సుమారు 25 నుంచి 33 శాతం మంది Insomnia సమస్యతో బాధపడుతుండగా, దాదాపు 37 శాతం వరకు ప్రజలు Sleep Apnea లక్షణాలను ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

గురక పెట్టడం, రాత్రి మధ్యలో తరచూ లేవడం, పగటి సమయంలో అధిక అలసట అనుభవించడం వంటి లక్షణాలను సాధారణంగా తీసుకోవడం ప్రమాదకరం. ఇవి గాఢ నిద్రలో లోపం లేదా గంభీర మైన నిద్ర వ్యాధులకు సూచనలుగా ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో Polysomnography వంటి నిద్ర పరీక్షలు సమస్యలను ఖచ్చితంగా నిర్ధారించడంలో సహాయపడతాయి.

మంచి నిద్ర కోసం జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం ఎంతో అవసరం. నిద్రకు ముందు స్క్రీన్ వినియోగాన్ని తగ్గించడం, సాయంత్రం తర్వాత కాఫీ తీసుకోవడం తగ్గించడం, ప్రతిరోజూ ఒకే సమయా నికి నిద్రపోవడం వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఈ సందర్భంలో “10-3-2-1-0” నియమం ఒక సులభమైన మరియు ఉపయోగకరమైన మార్గదర్శకం. ఈ నియమం ప్రకారం, నిద్రకు 10 గంటల ముందు కాఫీని మానడం, మూడు గంటల ముందు భారమైన ఆహారం తీసుకోకపోవడం, రెండు గంటల ముందు మానసికంగా ఒత్తిడిని కలిగించే పనులను ఆపడం, ఒక గంట ముందు స్క్రీన్లను దూరంగా పెట్టడం, ఉదయం స్నూజ్ బటన్‌ను నొక్కకపోవడం వంటి అలవాట్లు శరీరాన్ని సహజంగా నిద్రకు సిద్ధం చేస్తాయి.

ప్రస్తుతం ‘Sleepmaxxing” అనే భావన ప్రాచుర్యం పొందుతోంది. ఇది నిద్రను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో, వ్యక్తులు తమ నిద్ర వాతావరణం ,అలవాట్లను క్రమబద్ధం చేయడానికి ప్రయత్నించే ఒక జీవనశైలి ధోరణి. ఇందులో  నిద్రకు ఉపక్రమించే ముందు గది ఉష్ణోగ్రతను తగ్గించడం, చీకటి వాతావరణం కల్పించడం, శబ్దాన్ని తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఇది పూర్తిగా శాస్త్రీయంగా నిర్థారితమైన పద్ధతి కాకపోయినా, ఇందులో సూచించే మార్పులు ఇప్పటికే జనామోదానికి నోచుకున్న “sleep hygiene” సూత్రాలకు దగ్గరగా ఉంటాయి. ఈ విధమైన ధోరణులు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో వాతావరణం, అలవాట్ల ప్రాధాన్యాన్ని ప్రముఖంగా చేస్తున్నాయి. ఇవి కొత్తగా కనిపించినప్పటికీ, వాస్తవానికి ఇవి మనకు ఇప్పటికే తెలిసిన మంచి నిద్ర అలవాట్ల విస్తరణ మాత్రమే.

నిద్ర జీవశాస్త్ర పరంగా ఒక అవసరం అయి నప్పటికీ, ఆధునిక జీవనశైలిలో అది విలాసంలా కనిపిస్తోంది. ఇది మన దృక్పథం మారాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సరైన అవగాహనతో పాటు చిన్న అలవాట్ల మార్పులను స్వీకరిస్తే, ఆరోగ్యకరమైన నిద్రను తిరిగి సాధించవచ్చు. నిద్రను ప్రాధాన్యంగా తీసుకోవడం అంటే ఆరోగ్యాన్ని ఆహ్వానించడమే అవుతుంది.

బాగా నిద్రపోండి – ఆరోగ్యంగా జీవించండి!

డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ                       

ప్రొఫెసర్ & ప్రిన్సిపాల్ (రిటైర్డ్)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE