సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
విద్యలేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు. వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక అభివృ ద్ధికి అక్షరాస్యత ముఖ్యం. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, స్వతంత్రంగా ఆలోచించడం అక్షరాస్యతతోనే సాధ్యం. కానీ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేదు. కానీ ఈ విషయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీలాంటి దేశాలు కొన్ని చిన్న దేశాల కన్నా వెనుకబడే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి 100% అక్షరాస్యతను సాధించేందుకు ‘ఉల్లాస్’ కార్యక్రమాన్ని చేపట్టింది.
అక్షరాస్యత అంటే ఏమిటి? చదవడం, రాయడం, మాట్లాడటం, వినడం అనే ప్రాథమిక లక్షణాలు. రాయడం, చదవటం మాత్రమే అక్షరాస్యత కాదనీ.. గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత అని కొంతమంది చెబుతుంటారు. నైపుణ్యాలను ఉపయోగించడం వంటి ప్రాథమిక సామర్థ్యాలను కలిగి ఉండటం అని కూడా చెప్పవచ్చు. ఇది చదువుకోవడం మాత్రమే కాకుండా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ఇతరులతో సమర్థవంతంగా సంభాషించడానికి, సమాజంలో క్రియాశీలకంగా పాల్గొనడానికి అవసరమైన విస్తృత మైన నైపుణ్యాలను సూచిస్తుంది.
పెద్ద దేశాలు వెనుక బెంచీలో..
నవంబర్ 17,1965న యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం ఏటా సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్స వంగా జరుపుకోవాలని ప్రకటించారు. యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి 2003-2012ను అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. వెనుకబాటు తనానికి కారణాలలో పేదరికంతో పాటు నిరక్ష రాస్యత కూడా కారణం అని చెబుతారు. అయితే ఇది వాస్తవం కాదు.
ప్రపంచంలో ధనికదేశాలు లేదా అధిక జనాభా కలిగిన దేశాలేవీ అక్షరాస్యతలో ముందు స్థానంలో లేవు. అతి చిన్నదేశాలు అత్యధిక అక్షరాస్యతను సాధించి మొదటి స్థానంలో నిలిచాయి. ఇందులో అండోరా, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, లీచ్టెన్‌స్టెయిన్, లక్సెంబర్గ్, నార్వే, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, ఉత్తర కొరియా ఉండటం విశేషం. ఇవి 100% అక్షరాస్యత సాధించాయి. అగ్రరాజ్యం అమెరికా అక్షరాస్యతలో 38వ స్థానం ఉంది. దీని కన్నా రష్యా, ఇటలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్ మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. చాలామంది అమెరికన్లకు ఉద్యోగ దరఖాస్తును పూరించడానికి అక్షరాస్యత నైపుణ్యాలు లేవు. బార్బరా బుష్ ఫౌండేషన్ ప్రకారం ప్రతి 5 మంది పెద్దలలో ఒకరు ప్రాథమిక వాక్యాలను చదవడానికి, దరఖాస్తులను పూరించడానికి ఇబ్బంది పడుతున్నారు.
మన దేశం స్థానమేంటి?
భారతదేశంలో అక్షరాస్యత రేటు 2023-24లో దాదాపు 80.9%. అయితే ఇది ప్రపంచ సగటు 84%తో పోలిస్తే తక్కువ. మన దేశంలో 7 సంవత్స రాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న, ఏ భాషలోనైనా చదవడం, రాయడం చేయగల వ్యక్తిని అక్షరాస్యుడిగా పరిగణిస్తారు. లింగం, మతం, ప్రాంతాల వారీగా అక్షరాస్యతలో అంతరాలున్నాయి.
1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు అక్షరాస్యత శాతం కేవలం 12.2% శాతం. 1944లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం (అప్పటికి దేశాన్ని వీడే ఆలోచన లేదు) మన దేశంలో రాబోయే 40 ఏళ్లలో అంటే 1984 నాటికి 100% అక్షరాస్యత లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కాంగ్రెస్ నాయకులు సంపూర్ణ అక్షరాస్యతను సాధించడానికి ఈ వ్యవధి ఎక్కువ అని అపహస్యం చేశారు. అయితే స్వాతంత్రం తర్వాత అధికారం చేపట్టిన ఆ పార్టీ ఈ లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయింది. 1991 నాటికి దేశ అక్షరాస్యత శాతం 52.21% దగ్గర ఉంది..
దేశంలో కొన్నేళ్ల క్రితం వరకూ అక్షరాస్యతలో కేరళదే మొదటి స్థానం. 2025 వచ్చే సరికి మిజోరం 98.2%తో అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో లక్షద్వీప్ (97.3%), మూడో స్థానంలో నాగాలాండ్ (95.7%), నాలుగో స్థానంలో కేరళ (95.3%), ఐదో స్థానంలో మేఘాలయ (94.2%) నిలిచాయి. ఏ రాష్ట్రమైనా 95% అక్షరాస్యతను దాటితే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లు గుర్తిస్తారు.
సాక్షరతా కార్యక్రమాలు
మన దేశంలో సంపూర్ణ అక్షరాస్యతను సాకారం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్ర మాలు చేపట్టాయి. ఇందుతో ప్రధానమైనది 1988లో ప్రారంభమైన నేషనల్ లిటరసీ మిషన్ (జాతీయ అక్షరాస్యత కార్యక్రమం). 2007నాటికి దేశంలో 75% అక్షరాస్యత రేటును సాధించాలనే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.15-35 సంవత్సరాల మధ్య వయసున్న నిరక్షరాస్యులను లక్ష్యంగా పెట్టుకున్నారు. 2011 నాటికి అక్షరాస్యత 74.01%కి పెరిగింది.
మరోవైపు 2001లో కేంద్ర ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ప్రారంభించింది. 6-14 సంవత్స రాల మధ్య ఉన్న బాలలందరూ పాఠశాలకు వెళ్లేలా చేయడం, 2010 నాటికి ఎనిమిదేళ్ల పాఠశాల విద్యను పూర్తి చేసేలా చర్యలు చేపట్టడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. ఈ పథకంలో విద్యా హామీ పథకం కీలకం. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేలా ప్రోత్సహించడానికి చేపట్టిన అత్యంత ప్రసిద్ధ పథకం మధ్యాహ్న భోజన పథకం. దీనిని 1995లో ప్రారంభించారు. ఈ పథకం చాలావరకు సత్ఫలితాలు ఇచ్చింది.
వికసికత భారత్‌లో ‘ఉల్లాస్’
వికసిత భారత్ ప్రణాళికకు అనుగుణంగా స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జురుపుకునే 2047 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు కోసం ‘ఉల్లాస్’ పేరుతో సరికొత్త సాక్షరతా కార్యక్రమం ప్రాంభమైంది. ఉల్లాస్ అంటే.. అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. 2020లో అమలు లోకి వచ్చిన జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం సంపూర్ణ అక్షరాస్యత దిశగా ఒక ప్రధాన మైలురాయి. 2022-2027 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిరక్షరాస్యు లను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఏడాదికి కోటి మంది అభ్యాసకులతో ఐదు కోట్ల మంది అక్షరాస్యులను నమోదు చేయాలని భావిస్తున్నది. ప్రాథమిక విద్య, జీవన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలను అందించేలా ప్రణాళికలు రూపొం దించింది. దీంతోపాటు అవగాహనతో చదవడం, రాయడం, అంకెలను గుర్తించడానికి ప్రత్యేక పుస్తకాలను రూపొందించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయనున్నాయి.
కాగా ఉల్లాస్ కార్యక్రమం అప్పుడే సత్పలితాలు ఇస్తోంది. ఇందులో భాగంగానే మిజోరం 98.2% అక్షరాస్యత రేటును సాధించి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
తెలుగు రాష్ట్రాలు కూడా ఉల్లాస్ అమలుకు సిద్దమయ్యాయి.. ఆంధప్రదేశ్ ప్రభుత్వం‘ఉల్లాస్’తో కలిసి ‘అక్షరాంధ్ర’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా 2025-26లో 25లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, ఇతర వలంటీర్ల సహకారంతో వయోజనులకు 100 గంటల పాటు శిక్షణ ఇస్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు, మార్చిలో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఉల్లాస్‌లో భాగంగా ‘అక్షర వికాసం’ పేరిట 100 రోజుల ఉద్యమానికి వయోజన విద్యాశాఖని సన్నద్ధం చేసింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేళ దీనికి శ్రీకారం చుట్టనుంది. దీనిలో భాగంగా 12.45 లక్షల మందిని అక్షరా స్యులుగా తీర్చిదిద్దాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. ఇప్పటివరకు 6 లక్షల మంది నిరక్ష రాస్యులను గుర్తించింది. వారిలో 4 లక్షల మంది మహిళలే. ఈ ఉద్యమంలో మహిళా అక్షరాస్యతపై దృష్టి సారించనున్నారు.
సాంకేతిక అక్షరాస్యత
దేశం శరవేగంగా అభివృద్ధి చెందడంలో సాంకేతిక పరిజ్ఞానానిదే కీలక పాత్ర. దీన్నే డిజిటల్ అక్షరాస్యతగా పిలుస్తున్నారు. కంప్యూటర్లు మాత్రమే ఉన్నప్పుడు దీని అవసరం సామాన్య ప్రజలకు అంతగా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. దేశంలో 77 శాతం మంది చేతుల్లో సెల్‌ఫోన్లు ఉంటే, 56 శాతం మంది నిత్యం ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉంటున్నారు. వారిలో వీడియోలూ పోస్టులూ చూసేవారే ఎక్కువ. మొబైల్ ఫోన్ ద్వారా ఎన్నో రకాల ప్రభుత్వ, పౌర సేవలతో పాటు ఆన్‌లైన్ షాపింగ్ చేయవచ్చు. అయితే చాలా మంది పౌరులకు దీనిపై సరిగ్గా అవగాహన లేదు. ఈ-సేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిరక్షరాస్యతకు తోడు స్థానిక భాషల్లో టెక్నాలజీ లేకపోవడమూ కారణమవుతోంది.
దేశంలో 2021-24 మధ్య సైబర్ నేరాలు ఏకంగా 400 శాతం పెరిగాయి. ఇందుకు ప్రధాన కారణం డిజిటల్ ఉపకరణాల వినియోగం పట్ల ప్రజలకు సరైన అవగాహన లేకపోవడమే. సొంతంగా కంటెంట్ సృష్టించేవారూ సందేశాలు రాసేవారూ చాలా తక్కువ. డిజిటల్ అక్షరాస్యతపై 120 దేశాల్లో చేపట్టిన సర్వేలో భారత్ 73వ స్థానంలో నిలిచింది. ‘నాస్కామ్’ నివేదిక ప్రకారం, 2023లో భారత స్థూల డిజిటల్ అక్షరాస్యత రేటు 37 శాతం. ఈ ఏడాది చివరికి అది 43శాతానికి చేరు కుంటుందని అంచనా.
ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా సెల్‌ఫోన్, కంప్యూటర్‌ను ఉపయోగించగలిగేలా అవగాహన కల్పించడమే లక్ష్యంగా కేంద్రం 2014లో నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్‌డీఎల్‌ఎం)ను చేపట్టింది. విద్యార్థులు, యువత తమ కుటుంబ సభ్యులందరికీ డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన పెంచాలి. ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తేనే ‘డిజిటల్ ఇండియా’ సాకారం సుసాధ్యమవుతుంది.
ఆర్థిక అక్షరాస్యత
కేవలం చదవడం వస్తే చాలదు. ఆర్థిక విషయా లపై అవగాహన కూడా ముఖ్యం. దీన్నే ఆర్థిక అక్షరాస్యత అంటారు. గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ స ర్వే ప్రకారం మన దేశ జనాభాలో 77% అక్షరా స్యులు ఉన్నప్పటికీ, అందులో 24% కంటే తక్కువ మంది ఆర్థిక అక్షరాస్యులు ఉన్నారు. ఇందులో యుక్త వయస్కులైన ఆర్థిక అక్షరాస్యలు 17% మాత్రమే. మొత్తం 144 దేశాలను పరిశీలిస్తే ఆర్థిక అక్షరాస్యత రేటులో భారత్ 73వ స్థానంలో ఉంది. ఆర్థిక పరిజ్ఞానం, అవగాహన లేకపోవటం వల్ల మెజార్టీ భారతీయులు ఆర్థిక ఇబ్బందులను ఎదురొంటున్నారని తేలింది.
చదువుకు, ఆర్థిక అక్షరాస్యతకు సంబంధం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంలోనే అధిక అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రంగా కేరళకు గుర్తింపు ఉంది. కానీ అక్కడ లాటరీ టికెట్లు కొని నష్టపోతున్నవారు ఎక్కువ. అంటే చదువు ఆర్థిక పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్పించడం లేదు. పిల్లలకు చదువుల్లో ఆర్థిక సంబంధ అంశాలపై పరిజ్ఞానం పెంచాలని నిపుణులు చెబుతున్నారు.
ముందు తల్లిదండ్రులకు ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే పిల్లలకు నేర్చించగలుగుతారు. చిన్నప్పటి నుంచే వారికి ఆర్థిక విషయాలు పరిచయం చేయాలి. ఇవన్నీ తరగతి గదుల బయటే నేర్చుకోవాలి. ఉదాహరణకు.. సరకులు కొనడానికి మార్కెట్‌కు వెళ్లడానికి ముందే కావాల్సిన వస్తువుల జాబితా రాసుకోవాలి. మన దగ్గర ఎంత డబ్బు ఉంది, అవసరాలు ఏమిటి, అందులో ప్రాధాన్యత ఉన్నవి ఏమిటి, వస్తువుల ధరలు, నాణ్యత ఎలా ఉన్నాయి చూసుకోవాలి. వీటిని దగ్గర ఉండి చూపించడంతో పాటు వారిని ఒంటరిగా వెళ్లే కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించాలి. మనకు వచ్చే జీతం లేదా ఆదాయం ఎంత? అందులో ఖర్చులు, పొదుపు తదితర విషయాలను బోధించాలి. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పిల్లలు ఆర్థిక క్రమశిక్షణ అలవరచుకుంటారు.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్