– పాలపర్తి జ్యోతిష్మతి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

కారు ఆ కూడలిలో పక్కకి తిరగగానే, బాణం గుర్తుతో దారి చూపిస్తున్న ‘అడివి నడిమి స్వామి గుడి’ అన్న పెద్దబోర్డు కనిపించింది. ‘‘అన్నయ్యా!’’ అంటూ అరిచినట్టు పిలిచి ఆ బోర్డు చూపించింది వసంత నాకు.

 ‘‘వెళ్దామా?’’ అంది ఉత్సాహంగా.

‘‘ఆ గుడికా?’’ అని అడిగాడు డ్రైవరు వెనక్కి బోర్డువైపు చెయ్యి చూపిస్తూ.

‘‘అవును, వెళ్దాము’’ అన్నాన్నేను ఇద్దరికీ ఒకేసారి సమాధానం చెప్తూ.

‘‘అడవి మధ్యలో ఎక్కడో ఉంటుంది. దారి కనుక్కోగలమంటావా?’’ సందేహంగా అడిగింది వసంత.

‘‘దారి కనుక్కోడం కష్టమేముందమ్మా? ఇక్కడి లాగే ఎక్కడికక్కడ బోర్డులు పెట్టే ఉంటారు’’ అన్నాడు డ్రైవరు.

‘‘గూగుల్‌ ‌మ్యాప్స్‌లో చూసుకుంటూ వెళ్లవచ్చులే గానీ ఈ గుడి గురించి మీ కెట్లా తెలుసు?’’ అడిగాడు వసంత భర్త సతీష్‌.

‘‘ఈపాటికి గూగుల్‌ ‌మ్యాప్స్‌లోకి చేరుం టుందా?’’ తనలో తనే గొణుక్కుంది వసంత.

‘‘ఆ గుడి గురించి మేమెప్పుడూ వినలేదు, మీ కెట్లా తెలుసు?’’ వదలకుండా నొక్కి అడిగింది నా భార్య సుమతి.

వసంత వాళ్లిద్దరికి మేము పూర్వం ఆ గుడికి వెళ్లినప్పటి సంగతులు ఆవేశంగా చెప్పడం మొదలు పెట్టింది. నేను గతం తాలూకు ఆలోచల్లోకి జారుకున్నాను.

————-

ముప్పయ్‌ ఏళ్ల క్రితం మా పెదనాన్నగారి అబ్బాయి రాజేష్‌ ‌పెళ్లికి•, వాళ్ల• అత్తగారి పల్లెకి ఇటువైపు వచ్చాము అమ్మ, నాన్న, నేను, వసంత. ఇప్పుడు మళ్లీ రాజేష్‌ ‌కూతురి పెళ్లికి ఆ పల్లెకే వెళుతున్నాము.

అప్పుడు దగ్గరిలోని పట్నంలో రైలు దిగి ట్యాక్సీ చేసుకుని పల్లెకి వెళ్లాము. ఇప్పుడు సరాసరి హైదరాబాదు నుంచి సొంత కారులో వస్తున్నాము.

అప్పుడు ఈ మలుపు తిరగగానే ‘‘మనం పల్లెకి వెళ్లే దారిలో కొద్దిగా పక్కకి వెళితే ‘అడివి నడిమి స్వామి గుడి’ ఉంది సార్‌! ‌వెంకటేశ్వరస్వామి గుడి, చాలా మహిమగల స్వామి అని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రసిద్ధి. మళ్లీ వెనక్కి రావక్కర్లేదు, అట్నించి అటే పల్లెకి వెళ్లిపోవచ్చు. చూస్తారా?’’ అని అడిగాడు ట్యాక్సీ డ్రైవరు.

‘‘తప్పకుండా చూడాలి. ఇంత దగ్గరికి వచ్చి అంత మహిమగల స్వామిని చూడకుండా ఎట్లా వెళ్తాం? మళ్లీ మళ్లీ వస్తామా ఏంటి?’’ అంది అమ్మ, నాన్న సమాధానం చెప్పే లోపు.

‘సరే’ అన్నట్టు తలూపాడు నాన్న.

కాసేపటికి మెయిన్‌ ‌రోడ్డునుంచి పక్కకి తిరిగి మట్టి రోడ్డు ఎక్కింది కారు. గతుకుల బాటమీద ఊగిసలాడుతూ వెళ్తోంది కారు. రోడ్డుకి రెండుపక్కలా దట్టమైన చెట్లతో అడవిలానే ఉంది మార్గమంతా. ఓ పావుగంట అట్లా వెళ్లేటప్పటికి కుదుపులకి కూర్చోలేక ఇబ్బంది పడుతూ నాన్న ‘‘ఇంకా ఎంత దూరం?’’ అని అడిగాడు.

‘‘తొందర పడితే ఎట్లా? మహిమగల స్వామి అంత తేలిగ్గా కనిపిస్తాడా?’’ అంది అమ్మ.

‘‘వచ్చేశాం సార్‌! అదిగో ఆ చింతచెట్టు పక్కన మలుపు తిరగ్గానే గుడి కనిపిస్తుంది’’ అన్నాడు డ్రైవరు.

కారు గుడి దగ్గర్లో ఆగింది. చిన్న గుడి, పురాతన రాతి కట్టడం, గుడిని కప్పేసినట్లున్న చెట్లు, చెట్లవల్ల వచ్చిన చల్లదనం, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. గుడికి ఒక మూలగా బావి, బావి గట్టుమీద చేద ఉన్నాయి.

గుళ్లోంచి బయటికి వచ్చి గుడికి తాళం వెయ్యబోతున్న పూజారి మమ్మల్ని చూడడంతోటే ‘‘రండి, రండి!’’ అంటూ ఆనందంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లాడు. ముందు ఒక చిన్న గది, వెనక ఇంకా చిన్న గర్భాలయం, అంతే గుడి మొత్తం. బయటికంటే చల్లగా ఉంది గుడి లోపల.

పూజారి అర్చనకి ఏర్పాట్లు చేస్తుంటే ‘‘ఈ దారిన వెళ్తుండగా ఇక్కడ ఒక గుడి ఉందని డ్రైవరు చెప్తే ఇటు వచ్చాము. మేం కొబ్బరికాయ కూడా తీసుకురాలేదు’’ మొహమాటంగా అంది అమ్మ.

‘‘ఏం ఫరవాలేదమ్మా! పొద్దున్నే పిల్లాడికి నామకరణం చేసుకోడానికి పల్లె జనం వచ్చారు. ప్రసాదంతో బాటు నాలుగు కొబ్బరికాయలు తెచ్చారు వాళ్లు. రెండు వాళ్ల పేరుమీద కొట్టించుకున్నారు. మిగతా రెండూ ఇక్కడే వదిలి వెళ్లారు. వాటిలో ఒక కాయ మీపేరున కొడతానులెండి’’ అన్నాడు పూజారి.

అర్చన పూర్తయ్యాక ‘‘దేవుడిసొమ్ము కదా, కొబ్బరికాయ ఖరీదెంతో చెప్పండి’’ అంది అమ్మ. నవ్వి ఊరుకున్నాడు ఆయన. అమ్మ అటూఇటూ చూసి ‘‘హుండీ లేదా?’’ అని అడిగింది.

‘‘లేదమ్మా! మీకు తోచినంత హారతి పళ్లెంలో వెయ్యండి’’ అన్నాడా యన.

అమ్మ హారతి పళ్లెంలో వేసిన డబ్బుని సంతో షంగా తీసుకుని కళ్లకద్దుకుని బొడ్లో దోపుకుంటూ ‘‘దేవుడి సొమ్ము ఒక్క పైసాకూడా నేను తీసుకోను. అంతా దేవుడి కైంకర్యానికే’’ అన్నాడు.

బయటికి వచ్చాక పూజారి గుడికి తాళం వేస్తుంటే ‘‘ఇందాక తాళం వెయ్యబోతుండగా మేమొచ్చాము. ఇంటికెళ్లబోయేవారు ఆగిపోయి మళ్లీ అర్చన చేశారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టామేమో’’ అంది అమ్మ.

‘‘అయ్యో! అట్లా అనకండమ్మా! నాకు ఇబ్బంది కాదు, చాలా సంతోషం. ప్రతిరోజూ ఉదయం రాగానే అర్చన చేస్తాను. ఒక్కోరోజు చుట్టుపక్కల పల్లెల వాళ్లు వస్తారు అర్చన చేయించుకోడానికి, ఒక్కోరోజు ఎవరూ రారు. స్వామికి ఉదయం చేసిన అర్చన ఒక్కటే అవుతుంది. రోజులో ఎన్ని ఎక్కువసార్లు అర్చన చెయ్యగలిగితే అంత సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది నాకు. ఎవరూ రానిరోజు ఏదో దిగులుగా ఉంటుంది. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు. మీకోసం అర్చన చేసినందుకు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది’’ ఉద్వేగంతో చెప్పాడు పూజారి.

‘‘మీకు ఇంటికెళ్లడానికి తొందర లేకపోతే ఈ గుడి చరిత్ర చెప్తారా?’’ అడిగింది అమ్మ.

‘‘చరిత్ర అంటూ పెద్దగా ఏం తెలీదమ్మా! గుడి గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తాను. ఇక్కడికి అందరూ చుట్టుపక్కల పల్లెలవాళ్లే వస్తారు. దూరప్రాంతాల నుంచి ఎవరూ రారు. అందుకని గుడి గురించి నాకు తెలిసిన కాసిన్ని విషయాలనైనా ఎవరికైనా చెప్పే అవకాశం ఇంతవరకూ రాలేదు. ఇంటికెళ్లే తొందరేం లేదు, ఒకవేళ ఉన్నా ఆపుకుని మీకు గుడి గురించి చెప్పడమే నాకు సంతోషం’’ అంటూ దీర్ఘంగా ఊపిరి తీసుకుని చెప్పడం మొదలు పెట్టా డాయన.

‘‘పదేళ్ల క్రితం పశువుల్ని మేపుకుంటూ ఇటువైపు వచ్చాడో కుర్రాడు. వాడు మా పల్లె భూస్వామి దగ్గర పాలేరు. ఈ గుడిని చూడడంతోటే వాడు పరుగు పరుగున వెళ్లి యజమానికి చెప్పాడు. ఆయన హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. వెంటనే గుడిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాడు. గుడి చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కల్ని పీకించాడు. గుడి ఏ కాలంనాటిదో తెలిపే ఆధారాలేవీ దొరకలేదు. పురాతన రాతి కట్టడాన్ని ఆధునీకరణ చెయ్యడం ఆయన కిష్టం లేదు. గుడిని అట్లానే ఉంచి మొత్తం శుభ్రం చేయించారు. ఈ బావికూడా ఆయనే తవ్వించారు. చేద ఇరవైనాలుగ్గంటలూ అక్కడే ఉంటుంది. ఎవరైనా తీసుకెళతారన్న భయం లేదు. అంతా ఆయనే చూసుకుంటాడు’’ అంటూ గుడివైపు తిరిగి నమస్కారం చేసి మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘మా భూస్వామే నన్ను అర్చకునిగా నియమించాడు. దేవుడి కైంకర్యానికి, మా కుటుంబ పోషణకు రెండెకరాల పొలం ఇచ్చాడు. కౌలు రైతే పొలం వ్యవహారాలు చూసుకుంటాడు. ప్రతిరోజూ ఇంటినించే పూజాద్రవ్యాలు తీసుకొచ్చి భూస్వామి పేరుమీద ప్రథమ అర్చన చేస్తాను, తరువాత ఆ దేవుడి దయ. ఏ రోజు నా చేత ఎన్నిసార్లు అర్చన చేయించుకో దలుచుకుంటే ఆ రోజు అంతమందిని పంపుతాడు.’’

‘‘గుడిలో అర్చకులుగా చేరకముందు ఏం చేసేవారు?’’ అడిగింది అమ్మ.

‘‘పల్లెలోనే పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు చేయిస్తూ ఉండే వాడిని. అప్పుడూ జరుగుబాటుకేమీ ఇబ్బంది ఉండేది కాదు, ఇప్పుడు అసలే లేదు. చుట్టుపక్కల పల్లెలవాళ్ల కోసం దేవుడికి పూజలు చేస్తున్నానన్న తృప్తి ఒకటి అదనంగా సంపాదించుకుంటున్నాను ఇప్పుడు. జీవితం ప్రశాంతంగా జరిగిపోతోంది’’ అని చెప్పి మమ్మల్ని కారెక్కమన్నట్టు చేత్తో చూపించి ఆయన ఇంటికి బయలుదేరారు.

దాహం లేకపోయినా సరదాగా బావిలో నీళ్లు చేదుకుని తాగి కారెక్కాం.

‘‘ఎంత బాగుందో ఇక్కడ, వెళ్లబుద్ధవట్లేదు’’ అంటూ ఆ ప్రదేశాన్ని వదలలేక వదలలేక వదిలి వచ్చింది వసంత.

————-

నేను గతకాల యాత్రనించి ఇహలోకంలోకి వచ్చేటప్పటికి వసంత కథ చెప్పడంకూడా పూర్తయింది. అప్పటికే మెయిన్‌ ‌రోడ్డునుంచి పక్కకి తిరిగి మట్టి రోడ్డు ఎక్కిన ప్రాంతానికి చేరాం. కానీ ఇప్పుడక్కడ ఉన్నది మట్టిరోడ్డు కాదు, విశాలమైన సిమెంటు రోడ్డు. ఆ దారిపొడవునా బాణం గుర్తులతో గుడికి దారి చూపిస్తున్న బోర్డుల్ని, కనుచూపుమేర విస్తరించి ఉన్న బీళ్లను, సూర్యుడి భగభగల్ని, రయ్య్ఁ ‌రయ్య్ఁన పరుగెత్తుతున్న వాహనాల్నీ నేను, వసంత సంభ్రమంగా చూస్తూ గతానికి వర్తమానానికి లంకె కుదుర్చుకునే ప్రయత్నంలో ఉండగానే కారు గుడిదగ్గర ఆగింది.

‘‘ఇంత మారిపోయింది ఏంటన్నయ్యా?’’ అంది వసంత నా చెయ్యి గట్టిగా పట్టుకుని.

‘‘దేవాదాయ శాఖవాళ్లు తీసేసుకుని ఉంటారు’’ అన్నాన్నేను.

వాతావరణం వేడిగా ఉంది. నెమ్మదిగా గుళ్లోకి నడవడం మొదలుపెట్టాం.

గుడి చుట్టూ పెద్ద ఆవరణ కట్టారు. వాహనాలు నిలుపుకోడానికి కేటాయిం చిన విశాలమైన స్థలం క్రింద చేదబావి కప్పబడి పోయింది. గుడి ఎదురుగా కొబ్బరికాయలు, ఆటబొమ్మలు, ప్రసాదాలు, తినుబండారాలు, పూజాసామగ్రి అమ్మే దుకాణాలు చాలా వెలిశాయి. గుళ్లోకి వెళ్లడానికి పెద్ద క్యూలైన్‌ ‌కట్టారు. బయటే కొబ్బరికాయలు కొట్టడానికి చోటుని నిర్దేసించే బోర్డు వేళ్లాడదీశారు. అడుగడుగునా హుండీలు పెట్టారు.• గర్భగుడి పాతది అలాగే ఉంచి ముందు పాతగది తీసేసి చుట్టూ వసారాతో రెండు పెద్ద గదులు నిర్మించారు. మొదటి గదిలోకి ప్రవేశించగానే బయటి కంటే వేడిగా సెగ కొట్టింది. నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ క్యూ కదిలి రెండో గదిలోకి కాలు పెట్టగానే ఏసీగాలి చల్లగా తాకింది. దేవుడి సన్నిధికి వెళ్లేటప్పటికి తోపులాట ఎక్కువైంది. పూజారి నిర్వికారంగా కొబ్బరికాయలు కొట్టి తెచ్చినవాళ్ల దగ్గరి నుంచి చిప్పలు తీసుకుని దేముడి వైపు చూపించి తిరిగి ఇచ్చేస్తున్నాడు. యమకింకరుల్లా ‘‘కదలండి, కదలండి’’ అని జనాన్ని నెడుతూ ఒక మనిషి, ‘‘కానుకలు హుండీలో వెయ్యండి’’ అని భక్తుల్ని అదిలిస్తూ ఇంకొక మనిషి గర్భాలయం ముందు నిలబడి ఉన్నారు.

దర్శనం సరిగా చేసుకున్నామా? లేదా? అసలు దైవదర్శనం అయిందా? లేదా? అన్న అనుమానంతో గుళ్లోంచి బయటపడ్డాం. బయటికి రాగానే బల్లమీద తీర్థం, శఠగోపం పెట్టుకుని ఒక పూజారి ఉన్నాడు. కాస్త ముందుకి వెళితే చిన్న అంజనేయస్వామి గుడి, గరుడాలయం ఉన్నాయి. రెండు గుళ్లలో ఇద్దరు పూజారులున్నారు. ఇద్దర్లో కాస్త తీరిగ్గా ఉన్న పూజారిని పట్టుకుని వసంత ఇంటర్వ్యూ మొదలు పెట్టింది.

‘‘గుడిని దేవాదాయశాఖ తీసుకుందా’’ అని అడిగింది మొదటగా.

‘‘అవును మేడమ్‌! ఇప్పు‌డేం, ఇరవై ఎనిమిది సంవత్సరాలయ్యింది…’’

‘‘ముప్ఫై సంవత్సరాలక్రితం మే మొచ్చాం…’’ పూజారి మాటలకి అడ్డుపడి వసంత చెప్పబోతుంటే, వసంతని మాట్లాడ నివ్వకుండా ఆయన మళ్లీ మొదలు పెట్టాడు.

‘‘దేవాదాయశాఖ తీసుకోకముందు పక్క పల్లెలోని భూస్వామి అధీనంలో ఉండేది గుడి. గుడి బయట పడినప్పుడు తనంతటతనే గుడిని బాగుచేయించి, పూజారిని నియమించి, ఓ రెండెకరాల భూమిని గుడిమాన్యంగా ప్రకటించి, తనని తనే ధర్మకర్తగా నియమించుకున్నాడు ఆ భూస్వామి. అప్పట్లో గుడిని దర్శించిన మీబోటి వాళ్లెవరి మూలంగానో ప్రభుత్వానికి ఈ అరాచకం తెలిసి వెంటనే స్వాధీనం చేసేసుకుంది. ఆ పూజారినికూడా తీసేసింది. ఇప్పుడు మేం నలుగురు పూజారులం ఉన్నాం. ప్రతివారం మా స్థానాలు మారుతూ ఉంటాయి. ప్రధాన ఆలయంలో అర్చనలు చేసే పని ఎక్కువ శ్రమగా ఉంటుంది. మామూలు రోజుల్లోనే మూడో నాలుగో అర్చనలు ఉంటాయి. రాత్రయ్యేసరికి అలసిపోతాం. ఇంక పర్వదినాల్లో, ధనుర్మాసంలో అయితే ఓ పది అర్చనలదాకా వస్తాయి. పొద్దు న్నొకళ్లు, సాయంత్రం ఒకళ్లు చేసుకోవలసిందే. రోజంతా ఒక్కరమే చెయ్యడం మా వల్ల అయ్యే పని కాదు’’ అతిశయంగా చెప్పాడు.

‘‘ఆ పాతపూజారి ఇప్పుడెక్కడున్నారు?’’ ఆరాటంగా అడిగింది వసంత.

‘‘తెలీదు’’ క్లుప్తంగా సమాధానం చెప్పాడాయన.

వసంత నిస్పృహగా నిట్టూర్చి కదలబోయింది.

‘‘గుడి చరిత్ర వినరా?’’ వెళ్ళిపోతామేమోనన్న కంగారుతో అడిగాడాయన.

‘‘విన్నది చాలు’’ అంటూ రెండడుగు లేసింది వసంత.

‘‘చెప్పండి, వింటాం’’ అంటూ వసంతని చెయ్యపట్టుకుని లాగి ఆపింది సుమతి.

‘‘ఫలానా కాలంలో ఫలానా రాజు కట్టించిన గుడి ఇది…’’ అంటూ మొదలు పెట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక జరిగిన అభివృద్ధిదాకా, ఉన్నదీ, లేనిదీ ఏదేదో చెప్పుకొచ్చాడు. అంతా అయిపోయాక మేమెళ్లబోతుంటే చెయ్యి చాపాడు. సతీష్‌ ‌వందరూపాయల కాగితం ఆయన చేతిలో పెట్టాడు. ‘ఇంతేనా’ అన్నట్టు చెయ్యి కదిల్చాడు ఆయన. సుమతి పర్సు తియ్యబోతుంటే వసంత సుమతి చెయ్యి పట్టుకుని లాక్కెళ్లింది. వెనకే నేను, సతీష్‌ ‌కదిలాం. బయటికొచ్చి కూల్‌ ‌డ్రింకులు తాగి, ముందు జాగ్రత్తగా రెండు మంచినీళ్ల సీసాలు కొనుక్కుని కారువైపు నడిచాం.

‘‘ఇంతకుముందు మనం చూసినదానికీ, ఇప్పటికీ ఎంత తేడా…?’’ అంది వసంత గొంతులో ఏదో దిగులు ధ్వనిస్తుండగా.

‘‘ఆయనక్కావలసింది జరిగేట్టు ఆయనే చూసుకుంటాడు’’ అంది సుమతి గుడివైపు తిరిగి భక్తిగా దణ్ణం పెట్టుకుంటూ.

‘అడివి నడిమి స్వామి గుడి’ చుట్టుపక్కల కనుచూపుమేరలో పిసరంత పచ్చదనం ఎక్కడైనా కనిపిస్తుందేమోనని వెతుకుతున్న నా ఎదురుగా ‘ఆయన అంటే ఎవరు?’ అన్న ప్రశ్న కొండలా వచ్చి నిలబడింది.

About Author

By editor

Twitter
Instagram