జూలై 27 సంగం లక్ష్మీబాయి జయంతి

వినాయక్‌ ‌నరహరి భావే గుర్తున్నారా? సంగం లక్ష్మీబాయి పేరు విన్నారా? ఆ తరాల వారందరికీ ఈ ఇద్దరూ స్ఫూర్తిప్రదాతలు. ఈ రెండు పేర్లకూ ఎందుకీ అవినాభావ సంబంధం అనే ప్రశ్నకు బదులివ్వాలంటే, దశాబ్దాల చరితను తరచి చూడాల్సిందే! ఇద్దరూ భారత స్వాతంత్య్ర సమరయోధులు. ఉభయులూ జీవిత పర్యంతం లక్ష్య సాధనకే పరిశ్రమించినవారు. సర్వోదయ ధ్యేయంతో అన్ని వర్గాల ప్రజలకు చేరువైన భూదాన ఉద్యమం గురించి ఎందరెందరికో తెలుసు. పల్లెప్రజలు ఎప్పుడూ కష్టనష్టాలతోనే రోజులు వెళ్లదీయాలా? వారికంటూ సుఖశాంతులు కలిగించే బాధ్యత ఉన్న వాళ్లకు లేదా? అని ఎంతగానో మథనపడ్డారు వినోబా. అందులో నుంచి జనించిన సృజనాత్మక కార్యాచరణ ప్రణాళికే పాదయాత్ర సహిత భూదాన క్రతువు. నలుమూలలా నడక సాగించి, భూములున్న వారిని ‘పెద్ద మనసు చేసుకోండ’ని ఒప్పించి, ఎక్కడికక్కడ సమీకరించారు ఆ పెద్దాయన. అందుకు చేదోడు వాదోడుగా నిలిచారు లక్ష్మీబాయి. తెలుగునాట వినోబా మొట్టమొదటి పాదయాత్రత్సోవానికి సారథ్యం ఆమెదే.

హైదరాబాద్‌ ‌శివారు ప్రాంతం ఘట్‌కేసర్‌ ‌సమీప గ్రామమే లక్ష్మీబాయి స్వస్థలం. చిన్నప్పటి నుంచి చదువు, ఆటపాటల్లోనూ ముందుండే ఆమె చదువుకుంది మద్రాసులోని ఆంధ్ర మహిళా సభలో. సంస్కరణవాది ఉన్నవ లక్ష్మీబాయమ్మ నెలకొల్పిన శారదా నికేతన్‌లో, మద్రాసు ఆర్టస్ ‌కళాశాలలో ఉన్నత విద్యా భ్యాసం ముగించుకున్న లక్ష్మీబాయి తదనంతరం భాగ్యనగరానికి చేరుకున్నారు. ఇరవై ఏళ్ల వయసులో ఉప్పు సత్యాగ్రహ భేరి మోగించి పాలకుల దురాగ్రహానికి గురయ్యారు. ఫలితం.. ఏడాదికి పైగా కఠిన కారాగారవాస శిక్ష. విడుదల కాగానే తిరిగి పోరుమార్గమే. సైమన్‌ ‌కమిషన్‌ ‌నిరసనోద్యమంలో పాల్గొన్నారు. సత్యధర్మ రక్షణకే ఈ సంగ్రామమని బహిరంగ సభాముఖంగా ప్రకటించారు.

 తల్లిదండ్రులను, కట్టుకున్న వ్యక్తిని కోల్పోయి అనాథగా మిగిలిన తనలాంటి జీవితం ఏ ఇతర వనితకు రాకూడదన్న భావనతో హైదరాబాద్‌ ‌నగరంలోని సంతోష్‌నగర్‌ ‌చౌరస్తా వద్ద శరణాల యాన్ని (ఇందిరా సేవా సదన్‌) ‌స్థాపించి నిర్వహిం చారు (అదే నేటి ఐఎస్‌ ‌సదన్‌). ‌సువిశాల స్థలంలో ఉన్న తన ఇంటినే మహిళా నిలయంగా తీర్చిదిద్దిన సేవా తత్పరురాలు. బాల్యంలో పేదరికాన్ని అనుభవించి, స్వయం కృషితో ఉన్నతి సాధించిన ఆమె అన్ని వర్గాలకు, ము్య•ంగా మహిళా లోకానికి అండగా నిలిచారు. మహిళా కళాశాల వసతి గృహ నిర్వహణను చేపట్టారు. అందులో తలమునకలవు తుండగానే, నగరంలో ఊపందుకున్న హైదరాబాద్‌ ‌విమోచన సాధనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అనేక మందిని ఉద్యమ బాటలో నడిపి, తిరుగులేని నేతగా కీర్తిగడించారు. ఎప్పుడూ ఖద్దరు వస్త్రధారణ. నుదుటి మీద గుండ్రటి బొట్టు. ఏం రాసినా, ఏది మాట్లాడినా, ఏ పని చేసినా జాతీయతా దీప్తి. తెగువ చూపినా, సేవ చేసినా తనకు తానే సాటి.

నలభై సంవత్సరాల ప్రాయమప్పుడు ఎదురైన అనుభవమే కీర్తికిరీటమై ఎదిగింది. అప్పటికే దేశం స్వాతంత్య్రాన్ని సముపార్జించుకుని మూడేళ్లయింది. భూదానోద్యమం యాతాక్రియలో భాగంగా తెలుగు నేలపై అడుగిడిన ఆచార్య వినోబాకు స్వాగతాంజలి పలికిన ఆమె, ఆయన ప్రసంగాలన్నింటినీ చక్కనైన తెలుగులోకి అనువదించారు. సందేశ పరంపరను వ్యాప్తి చేయడమే కాకుండా, ఆ మహనీయుడి వెంట పర్యటించారు. వందలాది ఎకరాల భూ సమీకరణ యజ్ఞంలో తన వంతు పాత్ర పోషించి శభాష్‌ అనిపించుకున్నారు లక్ష్మీబాయి. తెలుగు రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ప్రథమ శ్రేణి మహిళామణి. బాలికల విద్య, మహిళా స్వావ లంబనకు ఎన్నెన్నో ప్రణాళికలు రూపొందించి అమలు జరిపిన దక్షురాలు. బాలలందరికీ ఉచిత చదువు అందించేందుకు ఎంత చేయాలో అంతా చేసిన క్రియాశీలి. రాష్ట్ర ప్రభుత్వంలో తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్న తరుణంలో ప్రత్యేకించి అమ్మాయిల కోసమే విద్యాలయాల ప్రారంభానికి మూల కారకురాలు. చదువుతో సమస్త శక్తియుక్తులూ సొంతమై ప్రతి అతివ నేతగా రూపొందుతుంద నేందుకు నిదర్శనాలు ఆమె జీవనరంగంలోనే పుష్కలంగా ఉన్నాయి.

 బాలికల ఉన్నత పాఠశాల, మాత సంరక్షణా లయం, శిశువిహార్‌, ‌సంక్షేమ సలహామండలి, యువతీ మండలి… ఇలా అనేక సంస్థల నిర్వాహ కత్వం ఆమె బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక. విద్యార్థిని సంఘ నాయకురాలిగా, అన్నింటికన్నా రాజకీయ వేత్తగా ఎనలేని రాణింపు ఆమెది.

ఆకాశవాణితో పాటు పలు వేదికల మీద ఉత్తేజభరిత ప్రసంగాలు చేశారామె. జీవితంలో తాను ఎదుర్కొన్న సంఘటనలను ‘అనుభవాలు’ పేరిట అక్షరీకరించారు. దృఢత్వం, నిర్మలత్వం సంతరించు కున్న లక్ష్మీబాయి తెగువలో, సేవలోనూ మిన్న. స్త్రీ లోకానికి బహు చక్కని మార్గదర్శిని. సమస్యలపై సమరభేరి మోగించడం, సాధించిన విజయాల ఆస్వాదనతో నిత్య ఉత్సాహికావడం… ఆమెను చూసే నేర్చుకోవాలందరూ!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram