– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌స్వయంకృతాపరాధం.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. ఇవి శివసేన అధిపతి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రేకి అతికినట్లు సరిపోతాయి. ప్రస్తుతం శివసేనలో, మహారాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభానికి కారణం ఎవరంటే అందరి వేళ్లూ ఉద్ధవ్‌ ‌వైపే చూపుతాయి. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను చూసి ఉద్ధవ్‌ అభిమానులు ఆవేదన చెందక మానరు. అదే సమయంలో ఆయన వ్యతిరేకులు సంబరపడిపోవడం కూడా సహజమే. అధికారంపై యావ, మూల సిద్ధాంతాలను మరచి పోవడం, పార్టీ శ్రేణులను పట్టించుకోక పోవడం, దుష్టచతుష్టయం సలహాలను వేదవాక్కుగా పరిగణించడం ఈ పరిస్థితికి కారణమని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక, చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు తీరిగ్గా విచారించడం వల్ల ప్రయోజనం ఏమీలేదు. ఇది ఇప్పుడు ఉద్ధవ్‌కు అనుభవ పూర్వకంగా అర్థమైంది.

ఉద్ధవ్‌.. అధికారపీఠం ఎక్కిన తర్వాత శివసేన ముఖ్యనేతలను పూర్తిగా పక్కన పెట్టారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అంతేకాదు, ఏకనాథ్‌ ‌శిందే వంటి నమ్మకమైన, ప్రజాబలం గల నేతలను ఉద్ధవ్‌ ‌దూరం చేసుకున్నారు. ఈ తీరే ఇప్పుడు పార్టీలో చీలికకు దారితీసింది. శిందే ప్రజా బాహుళ్యంలో పట్టున్న నేత. పార్టీకి నమ్మినబంటు. పార్టీనే ప్రాణంగా పెట్టుకుని పనిచేస్తున్న నేత. వారసత్వంతో ఎదిగిన నేత కాదు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారు. ఒకప్పుడు ఆటో రిక్షా నడిపిన ఆయన నేడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ‌ఠాక్రే, పార్టీ థానే ఇన్‌ఛార్జి ఆనంద్‌ ‌దిఘే అడుగు జాడల్లో నడిచి పైకొచ్చిన నేత. 2004లో థాణె నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో కొపారి-పంచపఖాడి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో భాజపా, శివసేన మంత్రివర్గంలో పని చేశారు. ప్రస్తుతం ఉద్ధవ్‌ ‌ఠాక్రే మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి మంత్రి. ఉద్ధవ్‌ ‌ఠాక్రే శాసనసభ్యుడు కాకపోవడంతో శివసేన శాసనసభా పక్షనేతగా వ్యవహరించారు. పార్టీలో బలమైన నేతగా పేరుగాంచిన శిందే గత రెండేళ్లుగా పార్టీ నడుస్తున్న తీరుపై సంతోషంగా లేరు. ప్రభుత్వ పనితీరు పట్ల కూడా అదే పరిస్థితి. పార్టీ వ్యవస్థాపక సిద్ధాంతాలకు భిన్నంగా వేరే మార్గంలో ఉద్ధవ్‌ ‌సాగుతున్నారని, ఇది పార్టీకి ఎంతమాత్రం శ్రేయోదాయకం కాదన్నది శిందే వాదన. ఈ విషయాన్ని పలుమార్లు ఉద్ధవ్‌•కు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లైంది. దీంతో పార్టీ భవితవ్యం, దానిని నమ్ముకుని బతుకుతున్న తనలాంటి వేలాది మంది కార్యకర్తలు, నాయకుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని శిందే ఆవేదన చెందేవారు. వాస్తవానికి పార్టీ ప్రవచిత సిద్ధాంతానికి వ్యతిరేకమైనప్పటికి, ఉద్ధవ్‌ ‌సూచన మేరకు అప్పట్లో ఎంవీఏ ప్రభుత్వ ఏర్పాటులో శిందే కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఏకంగా ఉద్ధవ్‌ ‌ఠాక్రేనే సీఎం పదవి ఆశించడంతో శిందే ఆ విషయాన్ని మరచిపోయి పార్టీని పటిష్టం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ప్రజల్లో ఎలాంటి బలం లేని సంజయ్‌ ‌రౌత్‌కు పెద్దపీట వేయడం ఆయనకు నచ్చలేదు. సంజయ్‌ ‌రౌత్‌ ‌పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’ పత్రిక ఎడిటర్‌. ‌పత్రిక ఎడిటర్‌గా దానిని తీర్చిదిద్దడంపై కాకుండా పార్టీ, ప్రభుత్వ వ్యవహారంలో వేలు పెట్టట్డం పార్టీ శ్రేణులకు ఎంతమాత్రం నచ్చలేదు. ఇక సీఎం తనయుడు ఆదిత్య ఠాక్రేను మంత్రివర్గంలోకి తీసుకోవడం, భవిష్యత్‌ ‌ముఖ్యమంత్రి ఆయనేనంటూ జరుగుతున్న ప్రచారంపై శిందే ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా జరిగిన మండలి ఎన్నికల్లో ఎంవీఏ కూటమి వెనకబాటుకు పై పరిస్థితులే కొంతవరకు కారణమని చెప్పవచ్చు. మొత్తం పది సీట్లకు గాను శివసేన, ఎన్సీపీ రెండేసి సీట్లలో, కాంగ్రెస్‌ ఒక సీటులో విజయం సాధించగా భాజపా అయిదు సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. వాస్తవానికి కమలం పార్టీకి గల బలం ప్రకారం నాలుగు సీట్లే రావాలి. కానీ ఉద్ధవ్‌ ‌మీద వ్యతిరేకత కలిగిన కూటమిలోని కొంతమంది శాసనసభ్యుల మద్దతుతో భాజపా విజయవంతంగా అయిదో స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఠాక్రే కంగుతిన్నారు. శాసన సభ్యులపై పట్టు కోల్పోయానన్న సంగతి అర్థమైంది. ఇదే అదనుగా ఏకనాథ్‌ ‌శిందే నాయకత్వంలో కొంతమంది శాసనసభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తొలుత పక్కనున్న గుజరాత్‌లోని సూరత్‌కు, తరవాత గువాహటికి తరలిపోయారు. దీంతో ఆగ్రహించిన ఉద్ధవ్‌ ‌వెనువెంటనే శిందేను శాసనసభా పక్ష నేత పదవి నుంచి తొలగించారు. మెజార్టీ శాసనసభ్యులు శిందే వైపు ఉన్నారని గ్రహించిన ఉద్ధవ్‌ ‌చేసేదేమీ లేక ముఖ్యమంత్రి అధికార నివాసం ‘వర్ష’ నుంచి సొంతిల్లు అయిన ‘మాతోశ్రీ’కి వచ్చారు. తాను వీడింది అధికార నివాసాన్నే తప్ప ధైర్యాన్ని కాదని పైకి మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేస్తున్నప్పటికీ పదవి నుంచి దిగిపోక తప్పదని స్పష్టంగా అర్థమైంది. దీంతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. హిందూత్వమే శివసేన భావజాలమని, దాని నుంచి వైదొలగే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. గత ఏడాది వెన్నెముకకు శస్త్రచికిత్స చేయడం వల్ల ప్రజలను, పార్టీ శ్రేణులను, కార్యకర్తలను, శాసన సభ్యులను కలవలేక పోయాయని వివరించారు.

మరోపక్క శిందే వర్గం కూడా దీటుగానే స్పందించింది. శిందే వర్గం అధికార ప్రతినిధి దీపక్‌ ‌కెసర్కర్‌ ‌విలేకరులతో మాట్లాడుతూ, ‘మేం శివసేనను వీడలేదు. మరో పార్టీలో మా వర్గాన్ని విలీనం చేయడం లేదు’ అని స్పష్టం చేశారు. ఇంకా, ‘అసలైన శివసేన మాదే. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ ‌నుంచి మా పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఠాక్రే రాజీనామాను మేం కోరుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. మరోపక్క నిబంధనల పేరుతో శిందే వర్గ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేవిధంగా ఉద్ధవ్‌ ‌ఠాక్రే పావులు కదిపారు. శాసనసభ్యులుగా అనర్హతకు సంబంధించిన నోటీసులకు జూన్‌ 27‌లోగా సమాధానమివ్వాలని శిందే సహా 16 మంది తిరుగుబాటు నేతలకు అసెంబ్లీ సెక్రటరీ సమన్లు జారీచేశారు. చీఫ్‌ ‌విప్‌ ‌సునీల్‌ ‌ప్రభు ఇచ్చిన లేఖలోని జాబితా ప్రకారం ఈ సమన్లు వెళ్లాయి. మరోపక్క శాసనసభా పక్ష నేతగా శిందేను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్‌ ‌నరహరి జిస్వాల్‌ ‌తీసుకున్న నిర్ణయంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానంలో శిందేకు భారీ ఊరట లభించింది. సమాధానాలు ఇచ్చేందుకు గడువును జూలై 11 వరకు పొడిగిస్తూ తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారి ప్రాణాలకు, కుటుంబ సభ్యులకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే అదే సమయంలో శాసనసభలో బలపరీక్ష నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన వ్యాజ్యంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. డిప్యూటీ స్పీకరును అడ్డు పెట్టుకుని ప్రభుత్వం ఆడుతున్న నాటకానికి ఈ ఆదేశాలతో తెరపడినట్లయింది. అదే సమయంలో ఉద్ధవ్‌ ‌వర్గానికి పెద్ద ఎదురుదెబ్బగా పేర్కొనవచ్చు. మరోపక్క ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌కూడా రాజకీయంగా పావులు కదుపుతున్నారు. అసమ్మతి శిబిరంలో చేరడానికి గువాహటి వెళ్లిన 9 మంది మంత్రులపై ఉద్ధవ్‌ ‌కన్నెర్ర చేశారు. ఇప్పటివరకు వారు చూస్తున్న శాఖలను పరిపాలన సౌలభ్యం పేరిట వేరే మంత్రులకు కేటాయించారు.

ఇప్పటివరకు ముంబయి, గువాహటి చుట్టూ తిరిగిన మహారాష్ట్ర రాజకీయం ఇప్పుడు కోర్టుల వద్దకు వెళ్లింది. తొలుత స్పీకర్‌ అనర్హత నోటీసులపై శిందే వర్గం సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టింది. తాజాగా తిరుగుబాటు శాసనసభ్యులకు నాయకత్వం వహించడం ద్వారా రాష్ట్రంలో అశాంతి, రాజకీయ కల్లోల్లాన్ని రేకెత్తించడానికి శిందే ప్రయత్నిస్తున్నారని, బాధ్యతలను విస్మరిస్తూ నైతికంగా తప్పులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిల్‌ ‌దాఖలైంది. పలువురు మంత్రులు లేని సమయంలో పాలన ఎలా సాగుతుందో తెలిపే సవివర ప్రణాళికను సమర్పించా ల్సిందిగా సర్కారును ఆదేశించాలని కోరుతూ ఏడుగురు పౌరులు ‘పిల్‌’ ‌వేశారు. తిరుగుబాటు శాసనసభ్యులు రాష్ట్రానికి రావాలంటూ ఆదేశించా లని వారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై విచారణకు ఇంకా తేదీని కోర్టు నిర్ణయించలేదు. మరోపక్క గవర్నర్‌ ‌భగత్‌సింగ్‌ ‌కోశ్యారీ కూడా ప్రభుత్వ పాలనపై కన్నేసి ఉంచారు. ఈ నెల 22 నుంచి 24 వరకు ప్రభుత్వం వెలువరించిన ఆదేశాలు, ఉత్తర్వులను తనకు సమర్పించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రోజురోజుకి శిందే బలం పెరుగుతుండగా, ఉద్ధవ్‌ ‌బలం తగ్గుతోంది. ప్రస్తుతం శివసేనకు చెందిన 9 మంది మంత్రులు శిందే వైపు చేరిపోయారు. మంత్రివర్గంలో శివసేన మంత్రులు నలుగురే ఉన్నారు. మరోపక్క సోనియా, పవార్‌ ‌వంటి వారు ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పవార్‌ ‌పడరాని పాట్లు పడుతున్నారు. తన చాతుర్యాన్నంతా ప్రదర్శిస్తున్నారు. శివసేనలో తిరుగుబాట్లు కొత్తేమీ కాదు. బాల• ఠాక్రే హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. గతంలో రాజ్‌ ‌ఠాక్రే, నారాయణ రాణె, చగన్‌ ‌భుజబల్‌ ‌వంటి వారు పార్టీపై తిరుగుబాటు చేశారు. 1991లో చగన్‌ ‌భుజబల్‌ ‌కాంగ్రెస్‌లో చేరారు. 2003లో ఉద్ధవ్‌ను వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా నియమించడాన్ని నిరసిస్తూ నారాయణ రాణె కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదంటూ బాల్‌ ‌ఠాక్రే సోదరుడి కుమారుడైన రాజ్‌ ‌ఠాక్రే 2005లో మహారాష్ట్ర నవనిర్మాణ సమితి పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. 2014లో 13 సీట్లు గెలుచుకున్న ఆయన పార్టీ 2019లో ఒక స్థానానికే పరిమితమైంది. అప్పట్లో బాల్‌ ‌ఠాక్రే పార్టీలో తిరుగుబాట్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. పార్టీని కాపాడుకున్నారు. కానీ ఇప్పుడు ఉద్ధవ్‌కు అది సాధ్యం కాకపోవచ్చనే విశ్లేషకులు చెబుతున్నారు.

అధికార దాహంతో సిద్ధాంతాలకు పాతర

తండ్రి బాల్‌ ‌ఠాక్రే నుంచి శివసేన అధికార పగ్గాలు అందుకున్న ఉద్ధవ్‌ ఆయన బాటలో నడిస్తే ఇబ్బందులు ఉండేవి కావు. రాజకీయ జీవితం సాఫీగా సాగిపోయేది. బాల్‌ ‌ఠాక్రే ఏనాడూ అధికారం కోసం అర్రులు చాచలేదు. ఎమ్మెల్యే కావాలనో, మంత్రి కావాలనో, ముఖ్యమంత్రి కావాలనో ఆయన ఏనాడూ కోరుకోలేదు. నిజానికి ఠాక్రే పదవులు కోరుకుంటే అవి క్షణాల్లో ఆయన ముందు వచ్చి వాలేవి. కానీ ఆయన పదవులకు పూర్తిగా దూరం. ఆ దివంగత నేతకు మహారాష్ట్ర ప్రయోజనాలే పరమావధి. రాష్ట్ర ప్రజల బాగోగులే ముఖ్యం. ఏనాడూ అధికారం చేపట్టనప్పటికీ తన కనుసైగలతో అధికారంలో ఉన్న వారినే శాసించేవారు. పార్టీలకు అతీతంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల అధినేతలు ఆయన ఇంటిముందు (మాతోశ్రీ) వాలేవారు. వాజపేయి, అడ్వాణీ వంటి వారు సైతం ఠాక్రే దగ్గరకు వచ్చేవారు. ఠాక్రే దర్శనానికి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు సైతం బారులు తీరేవారు. అందువల్లే ఠాక్రే బతికున్నంత కాలం పులిగానే బతికారు. ఆయనను వ్యతిరేకించే వారు కూడా మహారాష్ట్ర ప్రయోజనాల పట్ల ఠాక్రే నిబద్ధతను ప్రశంసించేవారు. మాటమీద నిలబడటం ఠాక్రే లక్షణం.

ఆయన వారసుడైన ఉద్ధవ్‌కు తండ్రి నుంచి ఒక్క మంచి లక్షణం అబ్బలేదు. తండ్రి తదనంతరం పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన చూపంతా ముఖ్యమంత్రి పదవిపైనే ఉండేది. ఇందులో తప్పేమీ లేదు. కానీ ఆ దిశగా ప్రజల మెప్పు పొందేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఏమీ లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో జట్టు కట్టిన శివసేన మంచి ఫలితాలనే సాధించింది. ఉద్ధవ్‌ ‌తెరవెనక ఉన్నప్పటికీ ఆయన పార్టీకి చెందినవారు అధికారంలో భాగస్వాములు అయ్యారు. నాటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌ప్రభుత్వంలో శివసేన నాయకులు మంత్రులుగా చేరారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ భాజపా-శివసేన మంచి ఫలితాలనే సాధించింది. అదేవిధంగా అదే ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసే బరిలోకి దిగాయి. మంచి ఫలితాలే సాధించాయి. మొత్తం 288 స్థానాలకుగాను భాజపా 106, శివసేన 55 స్థానాలు సాధించాయి. సహజంగా ఎక్కడైనా మెజార్టీ సీట్లు సాధించిన పార్టీని సీఎం పదవి వరిస్తుంది. జూనియర్‌ ‌భాగస్వామికి డిప్యూటీ సీఎం పదవో, మంత్రివర్గంలో కీలక భాగస్వామ్యమో లభిస్తుంది. భాజపా-సేన పొత్తు ఎన్నికలకు ముందు కుదిరింది. అందువల్ల ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండటం ధర్మం. కచ్చితంగా ఇక్కడే ఉద్ధవ్‌ ‌వాస్తవ విరుద్ధంగా వ్యవహరించి తాత్కాలిక ప్రయోజనాల కోసం పక్కదారి పట్టారు. అకస్మాత్తుగా తనకే సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. దీంతో ఆశ్చర్యపోవడం బీజేపీ వంతైంది. ఇది పూర్తిగా అహేతుకమైన, అసహజమైన డిమాండ్‌. ఉద్ధవ్‌ ‌రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. మొండితనానికి, అధికార యావకు ఆయన డిమాండ్‌ అద్దం పట్టింది. ఇరుపార్టీలు దాదాపు సమానంగా సీట్లు సాధించి నట్లయితే సీం పదవి విషయమై పోటీ పడవచ్చు. అలా కాకుండా జూనియర్‌ ‌భాగస్వామి ఏకంగా సీఎం పదవి అడగటం విచిత్రం. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.

తన డిమాండ్‌కు భాజపా తలొగ్గకపోవడంతో ఉద్ధవ్‌ ‌పక్కదారి పట్టారు. సిద్ధాంతాలు, విలువల విషయంలో రాజీపడ్డారు. అధికారం కోసం దిగజారి పోయారు. బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్‌, ‌నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మద్దతుతో తన జీవితకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మహా వికాస్‌ అగాఢీ (ఎంవీఏ) పేరుతో సంకీర్ణ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఇలా చేయడం అంటే దివంగత బాల్‌ ‌ఠాక్రే నమ్మిన విలువలకు, సిద్ధాంతాలకు నీళ్లు వదిలినట్లే. ఎందుకంటే ఆయన జీవితకాలం ఏ పార్టీ (కాంగ్రెస్‌)‌పై పోరాడారో ఆ పార్టీ మద్దతుతో సర్కారును ఏర్పాటుచేయడం అంటే శివసేన పునాదులను పెకలించడమే అవుతుంది. బయటి నుంచి మద్దతు పేరుతో కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, తన అవసరం తీరుగానే ఏదో పేరుతో వాటిని కూల్చడం హస్తం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. 1990ల్లో కేంద్రంలో దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్‌, అం‌తకుముందు చరణ్‌సింగ్‌, ‌చంద్రశేఖర్‌ ‌ప్రభుత్వాలను గద్దెనెక్కించిన తీరు, తరువాత వాటిని కూల్చిన తీరు చూసిన తరవాత హస్తం పార్టీ ఎలాంటి మిత్రపక్షమో రాజకీయ నాయకులు అందరికీ అర్థమైంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఉదాహరణ లకు లెక్కలేదు. అధికార మత్తు తలకెక్కిన ఉద్ధవ్‌కు ఇవేమీ పట్టలేదు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌కు బ్రోకర్‌ అన్న పేరుంది. అధికారం కోసం ఎత్తులు పైయెత్తులు వేయడంలో పవార్‌ ‌దిట్ట. ఆయనకు సిద్ధాంతాలు, విలువలు వంటి బాదరాబందీ ఏమీ లేవు. కావాల్సిందల్లా అధికారమే. సోనియా విదేశీయతపై ప్రశ్నించి కాంగ్రెస్‌ ‌నుంచి బయటకు వచ్చిన పవార్‌ ‌మళ్లీ ఆ పార్టీతో అంటకాగారు. ఇందుకు గల ఏకైక కారణం అధికారమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అవకాశవాద పవార్‌ను, వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఉద్ధవ్‌ ‌చేసిన పెద్ద తప్పు. అధికారం కోసం మూడు దశాబ్దాలకు పైగా భాజపాతో గల అనుబంధాన్ని తెంచుకున్న ఆయన ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు.

 ఇక అధికారాన్ని చేపట్టిన తరవాత అయినా సరిగా వ్యవహరించారా? అంటే అదీ లేదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాని ఉద్ధవ్‌ ‌సీఎం అవడమే ఓ వైచిత్రి. అరకొర బలంతో అధికారం చేపట్టిన ఆయన గవర్నరుతో, కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వారు. పార్టీకి వెన్నెముక వంటి కార్యకర్తలను దూరం పెట్టారు. ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండలేక పోయారు. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో మాట్లాడటం శాసనసభ్యులకు గగనమైంది.

దీంతో వారు విసుగు చెందారు. క్రమంగా పార్టీకి దూరమయ్యారు. పార్టీకి చెందిన మంత్రులకే ఆయన దర్శనం దుర్లభమైంది. అదే సమయంలో పుత్ర వాత్సల్యం హద్దులు దాటింది. కుమారుడైన మంత్రి ఆదిత్య ఠాక్రేకు అన్నీ అప్పగించి అచేతనంగా ఉండిపోయారు. ఆదిత్య రాజ్యాంగేతరశక్తిగా మారారన్న ఆరోపణలు విపక్షాల నుంచే కాకుండా సంకీర్ణ కూటమి నేతల నుంచి వినపడ్డా పట్టించుకోలేదు. అదే సమయంలో పార్టీకి చెందిన సంజయ్‌ ‌రౌత్‌ ‌చేతిలో ఉద్ధవ్‌ ‌బందీ అయ్యారు. ఆయన ఎంతంటే అంతన్న పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంలో సంజయ్‌ ‌రౌత్‌ అనధికార శక్తిగా మారిపోయారు. తెరవెనక, తెరపైన అన్ని పాత్రలను ఆయనే పోషించారు. ఉద్ధవ్‌ ‌భార్య రశ్మిక కూడా తక్కువేమీ కాదు. భర్తను ముఖ్యమంత్రిగా, కుమారుడిని మంత్రిగా చూడాలన్న కోరికతో చివరికి పార్టీని భూస్థాపితం చేశారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె జోక్యం పెరిగిపోయింది. మహారాష్ట్ర ప్రయోజనాల కన్నా కుటుంబ ప్రయోజ నాలే ఆమెకు ముఖ్యమయ్యాయి. విశ్వసనీయత కొరవడిన కాంగ్రెస్‌, ‌పవార్‌ ‌వంటి వారితో స్నేహం వల్ల ఉద్ధవ్‌కు జరిగిన లాభం కన్నా నష్టమే ఎక్కువ. సంజయ్‌ ‌రౌత్‌, ఆదిత్య ఠాక్రే, శరద్‌ ‌పవార్‌, ‌పీసీసీ అధ్యక్షుడు నానా పటోలె… దుష్టచతుష్టయంగా మారారు. అంతిమంగా పార్టీని స్వయంగా ఉద్ధవ్‌ ‌దెబ్బతీశారు.

ఏది ఏమైనా ఉద్ధవ్‌ ‌ఠాక్రే పదవి నుంచి వైదొలగడం అనివార్యం.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram