అహంకారం దరిచేరనీయకుండా దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పరమపూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ శ్రీ ‌మోహన్‌జీ భాగవత్‌ అన్నారు. భాగ్యనగరంలో ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌) ‌నూతనంగా నిర్మించిన ‘స్పూర్తి ఛాత్ర శక్తి భవన్‌’ ‌ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

మోహన్‌జీ ప్రసంగం వారి మాటల్లోనే..

‘అనేక కష్టనష్టాలను ఓర్చుకొని, ఎంతోకాలం శ్రమించి ఈ కార్యాలయం నిర్మించిన వారందరికీ అభినందనలు. మన ఆలోచన న్యాయబద్ధమైనదైతే, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదో ఒకరోజు తప్పక విజయం లభిస్తుంది అనడానికి ఈ కార్యాలయ నిర్మాణమే ఒక ఉదాహరణ. ఏబీవీపీ అంటే ఏమిటో తెలం గాణలో విద్యార్థి పరిషత్‌ ‌పనితీరు చూసి తెలుసు కోవచ్చు. ప్రతికూల వాతావరణంలో మన పని వేగం పెంచడానికి చెమటోడ్చడంతో పాటు రక్తాన్ని కూడా చిందించాల్సి వచ్చింది. నేటి అనుకూల సమయంలో ఎంతో సంయమనంతో పనిచేయవలసి ఉంటుంది.

సత్యాన్ని, న్యాయాన్ని నమ్ముకుని నడుస్తున్న ప్పుడు.. తమదే సత్యం ఇతరులదంతా అసత్యం అనుకునే తర్కవాదులు వారి సర్వశక్తులను ఒడ్డి సత్యాన్ని, న్యాయాన్ని అణిచివేయాలని చూశారు. కాని సత్యం ఎప్పటికీ దాగదు. అన్యాయాలను ఎదురించి తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన కార్యకర్తల తపస్సు ఫలమే ఈ కార్యాలయం.

ఇక్కడి ఏబీవీపీ కార్యానికి ఘనచరిత్ర ఉన్నది. ఇదంతా చూసి మన మనసులో ఒక స్ఫూర్తి ఉద్భవిస్తుంది. మొదటినుండి తెలంగాణ ప్రాంతంలో ఏబీవీపీ కార్యం అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు, ఇక్కడి ఏబీవీపీ కార్యం దేశవ్యాప్తంగా ట్రెండ్‌ ‌సెట్టర్‌గా కూడా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు విరోధులను ఎదుర్కొని నిలబడటం, మరోవైపు ఆ విరోధులతో కలిగిన నష్టాన్ని నివారించి, కార్యాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడం.. ఈ రెండూ తెలంగాణ ఏబీవీపీకే చెల్లాయి. వీటి ప్రతిరూపమే నేటి కార్యాలయం.

సంఘ ప్రార్థనలో చెప్పినట్లు ఇది ముళ్లబాట. 30 ఏళ్ల క్రితమే ఇది మనకు అనుభవమయింది. ఇప్పటి కార్యకర్తలు మన దారిలో ముళ్లు ఎక్కడ ఉన్నాయి? అని అడుగుతున్నారు. అంటే, మనం ఆ సమయంలో సహనం, ఓపిక చూపాం. వ్యతిరేక వాతావరణంలో సంఘర్షణ చేశాం. కష్టనష్టాలు ఎదురైనా కార్యకర్తల కోసం, కార్యం కోసం ముందుకే వెళ్లాం. మనలో శత్రుభావన రాకుండా నిగ్రహం, విశ్వాసం పెంచుకున్నాం. ఇప్పుడు కార్యాలయం ఏర్పాటైంది. ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. సమాజంలో విశ్వాసం, ప్రేమ పెంచడానికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది. ఒక సమయంలో ఏబీవీపీ కార్యకర్తలను చూసి అందరూ నవ్వేవారు. వాళ్లు సరస్వతీ ప్రార్థన చేయడం, ఫస్ట్ ‌ర్యాంకులో నిలిచిన వారికి అభి నందనలు తెలపడం మినహా వారికి ఏమీ తెలియదని హేళన చేసేవారు. కాని మనల్ని హేళన చేసినవారే ఇప్పుడు మన దారిలో నడుస్తున్నారు. మనల్నే అను సరిస్తున్నారు. అప్పుడు మనల్ని పట్టించుకోని వారు ఇప్పుడు మనల్ని అగ్రగణ్యులుగా గుర్తిస్తున్నారు. ఈ సమయంలో ముళ్లబాట, అంటే మనకున్న సౌకర్యాలే కంటకంగా మారుతాయి. ఆనందం, ఉత్సాహం సెలబ్రేట్‌ ‌చేసుకునేటప్పుడు కొంత జాగరూకత కూడా అవసరమే. లేదంటే అనుకూలత కూడా కంటకమే అవుతుంది. సమాజంలో ఒక స్థాయికి రాగానే ఎవరి కైనా అహంకారం వస్తుంది. కానీ అందరి లాగా మనం కేవలం విజయం కోసమే పరితపించరాదు. విజయమే మన లక్ష్యం కాదు, అది మార్గం మాత్రమే కావాలి. ఎందరో రాజులు, ఎన్నో యుద్ధాల్లో విజ యాలు సాధించారు. కానీ వాళ్లు కొన్నేళ్లే గుర్తున్నారు. ఎన్ని యుగాలకైనా గుర్తుంచుకోదగినది శ్రీరాముడు ఒక్కరే. ఆయననే మనందరం ఆదర్శంగా తీసు కోవాలి. యుగాల నాడే పితృవాక్య పరిపాలన కోసం అడవి మార్గం పట్టిన రాముడిని కేవలం స్మరించడమే కాదు, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. జూలియస్‌ ‌సీజర్‌ ఎన్ని విజయాలు సాధించినా అహంకారంతో అడుగంటిపోయాడు. ధర్మాన్ని ఆచరణలో చూపి మన రాముడు అందరి నోళ్లలో నానుతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లో కొన్ని గ్రామాల్లో కొన్ని చదరపు కిలోమీటర్ల వరకు శనగ పంట పండించరు. ఎందు కంటే సీతమ్మ వివాహం తరువాత జనకపురి నుండి అయోధ్యకు వస్తున్నప్పుడు కొంతదూరం పల్లకీలో, కొంతదూరం నడిచి వచ్చారు. ఆ సమయంలో అక్కడ క్కడ ఉన్నటువంటి ఎండిపోయిన శనగగింజలపై నడవడం వల్ల రక్తం వచ్చింది. కాబట్టి నేటికీ అక్కడ రైతులు శనగలు పండించడం లేదు. సీతమ్మ ఇప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయింది.

ధీరులను అనుకూల, ప్రతికూలతలు ప్రభావితం చేయలేవు. వారిని పొగిడినా, తెగడినా, ఇప్పుడే మరణం ముంచుకొచ్చినా, యుగాంతం వరకు మరణం కోసం ఎదురుచూడాల్సి వచ్చినా వారు చలించరు. సత్యం, న్యాయమార్గాలనే ఎల్లప్పుడూ ఆచరిస్తారు. వారు ఏ స్థితి నుండి వచ్చారో, అనగా ఏ స్థితి నుండి కార్యం ప్రారంభించారో ఆ స్థితిని మరచిపోరు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను. ఒక రాజ్యంలో మంత్రి పదవి పొంది రాజు చేత అమితంగా గౌరవం పొందుతున్న ఒక సాధారణవ్యక్తి ప్రతిరోజు రాత్రి 12 గంటలకు అడవికి వెళ్లి మంత్రిపదవి పొందకముందు తాను నివసించిన పాడుబడిన ఇంట్లోకి వెళ్లి చెక్కపెట్టెలో భద్రంగా దాచిన చిరిగిన కోటును దర్శించేవారు. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే స్పృహ మనకు కచ్చితంగా ఉండాలి.

ధనవంతుల ఇళ్లలో పూలచెట్లకు కావలసినంత ఎరువువేసి పూలు విరగబూసేటట్లు చేస్తారు. కానీ అడవిలోని చెట్లకు పూసే పూలు స్వయంగానే పూయాలి. ఎవరూ ఆ చెట్లకు ఎరువు, నీరు పెట్టరు. ‘క్రియాసిద్ధిః సత్వేభవతి మహతాం నోపకరణే’  (సత్ఫురుషులు ఉపకరణాలపై ఆధారపడకుండా క్రియాసిద్ధితోనే విజయం పొందుతారు.) మన గూర్చి ప్రపంచంలో మంచి చెప్పిన వాళ్లు లేరు. తిట్లు, నిందలే చవిచూశాము. అటువంటి స్థితి నుంచి మనకు ప్రచారం, ప్రభుత్వం లేనిచోట, అనుభవం లేనిచోట స్వశక్తితో పైకి ఎదిగాం. పెద్దపెద్ద కార్యాలను సౌకర్యాలతో కాకుండా కార్యకర్తల శక్తితో సాధించడమే ఆవశ్యకం. ఆత్మీయత, ధ్యేయనిష్ట, అనుశాసనంతో కార్యకర్తల గుణాలను వికసింపజేసి వారిని శక్తిమంతులుగా చేశాం.

జ్ఞానం, శీలం, ఏకతలే మన బలం కావాలి. నూతన భవనంతో లభించిన ఉత్సాహం కార్యవేగం పెంచడానికి పూర్తిగా వినియోగించాలి. శీలం ఉన్న చోటే అన్ని సద్గుణాలు ఉంటాయి. ప్రహ్లాదుడు శీలాన్ని దానంచేసి రాజ్యపదవినే కోల్పోయాడు. కాబట్టి మనం ఎప్పుడూ మోసాల వెంట, కీర్తి వెంట, అబద్ధాల వెంట పడరాదు. మనమెప్పుడూ ప్రసిద్ధి వెనుక పరుగెత్తలేదు. మనం మన శీలం, బలంపైనే ఆధారపడ్డాం. ఆ శీలాన్ని కోట్లాది హృదయాల్లో రగిలించటంలో సఫలమైనాం. ఏబీవీపీలో జ్ఞానం, శీలం, ఏకత ఆధారంగా పని నిలబెట్టాం. ఈ బలంపైనే ఆధారపడి ఇంతవరకు వచ్చాం. భవన నిర్మాణం చేశాం. ఒక విధమైన సౌకర్యం లభించింది. దీనిద్వారా మన సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోవాలి. సామర్థ్యం ఎలా పెరుగుతూ వస్తుందో అలా వైభవం సాధించాల్సిందే. అది అవసరమే.

‘యత్ర యోగేశ్వరః కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ’

(భగవద్గీత 18-78)

ధ్రువా నీతి (ధృడమగు నీతి) సత్త్వానికి సంబం ధించింది. వీటితో పాటుగా శ్రీ (సంపద), విజయం, భూతి (ఐశ్వర్యం) కూడా కావాల్సిందే. ఈ ఆనంద సమ యంలో దీనిని దృష్టిలో ఉంచుకొని కార్య సాధనలో ముందుకు సాగు తున్నప్పుడు మనం ఈ వైభవానికి యజమాని అని సావధానంతో మెలగాలి. వైభవం ఆధారంగా మన సత్త్వాన్ని అధికాధిక తేజస్సుతో ప్రకటించుకోవాలి. ఈ వైభవం అందుకే ఉపయోగపడాలి.’

ఈ కార్యక్రమంలో అతిథులుగా ఏబీవీపీ అఖిల భారత సంఘటనా కార్యదర్శి ఆశిష్‌చౌహాన్‌, అఖిల భారత ప్రధాన కార్యదర్శి కుమారి నిధిత్రిపాఠి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఏబీవీపీ కార్యకర్తలు, పూర్వ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.

About Author

By editor

Twitter
Instagram