– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌     

ఓటుబ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు.. పేరేదైనప్పటికీ అవి ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయి. వీటివల్ల తాత్కాలికంగా ఆయా రాజకీయ పార్టీలకు మేలు జరగవచ్చేమో కానీ, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తాయి. ప్రజల మధ్య చీలికలు తెస్తాయి. చిచ్చు పెడతాయి. విభేదాలు, విద్వేషాలను రగిలిస్తాయి. లౌకికవాదానికి ప్రతినిధులమని చెప్పుకునే కుహనా పార్టీలు కొన్ని ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. అయితే తమ రాజకీయాల వల్ల చివరికి దేశానికి హాని చేస్తున్నామన్న విషయాన్ని అవి గ్రహించడంలేదు. దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా తమకు సంబంధం లేదని, రాజకీయ లబ్ధే తమకు ముఖ్యమని చెప్పడం ద్వారా దేశాన్ని ముక్కలు చేసేందుకు వెనకాడటం లేదు. ఇలాంటి విభజన రాజకీయాల వల్ల ఇప్పటివరకు దేశం ఎదుర్కొన్న చేదు అనుభవాలను చూసైనా అవి తమ పంథా మార్చుకోవడం లేదు.

వందేళ్ల చరిత్ర గల హస్తం పార్టీ, అంతర్జా తీయ పార్టీలమని చెప్పుకునే వామపక్షాలు ఈ తరహా రాజకీయాలు చేయడంలో పెట్టింది పేరు. తాము ఎండమావుల వెంట పరుగెడుతున్న విషయాన్ని ఈ పార్టీలు గ్రహించడం లేదు. ఒకప్పుడు సువిశాల భారతాన్ని సుదీర్ఘ కాలం పాలించిన హస్తం పార్టీ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకు పరిమితమైంది. వామపక్షాలు ఉనికిని కోల్పోతున్నాయి. బెంగాల్‌, ‌త్రిపుర వంటి కంచుకోటలు కూలిపోయినా వాటి వైఖరిలో మార్పు రావడంలేదు. ఒక్క కేరళలో మాత్రం పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని సాగిస్తోంది.

కరౌలీలో కిరాతకం..

రాజస్తాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ తనదైన పాత పంథాలో ప్రయాణిస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరలేపుతోంది. మైనార్టీలను బుజ్జగిస్తూ మెజార్టీ ప్రజల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలను పెంచుతోంది. కరౌలీ ఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఈ నెల మొదటివారంలో నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని భరత్‌పూర్‌ ‌డివిజన్‌లోని కరౌలీలో కొన్ని హిందూ సంస్థలు ప్రదర్శన నిర్వహించాయి. 2015 తరవాత ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. అన్య మతస్తుల కార్యక్రమాలకు బందోబస్తు పేరుతో నానా హడావిడి, ఆర్బాటం చేసే పోలీసు యంత్రాంగం ఎప్పటిలాగానే హిందూ సంస్థలు నిర్వహించిన ఈ కార్యక్రమంపై శీతకన్నేశాయి. చూసీచూడనట్లు వ్యవహరించాయి. భద్రతాపరంగా పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కొన్ని ఛాందస సంస్థలు ప్రదర్శనపై రాళ్లు రువ్వాయి. విధ్వంసానికి పాల్పడ్డాయి. దుకాణాలను ధ్వంసం చేశాయి. మోటారు బైకులకు నిప్పు పెట్టాయి. హింస చెలరేగింది. కరౌలీలోని హత్వాడా బజార్‌ ‌మీదుగా ప్రదర్శన సాగుతుండగా ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. 24 మంది హిందువులు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువమంది ఉంటారు. ఈ ఘటనలో 37 మందిపై ఎఫ్‌ఐఆర్‌ (‌ఫస్ట్ ఇన్ఫర్మేషన్‌ ‌రిపోర్టు)ను నమోదు చేశారు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 15రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతటితో తన పని అయిపోయినట్లు భావించి చేతులు దులిపేసుకుంది. ఈ విషయాన్ని పక్కనపెడితే ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉంది. తప్పంతా ప్రదర్శనకారులదే అన్నట్లు ఉంది వారి వాదన. ఎవరో చిన్నస్థాయి అధికారి వాదన కాదిది. ఏకంగా రాష్ట్ర డీజీపీ (డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌) ‌మోహన్‌లాల్‌ ‌లాధర్‌ ‌ప్రదర్శనకారుల తీరు అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. విచారణలో తేలాల్సిన విషయాన్ని ముందే పేర్కొనడం, అదీ ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పడం వింతగా ఉంది. అధికారంలో ఉన్న వారి ప్రోద్బలం లేకుండా సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ఇలా మాట్లాడలేరు. ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లత్‌ ‌మార్గదర్శకత్వం మేరకే డీజీపీ మాట్లాడారన్నది సుస్పష్టం. భాజపా నాయకుడు, ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాధోడ్‌ ఈ ‌విషయంపై సూటిగా నిలదీసినా ప్రభుత్వం నుంచి స్పందన కొరవడింది. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం మీదుగా ర్యాలీ నిర్వహించ రాదని ఏ చట్టం చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రదర్శనలు నిర్వహించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముందుజాగ్రత్తగా వాటికి భద్రత కల్పించడం ప్రభుత్వం, పోలీసుల బాధ్యత. ఈ విహిత కర్తవ్యాన్ని విస్మరించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అంతా అయిపోయిన తరవాత 50 మంది డీఎస్పీలు, 600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో పోలీసులకే తెలియాలి. నగరంలో కర్ఫ్యూ విధించడం, అంతర్జాల సేవలను నిలిపి వేయడం వల్ల సాధించేదేమిటో అర్థం కాని విషయం. ఈపాటి తెలివిడి ముందే చూపి ఉంటే అసలు కరౌలీలో అవాంఛనీయ ఘటనలు జరిగి ఉండేవి కావు. ఈ విషయంలో గెహ్లాత్‌ ‌ప్రభుత్వ వైఖరి ‘చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్న చందం’గా ఉందన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ విమర్శలను పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నది చేదునిజం. దేశంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా నానా హడావిడి చేసే హస్తం పార్టీ ఢిల్లీ పెద్దలు కరౌలీ ఘటనపై మౌనం వహించడం వారి ద్వంద్వ వైఖరిని చాటు తోంది. కరౌలీ ఘటనను భూతద్దంలో చూపేందుకు వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌కాలమిస్ట్ ‌ఖలీల్‌ ‌బేడన్‌ ‌తన వంతు ప్రయత్నం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో అభ్యంతరకర పోస్టులను పెట్టాడు.

గోరఖ్‌పూర్‌లో ఘోరం…

మొన్నటి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన యూపీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి శషభిషలకు తావు లేకుండా ప్రజలు కమలం పార్టీకి పట్టం కడుతూ స్పష్టమైన తీర్పిచ్చారు. అక్కడ అధికార పార్టీ రెండోసారి గెలవడం మూడు దశాబ్దాల తరవాత ఇదే ప్రథమం. ఒకప్పటి గోరఖ్‌పూర్‌ ‌మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్‌ ‌పాలనను ప్రజలు మెచ్చి ఆయనను దీవించారు. ఈ ప్రజా విజయాన్ని కొన్ని ఛాందసవాద సంస్థలు, వ్యక్తులు జీర్ణించుకోవడం లేదు. వ్యక్తిగతంగా యోగి పైనా, ఆయన మఠంపైనా బురద చల్లుతూనే ఉన్నారు. దాడులకు దిగుతూనే ఉన్నారు. ఈ నెల 4న నగరంలోని గోరఖ్‌నాథ్‌ ఆలయంపై దాడి ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి ఆలయంలోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించి అక్కడి పోలీసులపై దాడికి తెగబడ్డారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని నగరానికి చెందిన ముర్తాజా అబ్బాసీగా పోలీసులు గుర్తించారు. ముర్తాజాను కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ ‌విధించింది. గాయపడిన పోలీసులకు, దాడిని అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మరో పోలీసుకు రూ. 5 లక్షల వంతున బహుమానాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌ప్రకటించారు. ‘ఆలయం వద్ద దాడి ముందస్తు కుట్రలో భాగంగా జరిగిందే. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొనవచ్చు. దురుద్దేశంతోనే నిందితుడు ఆలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. దాడిని రాష్ట్ర పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. ఆలయానికి, భక్తులకు ముప్పు వాటిల్లకుండా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశంసనీయం’ అని రాష్ట్ర హోం మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే దీనిని ముందస్తు ఉగ్రకుట్ర గా పేర్కొనడంలో ఎలాంటి సందేహం లేదు. నిందితుడు అమాయకుడేమీ కాదు. అన్నీ తెలిసిన వ్యక్తే. ఐఐటీ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ) ముంబయిలో విద్యనభ్యసించిన తెలివైన యువకుడు. 2015 బ్యాచ్‌ ‌విద్యార్థి. కొంతకాలం ఒక బహుళజాతి సంస్థలో కెమికల్‌  ఇం‌జనీరుగా పనిచేశాడు. తన కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోవాలని అతని తండ్రి మునీర్‌ అబ్బాస్‌ ‌కోరడం గమనార్హం. కన్నతండ్రిగా మునీర్‌ ‌తన కుమారుడి సమస్య గురించి చెప్పడం, అతనిని వెనకేసుకు వచ్చాడంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు.

కానీ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌సైతం ఇదే వాదనను వినిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ముర్తాజా గురించి ఆయనకేమి తెలుసు? ఇదే పని మరొకరు చేస్తే అఖిలేశ్‌ ‌యాదవ్‌ ఇలాగే మాట్లాడతారా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకదు. చట్టపరంగా నిందితుడిపై తగిన చర్య తీసుకోవాలని, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతా చర్యలను బలోపేతం చేయాలని కోరడం ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా అఖిలేశ్‌ ‌కర్తవ్యం. దీనిని విస్మరించడం అంటే ఒక మతాన్ని, ఒక అవాంఛనీయ ఘటనను వెనకేసుకు రావడమే అవుతుంది.  నిజంగా మానసిక సమస్యతో బాధపడే వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించేం దుకు ఎందుకు ప్రయత్నిస్తాడు, దాడికి ఎందుకు తెగబడతాడు, ఇంతకాలం బహుళజాతి సంస్థలో ఎలా పనిచేసాడన్న ప్రశ్నలకు మాత్రం మునీర్‌ అబ్బాసీ నుంచి గానీ, అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌నుంచి గానీ సమాధానం దొరకదు. తప్పు ఎవరు చేసినా తప్పే. అతని కులాన్ని, మతాన్ని, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చూడటం చట్ట విరుద్ధం.

ప్రాథమికంగా లభించిన సమాచారం మేరకు చూస్తే ముర్తాజా ఉగ్రవాది. ఐఎస్‌ఐఎస్‌ (ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అం‌డ్‌ ‌సిరియా) ప్రభావిత వ్యక్తి. మత ఛాందసవాది. అవివాహితుడు. ఐఎస్‌ఐఎస్‌లో చేరాలన్నది అతని కోరిక. ఇందులో భాగంగా 2016లో ఒకసారి సౌదీ అరేబియా వెళ్లి వచ్చాడు. 2020లో తన నివాసాన్ని గోరఖ్‌పూర్‌కు మార్చుకున్నాడు. పెళ్లి, పిల్లలు వంటి జీవితం తనకు అక్కరలేదని, అల్లాను చేరుకోవడమే తన లక్ష్యమని వాదించేవాడు. ఇంత అవగాహన గల వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదంటే నమ్మశక్యం కాదు. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ‌గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లా పేరుతో, ఇస్లాం పేరుతో విధ్వంసానికి పాల్పడటం దాని లక్ష్యం. ముఖ్యంగా భారత్‌లో అస్థిరత కల్పించడం, అవాంఛనీయ ఘటనలకు పాల్పడటం దాని ఉద్దేశం. ఇందుకోసం అమాయక యువతను రెచ్చగొట్టి, మతం పేరుతో వారిలో విషబీజాలు నాటి వక్రమార్గం పట్టించడం దాని లక్ష్యం. ఈ విషయం తెలుసుకోలేని ఎంతో మంది అమాయక యువకులు సమిధలవుతున్నారు. వారికి సరైన దిశా నిర్దేశం చేయడంలో తల్లిదండ్రులు, ముస్లిం మేధావులు, మత పెద్దలు విఫలమవు తున్నారు. ఉన్నత విద్య అభ్యసించిన యువత కూడా దారి తప్పడం బాధాకరం. మనిషి జీవితంలో మతం పాత్ర ఎంత? ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తన పాత్ర ఏమిటన్న విషయాన్ని విస్మరించి ఉగ్రవాద భావజాలంతో ముందుకు సాగుతూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. దేశానికి నష్టం చేస్తున్నారు.

‘అజాన్‌’‌పై ఉద్ధవ్‌ ఉదాసీనత..

శివసేన.. పేరుకు ఇది ప్రాంతీయ పార్టీ అయి నప్పటికీ ఒకప్పుడు హిందువుల వాణిని బలంగా వినిపించేది. పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే అధికారంలో లేనప్పటికీ మహారాష్ట్ర రాజకీయాలను తన కనుసైగలతో శాసించేవారు. హిందూత్వ విషయంలో రాజీలేని ధోరణిని అనుసరించే వారు. ఇప్పుడు అదంతా చరిత్ర.  ఆయన కుమారుడు ఉద్ధవ్‌ ‌ఠాక్రే అధికారంలో ఉన్నప్పటికీ హిందూత్వ గురించి నంగినంగిగా మాట్లాడటం రాజకీయ వైచిత్రి. అధికారం కోసం చిరకాల వైరి కాంగ్రెస్‌తో, సిద్ధాంతం వంటి బాదరబందీ లేని అవకాశవాద పార్టీ అయిన శరద్‌ ‌పవార్‌ ‌సారథ్యంలోని ఎన్‌సీపీ (నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ)ల మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రోజే ఉద్ధవ్‌ ‌ఠాక్రే హిందూత్వకు ఎప్పుడో నీళ్లొదిలారు. ఇప్పుడు ‘అజాన్‌’ ‌విషయంలో ఠాక్రే వైఖరిని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ముస్లింలను ఉదయం ప్రార్థనలకు పిలుపిచ్చే ‘అజాన్‌’ ‌వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతుందన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. అతి బిగ్గరగా పిలుపివ్వడం వల్ల సమీప ప్రాంతాల ప్రజలకు  ఇబ్బందులు ఎదురవు తున్నాయని దీనిని నివారించాలని హిందూ సంస్థలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. దీనిపై గతంలో కోర్టులు కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చాయి. అయినా పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము కూడా ఆలయాల ముందు అంతకన్నా బిగ్గరగా హనుమాన్‌ ‌చాలీసా పఠిస్తామని హిందూ సంస్థలు పేర్కొన్నాయి. ఈ దిశగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) ‌కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా సేన కార్యకర్తలు ముంబయి దాదర్‌ ‌ప్రాంతంలోని శివసేన ప్రధాన కార్యాలయం ముందు లౌడ్‌ ‌స్పీకర్లలో హనుమాన్‌ ‌చాలీసాను పెద్ద శబ్దంతో పఠించారు. దీంతో పోలీసులు లౌడ్‌ ‌స్పీకర్లను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నవనిర్మాణ సేన కార్యకర్త యశ్వంత్‌ ‌కిల్లేదార్‌ ‌తదితరులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎంఎన్‌ఎస్‌ ‌కార్యకర్తలు పెద్దయెత్తున పోలీస్‌ ‌స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌ ‌ప్రాంగణంలోని చిన్న గుడి వద్ద హనుమాన్‌ ‌చాలీసా పఠించారు. ఆధ్యాత్మిక భజనలు చేశారు. నవ నిర్మాణ సేన కార్యకర్తల అరెస్టును పార్టీ అధినేత రాజఠాక్రే ఖండించారు. రాజ్‌ ‌ఠాక్రే దివంగ బాల్‌ ‌ఠాక్రే సమీప బంధువు. అధికార రుచి మరిగిన ఉద్ధవ్‌ ‌ఠాక్రే హిందూత్వకు ఎప్పుడో దూరమయ్యారని విమర్శించారు. తాను ఏ మతానికి అనుకూలం, వ్యతిరేకం కాదని అందరికీ ఒకే విధానం ఉండాలన్నదే తమ వైఖరి అని స్పష్టం చేశారు. తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని, అదే సమయంలో శివసేన ‘అజాన్‌ ’ ‌పిలుపు వల్ల ఏర్పడే శబ్ద కాలుష్యాన్ని అడ్డుకునే ధైర్యం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఒక్క ముంబయిలోనే కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హనుమాన్‌ ‌చాలీసాను పఠించారు సేన కార్యకర్తలు. శివసేన కుహనా లౌకికవాదాన్ని అనుసరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర భాజపా అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌ధ్వజ మెత్తారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే  ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలోనూ ‘అజాన్‌’ ‌పిలుపుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పిలుపుల వల్ల ఏర్పడే శబ్ద కాలుష్యంపై సర్కారు ఆలోచించడం లేదని హిందూత్వ సంస్థలు పేర్కొంటున్నాయి. భారతీయ సమాజంలో మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆ స్వేచ్ఛ పరిధులు దాటరాదు. ఎంతమాత్రం హద్దులు మీరరాదు. ఒకరి స్వేచ్ఛ మరొకరికి అడ్డంకిగా మారరాదు. ఈ చిన్న విషయాన్ని కొన్ని మత సంస్థలు విస్మరిస్తున్నాయి. అజాన్‌ ‌పిలుపును ఎవరూ వద్దనడం లేదు. అదే సమయంలో అది ఇతరులకు ఇబ్బందికరం కారాదు. శబ్ద కాలుష్యానికి కారణం కారాదు. ఇప్పటికే ప్రజలు అనేక (జల, వాయు, పర్యావరణ) కాలుష్యాలతో సతమతమవు తున్నారు. ఈ జాబితాలో మరొకటి చేరరాదు. ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పార్టీలకు, మతాలకు సంబంధిం చిన విషయం కాదన్న వాస్తవాన్ని గ్రహిస్తే పరిష్కారం సులభంగా దొరుకుతుంది. లేనట్లయితే రాచపుండుగా మారి సరికొత్త సమస్యలకు దారి తీస్తుంది. ఈ విషయం అర్థమైనప్పటికీ ఉద్ధవ్‌ ‌ఠాక్రే సర్కారు తన మిత్రులకు ఎక్కడ కోపం వస్తుందేమోనన్న భయంతో నీళ్లు నములుతోంది. ప్రవచిత సిద్ధాంతాల కన్నా ఉద్ధవ్‌కు అధికారమే ముఖ్యమైంది. దీనిని కాదనగలరా?

 వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram