ప్రజలందరూ కరోనా రెండో దశతో సతమతమవుతున్న వేళ ఆంధప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారుచేసిన మందు అందరికీ ఆశాకిరణంలా కనిపిస్తోంది. అనుమతుల పేరుతో ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా ప్రజల్లో ఆనందయ్య వైద్యం పట్ల రోజురోజుకి నమ్మకం, ఆదరణ పెరుగుతూనే ఉన్నాయి.

ప్రజలకు ఏమీ తెలీదని, కేవలం మాయలకు, మంత్రాలకు, చిట్కా మందులకు వారు ఆకర్షితు లవుతారని.. తామే వారిని జ్ఞానశిఖరాల వైపుకు నడిపించే మేధావులమని భావించే కొందరు ఆనందయ్య వైద్యం నిరర్ధకమైనదని, దానివల్ల ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తాయని నమ్మించడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో కొన్ని మీడియా సంస్థలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఉచితంగా లభించే ఆనందయ్య వైద్యంతో స్వస్థత పొందిన వందలాది మంది ఒకవైపు రుజువుగా నిలువగా.. లక్షలు ఖర్చు చేసినా అల్లోపతి వైద్యంతో సాంత్వన పొందలేక ప్రాణాలు కోల్పోతున్నవారు మరోవైపు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజానీకం ఆనందయ్య మందును అపరసంజీవనిలా భావించే పరిస్థితి ఉత్పన్నమైంది.

అబద్ధపు ప్రచారాలు

ఆనందయ్య వైద్యంతో స్వస్థత పొందిన కొందరు మరేదైనా కారణం వల్ల అస్వస్థతకు గురైతే.. ఆనందయ్య వైద్యం వికటించిందంటూ కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు చాలా మందున్నాయి. మృత్యువాకిట నిలిచిన తనకు ఆనందయ్య మందు అమృతంలా పనిచేసి పునర్జన్మను ఇచ్చిందని బహిరంగంగా ప్రకటించిన విశ్రాంత ఉపాధ్యాయుడు కోటయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు (మరేదైనా కారణం కావొచ్చు). పక్కనే ఉన్న టౌన్‌లోని ఆసుపత్రికి వెళ్లాడు. అయితే ఆనందయ్య మందు వికటించి నందునే కోటయ్య మృతి చెందాడంటూ కొన్ని మీడియా సంస్థలు అబద్ధపు ప్రచారానికి పూను కున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా సంస్థలు ఇలాంటివి ప్రచారం చేయడం సరికాదు.

ప్రజలు మాత్రం ఇలాంటి దుష్ప్రచారాన్ని, దుష్ప్రయత్నాన్ని గుడ్డిగా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వారి కళ్ల ముందే లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఆనందయ్య మందుతో కరోనాను జయించినవారు చాలా మంది ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడు తూంటే తమ బంధువులలోనో, సన్నిహితులలోనో, ఇతర పరిచయస్తులలోనో ఎవరో ఒకరు ఆనందయ్య మందు ద్వారా పూర్తి స్వస్థత పొందినట్లుగా వారు చెబుతున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ ‌రెడ్డి సమక్షంలోనే దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న ఒక యువకుడి కంట్లో ఆనందయ్య మందు వేసిన నిమిషాల వ్యవధిలోనే ఆ యువకుడు లేచి కూర్చున్నాడు. ఇది ఆయన మందు పనితనానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘనలు ఇంకా అనేకం ఉన్నాయి.

గత సంవత్సర కాలంగా ఆనందయ్య తన వైద్యం ద్వారా ఎందరో కరోనా రోగులను ఆరోగ్యవంతులుగా చేశారు. తాను ఈ మందు తయారీ చెన్నై సమీపంలోని రెడ్‌హిల్స్ ‌వద్ద గల డాక్టర్‌ ‌వివేకానంద సహకారంతో చేస్తున్నట్లుగా చెప్పారు. ఆనందయ్య కుటుంబానికి ఈ ఆయుర్వేద వైద్యం వంశ పారంపర్యంగా వస్తున్నది. గత 30 ఏళ్లుగా ఆయన ఎన్నో రకాల రోగాలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఇప్పటివరకు సుమారుగా 50 వేల మంది కరోనా రోగులకు మాస్కు కూడా ధరించకుండా కరోనా మందును అందించినట్లుగా చెప్పారు ఆనందయ్య. తాను కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కరోనా బారినపడలేదు. తన మందు బాగా పనిచేస్తున్నదనడానికి ఆనందయ్య తనకు తానే ప్రబల సాక్ష్యంగా నిలిచారు. అంతేకాదు, వారి గ్రామంలో కూడా ఎవరూ ఇప్పటివరకూ తీవ్రమైన కరోనా లక్షణాలతో ఆసుపత్రి పాలు కాలేదు. ఆ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా సంభవించ లేదంటే నమ్మకతప్పదు. ఈ ఔషధాన్ని ఆనందయ్య మొదటినుంచీ ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. ఔత్సాహిక దాతల నుంచి కూడా ధనరూపంలో కాకుండా ఔషధ తయారీకి అవసరమైన వస్తువులను మాత్రమే స్వీకరిస్తారు. అవకాశం దొరికితే రోగుల నుంచి లక్షలు గుంజే ఆసుపత్రులున్న ఈ రోజులలో లక్షలాదిమంది విశ్వాసాన్ని, ఆదరణను చూరగొన్న ఆనందయ్య తన మందును ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయం.

ఆనందయ్య ఆంగ్ల అక్షరాలు P, L, F, K, I అనే పేర్లతో మందు ఇస్తున్నారు. వీటిలో P- కరోనా రాకుండా నిరోధించే ప్రివెంటివ్‌ ‌మెడిసిన్‌. L- ఆకలి మందగించిన వారికి ఇచ్చే మందు. F- జ్వర (ఫీవర్‌) ‌పీడితుల కోసం. K- కిడ్నీ సమస్యలతో బాధపడే వారి కోసం. I- తీవ్రమైన కరోనా లక్షణాలు కలిగినవారికి కంట్లో వేసే మందు. ఆనందయ్య మందులు వాడిన కొవిడ్‌ ‌బాధితులను కూలంకషంగా పరిశీలించగా.. వారందరూ మందు వాడిన మూడు రోజుల తర్వాత నెగిటివ్‌ ‌రిపోర్ట్ ‌పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్నవారు కూడా కోలుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఐసిఎంఆర్‌ ఈ ‌మందు తయారీ, పనితీరులను పరిశీలించే వరకూ తయారీ, వితరణను ఆపవలసిందిగా అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయుష్‌ ‌పరిశీలన బృందం ఆనందయ్య మందును ఆయుర్వేద ఔషధంగా పరిగణించలేమని, నాటుమందుగా మాత్రమే పరిగణిస్తామని తెలిపింది. అలాగే ఈ మందు వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేవని, ఇది సహజసిద్ధమైన వనమూలికలతో తయారవుతున్న మందు కాబట్టి నిరభ్యంతరంగా వాడవచ్చని పేర్కొనడం గమనార్హం. అయితే ఇంకా ఐసిఎంఆర్‌ ‌పరిశీలన జరగవలసి ఉంది. ఆనందయ్య మందు తయారీని, పనితీరును పరిశీలించిన టీటీడీ ఆయుర్వేద వైద్య బృందం తమ ఆయుర్వేద ఔషధ తయారీ కేంద్రంలో ఈ మందును తయారు చేసుకోవడానికి అనుమతించారు.

మరొకవైపు ఆనందయ్యను పోలీసులు నిర్బంధించారని, ఆయన పోలీసుల పటిష్ట భద్రత మధ్య ఉన్నారని పేర్కొంటూ ప్రచారంలోకి వచ్చిన కొన్ని వార్తలను ప్రభుత్వ వర్గాలు నిర్ద్వందంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు వచ్చాకే తాను మందును తయారుచేయాలనే ఆలోచనలో ఆనందయ్య ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత తాను రోజుకు లక్ష మందికి సరిపడా మందు తయారు చేయగలనని ఆయన స్వయంగా ప్రకటించారు.

ఆనందయ్య మందు వలన వందలాది మంది రోగులకు ఉపశమనం కలుగుతున్న సంగతిని, దాని తయారీకి, పంపిణీకి అనేక అడ్డంకులు ఎదురవుతున్న సంగతిని తెలుసుకున్న స్థానిక ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు ఆనందయ్య మందు వాడిన అనేకమంది రోగులను నేరుగా కలిసి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఆంధప్రదేశ్‌ ‌ప్రాంత ప్రచార ప్రముఖ్‌ ‌బయ్యావాసు నేతృత్వంలోని బృందం కృష్ణపట్నం గ్రామంలోని ఆనందయ్య ఔషధ తయారీ కేంద్రాన్ని పరిశీలించింది. ఆనందయ్యతో మాట్లాడి వివరాలు తెలుసుకుని మందు తయారీ, పంపిణీకి తాము అన్నివిధాలుగా సహకరిస్తా మని తెలిపింది. ఈ విషయం ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆనందయ్య స్వగ్రామమైన కృష్ణపట్నానికి పరిశీలకుల బృందాన్ని పంపింది.

ఆనందయ్యకు చిరపరిచితుడు, మందు పనితీరును స్వయంగా పరిశీలించి రూఢీ పరచుకున్న స్థానిక (సర్వేపల్లి నియోజకవర్గం) ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా ఆనందయ్యకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. కానీ తన అద్భుత ఆవిష్కరణతో అందరివాడుగా మారిపోయిన ఆనందయ్యను తమ పార్టీ కార్యకర్తగా ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి పరిచయం చేయడం, వైసీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ ‌పెట్టడం పలు విమర్శలకు కారణమైంది.

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలువురు ఆయుర్వేద వైద్యులతో నిర్వహించిన ఆన్‌లైన్‌ ‌సమావేశంలో పాల్గొన్న వైద్యులందరూ ఆనందయ్య మందు అద్భుతంగా పని చేస్తున్నదని, సత్ఫలితాల నిస్తుందని పేర్కొనడమే కాదు, దాని శాస్త్రీయతపై కూడా సంతృప్తిని వ్యక్తంచేశారు. మందు తయారీ, పనితీరుపై తాము స్పష్టమైన నివేదికను రూపొంది స్తామని కూడా వారు పేర్కొన్నారు. ఆనందయ్య మందుతో స్వస్థత పొందిన కరోనా బాధితుల నుంచి ఫీడ్‌ ‌బ్యాక్‌ ‌తీసుకొని దానిని క్రమపద్ధతిలో పొందు పరచాలనే ఉద్దేశంతో విజ్ఞాన భారతి గూగుల్‌ ‌ఫారంను ప్రారంభించి దానిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజలకు ఉచితంగా తన సేవలను అందిస్తున్న ఆనందయ్య మందుకు త్వరితగతిన అనుమతులు ఇప్పించవలసిందిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయుష్‌ ‌మంత్రిత్వ శాఖను కోరిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి ఎదురవుతున్న అడ్డంకులపై ప్రజలలో తీవ్ర ఆవేదన, నిరసన వ్యక్తమవుతోంది. ఎవరు ఎన్ని విచారణలు చేసినా, ఎన్ని పరీక్షలు నిర్వహించినా ఆ మందు పని చేస్తున్నదనడానికి ప్రజల అనుభవాలే ప్రబల సాక్ష్యం. ఎన్నో సాక్ష్యాధారాలు కళ్లముందు కనిపిస్తూ ఉన్నా ఇంకా మందు పనితీరుపై సందేహాలు వెలువరిస్తున్న మీడియా, మేధావులమని చెప్పుకునే కొందరి తీరు చూస్తుంటే.. వారి వెనక మెడికల్‌ ‌మాఫియా ఉన్నదనే సందేహాలు కూడా లేకపోలేదు. వారికి ప్రజాసంక్షేమం కంటే మెడికల్‌ ‌మాఫియా విదిల్చే చిల్లరే ముఖ్యమని తెలుస్తున్నది.

ఆఖరికి కంట్లో వేసే మందు మినహా ఇతర మందులు ఆనందయ్య ఇచ్చుకోవచ్చునని ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం మే 31న అనుమతి ఇచ్చింది. ఆయన మందుకోసం ఎదురు చూస్తున్న లక్షలాది మందికి ఇది శుభవార్తే. అయితే ఐదు రోజుల తరువాతే మందు లభిస్తుంది. అలాగే పంపిణీదారుల సూచనల మేరకు, కరోనా నిబంధనలు పాటిస్తూనే మందు తీసుకోవచ్చు. ఎవరూ కృష్ణపట్నం రానక్కరలేదని కూడా వారు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ ‌ద్వారా సంప్రతించి మందు పొందవచ్చు.

– శ్యాంప్రసాద్‌రెడ్డి కోర్శిపాటి

By editor

Twitter
Instagram