ఇదొక మరుగుపరచిన దురంతం. లైంగిక అత్యాచారం, హత్య. ఉద్యమకారులమని చెప్పుకుంటున్న రైతుల సాక్షిగా ఉద్యమ శిబిరంలోనే జరిగిన మరొక నిర్భయ దురంతం. దేశ రాజధాని సరిహద్దులలో జరిగినప్పటికి అడవులలో నక్సల్స్ ‌నిర్వహించే ‘ప్రజాకోర్టు’ తరహాలో ఘోరానికి ముగింపు ఇవ్వాలని చూశారు, అర్బన్‌ ‌నక్సల్స్ ‌నేతలు. ఈ ఘట్టం తొలి అంకానికి మమతా బెనర్జీ ‘ఘన విజయం’ సాధించిన పశ్చిమ బెంగాల్‌లో  తెర లేచింది. ఆప్‌ ‌నాయకుడు అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వ పాలనలోని ఢిల్లీలో గుట్టుగా ముగిసింది. ప్రధాన నిందితులిద్దరూ ఆమ్‌ ఆద్మీ పార్టే వారే కావడం మరొక మలుపు. మమతా బెనర్జీ సహా ఏ ఒక్క మహిళా నేత, హక్కుల నేతల ముఠాలు, మహిళల హక్కుల కోసం తపిస్తామని చెప్పే చానెళ్లు ఈ దుర్ఘటనను ఖండించకపోవడం ఘోరం.

ఢిల్లీ సరిహద్దులలోని టిక్రి రైతు నిరసన శిబిరంలో ఒక బెంగాల్‌ ‌యువతి మీద జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి హరియాణా పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ‘అపహరణ, సామూహిక అత్యాచారం’ ఆరోపణ మీద అనిల్‌ ‌మాలిక్‌, అనూప్‌ ‌సింగ్‌ ‌చానౌత్‌, అం‌కుశ్‌ ‌సంగ్వాన్‌, ‌జగదీశ్‌ ‌బ్రార్‌, ‌కవితా ఆర్య, యోగితా సుహాగ్‌ (‌చివరి ఇద్దరు మహిళలు)లను (ఆరుగురు) అరెస్టు చేశారు. ఈ ఘోర దుర్ఘటన జరిగిన గుడారాన్ని నిర్మించినది ఆ ఇద్దరు మహిళా మణులే. వీళ్లంతా కిసాన్‌ ‌సోషల్‌ ఆర్మీ (కేఎస్‌ఏ)‌కు చెందినవారు. ఆ గుడారం కూడా ఆ పేరు మీద నిర్మించారు.

ఆ ఘటన క్రమం ఇలా ఉంది. ఏప్రిల్‌ 1‌వ తేదీన బెంగాల్‌లోని హుగ్లీలో కేఎస్‌ఏ ఒక బహిరంగ సభ నిర్వహించింది. అత్యాచారానికి గురైన ఆ యువతి ఒక కళాకారిణి, డిజైనర్‌. ‌రైతుల మీద సానుభూతి, ఉద్యమాల మీద గౌరవం కలిగిన 25 ఏళ్ల యువతి ఆమె. తండ్రి ఉత్పల్‌ ‌బసు హుగ్లీ కేంద్రంగా పనిచేసే అప్రిసియేషన్‌ ‌ఫర్‌ ‌ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ‌డెమోక్రటిక్‌ ‌రైట్స్ ‌సంస్థకు చెందినవారు. హుగ్లీ కార్యక్రమంలోనే ఏప్రిల్‌ 4‌న ఆ ఆరుగురితో బసు కుమార్తెకు పరిచయ మయింది. సంయుక్త కిసాన్‌ ‌మోర్చ గురించి ప్రచారం చేయడానికే ఆ ఆరుగురు హుగ్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి రైతుల నిరసనలో తాను కూడా పాల్గొని, సంఘీభావం ప్రకటిస్తానని, ఇందుకు అనుమతించవలసిందని ఆమె తల్లిదండ్రులను కోరింది. మొదట బసు తిరస్కరిం చినా, తరువాత అంగీకరించారు. తమ కుమార్తెను సోదరిలా భావించి ఆమె బాగోగులు చూడాలని హుగ్లీ స్టేషన్‌లో వీడ్కోలు పలకడానికి వచ్చినప్పుడు బసు దంపతులు అనిల్‌ ‌మాలిక్‌ను (అత్యాచారం ఆరోపణతో అరెస్టయిన వారిలో ఒకడు) కోరడమే ఇందులో కొసమెరుపు. పంజాబ్‌ ‌వెడుతుండగా ఏప్రిల్‌ 11‌న రైలులోనే అనిల్‌ ‌మాలిక్‌ ఆమెను బలవంతం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించింది. మరునాడు టిక్రి సరిహద్దుకు చేరుకున్న తరువాత ఎక్కడా ఖాళీ లేదన్న నెపంతో ఆ యువతికి ఈ నలుగురు ఉంటున్న గుడారంలోనే బస ఏర్పాటు చేశారు. ఇదంతా హరియాణా పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ‌లోనిదే. తనతో కలసి ప్రయాణిస్తున్నవారిలో వీరు అంత మర్యాదస్తులు కాదని తండ్రికి ఫోన్‌ ‌చేసి చెప్పిందామె. తనను ఒత్తిడి చేస్తున్నారని, బ్లాక్‌మెయిల్‌ ‌చేస్తున్నారని కూడా తెలియచేసింది.

ఒక దశ తరువాత ఆ బెంగాలీ యువతి తల్లి దండ్రులు ఈ సంగతిని టిక్రి రైతు నేతల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మాటలు రికార్డయ్యాయి కూడా. ఆపైనే మహిళలు మాత్రమే ఉన్న గుడారంలోకి యువతి బసను మార్చారు. ఏప్రిల్‌ 21‌న ఆమెకు తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చింది. ఢిల్లీలోనే ఆసుపత్రికి తీసుకువెళితే, కొవిడ్‌ 19 ‌కేసుగా తీసుకుని వైద్యం చేశారు. ఆ ఆసుపత్రిలో ఉండగా తండ్రి వచ్చినప్పుడు, ఆమె స్పష్టంగా తనపై రైలులోను, గుడారంలో కూడా లైంగిక అత్యాచారం జరిగిందని వెల్లడించింది.

 పైగా ఆమె తనపై అత్యాచారం జరిపిన వారికి శిక్ష పడేటట్టు చేయవలసిందేనని, కానీ రైతు ఉద్యమానికి అపకీర్తి కలగకుండా ఉండాలని కోరడం మరొక విశేషం. తరువాత పరిస్థితి విషమించి వేరొక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం జరుగుతూ ఉండగానే ఆ యువతి కన్నుమూసింది. ఆ నలుగురు ఉన్న గుడారం నుంచి మరొక గుడారానికి మార్చడం ఆమె అస్వస్థతకు గురి కావడానికి చాలా ముందే జరిగింది. ఆమె చెప్పిన విషయాలతో ఒక వీడియో కూడా విడుదలైంది. అది రైతు నేతలందరికీ అందింది కూడా. ఎంత అమానుషమంటే, ఏప్రిల్‌ 30‌న ఆ యువతి కన్నుమూసింది. కానీ మే 8న ఆమె తండ్రి వచ్చి హరియాణాలోని బహదూర్‌గఢ్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు కాలేదు. అంటే ఆమె చనిపోయిన పదిరోజుల తరువాత కేసు పోలీసుల దృష్టికి వెళ్లింది.

కూతురి పరిస్థితిని ఫోన్‌లో తెలుసుకున్న బసు కోల్‌కతాలో తనకు తెలిసిన డాక్టర్‌ అవిక్‌ ‌షాను కలుసుకున్నారు. ఢిల్లీలో కూతురికి వైద్యం చేస్తున్న డాక్టర్‌ అమిత్‌ ‌వత్స్‌తో మాట్లాడవలసిందని కోరారు. ఏప్రిల్‌ 24‌న డాక్టర్‌ ‌వత్స యోగేంద్ర యాదవ్‌కు పరిస్థితిని వివరించారు. తాను ఆమె వైద్యానికి ఏర్పాటు చేస్తానని యోగేంద్ర హామీ ఇచ్చారు. మరునాడే సంగతి బయటకు పొక్కిన విషయం తెలిసి అనిల్‌, అనూప్‌ ‌టిక్రి సరిహద్దు నుంచి తరలించారు. తరువాత బసు తన కుమార్తెకు టిక్రి వద్దనే వైద్యం జరగాలని కోరినా అనిల్‌, అనూప్‌ ‌బెంగాల్‌ ‌తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నది కూడా యోగేంద్ర యాదవ్‌ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇలా తీసుకువెళ్లడం తన కుమార్తెను అపహరించడమేనని బసు ఆరోపించారు. ఆ మరునాడే బాధితురాలిని ఒక నిరసన సంఘం తీసుకువెళ్లి రోహతక్‌లోని పీజీఐ ఆసుపత్రిలో చేర్పించాలని చూసినా బెడ్లు ఖాళీ లేవు. దీనితో బహదూర్‌గఢ్‌లోనే శివం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. దాక్టర్‌ ‌వత్స చెప్పిన మీదట బసు ఏప్రిల్‌ 29‌న ఢిల్లీ వచ్చారు. అప్పుడే ఆయన కుమార్తె మొత్తం విషయం వెల్లడించింది.

ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదులో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో వెల్లడించడానికి ఒక్క రైతు నాయకుడు కూడా ముందుకు రాకపోవడం విశేషం. దీనికి సంయుక్త కిసాన్‌ ‌మోర్చ నాయకులు చెబుతున్న వివరణ అత్యంత హాస్యాస్పదంగా, అదే సమయంలో అమానుషంగా, జుగుప్సాకరంగా కూడా ఉంది. టిక్రి సరిహద్దులలోని నిరసన శిబిరంలో ఇలాంటి దుర్ఘటన జరిగిందని తమకు తెలిసిన తరువాత, తామే దర్యాప్తు జరిపి, వాస్తవాలు రూఢి అయ్యాకే వెల్లడిద్దామని భావించామని వారు చెప్పడం విశేషం. పూర్తి వాస్తవాలు తెలియకుండా బయటకు చెప్పడం ఎలాగ అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఆ యువతి చెప్పింది నిజమేనని రూఢి అయిన తరువాతనే తాము చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించామని చెబుతున్నారు. కానీ, నాలుగు రోజుల క్రితమే ఆ యువతి చెప్పినది సత్యమేనని తేలినప్పటికీ, చేతులు దులుపుకోవడానికి వీలుగా కిసాన్‌ ‌సోషల్‌ ఆర్మీ గుడారాలు పీకేసిన తరువాత కూడా ఆ నేరం గురించి పోలీసులకు ఎందుకు తెలియచేయలేదన్న ప్రశ్నకు రైతు నేతల దగ్గర సమాధానం లేదు.

ఆ బెంగాల్‌ ‌యువతి టిక్రి సరిహద్దులకు వస్తున్నప్పుడే ఇద్దరు ఆప్‌ ‌కార్యకర్తలు ఆమె మీద లైంగిక అత్యాచారం జరిపారని హిందీ దినపత్రిక ‘దైనిక్‌ ‌భాస్కర్‌’ ‌వార్తను ప్రచురించింది. అంతేకాదు, ప్రస్తుతం రైతు వేషంలో ఉన్న సామాజిక కార్యకర్త, సంయుక్త కిసాన్‌ ‌మోర్చ నాయకుడు యోగేంద్ర యాదవ్‌కు ఈ విషయం స్పష్టంగా తెలుసునని కూడా ఆ పత్రిక ఆరోపించింది. తన కుమార్తె మీద జరిగిన పాశవిక దాడి గురించి యోగేంద్ర యాదవ్‌కు తెలుసుననీ, అయినా మౌనం దాల్చారనీ బెంగాలీ యువతి తండ్రి బసు ఆరోపించిన సంగతిని కూడా పత్రిక ప్రచురించింది.

కొవిడ్‌ ‌లక్షణాలతో ఆమెను ఏప్రిల్‌ 26‌న ఝజ్జర్‌ ‌జిల్లాలోని ఒక ఆసుపత్రిలో చేర్చారని బహదూర్‌గడ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు చెందిన విజయ్‌ ‌కుమార్‌ ఈ ‌సంగతి చెప్పారు. ఏప్రిల్‌ 30‌న ఆమె చనిపోయింది. తన కుమార్తెపై అత్యాచారం చేశారంటూ ఆమె తండ్రి ఇద్దరి మీద కేసు పెట్టారు. ఇందులో అనూప్‌ ‌సింగ్‌ ఆప్‌లో క్రియాశీలక కార్యకర్త. ఆ పార్టీ హిస్సార్‌ ‌ప్రాంత ప్రముఖుడు కూడా. అనూప్‌సింగ్‌ ‌తమ పార్టీవాడేనని ఆప్‌ ఎంఎల్‌ఏ ‌సుశీర్‌కుమార్‌ ‌కూడా వెల్లడించారు. అనిల్‌ ‌మాలిక్‌ ‌ఢిల్లీలో ఆప్‌ ‌కార్యకర్త. కిసాన్‌ ‌సోషల్‌ ఆర్మీ పేరుతో వీళ్లిద్దరూ ఢిల్లీ సరిహద్దులలో రైతుల కొమ్ము కాస్తున్నారు.

‘ఈ దుర్ఘటన గురించి చాలామంది సంయుక్త కిసాన్‌ ‌మోర్చ నాయకులకు ముందే తెలుసు. అయినా వాళ్లంతా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంతో ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించిన బెంగాలీ యువతి తండ్రిని కలుసుకోవ డానికి తమను అనుమతించకపోవడం కూడా వింతగానే ఉన్నది. ఈ తప్పులో భాగస్వాములై ఉన్నట్టు అనుమానం ఉన్న ఇతర రైతు నాయకులను కూడా జరిగిన ఉదంతం గురించి ప్రశ్నించాలి. జరిగిన జాప్యం గురించి వివరణ తీసుకోవాలి’ అని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌మహిళా విభాగం నాయకురాలు హరీందర్‌ ‌కౌర్‌ ‌బిందు పత్రికలవారిని కోరారు. నిజానికి బెంగాల్‌ ‌యువతి చెప్పింది అసత్యమని ఇంతవరకు ఎవరూ అనలేదు.

భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ఏక్తా ఉగ్రహాన్‌ ‌వర్గం నేత జోగిందర్‌ ‌సింగ్‌ ఉ‌గ్రహాన్‌ ‌కూడా ఇదే చెబుతున్నారు. ఈ దురాగతం గురించి తెలిసిన తరువాత రైతు నాయకులు ప్రాథమిక దర్యాప్తు జరిపారు, ఆ యువతి చెప్పినది నిజమేనని తేలింది అనే ఉగ్రహాన్‌ ‌చెప్పారు. తాము బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామనీ చెబుతున్నారు. ఇప్పుడు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా, అసలు కిసాన్‌ ‌సోషల్‌ ఆర్మీ తాము అధికారికంగా గుర్తించిన విభాగం కాదని చెబుతోంది.

ఆ ఆర్మీకి చెందిన గుడారాలు తీసేశామని చెబుతున్నారు నాయకులు. దానితో ఈ ఘోర పాపం పోతుందా? అయితే ఎఫ్‌ఐఆర్‌లోకి ఎక్కిన ఆ ఆరుగురు కూడా మోర్చ తరఫునే బెంగాల్‌ ‌వెళ్లారన్న సంగతిని సంయుక్త కిసాన్‌ ‌మోర్చ దాస్తున్నదని దైనిక్‌ ‌భాస్కర్‌ ‌దినపత్రిక కథనం.

About Author

By editor

Twitter
Instagram