అయోధ్యాకాండ-3

డిసెంబర్‌ 23,1949 అర్ధరాత్రి అయోధ్య వివాదాస్పద కట్టడంలో హఠాత్తుగా బాలరాముడు, సీతమ్మ విగ్రహాలు వెలిసాయి. వీటిని తొలగించాలని నాటి ప్రధాని భావించారా? దేవుడే అన్నట్టు దేశ ప్రజలంతా ఆరాధిస్తున్న జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ, ఇతర ప్రముఖులు కూడా తమవంతుగా విగ్రహాలు తొలగించే ప్రయత్నం చేయకపోలేదు. గొప్ప వాస్తవం ఏమిటంటే, విగ్రహాలు తొలగిస్తే రక్తపాతం తప్పదని స్థానిక అధికారి ఒకరు ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నిర్మొహ మాటంగా వెల్లడించారు. అది అక్కడితో ఆగిపోయింది. అంటే హిందువుల మనోభావాల ముందు వీర సెక్యులరిస్ట్ ‌నెహ్రూ కూడా తలొంచారన్నమాట.


కేకే నాయర్‌

నాటి ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ఐసీఎస్‌ అధికారి భగవాన్‌ ‌సాహే (లక్నో)కు ఫైజాబాద్‌ ‌డిప్యూటీ కమీషనరు కే.కే.నాయర్‌ (ఐపీయస్‌), ‌డిసెంబర్‌27, 1949‌న ఈ లేఖ రాశారు. ఇదే నాటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది. దరిమిలా సుప్రీంకోర్టులో ఈ అంశం మీద జరిగిన వాదోపవాదాలలో కీలకంగా నిలిచింది. వాస్తవానికి కేకే నాయర్‌ ‌రాసిన లేఖ అయోధ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశం. ‘అయోధ్య 6 డిసెంబర్‌ 1992’ ‌పేరుతో దివంగత పీవీ నరసింహరావు (2006) వెలువ రించిన పుస్తకంలో ఈ ఘట్టం ప్రత్యేకంగా కనిపిస్తుంది కూడా. వివాదాస్పద కట్టడం లోపల పెట్టిన విగ్రహాలను తీయించడానికి నెహ్రూకు ధైర్యం చాలలేదు. పీవీ హయాంలో కట్టడమే కూలింది.

కట్టుదిట్టమైన పోలీసుల రక్షణలో ఉన్న వివాదాస్పద కట్టడంలోనే కొంతమంది భక్తులు అర్ధరాత్రి భద్రతావలయాన్ని ఛేదించి అందులోకి ప్రవేశించినట్లు పహారాగా ఉన్న పోలీసులు పై అధికారులకు నివేదించారు. మరుసటిరోజు ఆ వార్త దావానంలా వ్యాపించింది. ప్రజలు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. దీనితో ముస్లింలు వెంటనే కేందప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. నాటి ప్రధాని నెహ్రూ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకుండా ఎలా ఉంటారు? విగ్రహాలు తొలగించాలని ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి గోవింద్‌వల్లబ్‌ ‌పంత్‌ను ఆదేశించారు. విగ్రహాలు తొలగిస్తే హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఎలా పరిష్కరించాలని ఆనాడు అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. విగ్రహాలు తొలగిస్తే జరిగే పరిణామాలు వివరిస్తూ యూపీ ముఖ్య కార్యదర్శికి ఫైజాబాద్‌ ‌డిప్యూటీ కమిషనర్‌ ‌వ్రాసిన ఉత్తరం ఇది. ఈ లేఖ చదవడం వల్ల రెండు కీలక అంశాలు తెలుస్తాయి.

ఒకటి 1949 నాటికి హిందువులు కనీసం ధర్మం విషయంలో అయినా కలసికట్టుగా నిలబడ్డారు. సెక్యులరిజానికి దూతగా చెప్పుకునే నెహ్రూ కూడా హిందూ అభిమతాన్ని ఎదిరించే సాహసం చేయలేదు. అప్పటికి విభజన జరిగి రెండేళ్లే అయింది. అయినా ముస్లింల విన్నపాలను పక్కన పెట్టక తప్పలేదు. ఈ లేఖను అధ్యయనం చేయడం వల్ల 1949 నాటికి అయోధ్య ఎలా ఉంది? అంతిమంగా తేలేదేమిటంటే, అప్పటి నుంచి అక్కడ హిందువులు పూజలు చేసుకుంటున్నారు.

విగ్రహాలు తొలగించడం గురించి ఐపీఎస్‌లు, ఐసీఎస్‌లు లోతుగానే చర్చించారు. అంతిమంగా కేకే నాయర్‌ ‌తన అభిప్రాయాన్ని ఇలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.

నెహ్రూ

విగ్రహాలు తొలగించటం నేను అంగీకరించే విషయం కాదనే నాయర్‌ ‌చెప్పేశారు. ఇంకా ఇలా రాశారు, ‘అది నేను చొరవ తీసుకుని చేసే పనికాదు. ఎందుకంటే అది జిల్లా వ్యాప్తంగా అల్లకల్లోలాన్ని సృష్టించే పెను ప్రమాదంతో కూడుకున్న పనిగనుక. ఈ వివాద చరిత్రలో కనీవినీ ఎరుగని భయానకపు దహనకాండకు అది దారి తీయవచ్చు. జిల్లా అంతా అట్టుడికి పోతూంది. తుపాకు లైసెన్స్‌దారులు అవసరమైతే తమ ఆయుధాలతో ముందుకొచ్చి ఈ వివాదంలో పోలీసులకు, అధికారులకు మద్దతిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలందుతున్నాయి. అటువంటి ఘోరకలిని అడ్డుకునేందుకు జిల్లాలోని ఆయుధాల లైసెన్స్‌దారులందరి నుండి ఆయుధాలను సేకరించటం అంత సులభమూ కాదు. త్వరితగతిన జరిగే పనీకాదు. ప్రస్తుత స్థితి ఏర్పడేందుకు ఔచిత్యం విషయంలో నేనెరిగిన హిందువులలో భేదాభిప్రాయా లున్నా ఆ విగ్రహాం అక్కడే ఉండాలనే విషయంలో అందరిదీ ఒకే మాట. దానికోసం వాళ్లు ప్రాణం తీయటానికైనా, ప్రాణాన్ని కోల్పోవటానికైనా సిద్ధమే. ఉద్యమం వెనుకగల లోతైన భావనల్ని, తాడోపేడో తేల్చుకోవాలనే దశలో వారు కృతనిశ్చయాన్నీ, ప్రతిజ్ఞల్నీ చిన్నచూపు చూడటంగానీ, గేలిచేయటంగానీ కాని పనులు. ఒకసారి ఉప్పెన విరుచుకుపడిందంటే పట్టణ పరిధిలోని దాడుల్ని మనకున్న బలగాలతో అణచి వేయవచ్చునుగాని అయితే తప్పనిసరిగా కాల్పులు జరపవలసి ఉంటుంది. కాల్పులవల్లనే గాక దెబ్బకు దెబ్బ తీర్చుకునే విస్ఫోటనాలతో జిల్లా అంతటా భారీ ఎత్తున ప్రాణనష్టం వాటిల్లుతుంది.’ అని రాశారాయన. లేఖలోని అంశాన్ని బట్టి విగ్రహాలు తొలిగిస్తారనే వదంతులు ప్రబలటంతో హిందువులు ముస్లిముల ఆవాసాల మీద దాడులకు దిగారు. అవి ఇంకాస్త ముదిరితే అన్నిచోట్లా ముస్లిముల ప్రాణాలకు రక్షణ కల్పించలేక పోవటమే కాదు, ప్రభుత్వ అధికారులకి కూడా సొంత ఆస్తుల్ని రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. మరొక అంశం కూడా గమనించాలి. ఇంతవరకు విగ్రహాన్ని తొలగించే చర్యను సమర్థించే హిందువు కానీ, కనీసం కాంగ్రెసు వారిలో సైతం కన్పించటంలేదని నాయర్‌ ‌చెప్పారు.

పూజారులను కూడా నయానో భయానో విగ్రహాలు తొలగించే పనికి ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ పన్నాగం కూడా సాగలేదు. ఎవరో ఒక పూజారిని వెతికి ఎంతగా ప్రలోభపెట్టినా విగ్రహాన్ని తొలగించే పనిలో పాల్గొనేందుకు లభించడని కూడా నాయర్‌ ‌రాశారు. అయినా విగ్రహాన్ని ఏదో విధంగా ఎవరో ఒకరితో తొలగించే కార్యక్రమాన్ని చేపడితే ఆగ్రహం, నిరసనల వెల్లువ కట్టలు తెంచుకొని జిల్లాను దాటిపోగలదు. అది సంబంధిత అధికారులనేగాక ప్రభుత్వాన్ని కూడ దూషిస్తూ కళంకితం గావించగలదని హెచ్చరించారు.

ఇవన్నీ కాదని ఒకవేళ ప్రభుత్వం బలప్రయోగంతో విగ్రహాలను తొలగించే పని పెట్టుకుంటే ఎంత నష్టం జరుగుతుందో నాయర్‌ ‌చెప్పారు. ‘ప్రభుత్వానికి నా మనఃపూర్వక విన్నపమేమంటే బలప్రయోగంతో పరిష్కారాన్ని కనుగొనాలని చేసే ఏ ప్రయత్నాన్నయినా ప్రస్తుతం నెలకొన్న బలమైన తెగింపు భావనలు తప్పక భయంకర దుర్ఘటనలకు దారితీయగలవనే నా మాటను వినిపించుకుని ఆమోదించాలని.’

పోలీసు సూపరింటెండెంట్‌ ‌కూడా ఈ అంచనాకే వచ్చారు. పోలీసు యంత్రాంగం చొరవ తీసుకుని విగ్రహాలు తొలగించే పని మొదలుపెడితే హిందువు లను హింసకు పాల్పడకుండా, దోపిడీలకు దిగకుండా లొంగదీయటం అనేది జరిగే పనికాదని కూడా ఎలాంటి శషభిషలు లేకుండా రాశారాయన. మసీదులో విగ్రహాన్ని ప్రతిష్ఠించటమనేది ముమ్మాటికీ న్యాయసమ్మతంకాని చర్య అయినా, సాధ్యమైనంత వరకు త్యాగాలు, నష్టాల్లేకుండా యథాస్థితికి తెచ్చేందుకు ప్రభుత్వ పరిశీలనకు నాయర్‌ ఒక పరిష్కార మార్గాన్ని సూచించారు. దాని ప్రకారం మసీదును జప్తు చేయాలి. దానిలోకి హిందువులను గాని, మహమ్మదీయులను గాని అనుమతించరాదు. పూజాదికాల కోసం అతి తక్కువ సంఖ్యలో పూజారులను అనుమతించవచ్చును. పూజారులసంఖ్య మూడు నుండి ఒకటికి మెల్లగా తగ్గించుకుంటూపోయి మరో ప్రతిష్ఠంభన ఎదురు కాకుండా చూసుకోవాలి. పూజారి విగ్రహంముందు పూజలు నిర్వహించవచ్చు. భోగం సమర్పించవచ్చు. ఇదంతా లోపలే జరుగుతుంది. పూజారిగాని, పూజారులుగాని మేజిస్ట్రేటు ఉత్తర్వులమేరకే నియమితులవుతారు. వాళ్ల వాళ్ల హక్కుల కోసం ఉభయవర్గాలు కోర్టుకెళ్ళవచ్చు. సివిల్‌కోర్టు ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసేవరకూ దానిని ముస్లింలకు స్వాధీనపరచరాదు. ఇది నాయర్‌ ‌సలహా.

కేకే నాయర్‌ ‌నాటి కాంగ్రెస్‌ ‌నేతల అంతరంగాన్ని ఎంత బాగా గ్రహించారో తెలియాలంటే ఈ వాక్యాలు చూడాలి. ‘పూర్వపు స్థితిని పునరుద్ధరించటం మంచి విషయమే. అయితే దానిని మనకు సంతృప్తిని తెచ్చే ఓ దివ్యమైన కీర్తికి ఆలవాలం చేయరాదు.’ అన్నా రాయన. నాడు హిందువుల ఇచ్చిన నినాద మేమిటి? ‘నయా అన్యాయ్‌ ‌కర్నా ఛోడ్‌ ‌దో నాయర్‌! ‌భగవాన్‌కా ఫాటక్‌ ‌ఖోల్‌దో (నూతనంగా అన్యాయాన్ని చేపట్టకు- నాయర్‌! ‌భగవంతుని తలుపులు తెరుచుకోనీ).

గోవింద్‌వల్లబ్‌ ‌పంత్‌

విగ్రహాలు తొలగించడం పోలీసు సూపరిండెంట్‌, ‌నేను గాని అంగీకరించలేమనే ఆనాడు నాయర్‌ ‌చెప్పగలిగారు. తామే చొరవ తీసుకొని ఆ పనిని నిర్వహింపలేమని కూడా చెప్పేశారు. తన సలహా కనుక ప్రభుత్వానికి నచ్చక విగ్రహాలను తప్పక తొలగించాలనే నిర్ణయానికి వస్తే, దాని పర్యవసానాలను ఎదుర్కొ నేందుకు సిద్ధమైతే ఆ పనిని ప్రభుత్వ విశ్వాసాన్ని కోల్పోయిన తనవంటి అధికారి మీద ఆ బాధ్యత పెట్టటం సరైన నిర్ణయం కాబోదని కూడా నాయర్‌ ‌స్పష్టం చేశారు. తన సలహా తగినది కాదనీ, చట్ట సమ్మతం కూడా కాదని భావిస్తే విగ్రహాలు తొలగించే పని (తనకు) అప్పగించవద్దని కూడా చెప్పారాయన. ఈ ఉత్తరం ముగించిన తీరు చూద్దాం. ‘ఒకవేళ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే విగ్రహాన్ని తొలగించాలనే నిర్ణయానికి వచ్చి ఉన్నట్లయితే నా వివేచనకు అందని మంచిని గ్రహించగల అధికారిని నా స్థానంలో నియమించి నన్ను ఈ బాధ్యతల నుండి తప్పించవలసినదిగా మనవి.’

నిజమే, ప్రజలు కోరినట్టు నాయర్‌ ‌రామజన్మ భూమికి మరొకసారి అన్యాయం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అలా హిందువులకు అన్యాయం చేయ తలపెడితే అందులో తాను భాగస్వామి కారాదని కూడా ఆయన నిర్ణయించుకున్న తీరు ప్రత్యేకంగా కనిపిస్తుంది.

1949 డిసెంబర్‌ 22‌న విగ్రహాలు అందులో కనిపించాయి. మరునాడు కేసు నమోదయింది. నాలుగు రోజుల తరువాత నాయర్‌ ఈ ‌లేఖ రాశారు. గోరఖ్‌పూర్‌ ‌మహంత్‌ ‌దిగ్విజయ్‌నాథ్‌, ‌దిగంబర్‌ అఖాడా మహంత్‌ ‌రామచంద్రదాస్‌ ‌పరమహంస ఆదేశాల మేరకే ఆరాత్రి కొంతమంది సాధువులు, భక్తులు విగ్రహాలను లోపల పెట్టారని డిసెంబర్‌ 23‌న కేసు నమోదయింది. అయితే వివాదాస్పద కట్టడంలో నిత్యం హిందువులు పూజ చేయడాన్ని ఫైజాబాద్‌కే చెందిన కొందరు ముస్లింలు అభ్యంతర పెట్టారు. అయితే జనవరి 16, 1950 సంవత్స రంలో కోర్టు కూడా విగ్రహాలు తొలగించరాదనే తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. ఇది హిందువులకు లభించిన మరొక విజయం. అయినా ముస్లింలు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా తొలగించరాదనే చెప్పింది. కానీ పూజారులకు అనుమతించిన ప్రభుత్వం భక్తులు పెద్ద ఎత్తున వెళ్లకుండా తాళాలు వేయించింది. ఈ తాళాలు మళ్లీ ఎనభయ్‌ ‌దశకంలోనే తీశారు.

About Author

By editor

Twitter
Instagram