పనాజి విముక్తికి అరవై ఏళ్లు

1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ ‌వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. కానీ బ్రిటిష్‌ ‌వారి కన్నా ముందే మనదేశానికి వచ్చి తిష్ట వేసిన పోర్చుగీసు వారు తమ ఆధీనంలోని గోవాను వదిలివెళ్లేందుకు ఇష్టపడలేదు. పోర్చుగీసు నియంతృత్వ పాలన, కాథలిక్‌ ‌చర్చి దురాగతాలతో అప్పటికే గోవా ప్రజల సంస్కృతిపై దారుణమైన దాడి జరిగింది. ఈ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఎంతోమంది స్వయంసేవకులు, ఇతర కార్యకర్తలు అమరులయ్యారు. భారత దేశంలో  భిన్న సంస్కృతి, సాంప్రదాయాలతో ఏకత్వాన్ని ప్రతిబింబించే రాష్ట్రాల్లో గోవా ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో, మాండవి, కుశావతి నదులతో వేలాది సంవత్సరాల కాలం నుంచి మనదేశ ఇతిహాసాలు, పురాణాలలో గోవా ప్రస్థావన కనిపిస్తుంది. కొంకణ్‌ ‌తీరంలోని గోవా ప్రాంతాన్ని మన పురాణాల్లో ‘పరశురామ క్షేత్రం’గా పేర్కొన్నారు. గోమాంతక్‌, ‌గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోవాపురి తదితర పేర్లతో గోవాను పిలిచేవారు. మౌర్యులు, శాతవాహనులు, గోవా భోజరాజులు, బాదామి చాళుక్యులు, రాష్ట్ర కూటులు, శిలా హరులు, యాదవులు, కదంబులు, విజయనగర రాజులు పాలించిన గోవా శతాబ్దాల క్రితమే ఎంతో వైభవాన్ని చూసింది. సముద్ర మార్గం ద్వారా సుదూర దేశాలతో వాణిజ్యం కొనసాగింది. సుప్రసిద్ధ ఆలయాలు, ధార్మిక క్షేత్రాలతో కళకళలాడింది. ఆ రోజుల్లో ఈ ప్రాంత వైభవాన్ని చూసి ‘స్వర్ణ గోవా’ అని పిలిచేవారు. అయితే, విదేశీయుల దండయాత్రలో గోవాకు సుదీర్ఘ గ్రహణం పట్టింది.


14వ శతాబ్దంలో సుసంపన్నమైన గోవా రాజ్యంపై అల్లావుద్దీన్‌ ‌ఖిల్జీ సేనాని మాలిక్‌కాఫర్‌ ‌దాడి చేసి, కొల్లగొట్టాడు. ఇది 1312 సంవత్సరంలో ఢిల్లీ సుల్తానుల వశమైంది. వీరి కాలంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాల విధ్వంసం జరిగింది. కాదంబరాజు సూర్యదేవుని 1345లో హత్య చేశారు. బహమనీ సుల్తానుల పాలైన గోవాపురిని 1370లో విజయనగర రాజు మొదటి హరిహర రాయలు జయించారు. ఆయన వందేళ్ల పాలన తర్వాత 1469లో బీజాపూర్‌ ‌సుల్తానులు దీనిని కైవసం చేసుకున్నారు.

బుడతకీచుల కన్ను పడిందిలా..

భారతదేశం ఏడు వందల ఏళ్ల క్రితం వరకూ సుగంధద్రవ్యాలు, దినుసులు, వస్త్రవ్యాపారంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అరబ్‌ ‌దేశాల మీదుగా ఇవన్నీ ఐరోపాకు చేరేవి. భారతదేశ సంపద గురించి తెలుసుకున్న ఐరోపా దేశాల వారు ఇక్కడికి నేరుగా సముద్ర మార్గం కనుగొనే ప్రయత్నాలు ప్రారం భించారు. అలా పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా 1498లో కేరళలో కోజికోడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 12 ఏళ్లకు ఆయన కన్ను గోవా మీద పడింది. బహమనీ సుల్తాన్‌ను ఓడించడం ద్వారా పోర్చుగీసు వారు 1510లో గోవాను స్వాధీనం చేసుకున్నారు. బుడతకీచులుగా ప్రసిద్ధికెక్కిన పోర్చుగీసువారి అరాచకాలు బ్రిటిష్‌ ‌వారి కన్నా ఘోరంగా ఉండేవి.

భారతదేశానికి మొదట వచ్చిన యూరోపియన్‌లైన పోర్చుగీసువారు తర్వాత కాలంలో బ్రిటిష్‌ ‌వారి ముందు నిలువలేక గోవాతో పాటు డామన్‌, ‌డయ్యూ, దాద్రా నగర్‌ ‌హవేలీలకే పరిమితమయ్యారు. గోవాను ముఖ్య నౌకాశ్రయంగా మార్చుకొని పాలించారు. క్రూరమైన పరిపాలనకు తోడు మతమార్పిళ్లు కొనసా గాయి. ఫ్రాన్సిస్‌ ‌గ్జేవియర్‌ ‌గోవాలోని హిందువులను బలవంతంగా మతం మార్చే భారీ కుట్రకు తెరతీశాడు. కాథలిక్‌ ‌చర్చి ఆధ్వర్యంలో 1560-1812 మధ్య కాలంలో ఇక్కడి ప్రజల మతం, సంస్కృతి, సాంప్రదాయాలపై పెద్దఎత్తున దాడి జరిగింది. ఎన్నో ఆలయాలను కూల్చడంతో పాటు భారీగా చర్చిలను నిర్మించారు. మతం మారని వారిని క్రూరంగా చిత్రహింసలు చేసేవారు. అయినప్పటికీ గోవా హిందువులు వారిని ధైర్యంగా ఎదిరించారు. తమ ధర్మాన్ని, సంస్కృతిని నిలబెట్టుకున్నారు. ఏకే ప్రియోల్కర్‌ ‌రాసిన ‘ది గోవా ఇన్క్విసిషన్‌’‌తో పాటు ఇతర పుస్తకాలలో ఈ వివరాలు ఉన్నాయి. ఇన్ని దారుణాలు జరిగినా కాథలిక్‌ ‌చర్చి భారతదేశాన్ని, ముఖ్యంగా హిందువులని క్షమాపణ కోరలేదు.

భారతదేశంలో బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగుతున్న సమయంలోనే గోవా విముక్తి కోసం సమరం మొదలైంది. గోవా విముక్తి ఉద్యమాలు 20వ శతాబ్దపు తొలి దశకంలో ప్రారంభమైనా ఊపందుకోడానికి చాలా కాలం పట్టింది. పోర్చుగీస్‌ ‌పాలనకు వ్యతిరేకంగా 14 తిరుగుబాట్లు జరిగాయి. పోర్చుగల్‌లో రాచరిక పాలన అంతమైన తర్వాత దాని వలస దేశాల్లో ప్రజాస్వామ్య పాలన కావా లంటూ 1910లో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.

గోవా జాతీయవాద పితామహునిగా ప్రసిద్ధికెక్కిన ట్రిస్టో డి బ్రాగన్యా కున్హా 1928లో గోవా నేషనల్‌ ‌కాంగ్రెస్‌ను స్థాపించారు. ఇది ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌కు అనుబంధంగా పని చేసేది. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీపై పోర్చుగీసు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఆ సంస్థను పనిచేయకుండా చేసింది. 1938లో బొంబాయి నగరంలో గోవా కాంగ్రెస్‌ ఏర్పడింది. గోవాలో జరిగిన స్వాతంత్య్ర పోరాటాలను పోర్చుగీస్‌ ‌ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేసింది. 1946లో ట్రిస్టో డి బ్రాగన్యా కున్హా ని నిర్బంధించంతో, ఎ.జి. తెండుల్కర్‌ ‌గోవా కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు.

కాంగ్రెస్‌ ‌ద్వంద్వ వైఖరి

గోవా స్వాతంత్య్రోద్యమంలో మహాత్మాగాంధీ చొరవతో డాక్టర్‌ ‌రామ్‌మనోహర్‌ ‌లోహియా కూడా చురుగ్గా పాల్గొన్నారు. అయితే నెహ్రూతో పాటు ఇతర నాయకులు గోవా వైపు దృష్టి పెట్టలేదు. పోర్చుగీస్‌ ‌పాలనపై జోక్యం చేసుకుంటే బ్రిటిష్‌వారితో చేస్తున్న ప్రధాన పోరాటం దెబ్బతింటుందని అనుకున్నారు. వారి దృష్టిలో గోవాకు అంతగా ప్రాముఖ్యం లేదు. రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా మాత్రమే గోవా ఉద్యమ నాయకులకు అండగా నిలిచారు. గోవాలో సభలు, సమావేశాల్లో పాల్గొన్న లోహియాను ప్రభుత్వం అరెస్టు చేసింది. డాక్టర్‌ ‌మెనెజెస్‌, ‌పురుషోత్తం కాకోడ్కర్‌, ‌లక్ష్మీకాంత్‌ ‌భెమ్బ్రే మొదలైన నాయకులను కూడా అరెస్టు చేసి లిస్బన్‌ ‌జైల్లో నిర్బంధించారు.

1947లో భారతదేశంతో పాటు గోవాకు స్వాతంత్య్రం వస్తుందని గోవా విముక్తి ఉద్యమ నాయకులు భావించారు. కానీ అలా జరగలేదు. 1954లో లోహియా ప్రేరణతో ‘గోవా విమోచన సహాయక సమితి’ ఏర్పడింది. ఈ సంస్థ సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ ‌నుంచి కూడా ఆచార్య నరేంద్రదేవ్‌ ‌స్థాపించిన ప్రజా సోషలిస్ట్ ‌పార్టీ సభ్యులు లోహియాకు మద్దతు తెలిపారు. ‘ఆజాద్‌ ‌గోమంతక్‌ ‌దళ్‌’ ‌నాయకులు విశ్వనాథ్‌ ‌లావండే, నారాయణ్‌ ‌హరినాయక్‌, ‌దత్తాత్రేయ దేశ్‌పాండే, ప్రభాకర్‌ ‌శినారి గోవా పోలీస్‌ ‌స్టేషన్లపై దాడి చేశారు. శివాజీరావు దేశయ్‌ ‌స్థాపించిన ‘గోవా లిబరేషన్‌ ఆర్మీ’ ఒక ప్రభుత్వ గనిని పేల్చేసింది. ఈ పోరాటంలో ఎందరో నాయకులు జైలు పాలయ్యారు.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ప్రథమ ప్రధాని నెహ్రూ గోవా స్వాతంత్య్ర పోరాటానికి మొదట సహకారం అందించలేదు. పైగా తమ రాజ్యంలోకి ప్రవేశించి, వారి సార్వభౌమత్వాన్ని కొంతమంది భారతీయులు వమ్ము చేస్తున్నారని పోర్చుగీస్‌ అం‌తర్జాతీయంగా ఒత్తిడి తేవడంతో సత్యాగ్రహుల చర్యలకు ప్రభుత్వ ఆమోదం లేదని నెహ్రూ ప్రకటన కూడా చేశారు.

స్వయంసేవకుల పోరాటం

గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొనేందుకు భారత్‌ ‌నుంచి ఎంతోమంది దేశభక్తులు తరలివెళ్లారు. సత్యాగ్రహం చేస్తున్న వేలాదిమంది స్వయంసేవకులు (ఆర్‌ఎస్‌ఎస్‌), ‌జనసంఘ్‌ ‌కార్యకర్తలు అరెస్టయ్యారు. దేశం నలుమూలల నుండి వస్తున్న ఉద్యమకారులకు గోవా సరిహద్దు వెంబడి భోజనవసతి సమకూర్చే కార్యాన్ని స్వయంసేవకులు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. సంఘ్‌కి, జనసంఘ్‌కి చెందిన ప్రముఖులు అనేక సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించారు.

1955లో పోర్చుగీస్‌ ‌ప్రభుత్వం సత్యాగ్రహులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపగా ఎందరో అమరులయ్యారు. ఉజ్జయినికి చెందిన స్వయంసేవక్‌ ‌రాజాభావ్‌ ‌మహంకాళ్‌ ‌వేలాది కార్యకర్తలతో గోవాకి వెళ్లి సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఆ కాల్పుల్లో మొదటి మూడు వరుసల సత్యాగ్రహులు నేలకి ఒరగగా, సహోదరా దేవి అనే మహిళా కార్యకర్త, జాతీయజెండా అందుకుని భారత్‌ ‌మాతాకీ జై అంటూ ముందుకి వెళుతూ పోలీసుల లాఠీ దెబ్బలకు మరణించింది. అప్పుడు రాజాభావ్‌ ఆమె నుంచి జెండా అందుకుని ముందుకి పరుగెత్తి, ఇతర కార్యకర్తలకి అప్పగించి జెండా ఎగురవేసేలా చేశాడు. చివరకు ఆయన కళ్లల్లో తూటాలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మొట్టమొదటిసారి 1955లో పనాజీ సచివాలయంపై భారత త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఘనత స్వయంసేవక్‌ ‌జగన్నాథ్‌రావు జోషికి దక్కింది. 1961లో గోవా విమోచన తరువాత కూడా 17 సంవత్సరాలు ఆయన జైలు శిక్ష అనుభవించాడు. డా. గైతోండే, శ్రీయుత్‌ ‌దేశ్‌పాండే లను కూడా పోర్చుగీస్‌ ‌తరలించి అక్కడి జైళ్లలో బంధించారు. కొందరు పోర్చుగీస్‌ ‌జైళ్లలో ఎన్నో సంవత్సరాలు నరకయాతన అనుభవించారు.

1954 ఆగస్ట్ 2‌వ తేదీన పోర్చుగీసు స్థావరాలైన దాద్రా, నాగర్‌ ‌హవేలీలలోనికి పెద్ద సంఖ్యలో స్వయంసేవకులు జొరబడ్డారు. పుణె సంఘచాలక్‌ ‌వినాయకరావు ఆప్టే నేతృత్వంలో గెరిల్లా వ్యూహాన్ని రూపొందించి, సెల్వాసాలోని ప్రధాన పోలీసు కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. అక్కడున్న 175 మంది సైనికులు భేషరతుగా లొంగిపోయేటట్లు చేశారు. త్రివర్ణ పతాకం ఎగరవేశారు. ఆదేరోజన ఆ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఆ చారిత్రాత్మక సంఘటన రజతోత్సవం సందర్భంగా 1979 ఆగస్ట్ 2‌న సెల్వాసా ప్రజలు స్వాతంత్య్ర వీరులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి సత్కరించింది.

1961 డిసెంబర్‌ 19‌న విముక్తి

గోవా విముక్తి, స్వాతంత్య్ర ఉద్యమం పతాక స్థాయికి చేరడంతో అంతర్జాతీయంగా పోర్చుగీసు వారిపై ఒత్తిగి వచ్చింది. గోవాను వదులుకోవడానికి భారత్‌ ఒప్పుకోదు. పలు దేశాలు, సంస్థలు భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పినా ప్రయోజనం లేక పోయింది. మరోవైపు ఉద్యమకారుల పట్ల పోర్చుగీసు వారు చాలా కఠినంగా వ్యవహరించారు. ఆ రోజుల్లో గోవాలోని జైళ్లన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. 1961 నవంబర్‌లో పోర్చుగీస్‌ ‌సైన్యం గోవా మత్స్యకారులపై కాల్పులు జరిపింది. అందులో ఒకరు మరణించారు. తరువాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. నాటి రక్షణమంత్రి కేకే కృష్ణమీనన్‌, ‌నెహ్రూ కలిసి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గోవాలో పరిస్థితులు విషమించడంతో సైనిక చర్య చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్‌ 17‌న 30 వేల మంది సైనికులతో ఆపరేషన్‌ ‌విజయ్‌ ‌చేపట్టారు. వాయుసేన, నౌకాదళం కూడా ఇందులో పాల్గొన్నాయి. ఈ పోరాటంలో 22 మంది భారతీయులు, 30 మంది పోర్చుగీసు వారు మరణించారు. అయితే 36 గంటల్లోనే పోర్చుగీసు ప్రభుత్వం లొంగిపోయింది. గోవాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్‌, ‌డయ్యు కూడా భారతదేశం ఆధీనంలోకి వచ్చాయి.

గోవా విముక్తితో భారత భూభాగంపై 451 ఏళ్ల పోర్చుగీసు పాలన అంతమైంది. కాని 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. తమ గడ్డ మీద, తమ పౌరుల మీద భారత ప్రభుత్వం జరిపిన దాడిగానే పేర్కొంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన పద్నాలుగున్నర సంవత్సరాల తరువాత గోవాకు విముక్తి లభించింది. భారత్‌లో గోవా, డయ్యూ, డామన్‌ ‌కలిపి 1987 వరకూ కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగింది. 1987 మే 30న గోవాను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించారు.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram