సంక్రాంతి సందేశం

జాతీయ సాంస్కృతిక దర్శనాన్నీ, అవగాహననూ, సాంప్రదాయాలనూ, ప్రతితరానికి అర్థమయ్యేటట్టు చేయడంలో మన పండుగలు ప్రభావవంతమైన ఉపకరణాలుగా ఉన్నాయి. భూమండలం మీద ఆరు రుతువులూ కనబడే అరుదైన ప్రాంతం మన దేశం. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా సాంస్కృతిక బోధను సమాజమంతటికీ అనుభవానికి వచ్చే విధంగా మన పెద్దలు పండుగలు ఏర్పరిచారు. అదే హిందూ సంస్కృతి ప్రత్యేకత.

మకర సంక్రాంతి అలాంటి విశిష్టత కలిగిన పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భాన్ని, దక్షిణం నుండి ఉత్తరం వైపు (చీకటి,చలి నుండి వెలుతురు, వేడి వైపు) మరలే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సంక్రాంతిని జరుపుకుంటాం. ఈ పండుగను చాలా చోట్ల పెద్ద పండుగ అని కూడా అంటారు. సంపద చేతినిండా ఉన్న సమయం కావడంతో పండుగలన్నింటి కంటే సంక్రాంతి సమయంలో చేసే క్రతువులూ, సంప్రదాయాలూ చాలా ఎక్కువ. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, దానధర్మాలు చేయడం, ఇంటి ప్రాంగణం, వీధులు అలంకరించడం, పందాలు నిర్వహించడం, గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాలు, అనేక వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివన్నీ సంక్రాంతి పండుగ సమయంలో చూస్తూ ఉంటాం.

మన సంస్కృతి నుండి ప్రేరణ పొందుతూ దేశాన్ని వైభవతీరాల వైపు పయనింపచేసే లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ, దేశమంతటా ఆశిస్తున్న సమ్యక్‌ ‌క్రాంతి కోసం (మార్పు కోసం) ఈ పండుగను ఒక ప్రేరణా శ్రోతస్సుగా భావిస్తూ సంఘం యేటా జరుపుతోంది.


ఈ సంక్రాంతి హిందూ జాతి జీవితంలో గతమెరుగని ఒక క్రాంతిని సృష్టించబోతోంది. విదేశీ విధ్వంసకారుడు బాబర్‌ ‌చేతిలో కళంకితమైన అయోధ్య శ్రీరామజన్మభూమి విముక్తికై కోట్లాది హిందువులు శతాబ్దాల నుండీ చేస్తున్న అలుపెరుగని పోరాటం ఫలించింది. శ్రీరామజన్మభూమిలోని ఆ 2.77 ఎకరాల భూమి బాలరామునిదనీ, దాన్ని హిందువులకు అప్పగించమనీ 2019 నవంబర్‌ 9‌న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ 2.77 ఎకరాలతోపాటుగా గతంలో వివిధ సమయాల్లో సేకరించిన 67.33 ఎకరాల భూమినీ కలిపి ‘‘శ్రీరామాజన్మభూమి తీర్థక్షేత్ర’’ అనే ట్రస్టు ఏర్పరిచి దానికి అప్పగించింది. కోట్లాది హిందువులు పోరాడి సాధించుకున్న ఈ శ్రీరామ జన్మభూమిలో హిందువులందరి భాగస్వామ్యంతో భవ్యమైన శ్రీరామమందిరం నిర్మించబోతున్నామనీ, ఈ కార్యానికి మకర సంక్రాంతి నుండీ మాఘపూర్ణిమ వరకూ నిధిని సమర్పించమనీ ప్రతీ హిందూ కుటుంబానికీ ట్రస్ట్ ‌పిలుపునిచ్చింది. 5 లక్షల గ్రామాల నుండి, కోట్లాది కుటుంబాల నుండి హిందువులు మందిర నిర్మాణ నిధి సమర్పించ బోతున్నారు. ఇంతటి బృహత్‌ ‌ప్రజాభాగస్వామ్యంతో నిర్మించబోయే ప్రపంచంలోనే పప్రథమ కట్టడం ఇది. రామజన్మ భూమిలోని ఈ మందిరానికి ప్రతీ హిందువూ ఈ సంక్రాంతి సమయంలో నిధి సమర్పించడం అంటే హిందూ జాతి తమపై జరిగిన అఘాయిత్యాలను అంగీకరించి మౌనం వహించి తలవంచి ఇంకెంత మాత్రం కూర్చొనబోదనీ, భారత్‌లో అన్యమతాల విస్తరణ, దురాక్రమణ మనస్తత్వాన్ని ఎంతమాత్రమూ అనుమతించబోమనీ స్వాభిమానంతో, సగర్వంతో ప్రతీ హిందువూ ప్రపంచానికి ప్రకటించే శుభ సంకేతమే సంక్రాంతి క్రాంతి కేతనం.

మన హిందూ సాంస్కృతిక వారసులను ప్రలోభ పెట్టి, మభ్యపెట్టి, కుటిల ఎత్తులు పన్ని ఈ సంప్రదా యాలకు దూరం చేసి, ఈ సంస్కృతికి వ్యతిరేకంగా తయారుచేసే ఒక దుష్టప్రయత్నం మన చుట్టూ పెద్దఎత్తున జరుగుతూ ఉండడం కళ్లారా చూస్తున్నాం. ఇది ఈ దేశ భవిష్య సమైక్యత, సమగ్రత, అఖండతలకు పెను ముప్పు. ఈ చీకట్లను తొలగించే ప్రయత్నం హిందూజాతి చేస్తూనే ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా సమరసతా సేవా ఫౌండేషన్‌, ‌ధర్మజాగరణ వంటి సంస్థలు అన్యమతాల కుట్ర పూరిత కబంధహస్తాల్లో చిక్కుకుపోయిన హిందూ బంధువులను జాగృతపరిచి, తిరిగి స్వధర్మావలంబీకు లుగా చేయగలిగాయి. ఈ సంక్రాంతికి ఇది ఒక వేకువ వెలుగు. ఇది మరింత వేగవంతం కావాలి. ప్రతీ హిందువూ అన్యమతాల కుట్రలకు బలైపోయిన కనీసం ఒకరి జీవితంలో తిరిగి స్వధర్మ కాంతిని నింపే ప్రయత్నం చేసి విజయవంతం కావాలి. ఇలాంటి ఒక ఉత్తమ ప్రేరణను ఈ నూతన సంక్రాంతి వేళ సమస్త హిందూ ప్రజానీకం పొందాలి.

గడచిన తొమ్మిది నెలలుగా ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో విలవిలలాడుతోంది. ఆదాయ మార్గాలు మూసుకుపోయి అల్లాడిన బడుగుజీవులు, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయి దిక్కుతోచని దేశాలు.. ఈ దుస్థితి నుండి బయటపడి యథాస్థితికి వస్తున్న పరిస్థితి క్రమేణా ఏర్పడుతోంది. కరోనా కాలానికి ఇదొక పార్శ్వం. ఆ కాలానికి సంబంధించి మనం దృష్టి సారించ వలసిన మరొక పార్శ్వం కూడా ఉంది.

ప్రపంచాన్నీ, ప్రకృతినీ గెలవగలం అనుకునే మనిషి భ్రమలను ఈ కరోనా పటాపంచలు చేసింది. ప్రకృతిని, పర్యావరణానికి భంగం వాటిల్లేటట్లు మానవ సమాజం వ్యవహరిస్తే ఏమవుతుందో కరోనా పాఠం నేర్పింది. కనుక ప్రకృతికి దగ్గరగా, పర్యావరణానికి హితం కలిగించేట్లు మన జీవనం ఉండాలని మరొకసారి మహమ్మారి హితబోధ చేసింది. ‘బీపీ, సుగర్‌ ‌వంటివి నన్నేమి చేస్తాయి. ఏదైనా ఎంతైనా తింటాను. కాకుంటే ఓ మాత్ర పడేసుకుంటాను’ అనుకుని జీవించడం ఎంత అజ్ఞానమో తెలియజేసింది. జబ్బులన్నిటినీ మాత్రలతో జోకొట్టేద్దామని అనుకోవడం అవివేకమనీ, అవి రాకుండా చేసుకునే, వస్తే తక్షణం నిర్మూలించుకునే ఆరోగ్య జీవనశైలిని అలవర్చుకోవాలి అనే ఆలోచన లను అందరి మెదళ్లలో ఈ కరోనా కలిగించింది. మితాహారం, అల్లం, తులసి, మిరియాలు వంటి హితకరమైన ఆహారం, తగిన మోతాదులో వ్యాయామం, యోగ, ప్రాణాయామం రోజువారీ జీవితంలో తప్పనిసరి అనీ, మందులతో రోగాలను నెట్టుకురావడం సాధ్యం కాదనీ, రోగ నిరోధక శక్తి పెంపు మాత్రమే జీవితానికి శ్రీరామరక్ష అనీ ప్రపంచ వ్యాప్తంగా మనిషికి కరోనా ఢంకా బజాయించి మరీ తెలియజేసింది.

నిత్యావసర వస్తువులు వీలైనంత దగ్గర్లోనుండే సమకూర్చుకోవాలనీ, వాటిని చాలా దూరాల నుండీ తెప్పించుకోవలసిన పరిస్థితులు ప్రమాదకరమనీ ఈ కరోనా కాలం విశదపరించింది. స్వావలంబన కలిగిన గ్రామీణ జీవన వ్యవస్థ ఆవశ్యకతను అవగతం చేసింది.

స్వదేశీ వస్తువుల లభ్యత, వాటి నాణ్యతపై పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలూ, వ్యాపారులూ దృష్టి పెట్టవలసిన ఆవశ్యకతను అర్థమయ్యేటట్టు చేస్తూనే సామాన్య భారతీయులందరికీ స్వదేశీ వస్తు వినియోగంపై ఉండవలసిన శ్రద్ధను గుర్తు చేసింది.

ఇంటి శుభ్రత, వంటి శుభ్రత, ఇందుకు తీసుకోవ లసిన జాగ్రత్తలనూ అతి ముఖ్యంగా అవగాహన కలిగిస్తూనే నమస్కారం వంటి మన సంస్కారాల ఔచిత్యాన్ని కరోనా ప్రపంచం ఆచరించే టట్టు చేసింది. కుటుంబాల్లో ఆప్యాయతలు, ఇరుగుపొరుగు మధ్య ఆత్మీయబంధాలు కనుమరుగవు తున్న నేటి కాలంలో మరలా ఆ సంబంధాలలోని మాధుర్యాన్ని అందరి అనుభూతుల్లోకి కరోనా తీసుకువచ్చింది. ఇలా చెప్తూ పోతే కరోనా పాఠాలు లెక్కకు మిక్కిలి. మూసుకుపోతున్న మనిషి కళ్లు తెరిపించినదే కరోనా. ఆధునికత పేరుతో నేల విడిచి సాము చేస్తున్న వారందరి దృష్టీ భారతీయ, జీవనశైలివైపు ఒక్కసారిగా మరలింది.

ఈ కాలంలోనే పూజనీయ సర్‌ ‌సంఘచాలకులు మోహన్‌జీ ఏప్రిల్‌ 26‌న స్వయంసేవకులనుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా కాలం నిగ్గుతేల్చిన మన భారతీయ జీవన పద్ధతుల ఆధారంగా జాతి పునర్నిర్మాణానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావాలనీ, దానికి స్వయంసేవకులు ముందుండాలనీ అన్నారు. స్వ ఆధారిత తంత్రం స్థాపితం కావడమే స్వాతంత్య్ర ప్రాప్తి పరమార్థమని, కరోనా గుణపాఠాల ఆధారంగా ఈ దిశలో ఒక పెద్ద అడుగు ముందుకు పడాలన్నారు. తక్కువ వ్యయంతో ఉపాధి కల్పిస్తూ పర్యావరణానికి హాని చేయని మన కుటుంబ ఆలోచనలకు, అలవాట్లకూ అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించిన యుగానుకూల ప్రణాళికను  నిర్మాణం చేసుకో వలసిన సమయం వచ్చిందన్నారు. ఈ పనికి ప్రభుత్వాలతోపాటూ ప్రజలు అత్యంత కీలకమనీ, కోట్లాది భారతీయుల జీవితాల్లో ఈ చైతన్య కాంతులు వెల్లివిరియాలని కోరారు. మన కుటుంబాల్లో ప్రబోధన విషయాలుగా గ్రామ లేదా బస్తీ వికాసం, పర్యావరణ పరిరక్షణ వంటివి నియమితంగా ఉండాలని మార్గదర్శనం చేశారు.

ఈ సంక్రాంతి కరోనా గుణపాఠాల ఈ క్రొంగొత్త కాంతితో దేశమంతా ప్రకాశించాలి. ప్రతీ సంఘ శాఖ ఒక ప్రయోగశాల కావాలి. ప్రతీ స్వయంసేవక్‌ ఒక ఆదర్శ నమూనా కావాలి. ప్రతీ స్వయంసేవక్‌ ‌కుటుంబం ఒక ఆధారశిల కావాలి.

– విజయాదిత్య, సహప్రాంత ప్రచారక్‌, ఆం‌ధప్రదేశ్‌

About Author

By editor

Twitter
Instagram