సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు వైశాఖ బహుళ సప్తమి,  19 మే 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


జాతి ప్రబల ఆకాంక్ష మేరకు, వారి ఉగ్రకామనను గౌరవించి భారత సైన్యం ఆపరేషన్‌ ‌సిందూర్‌ను ఆరంభించింది. ఈ ఆపరేషన్‌లో ఇంతవరకు జరిగిన పరిణామాలన్నీ ప్రపంచ యుద్ధ చరిత్రలో సరికొత్త వాక్యాలుగానే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఖ్యాతి భారత్‌దే. భారత సేనా వాహినులదే. ఇలాంటి సంక్షుభిత సమయంలో దేశాన్ని నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానిది, ఆ ప్రభుత్వ నేత నరేంద్ర మోదీదే కూడా. ఇంకా, సరిహద్దులలో రణఘోషల మధ్య భారతజాతి వినిపించిన ఐక్యతా గళం మహత్తరమైనది. దేశం కల్లోలంలో ఉంటే మేమంతా ఎప్పటికీ ఒక్కటే అన్న సందేశాన్ని మరొక్కసారి శత్రువుకు ప్రదర్శించారు జాతి జనులు. ఇది అర్థవంతమైన ఆవేశం. దేశం ప్రదర్శించిన ఈ ధర్మాగ్రహం స్వాగతించదగినది. కానీ ఎన్నో గహనమైన పరిస్థితుల నడుమ ఘర్షణకు స్వల్ప విరామం ఇవ్వవలసి వస్తే ఇంతటి జాతి, అందులోని ఆవేశం క్షణంలో దిశ మార్చేసుకోవడం అవాంఛనీయం. ధర్మాగ్రహం దారి తప్పడం అత్యంత విషాదకరం, శోచనీయం. ఇది ఆగాలి. కాల్పులకు విరామం రణభూమిలో భారత్‌ ‌వెనుకడుగు అని నిర్ధారించే వరకు వెళ్లిన వారిని మే 12వ తేదీ రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చెప్పిన మాటలు మేల్కొలిపి ఉండాలి.

నిజమే, ఆపరేషన్‌ ‌సిందూర్‌ ఆరంభించిన మూడో రోజునే భారత్‌ ‌కాల్పుల విరమణకు అంగీకరించింది. కాదు, అంగీకరించవలసి వచ్చింది. కానీ భారత్‌ ‌వైఖరి మారలేదు. గురీ మారలేదు. చర్చలంటూ ఉంటే ఉగ్రవాదుల, ఆక్రమిత కశ్మీర్‌ అప్పగింతల మీద మాత్రమేనని కుండబద్దలు కొట్టి ప్రకటించింది. అయినా ఈ ఆపరేషన్‌ ‌ద్వారా భారత్‌ ఎం‌తో సాధించిందన్నది తిరుగులేని సత్యం. దీనిని గమనించకుంటే ఎలా? 130 నుంచి 140 మంది ముస్లిం మతోన్మాదులను/ఉగ్రవాదులను ఆపరేషన్‌ ‌సిందూర్‌తో భారత్‌ ‌వధించింది. ఇది నీతీ జాతీ రీతీ ఎరుగని ఒక రోగ్‌ ‌నేషన్‌ ‌పాక్‌తో జరుగుతున్న ఘర్షణ. అలాగే అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ప్రపంచంలో తొలిసారిగా జరుగుతున్న ఘర్షణ. నీవు ఉపయోగించకుంటే అణ్వాయుధాలను మాకు ఇమ్మని పాకిస్తాన్‌ ‌మీద ఉగ్రవాదులు వత్తిడి తెస్తున్నట్టు వచ్చిన వార్తలు కొట్టి పారేయదగినవి కావు. గోధుమల పద్దు కోసం తన మందుగుండును ఉక్రెయిన్‌కి అమ్మేసిన పాకిస్తాన్‌ ‌దగ్గర ఇప్పుడు ఆయుధాలూ లేవు. అందుకే, ఇక మిగిలినవి అణ్వాయుధాలేనని అమెరికాకు చెప్పిందంటున్నారు. ఇది పరోక్షంగా అణ్వాయుధాన్ని బయటకి తీస్తామన్న హెచ్చరిక. దశాబ్దం పాటు కశ్మీర్‌ ‌మినహా మిగిలిన భారత్‌లో ఒక్క ఉగ్రవాద పేలుడు కూడా సాగనీయకుండా ప్రజలను కాపాడుతూ వచ్చిన ప్రధాని మోదీ ఈ వాస్తవాలను గమనించకుండా ఉండడం సాధ్యం కాదు. దాని ఫలితం, ఆ ఫలితంతో సాధించిన పురోగతి విస్మరించడానికి వీలు లేదు. మోదీకి ముందటి హయాంలో జరిగిన ముంబై పేలుళ్లను మరచిపోయిన కొందరు ప్రధాని మోదీ గుర్తించక తప్పని ఆ వాస్తవాన్ని తొందరపడి శంకిస్తున్నారు. ఇది బాధాకరం. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌ముగిసిందని మోదీ ప్రకటించలేదు. నీరూ నెత్తురూ ఒకేచోట ప్రవహించడం సాధ్యం కాదనే తేల్చి చెప్పారు. ముందు నుంచి చెబుతున్నారు. దీనిని విస్మరిస్తే ఎలా? ‘పాక్‌ అణ్వాయుధం ప్రయోగిస్తే, 25 శాతం భారతీయులను కోల్పోయినా మేం ఖాతరు చేయం. కానీ పాకిస్తాన్‌ ఆ ‌తరువాతి రోజు సూర్యోదయం చూడదు’ అని నాటి అటల్‌ ‌బిహారీ వాజపేయి ప్రకటించిన సంగతి విస్మరించొద్దు. ‘పాక్‌ అణు హెచ్చరికలక• ఒక్కటే సమాధానం. మా దగ్గరా అణ్వాయుధాలు ఉన్నాయి. అవి దీపావళికి కాల్చుకోవడానికి కాదు’ అంటూ మన మోదీ తెగేసి చెప్పిన సంగతీ అప్పుడే పాత పడితే ఎలా? యుద్ధ సమయంలో జాతి జాగరూకతతో ఉండకపోతే మొదటి విజయాన్ని ఎగరేసుకుపోయేది అబద్ధమే. ఇప్పటికే క్షిపణుల స్థాయిలో బలహీనుల మెదళ్లను తాకిన అవాస్తవాలు చేయగలిగినంత నష్టం చేశాయి. భారతజాతిని ఇంకా ఇంకా డోలాయమాన స్థితికి తీసుకువెళ్లడానికి పెద్ద అప్రకటిత యుద్ధమే జరుగుతోంది.

ఆపరేషన్‌ ‌సిందూర్‌లో భాగంగా భారత్‌ ఎం‌పిక చేసుకుని ధ్వంసం చేసిన తొమ్మిది కేంద్రాలలో మురిద్కే ఒకటి. మురిద్కే ప్రశాంత ఆధ్యాత్మిక కేంద్రమనీ, భావి పౌరులను బుద్ధిమంతులుగా, బంగారుకొండల్లా తీర్చిదిద్దే విద్యాలయమనీ సీఎన్‌ఎన్‌ ‌జర్నలిస్ట్ ‌కొర్డెలియా లించ్‌ అక్కడ నుంచే నివేదించింది. ఈ నివేదిక పాశ్చాత్య మీడియా వక్రభాష్యాలకీ, వికార పోకడలకీ పాఠంగా ఎంపిక చేయదగినది. ఎందుకంటే ముంబై నెత్తుటి కాండను సాగించిన నరహంతకుడు అజ్మల్‌ ‌కసబ్‌ ఇక్కడే ఉత్పత్తి అయ్యాడు. డేవిడ్‌ ‌హెడ్లీ, తహవూర్‌ ‌రాణా ఇక్కడే శిక్షణ పొంది భారత భూభాగాలను రక్తంతో తడిపేశారు. ఇలాంటి కేంద్రాన్ని ధ్వంసం చేసినందుకు స్థానికులు భారత్‌ ‌మీద ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారంటూ ఈ మహిళా జర్నలిస్ట్ ‌కళ్లు మూసుకుపోయి, హద్దులెరుగని అజ్ఞానంతో నివేదించింది. నీ నివేదికలో అణుమాత్రమైనా నిజం ఉందేమో, పోయి హఫీజ్‌ ‌సయీద్‌నే అడిగి తెలుసుకో అంటూ భారత ఇంటెలిజెన్స్ ‌బ్యూరో మాజీ సంచాలకుడు యశోవర్ధన్‌ ‌ఝా అజాద్‌ ‌ముఖం పగిలే రీతిలో ఖండించారు. ఉగ్రవాదులను మిలిటెంట్లు అంటూ గౌరవించిన న్యూయార్క్ ‌టైమ్స్ ‌చీవాట్లు తిన్నది. కొందరు భారత వ్యతిరేక నాటు యూట్యూబర్లు, అమ్ముడుపోయిన స్వయం ప్రకటిత వార్తా వ్యాఖ్యాతలు ఈ స్థాయిలోనే దేశ ప్రజల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి నడుం కట్టేశారు. కాల్పుల విరమణ వార్తకు ఒక చెత్త యూట్యూబర్‌ ‘‌భారత్‌ ‌వెనకడుగు’ అని శీర్షిక పెట్టాడు. ఇవి వాస్తవాలా? మందు పడితేనే గాని మాట పెగలని, కలం కదలని జర్నలిస్టుల మత్తురాతలా? దేశం ఆలోచించాలి. కాల్పుల విరమణకు పాకిస్తాన్‌ ‌దేబరించిం దన్నదే తిరుగులేని వాస్తవం. భారత్‌ ‌వెనకడుగు వంటి మాటలు ఏ కోణం నుంచి చూసినా నిజమని ఎవరైనా చెప్పగలరా? ఆ అవసరం ఎవరిది?

దేశం సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు, ఒక నిర్దిష్ట, శాశ్వత ఫలితం కోసం యుద్ధంలోకి దూకినప్పుడు జాతిలో డోలాయమాన స్థితి ప్రమాదకరమే. మతోన్మాదం తకెక్కి ఏడున్నర దశాబ్దాలుగా స్వైర విహారం చేస్తున్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెళ్లగించాలన్న సంకల్పంతో మొదటిసారి జాతి నాయకత్వం కదిలిన తరువాత అవాచ్యాలు పేలడం ఆత్మహత్యా సదృశమే. భారతజాతి ఔన్నత్యాన్ని నిరంతరం కించపరిచే శక్తులు బలపడుతున్న వేళ, భారత సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయ వేదికల నుంచి దూషించే ప్రతిపక్షం ఉన్న కాలంలో సహేతుకమైన దృష్టితో వ్యవహరించడం జాతీయవాదుల కనీస కర్తవ్యం. జాతిని నడిపే చోదకశక్తి స్థానంలో జాతీయవాదమే శాశ్వతంగా ఉండాలి. అలాంటి జాతీయవాదమే ఊపిరిగా, చారిత్రక తప్పిదాల సవరణ మీద గొప్ప దృష్టి, దేశం పట్ల బాధ్యత కలిగిన నేటి ప్రభుత్వం విషయంలో ఇలాంటి శంకలు, అనాలోచిత నిర్ణయాలు, ఆవేశంతో కూడిన సత్వర తీర్పులు, అర్థరహిత ప్రకటనల క్షిపణిని వేగంగా వదలడం సరికాదని సవినయంగా మనవి చేస్తున్నాం.

About Author

By editor

Twitter
YOUTUBE