మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినం

ఒకప్పుడు తీవ్రవాదానికి నెలవులుగా ఉన్న ప్రాంతాలలో నేడు అభివృద్ధిపూలు పూస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇటు జమ్ముకశ్మీర్లో గానీ, అటు ఈశాన్య రాష్ట్రాల్లో గానీ పరిస్థితులు మునుపట్లా లేవు. రెడ్‌ ‌కారిడార్‌ ‌పేరుతో ఒకప్పుడు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన వామపక్ష ఉగ్రవాదం చత్తీస్‌గఢ్‌కు పరిమితమైంది. తీవ్రవాదుల దాడులు, తుపాకుల మోతలు, సైన్యం, పోలీసుల పదఘట్టనలతో సాగిన వారి దైనందిన జీవితంలో ఇప్పుడు ప్రశాంతత వచ్చింది. ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాలేదు. మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో సాధించిన ఘనతగా చెప్పుకోవాలి.

ఇవాళ్టి ఉగ్రవాదం స్వరూప స్వభావాలు వేరు. స్లీపర్‌ ‌సెల్స్ ‌వంటి ప్రమాదకర పంథాలు అమలవు తున్నాయి. పొరుగు దేశాల మద్దతుతో సాగే ఉగ్రవాదం మరొకటి. చాలా సైబర్‌ ‌నేరాలు కూడా ఉగ్రవాదంతో సంబంధం ఉన్నవే.హక్కుల పేరుతో మతం చాటున సాగుతున్న ఉగ్రవాదం కూడా బాగా విస్తరించింది. ఇవన్నీ ఏ ప్రభుత్వానికైనా సవాలే. అయినా దేశ సమగ్రత, భద్రతల విషయంలో రాజీ పడని మోదీ ప్రభుత్వ కఠిన వైఖరితో దేశవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. అటువంటి సంఘటనలు తగ్గటంతో పాటు మరణాల రేటు తగ్గటం వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తా వించుకోవాలి. మే 21 ‘యాంటీ టెర్రరిజం డే’ సందర్భంగా ఆ అంశాలను ఒకసారి సమీక్షించు కోవాలి.

రాళ్లదాడులు, సాధారణ ప్రజల హత్యలు, పండిత్‌ల మీద హత్యాకాండ వార్త వినపడని రోజు జమ్మూకశ్మీర్‌లో కొద్దికాలం క్రితం వరకు లేవు. ఈ నేపథ్యంలో ఆర్టికల్‌ 370, 35 ‌రద్దు చేయటం చారిత్రక పరిణామం. రాజ్యాంగ సవరణ ద్వారా ఆగస్టు 5, 2019నుంచి జమ్ముకశ్మీర్‌, ‌లద్దాఖ్‌లకు సమాన ఫెడరల్‌ ‌హక్కులు లభించాయి. ఒకే జెండా, ఏకైక సిటిజన్‌ ‌షిప్‌, ఒకే చట్టం అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్‌ 370 ‌రద్దు ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపిం చింది. తీవ్రవాద కార్యకలాపాలు బాగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అక్టోబరు2, 2016 నుంచి ఆగస్టు 4, 2019 వరకూ 959 సంఘటనలు చోటు చేసుకుంటే, ఆగస్టు5, 2019 నుంచి జూన్‌ 6, 2022 ‌వరకూ 654 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గింది. అక్టోబరు2, 2016 నుంచి ఆగస్టు 4,2019 వరకూ 137 మంది చనిపోతే, ఆగస్టు 5, 2019 నుంచి జూన్‌ 6, 2022 ‌వరకూ 118 మరణాలు సంభవించాయి. తీవ్రవాద సంఘటనల్లో 32 శాతం, మరణాల్లో 14 శాతం తగ్గుదల కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది మరణాల్లో 52 శాతం, కొత్తగా తీవ్రవాదుల చేరికలు 14 శాతం తగ్గాయి. తీవ్రవాద కార్యకలాపాలు, చొరబాట్లు, రాళ్లదాడులు వంటివి కూడా తగ్గిపోయాయి. 2004 నాటితో పోలిస్తే, సెక్యూరిటీ సిబ్బంది మరణాలు 70 శాతం తగ్గటం చెప్పుకోదగ్గ పరిణామం.

ఉగ్రవాదానికి దోహదం చేయగలవన్న కొన్ని పరిస్థితులను కూడా మోదీ ప్రభుత్వం మార్చే ప్రయత్నం చేసింది. ఉగ్రవాద నిర్మూలన, సమస్యల పరిష్కారానికి చొరవ ఈ రెండూ ఉగ్రవాద సమస్యను చల్లార్చడానికి ఉపయోగపడినాయి. జమ్మూకశ్మీర్‌లో పంచాయతీరాజ్‌ ‌చట్టాన్ని సవరించారు. విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచటానికి ఇండస్ట్రియల్‌ ‌డెవలప్మెంటు ప్రాజెక్టును ప్రారంభించారు. టూరిజం పాలసీ-2020ని సవరించారు. టూరిజం డిపార్ట్‌మెంటు 75 ఆఫ్‌ ‌బీట్‌ ‌డెస్టినేషన్లను గుర్తించి అక్కడ ప్రాథమిక సౌకర్యాలు కల్పించింది. కొవిడ్‌ ‌కారణంగా దెబ్బతిన్న టూరిజం సంస్థలకు రూ.17.44 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అక్టోబరు 2021లో శ్రీనగర్‌ ‌నుంచి షార్జాకు ప్రత్యేకంగా విమానాన్ని ప్రారంభించారు. అలాగే కొత్తగా రాత్రి విమానాలను ప్రారంభించారు. దాంతో 2022 మొదటి ఆరునెలల్లోనే 80 లక్షల మంది టూరిస్టులు జమ్ముకశ్మీర్‌ ‌ను సందర్శించారు. ఒక్క మే నెలలోనే 22 లక్షల మంది సందర్శించటం రికార్డుగా చెప్పుకోవాలి. ప్రధాని డెవలప్‌మెంటు ప్యాకేజీ కింద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. రూ.80వేల కోట్లతో 63 ప్రాజెక్టులు, రూ.58,477 కోట్లతో 53 ప్రాజెక్టులు కొనసాగుతుంటే, 29 ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులు, రైల్వే నెట్‌వర్కుల విస్తరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 28,400 కోట్లతో పారిశ్రా మికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌పాలసీని ప్రకటించారు. ఇవన్నీ జమ్మూకశ్మీర్‌ ‌ముఖచిత్రాన్ని మార్చేందుకు దోహదం చేశాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో హింస విధ్వంసాల రూపు రేఖలు వేరు. ఒకవైపు క్రైస్తవ మిషనరీల వేర్పాటు వాదం, మరొక వైపు గిరిజన తెగల మధ్య నిరంతర ఘర్షణలు ఈశాన్యాన్ని రావణకాష్టంగా మార్చాయి. అక్కడి వాతావరణం పూర్తిగా మారి పోయింది. హింస తగ్గుముఖం పట్టింది. 2006-14 మధ్య 8,700 సంఘటనలు చోటుచేసుకుంటే, 2014-22 మధ్య 2773 సంఘటనలు చోటుచేసు కున్నాయి. సంఘటనల్లో 68 శాతం తగ్గుదల కనిపించింది. మరణాల్లోనూ 60 శాతం తగ్గుదల ఉంది. 2006-14 మధ్య 304 మంది చనిపోతే, 2014-22 మధ్య 123 సంఘ టనలు చోటుచేసు కున్నాయి. పౌరుల మరణాల విషయానికొస్తే, 2006-14 మధ్య 1890 మంది చనిపోతే, 2014-22 మధ్య 317 మంది మరణించారు. తగ్గుదల శాతం 60. ఈశాన్య రాష్ట్రాల్లో జీడీపీని స్వాతంత్య్రా నికి ముందున్న స్థాయికి చేర్చటం, ప్రశాంతతకు నెలవుగా మార్చటం అన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్లింది. సాయుధ దళాల ప్రత్యేక చట్టాల పరిధిని కుదించారు. అస్సాంలో 60 శాతం ప్రదేశం, మణిపూర్‌ ‌లో 15 పోలీసు స్టేషన్లు, 16 జిల్లాలు, అరుణాచలప్రదేశ్‌లో మూడు జిల్లాలు తప్ప మిగిలిన ప్రదేశం, నాగాలాండ్‌లో 7 జిల్లాలోని 15 పోలీసు స్టేషన్ల ప్రాంతం, త్రిపుర, మేఘాలయాల్లో మొత్తం రాష్ట్రం అంతా ఈ పరిధి నుంచి తొలగించారు. ‘లుక్‌ ఈస్ట్ ‌పాలసీ’ పేరుతో ఈశాన్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. 2022-23 బడ్జెట్‌ ‌లో 2014-15తో పోలిస్తే 110 శాతం బడ్జెట్‌ ‌పెంచారు. నేషనల్‌ ‌రోప్‌ ‌వే డెవలప్మెంటు పోగ్రామ్‌, ‌నేషనల్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ ‌మిషన్‌ ‌వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డు, రైలు, విమానయానంల కనెక్టివిటీని పెంచారు. 2014-15 నుంచి రూ.48,575 కోట్లతో 5,695కోట్ల రోడ్లను నిర్మించారు. జిరిబం-ఇంఫాల్‌ ‌రైల్వే లైన్‌ ‌ప్రాజెక్టు ప్రారంభించారు. బంగ్లాదేశ్‌ ‌తో కనెక్టివిటీ పెంచటానికి అగర్తల-అఖావుర ప్రాజెక్టు చేపట్టారు. ఉడాన్‌ ‌స్కీం కింద కొత్తగా 34 విమానయాన రూట్లను ప్రారంభించారు.

 ఇవన్నీ ఒక ఎత్తయితే వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయటానికి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేశారు. మొదటిది తీవ్రవాద నియంత్రణ, రెండోది అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, మూడోది రాష్ట్రాల సహకారం. దీనికారణంగా ఎనిమిదేళ్లలో పరిస్థితులు గణనీయంగా మారాయి. సెక్యూరిటీ కవరేజిని పెంచటం, పరిస్థితిని బట్టి క్యాంపులను మార్చటం, నాలుగు కొత్త జాయిట్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ఏర్పాటు, సీఆర్పీఫ్‌ ‌బలగాలను పెంచటం, తీవ్రవాద ప్రభావిత ప్రదేశాల్లో ఆరు బెటాలియన్ల సెంట్రల్‌ ‌టాస్క్ ‌ఫోర్సు ఏర్పాటు చేయటం వంటి చర్యలు ఫలితమిచ్చాయి. దానితోపాటు కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయటానికి ఎన్‌ఐఏని పటిష్టం చేశారు.

 జీరో టెర్రరిజం పాలసీ

ప్రభుత్వం అనుసరించిన ‘జీరో టెర్రరిజం’ పాలసీలో భాగంగానే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. 2019 ఆగస్టు2వ తేదీన ఎన్‌ఐఏ ‌చట్టాన్ని సవరించి, ఈ పరిధిలోకి కొన్ని కొత్త నేరాలను కలిపారు. ఎన్‌ఐఏ ‌టెరిటోరియల్‌ ‌జ్యూరిష్‌ ‌డిక్షన్‌ను పెంచారు. వ్యక్తిని తీవ్రవాదిగా ప్రకటించటానికి, టెర్రరిజం ద్వారా సంపాదించిన సొత్తునుగానీ, ఆస్తిని గానీ స్వాధీనం చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు. టెర్రర్‌ ‌ఫైనాన్సింగ్‌ని అదుపు చేయటానికి 25 అంశాల ప్రణాళికను అమలు చేశారు. జిహాద్‌ ‌టెర్రరిజం, నార్త్ ఈస్టరన్‌ ఇన్‌ ‌సర్జన్సీ, వామపక్ష తీవ్రవాదం, కశ్మీర్‌ ‌తీవ్రవాదం, ఎఫ్‌ఐసీఎన్‌, ‌నర్కోటిక్స్ ‌ఫైనాన్సింగ్‌, ‌హవాలా లావాదేవీలపై ఫోకస్‌ ‌పెంచారు. బోర్డర్‌ ‌సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. దేశీయంగా అమలవుతున్న చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి.

తీవ్రవాదాన్ని సహించేదిలేదని పాక్‌కి, దానికి అండగా ఉన్న చైనాకు భారత్‌ ‌హెచ్చరికలు పంపుతూనే ఉంది.అంతర్జాతీయ వేదికలపైన ఈ విషయం స్పష్టంగా చెబుతోంది. మే మొదటి వారంలో జరిగిన గోవా షాంఘై సహకార సంస్థ సమావేశానికి పాక్‌, ‌చైనా, రష్యాకు చెందిన విదేశాంగ మంత్రులు విచ్చేశారు. ఈ సమావేశంలోనూ జైశంకర్‌ ‌పాక్‌కు పంపవలసిన సందేశాన్ని ఇచ్చేశారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా…

ఉగ్రవాద చర్యల వెనుక ఉన్న ప్రేరణల ఆధారంగా ఉగ్రవాదాన్ని వర్గీకరించే ధోరణి ప్రమాద కరమని భారతదేశం పేర్కొంది. ఇస్లామోఫోబియా, సిక్కు వ్యతిరేకత, బౌద్ధ వ్యతిరేకతతో ప్రేరేపించినవన్నీ ఉగ్రదాడులే అన్న విషయాన్ని గట్టిగా చెప్పింది. ఉగ్రవాద శాపాన్ని ఎదుర్కో వడంలోని తప్పుడు ప్రాధాన్యతలకు వ్యతిరే కంగా అంతర్జాతీయ సమాజం రక్షణగా నిలబడాల్సిన అవసరం ఉందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ ఆ ‌మధ్య పేర్కొన్నారు.‘ఉగ్రవాద చర్యల వెనుక ఉన్న ప్రేరణల ఆధారంగా దాన్ని వర్గీకరించే ధోరణి ప్రమాద కరం. అన్ని రూపాలు, వ్యక్తీకరణ లలో ఉగ్రవాదాన్ని ఖండించాలి, ఉగ్రవాద చర్యకు ఎలాంటి సమర్థన ఉండదు’ అనే ఆమోదిం చిన సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది’ అని గ్లోబల్‌ ‌కౌంటర్‌ ‌టెర్రరిజం స్ట్రాటజీపై మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మంచితీవ్రవాదులు, చెడ్డతీవ్రవాదులు అని వేర్వేరుగా ఉండరు. అలాంటి భావనలు 9/11 ముందు కాలానికి తీసికెళతాయని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రాలను పిలిపించి, వారి చర్యలకు జవాబుదారీగా ఉండా లనేది భారతదేశం చెబుతున్న మాట. ఇది ప్రధానంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి చెప్పిందే.

యూఎన్‌ ‌గ్లోబల్‌ ‌కౌంటర్‌-‌టెర్రరిజం స్ట్రాటజీ అనేది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను మెరుగు పరచడానికి జరిగిన ప్రత్యేకమైన ఏర్పాటు. 2006లో ఏకాభిప్రాయం ద్వారా దీనిని స్వీకరించడం ద్వారా, ఐక్యరాజ్యసమితిలో ఉన్న సభ్యదేశాలన్నీ మొదటి సారిగా తీవ్రవాదంపై పోరుకు ఉమ్మడి వ్యూహాత్మక మరియు కార్యాచరణ విధానానికి అంగీకరించాయి. యూఎన్‌ ‌జనరల్‌ అసెంబ్లీ గ్లోబల్‌ ‌కౌంటర్‌-‌టెర్రరిజం స్ట్రాటజీని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తుంది.సభ్యదేశాల తీవ్రవాద వ్యతిరేక ప్రాధాన్యతలకు అనుగుణంగా దానిని ఒక జీవన పత్రంగా మారుస్తుంది. జూన్‌ 7, 2021‌న జరిపిన సమీక్షలో ఆమోదించిన యూఎన్‌ ‌జీఏ తీర్మానం ప్రకారం.. ‘‘ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మతపరంగా ఇతర సంఘాల సభ్యులపై ఉన్న వ్యక్తులతో సంబంధం లేకుండా వివక్ష, అసహనం, హింస పెరుగుదలపైన ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్లామోఫోబియా, సెమిటిజం, క్రిస్టియానోఫోబియా, ఏదైనా ఇతర మతం లేదా విశ్వాసం ఉన్న వ్యక్తులపై పక్షపాతంతో నమోదైన కేసులు ఇందులోకి వస్తాయి.

తీవ్రవాదం వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులను నివారించడం, తీవ్రవాదాన్ని నిరోధించడానికి చర్యలు, రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంపొందించటం, ఆ విషయంలో ఐక్యరాజ్యసమితి వ్యవస్థ పాత్రను బలోపేతం చేయటం, టెర్రరిజంపై పోరాటానికి ప్రాథమిక ప్రాతిపదికగా అందరికీ మానవ హక్కులను గౌరవించేలా చర్యలు తీసుకోవటం అనే దిశగా భారత్‌ ‌వేగంగా ముందుకు వెళుతోంది.

ప్రతి సంవత్సరం మే 21వ తేదీని యాంటీ టెర్రరిజం డేగా గుర్తించాలని కేంద్రహోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలిచ్చింది. యువత తీవ్రవాదం వైపు మళ్లకుండా చూడాలని సూచించింది. ఇందు కోసం తీవ్రవాదం వల్ల సామాన్య జనం ఎదుర్కొనే సాధకబాధకాలను యువతకు పరిచయం చేయాలి. అది జాతి ప్రయోజనాలకు ఎలా భంగం కలిగిస్తోందో అవగాహన కల్పించాలి.

 – డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram