హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ నేపథ్యం-2

పాతబస్తీలో వివక్ష, అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నా మజ్లిస్‌ ప్రస్థానం అడ్డూ ఆపూ లేకుండా సాగడానికి కారణం కేవలం గూండాయిజం, మతోన్మాదం. ఒక వర్గానికి పొగ పెట్టడం కూడా. నలభయ్‌ ఏళ్లుగా మరొక గొంతు వినపడకుండా సాగుతున్న ఈ ఆధిపత్యానికి మొదట మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌ పేరుతో ఒక ఎదురుదెబ్బ తగిలింది. కానీ ఆనాడు అవకాశాలు అంతగా కలసి రాలేదు. సెక్యులరిస్టులు మజ్లిస్‌కే కొమ్ము కాశాయి. కానీ 2024 ఎన్నికల వేళ కొంపెల్ల మాధవీలత పేరుతో మొదటిసారి ‘రజాకార్‌ వారసులకు’ గట్టి ప్రతిఘటన వచ్చిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ  స్థానానికి అనూహ్యంగా మాధవీలత పేరును ప్రకటించి బీజేపీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆమె ఎంపిక సరైనదేనని అక్కడ పార్టీకి వస్తున్న ఆదరణ రుజువు చేసింది. మాధవీలత అరంగేట్రం కంటే ముందు మజ్లిస్‌ మూలాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే అక్కడ సెక్యులరిజం భంగపడిన క్రమం, కాంగ్రెస్‌ కోట కాస్తా ముస్లిం కోటగా మారిన వైనం, మెజారిటీ ప్రజల వలస ఎలా జరిగిందో అర్ధమవుతాయి.

రాచపుండు నుంచి జననం

 మజ్లిస్‌ది ఘనమైన చరిత్ర కాదు. స్వతంత్ర భారతదేశాన్ని కబళించడానికి చూసిన సంస్థానాల రాచపుండు నుంచి పుట్టినదే మజ్లిస్‌. దీని రక్తపుటడుగులు నిజాం పాలానా కాలం నుంచి కనిపిస్తాయి. 1927లో నవాబ్‌ మహమూద్‌ నవాజ్‌ ఖాన్‌ ఖిలేదార్‌ చేత ఉల్మా-ఎ-మషైకీన్‌ సమక్షంలో మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ అనే పార్టీ ఏర్పడిరది. ఆదిలో ఇది సాంస్కృతిక, మతపరమైన సంస్థ. అనతికాలంలోనే రాజకీయ రంగును సంత రించుకుంది. ఇస్లాంలో మతానికీ, రాజకీయాలకీ, రాజ్యానికీ మధ్య గీత పలచగా ఉంటుంది. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు మజ్లిస్‌ బాసటగా నిలిచింది. 1938లో  బహదూర్‌ యార్‌ జంగ్‌ దీనికి అధ్యక్షుడయ్యారు. జంగ్‌ మరణానంతరం ఖాసిం రజ్వీ నాయకుడిగా ఎన్నికయ్యాడు. ఇతడు రజాకార్‌ అనే స్వచ్ఛంద సేవకుల విభాగం ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ పల్లెల్లో రజాకార్లు సృష్టించి విధ్వంసం చరిత్ర మరవని గాయం. ఇప్పుడు కొందరు హిందూ మేధావులు ప్రదర్శిస్తున్న వైఖరి ఆ రక్తపాతానికి గౌరవ ప్రదమైనచోటు కల్పిస్తున్నది. బతకమ్మలను నగ్నంగా ఆడిరచిన రజాకార్‌లను గౌరవించే నీచ సంస్కృతిని ప్రోత్సహిస్తూ, నిజాం తల వంచిన సెప్టెంబర్‌ 17 విముక్తి ఉత్సవాన్ని నిర్వహించ డానికి భయపడిన రాజకీయ పార్టీ బీఆర్‌ఎస్‌.

ఆగస్టు15,1947న స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కాలేదు. మజ్లిస్‌-రజాకార్ల అండ చూసుకొని హైదరాబాద్‌ స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతుందని నిజాం విర్రవీగాడు. ఆర్యసమాజ్‌, స్టేట్‌ కాంగ్రెస్‌ ఈ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని పోరాడాయి. రజాకార్ల దారుణాలు ఢిల్లీ వరకూ వెళ్లడంతో నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పోలీసు చర్య చేపట్టారు. దీంతో సెప్టెంబర్‌ 17, 1948న హైదరాబాద్‌ విముక్తమై భారత్‌లో సంపూర్ణంగా విలీనమైంది.

భారత సైన్యం ఖాసిం రజ్వీ, సహా రజాకార్లను అరెస్టు చేసింది. వీరంతా పాకిస్తాన్‌ వెళ్లిపోతామని చెప్పడంతో 1957లో విడుదలయ్యారు. రజ్వీ పాకిస్తాన్‌ వెళ్లే ముందు తన అనుయాయులైన మజ్లిస్‌, రజాకార్‌ నాయకులను సమావేశపరిచాడు. తన వారసుడిగా అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీ అనే న్యాయ వాదిని ప్రకటించాడు. అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీ 1958లో పార్టీ పేరును ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఏఎంఐఎం)గా మార్చాడు ఈ పార్టీ భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుందనే వాగ్దానంతో రిజస్టరైంది. అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీ మరణించే వరకు  అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత 1976లో  అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీ కొడుకు సలావుద్దీన్‌ ఒవైసీ ఎంఐఎం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. సలావుద్దీన్‌ ఒవైసీ 1958లో చాలా చిన్నవయసులోనే రాజకీయాల్లో వచ్చాడు. పాతబస్తీ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా మారి సలార్‌ అనే బిరుదుతో చెలామణి అయ్యాడు

పాతబస్తీ మీద పట్టు

నిజాం పతనం తరువాత తర్వాత పాతబస్తీలో కాంగ్రెస్‌ బలపడిరది. 1960లో జరిగిన హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మల్లేపల్లి వార్డు నుండి సలావుద్దీన్‌ ఒవైసీ కార్పొరేటర్‌గా ఎన్ని కయ్యాడు. 1962లో పత్తర్‌ఘట్టి నుంచి అసెంబ్లీకి వెళ్లాడు. 1967, 1978, 1983 అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత 1984లో సలావుద్దీన్‌ తొలిసారిగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటులో ప్రవేశించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌ సీటు ఒవైసీ కుటుంబ చేతికి వెళ్లింది. 1984 నుంచి ఇప్పటి వరకూ జరిగిన 10 లోక్‌సభ ఎన్నికల్లో 6 సార్లు సలావుద్దీన్‌ ఓవైసీ, తర్వాత 4 సార్లు ఆయన కుమారుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఎంపీలుగా ఎన్నికయ్యారు. పాతబస్తీతో పాటు కొత్త నగరంలోని ముస్లిం ప్రాంతాల్లో కూడ ఎంఐఎం ఉనికి కనిపిస్తోంది. గతంలో బీజేపీ పార్టీల సహకారంతో మేయర్‌ స్థానాలను కూడా సాధించుకుంది.

పార్టీలో చీలిక తర్వాత

పాతబస్తీ రాజకీయాల్లో బలంగా పాతుకుపోయిన మజ్లిస్‌లోనూ సంక్షోభం తప్పలేదు. ఆ పార్టీ చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అమానుల్లాఖాన్‌ ఒవైసీ కుటుంబ ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. ఫలితంగా 1993లో పార్టీలో చీలిక వచ్చింది. మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌ (ఎంబీటీ)పేరిట ఖాన్‌ కొత్త పార్టీని స్థాపిం చారు. షియా ముస్లింలలో పలుకుబడి ఉన్న అమానుల్లా బలమైన నాయకునిగా ఎదిగారు. దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడిరది. 1989 ఎన్నికల్లో ఎంఐఎం 4 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటే, 1994 ఎన్నికల్లో దాని బలం 1 సీటుకు పడి పోయింది. అప్పుడే లండన్‌ నుంచి బారిస్టర్‌ విద్యార్థిగా వచ్చిన అసదుద్దీన్‌ చార్మినార్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంబీటీ అసెంబ్లీలో రెండు సీట్లు గెలిచింది. అమానుల్లాఖాన్‌ చంద్రాయణగుట్ట నుంచి ఎన్నికయ్యారు.

అసదుద్దీన్‌ ముస్లిం సెంటిమెంటు, ఐక్యత నినా దాలను మరింత బలంగా తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ఫలితంగా 1999 ఎన్నికల్లో ఎంఐఎం ఒక్కసారిగా 5 సీట్లు గెలిస్తే, ఎంబీటీ చిత్తుగా ఓడిరది. అమానుల్లాఖాన్‌ సైతం ఓడిపోయారు. ఆయన మరణం తర్వాత ఎంబీటీ సత్తాను చాటుకోలే పోయింది. పాతబస్తీ మీద ఒవైసీ కుటుంబం పట్టు పెరిగింది. పైగా అసదుద్దీన్‌ పార్టీని జాతీయస్థాయికి విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అసద్‌ సోదరుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ రెండో నాయకునిగా పట్టు సాధించాడు.

బీజేపీయేతర పక్షాలన్నీ మజ్లిస్‌ కొమ్ముకాస్తాయి. ఎప్పుడూ సెక్యులరిజం రక్షణ గురించి మాట్లాడే అసదుద్దీన్‌ ఇక్కడ ముస్లింలే తప్ప మరొకరు ఎందుకు విజయం సాధించలేరో చెప్పాలి. ఒకే కుటుంబం, ఒకే మతం వారు ఇక్కడ దశాబ్దాల తరబడి ఎందుకు తిష్ట వేసుకుని ఉన్నారు? మిగిలిన మతాల వారు లేరా? దీనిని ప్రశ్నించే గళం ఇప్పుడు వచ్చింది. ఆమె మాధవీలత.

మజ్లిస్‌ ఉక్కిరి బిక్కిరి

మాధవీలత ఈ ఎన్నికలలో ఒక సంచలనం. ఆప్‌ కీ అదాలత్‌ కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా జాతీయస్థాయికి ఎదిగిపోయారు. ప్రధాని మోదీ కూడా అదాలత్‌లో ఆమె ప్రదర్శించిన రాజకీయ పరిపక్వతకు ముగ్ధులై ట్వీట్‌ చేయడంతో మరింత గుర్తింపు వచ్చింది. ఆమె విమర్శల బాణాలు తీక్షణంగా ఉంటున్నాయి. అదను కోసం చూస్తున్న మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌కి మొత్తానికి ఒక కారణం దొరికింది. మసీదు మీద బాణం వేస్తున్న పోజు పెట్టి ఉద్రిక్తతలు లేవనెత్తేందుకు అభ్యర్థి ప్రయత్నించారని ఒవైసీలు ఆరోపించారు. అది మార్ఫింగ్‌ చేసిన వీడియో అని అసలు అక్కడ మసీదే లేదని మాధవి తిరిగి ఫిర్యాదు చేశారు. ఆ వివాదం సమసిపోయినట్టే. అయినా ఆమె మీద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. తరువాత ఆమె నృత్య భంగిమల ఫోటోలు సామాజిక మాధ్యమంలో పెట్టి అపఖ్యాతి పాల్జేయాలని చూశారు. మాధవీలతను అభ్యర్థిత్వం అసదుద్దీన్‌ ఒవైసీని కంగారు పెడుతున్న సంగతి దీనితో బయటపడిరది. అంతకు ముందే తన వీడియోల ద్వారా పాతబస్తీ దుస్థితి గురించి ఒక విస్తృత దృశ్యం దేశం ఎదుట పెట్టారు మాధవి. అక్కడ రోడ్లు సరిగా ఉండవు. పిల్లలకు చదువులు ఉండవు. దీనికి తోడు బాల్య వివాహాలు, దుబాయ్‌ షేక్‌ల అమానుష వైఖరి అన్నీ ప్రచారంలో ఉన్నాయి. ఈ దురాగతాలను ఆపడానికి ఒవైసీ ఏనాడూ ప్రయ త్నించలేదు. కారణం, వాటిని కూడా మతాచారాలుగా చూశారు. గడచిన ఎనిమిదేళ్లుగా మాధవీలత నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ముస్లిం మహిళలే. త్రిపుల్‌ తలాక్‌ విషయంలో ఆమె వారిలో అవగాహన కల్పించారు. మాధవీలతకు పాతబస్తీ జాతకంతో పాటుÑ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల మీద అవగాహన ఉంది. విలేకరుల ప్రశ్నలకు ఆమె ఇస్తున్న సమాధానాలలో పరిపక్వత కనిపిస్తుంది. ముస్లింలు పేదరికంలో ఉంటేనే, వెనుకబడి ఉంటేనే పబ్బం గడుస్తుందనుకునే ఒవైసీలు భారతదేశమంతటా ఉన్నారు. వారందరి గురించి ఆమెకు అవగాహన ఉంది. తాను ఎంపీగా ఎన్నికైతే నియోజకవర్గంలో ఏం చేయబోతున్నదో, అసలు నియోజకవర్గానికి ఏమి అవసరమో ఆమె సరిగానే గ్రహించారు. వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి దండిగా ఉన్న కొత్త నేత ఆమె.

మజ్లిస్‌ నిజరూపం ఆ వర్గానికి అర్ధం కావడానికి ఇంత సమయం పట్టింది. అందుకే వర్తమానంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.  అభివృద్దిని గాలికి వదిలేసి మతం ఆధారంగా గెలుస్తూ వచ్చిన తమ అధిపత్యానికి ఈసారి సవాళ్లు ఎదురయ్యాయని  ఆ పార్టీ నాయకులు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ముస్లిం ఓట్లలో బహిరంగంగానే ఎంపీ అసదుద్దీన్‌ మీద అసంతృప్తి వ్యక్తమవుతుంటే, సొంత పార్టీ నేతల అలక ఆ పార్టీని మరింత కలవరపెడుతోంది. దీంతో ఎంఐఎం హఠాత్తుగా వ్యూహం మార్చుకొని కాంగ్రెస్‌కు స్నేహహస్తం అందిస్తోంది.

చిగురించిన పాత దోస్తీ

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ పాతబస్తీలోని అత్యధిక నియోజక వర్గాలకు అభ్యర్థులను మొదటి జాబితా లోనే  ప్రకటించింది. ఇవన్నీ హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనివే. కానీ పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చే సరికి నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కూడా ఖరారైనా కాంగ్రెస్‌ అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు.  ఇందుకు కారణం సుస్పష్టం. కాంగ్రెస్‌ అధిష్టానం మజ్లిస్‌కు స్నేహ హస్తం చాస్తోంది. అందుకే ప్రచారానికి తగిన అవకాశం లేకుండా నామమాత్ర అభ్యర్థిని రంగంలోకి దింపుతుందని అందరికీ అర్థమైపోయింది.

కాంగ్రెస్‌ నుంచి సానియా మీర్జా, ప్రముఖ వ్యాపారవేత్త అలీ మస్కతీ, హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షులు సమీర్‌వహీఉల్లా, ఫిరోజ్‌ఖాన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. మైనార్టీలో బలమైన నేతగా ఉన్నవారిని కాంగ్రెస్‌ పోటీకి నిలిపితే ఎంఐఎంకు ఓట్ల వాటా తగ్గుతుందని పలువురు అభిప్రాయపడు తున్నారు. ఇలా జరిగితే కాంగ్రెస్‌ కన్నా బీజేపీకే విజయావకాశాలు మరింత మెరుగవుతాయని  అంచనా.  ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో స్నేహ సంబంధాలు కొనసాగించి తమ పనులను చక్కబెట్టుకోవడం ఎంఐఎంకు అలవాటే. గతంలో కాంగ్రెస్‌, టీడీపీలతో అనుసరించిన విధానాన్నే నిన్న మొన్నటి దాకా బీఆర్‌ఎస్‌తో కొనసాగించింది. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చేసరికి మజ్లిస్‌ మరోసారి వ్యూహాన్ని మార్చుకుంది. ఇటీవల  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో కాంగ్రెస్‌ నేతలు, మజ్లిస్‌ నేతలు వేదికపంచుకున్నారు. మారిన రాజకీయ పరిణామాల కారణంగా హైదరాబాద్‌ స్థానానికి బలహీన అభ్యర్థిని ఎంపికచేయాలని, అప్పుడు రాష్ట్రంలోని ఇతర స్థానాల్లో తమ సహకారమందిస్తామని మజ్లిస్‌ నేతలు కాంగ్రెస్‌రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపికలో అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పాతబస్తీ ఇరుకు సందులలో ఒక హిందూ స్త్రీ ధైర్యంగా జరుపుతున్న ఎన్నికల ప్రచారం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఒవైసీ సోదరుల భరతం పడతానని ఆమె గర్జించారు. ఆమె వెనుక జనం వస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో ఆదరణ లభిస్తు న్నది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం ముస్లింలకు రాసి ఇచ్చిన అడ్డాకాదని సవాలు విసురుతున్నారు. సాధారణంగా ఇతరులు ప్రవేశించడానికి భయపడే గల్లీలోకి కూడా వెళ్లి ఆమె ప్రచారం చేయగలుగు తున్నారు. ఒకనాడు అక్కడ సీపీఎం నాయకులు కూడా దెబ్బలు తిని వచ్చారు. ఒకటి వాస్తవం. అక్కడ ముస్లింలంతా ఒవైసీ మద్దతుదారులు కాదు. ఇక హిందువులు ఒవైసీ నాయకత్వాన్ని తప్పక భరిస్తు న్నారన్న మాట వాస్తవం. నిరంతరం హిందువులను, వారి సంస్కృతిని, దేవతారాధనని విమర్శించే, దూషించే నాయకులను ఏ హిందువు ఎంతకాలం భరిస్తాడు? దేశంలో హిందూ గళం బలపడిన నేపథ్యంలో పాతబస్తీకి మాధవీలత సరైన సమయంలో వచ్చారని చెబితే అతిశయోక్తి కాదు.

ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని మొదటి నుంచి మాధవి చెబుతున్నారు. నాంపల్లి కేంద్రంగా పనిచేసే కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌కూడా ఇదే ఆరోపణచేశారు. అవి ఐదులక్షల, నలభయ్‌ ఒక్కవేలు.  ఇందులో నాలుగులక్షల ఓటర్లు ఇక్కడ లేరు. దాదాపు 40,000 మంది జీవించి లేరు. 47 వేల మంది వేరే చోటికి పోయారు. అయినా ఆ ఓట్లు పోలవుతున్నాయి. ఇదే పాతబస్తీ ఘనత. మాధవీలత పట్టుతో వాటిని ఇప్పుడు ఎన్నికలసంఘం తొలగించింది. అది మాధవీలత తొలి విజయం. ఇంతవరకు జరిగిన ఎన్నికలలో రెండు లక్షల ఓట్ల తేడాతో ఇక్కడ బీజేపీ ఓడిపోయేది. అసదుద్దీన్‌ అల్లా పేరుతో గెలుస్తుంటే, నేను నా గెలుపు కోసం జైశ్రీరాం అంటే తప్పా! అంటున్నారు మాధవీలత. ఇప్పుడు ఆమె పాతబస్తీలో ఒక యోధురాలిలా కనిపిస్తున్నారు.

– క్రాంతి, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE