ఎన్నికలలో గెలవడం కంటే; హిందూత్వను, హిందూ దేవతలను, పురాణ పురుషులను, హిందువుల విశ్వాసాలను అవమానించడమే కాంగ్రెస్‌ ‌పార్టీకి ముఖ్యమని మరొకసారి రుజువైంది. ప్రతి ఎన్నికల ప్రచారాన్ని భారతీయతను కించపరచడానికే ఆ పార్టీ ఉపయో గించుకుంటున్నది. మే 2వ తేదీన ఆ పార్టీ కర్ణాటకలో ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. ఇందులో ఇచ్చిన ఒక హామీ దేశ వ్యాప్తంగా అగ్గి రాజేసింది. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ గెలిస్తే బజ్రంగ్‌దళ్‌నూ, పీఎఫ్‌ఐ ‌వంటి సంస్థలనూ నిషేధిస్తామని ఎన్నికల హామీ పేరుతో కాంగ్రెస్‌ ‌ప్రకటించింది. హిందువులూ, క్రైస్తవులూ అన్న తేడా లేకుండా మతోన్మాదమే ధ్యేయంగా రక్తపాతం సృష్టించిన పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాన•, జాతీయభావాలు కలిగిన బజ్రంగ్‌దళ్‌ను ఒకే గాట కట్టేంత అవివేకం, అజ్ఞానం, తెంపరితనం కాంగ్రెస్‌ ఎం‌దుకు ప్రదర్శించింది? ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్‌ ఏనాడో కబోదిగా మారిపోయింది. అందుకు సమాధానం ఇదే. మే రెండవ తేదీ అంటే ఎన్నికల ప్రచారం ముగియడానికి సరిగ్గా ఏడు రోజులే మిగిలి ఉండగా కాంగ్రెస్‌ ‌బజ్రంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న హామీని మోసుకొచ్చిన ఆ ప్రణాళికను విడుదల చేసింది. అది కూడా ఆంజనేయస్వామి (ఆయనే బజ్రంగ్‌) ‌జన్మస్థలిగా భక్తులు విశ్వసించే కర్ణాటక గడ్డ మీద నుంచే. ఆయన పేరుతో ఉన్న సంస్థను నిషేధిస్తామని ప్రకటించింది. ఇదంతా హిందువుల మనోభావాలంటే ఆ పార్టీకి ఎంత చులకనో వెల్లడించడం లేదా? హిందువుల ఓట్లు వారి మనోభావాలు తమకు ఎప్పటికీ అవసరం లేదనీ, మైనారిటీలను బుజ్జగిస్తే చాలునన్నదే ఆ పార్టీ విధానంగా కనిపించడం లేదా? ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌గెలుపు అవకాశాలు ఎక్కువని నాలుగు సర్వేలు చెబితేనే ఇంతగా విర్రవీగుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ రేపు గెలిస్తే ఇంకెలా ఉంటుంది? హిందువులు ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తున్నది. దమ్ముండి, నిషేధం ఎత్తివేసి పీఎఫ్‌ఐకి తిరిగి ప్రాణప్రతిష్ట చేస్తే రాష్ట్రం ఎలా ఉంటుంది?

హనుమ జన్మస్థలిలోనే ఇలాంటి ప్రకటన చేసి, కర్ణాటక 2013 అసెంబ్లీ పోరులో తన గెలుపును కాంగ్రెస్‌ ‌చేజేతులారా సందిగ్ధంలోకి నెట్టుకున్నదని రాజకీయ పండితులు విశ్లేషిస్తే విశ్లేషించవచ్చు. కానీ హిందువుల మనోభావాలను దారుణంగా గాయ పరిచిన ఇలాంటి హామీ, లేదా ఏదో ఒక పార్టీ చెప్పిన ఇలాంటి మాట-ఎన్నికలకు పరిమితమయ్యే విషయంగా పరిగణించడం సాధ్యం కానేకాదు. ఇది హిందువుల మనోభావాల మీద పథకం ప్రకారం వరసగా జరుగుతున్న దాడులలో భాగంగా భావించక తప్పదు. ఈ హామీ కాంగ్రెస్‌ ‌హిందూత్వను అవమా నించడానికి ఇంకా ఎంతదూరం వెళుతుందన్న ప్రశ్నను లేవనెత్తేదే.ఈ ధోరణి ఇంకెన్నాళ్లన్న ఆక్రోశానికి సంబంధించినది కూడా.

ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారంలోకి లాగకుండా ఉండడం సాధ్యం కాదని మొదట గుర్తించాలి. నిన్నటి వరకు అయోధ్య రామయ్యను బందిఖానాలో ఉంచిన కాంగ్రెస్‌ ఇప్పుడు, పురాణ ప్రసిద్ధమైన, హిందువులకు ఆరాధ్యదైవంగా ఉన్న రాములవారి ఆధ్యాత్మిక సఖుడు బజ్రంగీని హిందువులకు దూరం చేయడానికి పూనుకున్నదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఒకేరోజు ఆయన పాల్గొన్న మూడు ఎన్నికల ప్రచార సభలలో ఈ విషయం ప్రస్తావించారు కూడా. తన ప్రచార సభలలో ఆయన తప్పనిసరిగా పలికే భారతమాతాకీ జై అన్న నినాదంతో పాటు జై బజ్రంగ్‌ ‌బలి అన్న నినాదాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్‌ ఇలాంటి ఒక నికృష్టపు ఎన్నికల హామీని పడేయడం గురించి ఆ కార్యకర్తలు, నాయకులలో కూడా ఏకాభిప్రాయం లేదు. తప్పదు కాబట్టి ఆపద్ధర్మంగా నష్ట నివారణ చర్యలు ఆరంభించారు.

బజ్రంగ్‌దళ్‌ ‌నిషేధం గురించి కాంగ్రెస్‌ ఆలోచించడం ఇదే తొలిసారి కాదు. 2008, సెప్టెంబర్‌లో ఆ పార్టీ బజ్రంగ్‌దళ్‌ను, మాతృసంస్థ విశ్వహిందూ పరిషత్‌ను కూడా నిషేధించాలని గగ్గోలు పెట్టింది. ఈ రెండూ దేశ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నాయని శతాధిక వర్షాల పార్టీ అధికారి ప్రతినిధి మనీష్‌ ‌తివారీ అనాడు ఆరోపించాడు. జాతి విద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తున్నదంటూ సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌) ‌మీద మాత్రమే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందనీ, దానితో పాటు బజ్రంగ్‌దళ్‌, ‌వీహెచ్‌పీల మీద, ఇంకా సంఘవిద్రోహానికి పాల్పడుతున్న అన్ని సంస్థల మీద అలాంటి పత్రం విడుదల చేయాలనీ మరొక కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి షకీల్‌ అహ్మద్‌ ‌నోరు పారేసుకున్నాడు. బజ్రంగ్‌దళ్‌ను తక్షణమే నిషేధించాలని కమ్యూన లిజమ్‌ ‌కాంబాట్‌ అనే పౌర హక్కుల సంస్థ తరఫున(గుజరాత్‌) ‌తీస్తా సెతల్వాడ్‌, ‌జావెద్‌ అహ్మద్‌ ‌కూడా 2008 ఆగస్ట్‌లో హుంకరించారు. ఇదంతా కర్ణాటక తీర ప్రాంతంలో కొన్ని చర్చ్‌ల మీద దాడి ఘటనల తరువాతి పరిణామం. హిందూ తీవ్రవాదం అన్న మాటను అప్పుడే కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని యూపీఏ దేశం మీద రుద్దే, ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది కూడా. చర్చ్‌ల మీద దాడుల గురించి పూర్వపరాలు తెలియకుండానే, వాటి కార్యకలాపాలు ఎలాంటివో అంచనా వేయకుండానే మాజీ ప్రధాని హెచ్‌ ‌డీ దేవెగౌడ, కేంద్ర మాజీ మంత్రి రామ్‌విలాస్‌ ‌పాశ్వాన్‌ ‌కూడా ఇలాంటి కోరికే కోరారు. ఇక కమ్యూనిస్టులు, ఉదారవాద బిరుదాంకితులు, మేధావులు చేసిన గోలకు అంతే లేదు. బజ్రంగ్‌దళ్‌ ‌నిషేధం కోరికకు ఇంత నేపథ్యం ఉంది.

ఇప్పుడు ఏకంగా బజ్రంగ్‌దళ్‌ ‌నిషేధాన్ని కాంగ్రెస్‌ ఎన్నికల అంశాన్ని చేసేసింది. ఫలితం- బీజేపీ నుంచి, ఆ పార్టీ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటనే ఎదుర్కొంటున్నది. ‘నేను బజరంగీని. అలాగే కన్నడిగుడిని. ఇది ఆంజనేయస్వామి జన్మస్థలి. నేను కాంగ్రెస్‌కు సవాలు చేస్తున్నాను. నన్ను అరెస్టు చేయండి’ అని బీజేపీ ఎంపీ జాతీయ యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వీ ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌హిందూ వ్యతిరేక, భారత ధార్మిక వ్యతిరేక ధోరణి మీద రెండువేల గ్రామాలలో పోస్టర్ల యుద్ధం చేయాలని బజ్రంగ్‌దళ్‌ ‌మాతృసంస్థ విశ్వహిందూ పరిషత్‌ ‌పిలుపునిచ్చింది. రోట్లో తల దూర్చిన తరువాత రోకటి పోటుకి భయపడితే ఎలా? కొన్ని వాస్తవాలను జనం మరచిపోయినా, బీజేపీ నేతలు, వీహెచ్‌పీ, బజ్రంగ్‌దళ్‌ ‌నేతలు ఎలా మరచిపోగలరు? వారు బాధితులాయె. ముస్లిం మతోన్మాదుల దాడులకు బలైనవారాయె. వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే ఎన్నికల మేనిఫెస్టోలో అలా అనలేదని కాంగ్రెస్‌ ‌వెంటనే నాలుక్కరుచుకుని చెప్పవలసి వచ్చింది. ఇదో పెద్ద అబద్ధం. అంటే సర్వేలు కల్పించిన భ్రమలతో, అధికార మదంతో పోలింగ్‌కు ముందే ఆడిన పెద్ద రాజకీయ అబద్ధం. ‘ఈ మేనిఫెస్టో పూర్తిగా ముస్లిం మతోన్మాదపు మేనిఫెస్టో. జిన్నా బతికి ఉన్నా కూడా ఇంత దారుణమైన మేనిఫెస్టో ఇవ్వడు’ అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ. మా కేంద్ర హోంమంత్రి ముస్లిం మతోన్మాద పీఎఫ్‌ఐని నిషేధిస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌ ‌దేశభక్తి కలిగిన బజ్రంగ్‌దళ్‌ని నిషేధిస్తామని అంటోంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఇప్పటికే పీఎఫ్‌ఐని నిషేధించారు. కర్ణాటకలో పీఎఫ్‌ఐ ‌వాళ్ల మీద పెట్టిన కేసులను అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎత్తేశారు. అంటే అర్ధం- బీజేపీ పీఎఫ్‌ఐని నిషేధిం చింది కాబట్టి, ముస్లిం మతోన్మా దులను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్‌ ‌బజ్రంగ్‌దళ్‌ను నిషేధిస్తామని చెబుతోంది. ఈ హామీ వెనుక ఉన్న వాస్తవం ఇదే అన్నారు హిమంత బిశ్వశర్మ. ఇవన్నీ ఎందుకు అసలు ఈ మేనిఫెస్టోయే పీఎఫ్‌ఐ ‌మేనిఫెస్టోలాగే ఉందని తేల్చారాయన. ఇంకా చిత్రం సిద్ధరామయ్య అనే ప్రబుద్ధుడు ముఖ్యమంత్రి ఉండగా ఈ కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం పీఎఫ్‌ఐ ఉ‌గ్ర మూకల మీద ఉన్న187 కేసులను ఉపసంహరించాడు. ఇప్పుడు పీఎఫ్‌ఐని నిషేధిస్తామని చెప్పే ఎన్నికల ప్రణాళిక విడుదల కార్యక్రమంలో నిస్సిగ్గుగా పాల్గొన్నాడు. నిజానికి తీవ్ర స్థాయిలో ఉన్న ఈ నిరసనలో బీజేపీ ప్రధానంగా కనిపించినా, ఇది ఎవరో రెచ్చగొట్టినది కాదు. ఆ నీచ హామీ వెలువడిన కొన్ని గంటలలోనే బజ్రంగ్‌దళ్‌ ‌కార్యకర్తలు స్పందించారు. హిందూ సమాజం కూడా వెంటనే కదిలింది. రెండుమూడు రోజుల పాటు హనుమాన్‌చాలీసా పఠనంతో బజ్రంగ్‌దళ్‌ ‌కార్యకర్తల దేశమంతా హోరెత్తించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో కాంగ్రెస్‌ ‌కార్యాలయం మీద దాడి చేశారు. హైదరాబాద్‌లో గాంధీభవన్‌ ఎదురుగా కూడా వారు రోడ్డు మీదే హనుమాన్‌ ‌చాలీస్తా పఠన కార్యక్రమం నిర్వహించారు. హఠాత్తుగా తాము హిందువులమని గుర్తుకొచ్చిన కొందరు మహిళా కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా చాలీసాను పఠించారు.

గతంలో మాదిరిగా తాము ఎలా మాట్లాడినా, ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నా హిందువులు మౌనంగా ఉంటారనే భ్రమ నుంచి కాంగ్రెస్‌ ‌నేతలు బయటపడలేకపోతున్నారు. కానీ ఇలా చెంప చెళ్లుమనిపించే ఎదురుదెబ్బలు తగులుతున్నప్పుడు ఆ పార్టీ, నాయకత్వం ఉలిక్కిపడుతూ ఉంటుంది. ఇప్పుడూ అంతే. బజ్రంగ్‌దళ్‌ ‌నిషేధం హామీ మీద ఒకటి రెండు రోజులలోనే వెనుకడుగు వేసింది. ఆ పార్టీ నాయకుడు వీరప్ప మొయిలీ పరుగెత్తుకు వచ్చి అసలు తమకు బజ్రంగ్‌దళ్‌ను నిషేధించాలన్న యోచనే లేదని ఉడిపిలో విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించారు. ఉద్రేకపరిచే ప్రసంగాలు చేసేవారి మీద కేసులు పెట్టమని సుప్రీంకోర్టు ఈ మధ్యే చెప్పింది కాబట్టి, ఆ ఆదేశం మీద గౌరవంతో అలాంటి ప్రసంగాలు చేసేవారిని ఉపేక్షించబోమని చెప్పడమే తమ ఉద్దేశమని మొయిలీ ముక్తాయించారు. అసలు సంస్థల నిషేధం ఒక రాష్ట్రం చేతిలో ఉండదు కదా అంటూ స్వపక్షం వారికి పరోక్షంగా జ్ఞానబోధ కూడా చేశారు, ఈ ఆధునిక కన్నడ రామాయణ కర్త. అలాగే ఈ మధ్యే కాంగ్రెస్‌ ‌గూటికి చేరిన జగదీశ్‌ ‌శెత్తార్‌ ఆ ‌మాట మరచిపోయారు కాబోలు, ఆయన కూడా ఒక సంస్థను రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిషేధించగలవు అంటూ ప్రశ్నించారు.

 ఇక ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్లేట్‌ ‌ఫిరాయించిన వైనం దిగ్భ్రాంతిగొలిపే విధంగా ఉంది. ఆ కళలో తానెంత నిపుణుడో రాష్ట్ర ప్రజలు తెలుసుకునే అవకాశం ఈ సందర్భంలో ఆయన ఇచ్చాడు. ఆయన పేరు డీకే శివకుమార్‌. అసలు తమకు బజ్రంగ్‌దళ్‌ను నిషేధించే యోచనే లేదని తడుముకోకుండా బొంకేశాడు. పైగా తమకు అధికారం కట్టబెడితే మొత్తం హనుమాన్‌ ఆలయాలన్నింటినీ ఉద్ధరిస్తామని ఆశువుగా మరొక హామీ పడేశారు. మేం ఏ సంస్థను ప్రత్యేకంగా ఎత్తి చూపడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు చెడగొట్టేవారిని ఉపేక్షించబోమని మాత్రమే చెప్పదలుచుకున్నామని మరొక కాంగ్రెస్‌ ‌నాయకుడు, మేనిఫెస్టో రచనా సంఘం కన్వీనర్‌ ‌జి. పరమేశ్వర వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి నిండా మునిగిపోతున్నా చావు తెలివితేటలకు మాత్రం శతాధిక వర్షాల కాంగ్రెస్‌లో లోటేమీ లేదని చెప్పుకోక తప్పదు. హనుమంతుడు వేరు, బజ్రంగ్‌దళ్‌ ‌వేరు కదా అంటూ లా పాయింట్లు తీస్తున్నారు కొందరు. బజ్రంగదళ్‌తో హనుమను పోల్చి మోదీ మహాపచారం చేశారంటూ కొత్త పల్లవి అందు కున్నారు మరికొందరు. ఇందుకు ప్రధాని క్షమాపణలు చెప్పవలసిందేనని గాండ్రిస్తున్నారు. బజ్రంగ్‌దళ్‌, ఆం‌జనేయస్వామీ ఒక్కటే అన్నట్టు మోదీ చెప్పడం ఎంత సిగ్గుచేటు అన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ఖెరా. ఏమైతేనేం? పార్టీకి డ్యామేజీ జరిగితేనేం? బజ్రంగ్‌బలీని మోదీ భుజాన వేసుకోవడం వల్ల ఇక మైనారిటీల ఓట్లన్నీ మావే కదా అని ఒక కాంగ్రెస్‌ ‌నాయకుడు అన్నట్టు టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా వ్యాఖ్యానించింది. కానీ దీనితో పోయే హిందూ ఓట్ల సంగతి వీళ్లకి అక్కరలేదు.

పవనసుతుని గురించి వాళ్లు ఆడిన అబద్ధాలు ఇంకా ఉన్నాయి. హనుమంతుని పేరుతో ఒక నిధిని ఏర్పాటుచేస్తారట. దానితో ఆయన దేవాలయాలను అభివృద్ధి చేస్తారట. ఇది కూడా శివకుమార్‌ ‌మాటే. బజ్రంగ్‌దళ్‌ ‌నిషేధం హామీతో వెల్లువెత్తిన రగడతో శివకుమార్‌ ‌క్షణాల మీద మైసూరు చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న మారుతికి మొక్కారు. ఆ ఫొటోలు వైరల్‌ అయ్యేటట్టు జాగ్రత్త పడ్డారు. మైసూరు-బెంగళూరు జాతీయ రహదారిలో 25 ఆంజనేయస్వామి దేవాలయాలు ఉన్నాయి. వీటి గురించి బీజేపీ వాళ్లు అసలు ఎప్పుడైనా పట్టించు కున్నారా అంటూ ఎదురుదాడికి దిగారు, అమ్మవారి సమక్షంలోనే. ఇంకో సరికొత్త రహస్యం కూడా శివకుమార్‌ ‌బయటపెట్టారు.

అసలు కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పుడూ ఆంజనేయస్వామి భక్తకోటిలో ఒకటిగానే ఉందట. కొప్పాల్‌ ‌దగ్గర (ఇక్కడే అంజనాద్రి మీద ఆంజనేయస్వామి జన్మించాడని నమ్మకం) అంజనాద్రి అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి ఆయన జన్మస్థలిని కూడా ప్రత్యేక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని శివకుమార్‌ ‌హామీ ఇచ్చారు. కాస్త ఇబ్బందిగా, వికృతంగా ఉన్నా బజ్రంగ్‌బలిని వారు ఎంత రహస్యంగా ఆరాధిస్తు న్నారో ప్రతి కాంగ్రెస్‌ ‌నాయకుడు ఇప్పుడు బయట పెడుతుంటే వినక తప్పడం లేదు. కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు మనీష్‌ ‌తివారీ చేసిన ప్రకటన ఇలాంటిదే. ఆయన రోజుకు రెండుసార్లు హనుమాన్‌ ‌చాలీసా పఠిస్తే తప్ప నిద్రపోడట. బీజేపీ కూడా పఠిస్తుంది కానీ, దానికి రాజకీయ కోరికలు కోరుతూ పఠిస్తుందని తివారీ తేల్చారు.

క్రిస్టియన్‌ అధినాయకత్వం, విదేశీ భావాలు దండిగా ఉండే కింది స్థాయి నాయకత్వంలో ఉన్న పార్టీ అది. పైగా ముస్లిం బుజ్జగింపు ధోరణి అణు వణువు నింపుకున్న పార్టీ. హిందువుల మనోభావాల మీద బోలెడు గౌరవం ఉందని అది చాటుకుంటే, అంత పెద్ద అబద్ధాన్ని నమ్మడానికి నిజమైన హిందువులు సిద్ధంగా లేరనే చెప్పాలి. ఆగమేఘాల మీద ఆంజనేయస్వామికి ఇంత వైభవం తెస్తామని చెబుతున్న ఈ పార్టీ మొదట ఇటీవల శోభాయాత్రల మీద జరిగిన ముస్లిం మతోన్మాదుల దాడులను ఒక్కసారైనా ఖండించి ఉంటే దేశ ప్రజలకు కొంచెమైనా నమ్మకం ఉండేది.

——————-

ఈ మట్టిని పూజించే సంస్థ బజ్రంగ్‌దళ్‌

‌సెక్యులరిజం పేరుతో హిందూత్వను అవమానించడం, హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించడం కాంగ్రెస్‌ ‌పాలనలో మొత్తంలో కనిపిస్తుంది. ఈ ధోరణిని కాస్త ఆవేశంతో ప్రతిఘటించే హిందూ సంస్థ బజ్రంగ్‌దళ్‌. అది నుంచి మరొక మతం వారు ఈ దేశంలో ఉండరాదని అనడం లేదు. మా దేవుడే దేవుడు అని ప్రకటించడం లేదు. ఎవరి నాలుకలు కోస్తామని ప్రగల్భించలేదు. హిందువులకు ఈ దేశంలో హక్కులు ఉంటాయని సెక్యులర్‌ ‌పార్టీలకు ఇది కాస్త గట్టిగానే చెబుతూనే ఉంటుంది. బలవంతపు మత మార్పిడులను ప్రతిఘటిస్తుంది.

అక్టోబర్‌ 1, 1984‌న ఉత్తరప్రదేశ్‌లో బజ్రంగ్‌దళ్‌ ఆవిర్బవించింది. ఇది విశ్వహిందూ పరిషత్‌ ‌యువజన విభాగం. సేవ, సురక్ష, సంస్కారం ఈ సంస్థ నినాదాలు. సంస్థ నమ్మిన సిద్ధాంతం హిందూత్వం. దాని సంరక్షణ కూడా. 2010 నాటికి ఈ సంస్థ దేశమంతటా విస్తరించింది. సమాజం, సంస్కృతి పరిరక్షణ దీని ఆశయం. అయోధ్యలో రామమందిరం, మధురలో కృష్ణమందిరం, కాశీలో విశ్వేశ్వరుడి ఆలయ సముదాయాన్ని విస్తరిం చడం కూడా సంస్థ లక్ష్యాలే. వీటిలో కాశీ విశ్వేశ్వరుడి ఆలయం విస్తరణ పనులు పూర్తయ్యాయి. అయోధ్యలో రామజన్మ భూమిలో ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఇవన్నీ చట్టబద్ధంగా కొన్ని దశాబ్దాలపాటు న్యాయపోరాటం చేసి సాధించుకున్నవే తప్ప, బల ప్రదర్శనతో, రక్తపాతంతో సాగిస్తున్నవి కావు. దేశ జనాభాలో సమతౌల్యం ఉండాలని వీరు చెబుతారు.అలాగే క్రైస్తవులు చేసే మతాంతరీకరణలు, గోవధలను వ్యతిరే కిస్తారు. అక్రమ మతాంతరీకరణలు, గోవధ భారతదేశంలో రాజ్యాంగ విరుద్ధమే కూడా. కానీ కొన్ని రాజకీయ పార్టీల బుజ్జగింపు ధోరణివల్ల అవి అమలు కావడం లేదు. కాబట్టే బజ్రంగదళ్‌ ‌తన పని తాను చేయవలసి వస్తున్నది. తాము ఏదో వర్గాన్ని ఏనాడూ లక్ష్యంగా చేసుకోబోమని బజ్రంగ్‌దళ్‌ ‌కన్వీనర్‌ ‌ప్రకాశ్‌ ‌శర్మ చెబుతున్నారు. కానీ ఉగ్రవాదం కారణంగా భారతీయతకు, దేశానికి జరుగుతున్న చేటు గురించి తాము చైతన్యం కలిగిస్తామని ఆయన తెలియచేశారు. అందాల పోటీలను, ప్రేమికుల దినోత్సవాలను ఈ సంస్థ తీవ్రంగానే ప్రతిఘటిస్తుంది. లవ్‌ ‌జిహాద్‌తో పాటు హిందువులు, ముస్లింల మధ్య వివాహాలను కూడా వ్యతిరేకిస్తుంది. అలా అని ఇది సనాతన్‌ ‌సంస్థ, శ్రీరామ్‌సేనల మాదిరిగా మైనారిటీల మీద హింసను సమర్ధించదు. అయినా సామాజిక మాధ్యమాలలో బజ్రంగ్‌దళ్‌ను కూడా తీవ్రవాద సంస్థగా కొందరు ఆరోపించడం చూస్తూ ఉంటాం. కొన్ని చర్చ్‌ల మీద జరిగిన దాడులలోను, హలాల్‌ ‌వివాదాలలోను, గోవధ చేసే వారిపట్ల బజ్రంగ్‌దళ్‌ ‌కార్యకర్తలు దూకుడుగా వ్యవహరించినట్టు వార్తలు ఉండవచ్చు. కానీ బజ్రంగ్‌దళ్‌ ‌కార్యకర్తల మీద ఎన్ని దాడులు జరిగాయో, వారు ఎంతమంది చనిపోయారో మాత్రం ఏ సంస్థ వెల్లడించదు.

—————

రక్తపిపాసి నిషిద్ధ పీఎఫ్‌ఐ

‌పీఎఫ్‌ఐని పరిచయం చేస్తున్నప్పుడు మహమ్మదీయ రాజకీయ సంస్థ అంటున్నారు. అదే బజ్రంగ్‌దళ్‌ను పరిచయం చేస్తున్నప్పుడు కనిపించే తొలి వాక్యం, అది ఒక హిందూ తీవ్రవాద సంస్థ అనే. పీఎఫ్‌ఐ ‌తీవ్రవాద చర్యలలో పాల్గొంటుందని చెబుతూ కూడా రాజకీయ సంస్థ అంటున్నారు. అందుకే పీఎఫ్‌ఐ ఏం ‌చేసిందో, దాని నేపథ్యం ఏమిటో కొంత తెలుసుకోవాలి. దీని లక్ష్యమే హిందూ సంస్థల ఎదుగుదలను నిరోధించడం. అంటే హిందువులు తమ హక్కుల గురించి నిలదీస్తే ఇది రంగంలోకి దిగుతుంది. తాము 2045 సంవత్సరానికల్లా భారతదేశంలో ముస్లిం రాజ్యం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంస్థ ఇది. దీనిని కేంద్ర హోంశాఖ సెప్టెంబర్‌ 28, 2022‌లో నిషేధించింది. మళ్లీ నిషేధిస్తా మంటూ కాంగ్రెస్‌ ‌తన కర్ణాటక ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది దీని గురించే. ఇలాంటి సంస్థ పక్కన బజ్రంగ్‌దళ్‌ను నిలపడమే తాజా వివాదంలోని తీవ్రతకు కారణం.

నవంబర్‌ 22,2006‌లో ఆరంభమైన ఈ సంస్థ సిమి కొత్త అవతారమేనని సాక్షాత్తు కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వమే ముద్ర వేసింది. అలాగే ఇది ఇండియన్‌ ‌ముజాహిదీన్‌ ‌సంస్థకు అనుబంధంగా ఉందని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. కేంద్ర హోంశాఖ కూడా ఇలాంటి లెక్కకు మించిన ఆరోపణలు పీఎఫ్‌ఐ ‌మీద చేసింది. అవన్నీ బీజేపీ ప్రభుత్వం చేసింది కాబట్టి భారతదేశం లోని ఒక వర్గం మీడియా, అంతర్జాతీయ మేధావులు జీర్ణం చేసుకోలేరు. కానీ సీపీఎం ప్రభుత్వం చేసిన ఆరోపణలను కూడా రహస్యంగా ఉంచారు. కేరళతో పాటు, కర్ణాటకలో కూడా దీని ప్రభావం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తమ శత్రువని, నిరోధిస్తామని అనేకసార్లు పీఎఫ్‌ఐ ‌బాహాటంగానే ప్రకటించింది. బాంబులతో, మారణాయుధాలతో స్వయంసేవకుల మీద అనేక సార్లు దాడులకు దిగింది. అంతేకాదు, ఆ మధ్య జరిగిన ఢిల్లీ అల్లర్లు, రైతుల అల్లర్లు, షాహీన్‌బాగ్‌ ‌కుట్రలన్నింటిలోను దీని పాత్ర సుస్పష్టం. తాలిబన్‌, అల్‌కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలతో కూడా దీనికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో హిజాబ్‌ ‌రగడను లేవదీసిన క్యాంపస్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా దీని అనుబంధ సంస్థ. దీనితో పాటు మరొక ఏడు అనుబంధ సంస్థలను కూడా కేంద్రం నిషేధించింది.

పీఎఫ్‌ఐకి 27 హత్య కేసులతో నేరుగా సంబంధం ఉందని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం 2012లోనే రాష్ట్ర హైకోర్టుకు విన్నవించింది. దీని చేతిలో ఎక్కువగా చనిపోయినవారు సీపీఎం, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారేనని కూడా తేల్చింది. మరొక 27 మత కల్లోలాలలో కూడా ఇదే కీలకంగా ఉంది. ఇందుకు సంబంధించి 106 కేసులు ఉన్నాయి. 86 మంది మీద హత్యాయత్నం చేసింది. 2010లో ప్రవక్తను అవమానించే రీతిలో ప్రశ్న అడిగారన్న ఆరోపణ మీద ఆ సంస్థ కార్య కర్తలు ప్రొఫెసర్‌ ‌టీజే జోసెఫ్‌ ‌కాళ్లు నరికేశారు. ఏబీవీపీ నాయకుడు ఎన్‌. ‌సచిన్‌గోపాల్‌ను జూలై 6, 2012న చంపేశారు. ఇది పీఎఫ్‌ఐ అనుబంధ క్యాంపస్‌ ‌ఫ్రంట్‌ ‌చేసిన పని. పీఎంకే సభ్యుడు రామలింగంను చంపినందుకు 2019లో ఒక పీఎఫ్‌ఐ ‌కార్యకర్తను అరెస్టు చేశారు. ముస్లింలు చేస్తున్న మతాంతరీకరణల గురించి వారిద్దరి మధ్య వేడివాడి చర్చ జరిగిన తరువాత ఆ కార్యకర్త రామలింగంను చంపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. ఇలాంటి సంస్థ పక్కనే బజ్రంగ్‌దళ్‌ను నిలబెట్టడం కాంగ్రెస్‌ ‌దురంహ కారానికీ, అజ్ఞానానికీ నిదర్శనం.

———————–

బాబ్రీని పునర్నిర్మిస్తామని చెప్పలేదా?

రామాయణంలో పుడకల వేట అని ఒక సామెత. కన్నడ కాంగ్రెస్‌ ‌బజ్రంగ్‌దళ్‌ను నిషేధిస్తామంటూ ఎన్నికల హామీ ఇవ్వడం గురించి ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందన తెలుసుకుని తీరవలసిందే. ఈ హామీ గురించి మీరు ఏమంటారు అని ఒక విలేకరి అడిగాడు. అందుకు ఒవైసీ, ‘అయోధ్యలో బాబ్రీ మసీదును సంఘ పరివార్‌ ‌కూల్చేసినపుడు, దానిని తిరిగి అదే చోట తాము పునర్‌ ‌నిర్మిస్తామని ఒకానొక ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ ‌పార్టీ చెప్పింది. కానీ ఏం జరిగింది?’ అని ఎదురు ప్రశ్నించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్మానం కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడేమో తాము బజ్రంగ్‌దళ్‌ను నిషేధిస్తామని చెబుతున్నారనీ, ఎన్నికలకు ముందు చాలా విషయాలు జరుగుతూ ఉంటాయనీ కూడా వ్యాఖ్యానించారు. ఇంకా, ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రజా జీవితం ఆరంభించిన జగదీశ్‌ ‌షెత్తార్‌ను పార్టీలో చేర్చుకున్న సంగతేమిటని కూడా ఆయన ప్రశ్నించారు.

  • జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram