మహమ్మదీయ పరిపాలకులు దేశం నలుమూలలా వాళ్ల కర్కశత్వాన్ని చూపించారు. కొంచెం ఆలస్యంగా  దక్షిణ భారతదేశం మీదకు వచ్చారు. ముస్లిం దండయాత్రలు సుమారు 1700 ప్రాంతంలో తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలను కూడా తాకాయి. సుల్తానుల సైన్యం రాజకీయ, సాంఘిక, మత పరమైన జీవనాన్ని అల్లకల్లోలం చేసి దోపిడీలు, అకృత్యాలకు పాల్పడటంతో జనజీవనం కల్లోలమైంది. సాంస్కృతిక జీవనం భ్రష్టమైంది. ఆచారాలు అపవిత్రమయ్యాయి. అలాంటి సమయంలో కొందరు కవులు ఈ పరిస్థితిని రక్షించలేవా అంటూ తాము నమ్మిన దైవాలకు మొర పెట్టుకోవడం సర్వసాధారణమైన విషయం. సాధారణంగా నిందా స్తుతులతో ఈ వేడుకోళ్లు, విన్నపాలు ఉండేవి. ఇందులో దేవుళ్ల మీద దుమ్మెత్తి పోస్తారు. ఆ సంగతి ఎలా ఉన్నా, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు తురుష్కుల చేతిలో హిందూ ధర్మానికి ఎదురైన సంకటం వారు గొప్పగా ఆవిష్కరించారు. కానీ వారంతా పరమ భక్తులు. ఆ కాలంలో వేంకటాచల విహారునిగా శ్రీ వేంకటేశ్వర స్వామిని సంబోధిస్తూ ఈ దుస్థితినుండి రక్షించాలనీ, శత్రువులను నిర్జించాలనీ వేడుకుంటూ సాగేదే ‘వేంకటాచల విహారం’ శతకం. పైన చెప్పుకున్న విషయాలు, నిజానికి చారిత్రక సత్యాలు ఇందులో చాలానే ఉన్నాయి.


ఎటువంటి ఆచార్య పురుషుడుడినై•నా నరే, ఎటువంటి షట్‌ ‌శాస్త్రవేత్త్తనైనా గాని, సోమయాజి (యజ్ఞములు చేసినవారు) కొడుకునైనా, బహుశాస్త్ర సంపన్నుడినైనా పచ్చిబూతులతోనే సంబోధిస్తూ, ఈ శతక కవి కూడా కవి చౌడప్పనే ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. దండయాత్రకు వచ్చిన ముస్లింలను కూడా ఏ మాత్రం తగ్గకుండా మోతాదులో దూషించడం ఇక సర్వసాధారణం. ధూమపానం, సురాపానం, తోయపానం, రక్తపానం అంటే వారికి రక్తి కలుగుతుంది. దుష్ట ఆలోచనలతో వచ్చే తురక దొరల (కవి వాడిన పదం) గురించి ఈ కవి వివరించాడు. ఆయన 16వ శతాబ్దం నాటి పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షి. ఆ కాలం నాటి దురాగతాలను స్వయంగా అనుభవించి రాసిన గ్రంథం ఇది. హిందూ ధర్మానికి ఎదురైన హింస ఎలాంటిదో చెప్పేదే కూడా.

ఈ శతకంలోని ఏ పద్యంలోనూ కవి తన పేరు చెప్పుకోలేదు. శతకం అంటే  సుమారు నూరు పద్యాలు. కానీ 98 పద్యాలు మాత్రమే దొరుకుతున్నాయి. మిగిలిన ఆ రెండు పద్యాలే కవి వివరాలతో ఉండి ఉంటాయని ఒక నమ్మకం. వాటిలో కవి తన పేరు తదితర వివరాలు చెప్పుకొని ఉండవచ్చని ప్రముఖ సాహితీ పరిశోధకుడు, ఈ గ్రంథ పరిష్కర్త వేటూరి ప్రభాకరశాస్త్రి అభిప్రాయ పడ్డారు. కానీ అప్పుడున్న ఆ పరిస్థితులలో కవి తన పేరు తెలియకుండా గోప్యంగా ఉంచుకునే అవకాశం కూడా ఉంది. రెండు చోట్ల తాను బ్రాహ్మణుడనని (7 వ పద్యం) వే•ంకటేశ్వరస్వామి సొమ్ము తిన్న వాడినని (85వ పద్యం) చెప్పుకున్నాడు. అయితే మెకంజీ ఖైఫియత్‌ ‌ప్రకారం దీని గ్రంథకర్త ‘నల్ల కాల్వ వరకవి సీతాపతి’. ఈ విషయాన్ని విద్వాన్‌ ‌నరసింహులు పేర్కొన్నారు. కె. జె కృష్ణమూర్తి వ్యాసంలో తక్కిన రెండు పద్యాలు దొరికాయి.

ఈ శతకానికి ‘శత్రు సంహార వేంకటాచల విహార’ను మకుటంగా స్వీకరిం చారు. ప్రతి పద్యంలో చివరి పాదంగా ఈ పాదం ఉంటుంది. ముందు చెప్పినట్టు  ఈ గ్రంథం నిందాస్తుతి శైలిలో నడుస్తుంది. శతకంలోని విషయాలకూ మకుటానికి దగ్గర సంబంధం ఉంది. సుల్తాను సైన్యం (వీరినే తురకలని సంబోధించాడు కవి) చేస్తున్న ఆగడాలను భరించలేక, వారిని నశింపజేయమని తను నమ్మిన దైవాన్ని, అంటే వేంకటేశుని కోరుతూ ఈ శతకం రాశాడు. దీనిలో దేవుణ్ణి కటువుగా సంబోధించిన సందర్భం కూడా వస్తుంది. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ కూర్చున్నావు అంటూ  రాముల వారిని రామదాసు బాధతో నిలదీసినట్టే ఇదీను. సింహాద్రి అప్పన్న కొండపై తురుష్కులు దాడి చేసినప్పుడు గోగులపాటి కూర్మనాథ•కవి రాసిన ‘శ్రీ సింహాద్రి నారసింహ శతకం’ ఈ కోవలోకే వస్తుంది. అలాగే చల్ల పేరయ్య రాసిని ‘భద్రగిరి శతకం’ ఇలాంటిదే.

దేవాలయ ముట్టడి అంటే ఒక ధర్మం మీద అన్న స్పృహ తురుష్కులలో బలంగానే ఉండేదని పిస్తుంది. ఎందుకంటే తురుష్క సైనికులు విగ్రహాలను ధ్వంసం చేసేవారు. దైవత్వం ఉన్న వృక్షాలుగా పూజించే వృక్షాలను నరికేసేవారు. పూజారులను, పురోహితులను, పండితులను,  భక్తులను అవమానించేవారు.  బంగారు ఆభరణాలు దోచు కోవడం సర్వసాధారణం. ఇలా ఎన్నో అమానవీయ అకృత్యాలకు పాల్పడేవారని చరిత్ర చెబుతుంది.

విగ్రహాలను నాశనం చేస్తున్నప్పుడు జిగురు పాలకోసమంటూ చిగురించే పవిత్రమైన రావిచెట్లు నరికేవారు. వాటిని నుజ్జు నుజ్జు చేసేవారు. గురువులకే గురువులుగా పూజారులంతా పూజించే  వారిని పట్టుకుని  నామాలను చెరిపించే వారు. అది కూడా ఒకరి నామాలు ఒకరు నాలుకతో నాకి తుడిచి వేయాలి. ఇలాంటి ఒక దుర్భర పరిస్థితిని కవి వర్ణిస్తాడు. పైగా వాళ్లని ‘గెలవడం నీకు శక్యమా, ఏదో వెర్రితనం కొద్దీ విన్నవించుకుంటున్నాము, మీ చిత్తమూ మా భాగ్యమూ’ అని కూడా అంటారు.

 తురుష్క సైనికుల పైశాచికానందం ఎలా ఉండేది? బోడిగుండు సన్యాసులను పొట్టేళ్లలాగా ఒకరి తలతో ఒకరిని డీ కొట్టించువాడొకడట. సోమయాజులు జంధ్యాలు తెంచి వాటితో విల్లుల కట్టే తాళ్లు తయారుచేసుకొనేవాడొకడట. యవనుల మేఘాల్లా వ్యాపించి దుర్దినములు వచ్చినా దిగువ తిరుపతిలో (ఇవన్నీ చూడకుండా) నిదురపోతున్నాడు మీ అన్న (గోవిందరాజులు) లేవలేక. అని కూడా కవి బాధపడతాడు. ‘వడి గుళ్లు సొచ్చి దేవుళ్ల బ్రద్దలు చేసి’ దేవాలయాల్లోకి వెళ్లి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు చూస్తున్నావా అని నిలదీస్తాడు.

‘ఓ వేంకటేశ్వర స్వామీ! తురకలని బొడుతుననుచు బాకు మొలకు తగిలించుకుని బొంకుతున్నావు గానీ నీ వంటిపై గల సొమ్ములు దోచుకునే వరకూ కదలవా? ఖలులు సొమ్ములు దోచినా, మొల కఠారు ఊడదీసుకుపోయినా ఎదిరించి పోరాడలేవులే. ‘రత్నాల పెద్ద కిరీటంబు’ సొమ్ములన్నీ దోచుకుపోయాక ‘గోచీగోనము’ వేసుకొందువుగానిలే అని తిడతాడు కవి. ఇక్కడ తురుష్కుల ఆగడాలే కాదు, స్వామివారి వైభవాన్ని కూడా కవి విస్మరించడు. బంగారు భేరీ ఏ పాపాత్ముడు హరించాడు. కనీసం ‘అచ్యుత, కృష్ణరాయలొసంగిన రత్నాలహారం’ రక్షించుకోమని కోరుకుంటున్నాడు కవి. కటక్‌ ‌లోని జగన్నాథ స్వామిని ఎన్ని అన్నా, సింహాద్రి అప్పన్నను కృష్ణమాచార్యులూ, గోగులపాటి కూర్మనాథ•కవి ఎన్ని తిట్టినా, చిన్న మల్లేశుని ఎన్ని అన్నా మీ వల్ల కాదా మమ్ము రక్షించడం? అని నిష్ఠూరంగా మాట్లాడతాడు కవి.

గోల్కొండ తురుష్కులు కాళహస్తిని ఆక్రమణ కవిని మరింత బాధపడి, ఇంకొంత ఆగ్రహం తెచ్చుకునేటట్టు చేసింది. ఆ గుడిని ఆక్రమించారని తెలియగానే వెంకన్నబాబుకు భయపడిపోయాడని రాశాడు. ఇక మమ్మేమి రక్షిస్తాడు అని వాపోయాడు కూడా. ‘కోవెల’ పేరు ‘మసీదు’ను పల్కు ప్రసిద్ధమయ్యింది, గుఱ్ఱము ఘోడా అయ్యింది. ఆంధ్రభూమి తురుష్కుల వశమయ్యింది. సిద్ధవటంలో తురుష్కులు దేవాలయాన్ని నాశనం చేస్తుంటే ఒంటిమిట్ట రఘునాథుడు మాత్రం ఎదురు తిరిగి పోరాడాడు. కామాక్షి ముక్కు చెక్కలు పోయెనని సిద్ధలింగడు పోరాడి ప్రాణం విడిచాడు, అమ్మవారి బొద్దు మాణిక్యం పోతుందని కంచి వరదప్ప భయంతో వణికి పోయాడు, అయినా చెంగల్వరాయుడు, ఘటికాచల స్వామీ గట్టు దిగడు, మమ్ము రక్షింపడు అని వాపోతాడు కవి.

మంగళగిరిలో పానకాల స్వామి పొట్ట నిండా పానకం తాగాడు, కూరటానికి తెరిపి లేదు, హరి లచ్చితో ముచ్చట్లాడుతున్నాడు, పైగా ఎక్కువ ప్రసాదాలారగించి కదల లేకుండా ఉన్నాడు అని కూడా నిందలేస్తాడు. అంతేకాదు, దక్షిణాత్యుడవు, ఏకాకివి, నీవు మమ్మెట్టు కాపాడగలవు? అని ప్రశ్నించాడు. దక్షిణాదిలో ఆయన ఏకాకి అయ్యాడట.

రోజూ నీకు ఇన్ని ప్రసాదాలు పెడుతున్నాం కదా, అయినా మా రక్షణ సంగతి ఎలా మరిచిపోయావని కూడా అడుగుతాడు కవి. ఎన్ని రకాలు పెడుతున్నాం, మేము సాధారణ తిండి తిని నీకు అన్ని రకాలు పెడుతున్నాం, పాలు, వెన్న, బంగాళబాతు దద్ద్యోజనం, పులిహోర, వెన్న బూరెలు, పాయసం, చక్కెర పొంగలి, నువ్వు మండిగలు, మనోహరాలు, అప్పడములు, వడలు, దోసెలు, పండ్లు, తేనెలు, బొబ్బట్లు, పచ్చడలు ఇవన్నీ తినేసి … మా బోట్లకి గుగ్గిళ్ళు వదిలావు, నీవంటి బ్రతుకు గాదా మాది? అని తీవ్రంగానే అడుగుతాడు.

ఓ వేంకటేశ్వరస్వామీ యుద్ధం అంటే ‘చల్లని పన్నీటి చల్లులాట కాదని చెబుతాడు దేవదేవుడికి.  మమ్మల్ని ఎలానూ రక్షింపలేవు గానీ కనీసం నువ్వైనా పారిపోయి ప్రాణాలు దక్కించుకో, నీ సంపద అయినా రక్షించుకో అంటూ ‘వలదు మా యయ్యా ప్రాణంబు గలిగినేని బలుసుటాకే తినవచ్చు బారిపొమ్ము’ అని గేలి చేస్తాడు. మీరు త్వరగా పారిపోకపోతే గుర్రాలపై ఎక్కి స్వారీ చేసినట్లు వాళ్లు మనపై స్వారీ చేస్తారు, పరుగెత్తమంటారు అని హెచ్చరిస్తాడు. దానం ఇమ్మని వ్యాపారస్తులను బూతులు తిట్టేవాడొకడు. జీవితమంతా దుర్దినములుగా గడుస్తున్నా దిగువ తిరుపతిలో మీ అన్న (గోవిందరాజులు) నిదుర బోతున్నాడు. నువ్వేమో కంఠారలన్నీ తురుష్కులకిచ్చి మొలలో చిన్న బాకుతో తిరుగుతున్నావు, నువ్వేం కాపాడుతావు మమ్మల్ని’ అంటాడు. కానీ చివర్లో కవి తన అంతరంగాన్ని పరమ సాత్వికంగా విన్నవిస్తాడు. స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ‘తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టరాదు’ అందుకే చెపుతున్నాను. ‘దేవా నీ సొమ్ము గట్టిగా తిన్న కవిని గాన చెపుతున్నాను జాగ్రత్తగా ఇక్కడ నుండి తప్పించుకో’

ఈ విధంగా కవి నిందాస్తుతితో గేలి చేసాడు. అయితే అది ఆయన బాధ, తురుష్కుల ఆగడాలను చూడలేక ఆ విధంగా మాట్లాడాడు అంతే కానీ ఈ కవి శ్రీ వేంకటేశ్వరస్వామి పరమభక్తుడు.

దేవుళ్లతో మన కవులకు ఉన్న చనువు, మాలిమి, గారాబం కావ్యాలలో కడు రమ్యంగా కనిపిస్తుంది. దండి సరస్వతినే తిట్టాడు. అయినా  త్వమేవాహం అన్నది అమ్మ. అంటే నువ్వే నేను నేనే నువ్వు అని. ఇక శ్రీనాథుడి చాటువులలో కొన్ని ఉన్నాయి. పార్వతి చాలు గంగ విడువుము అని ఆదేశించాడీ కవి. ఇందులో చమత్కారం ఉంటుంది. సమకాలీన పరిస్థితులు ఉంటాయి. వాటిని మాత్రమే తీసుకోవాలి.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
Instagram