కాంగ్రెస్‌ని ఇంతకు మించి చెడగొట్టడం మరొకరి వల్ల కానేకాదని ఆ పార్టీ ప్రముఖులు ఏకగ్రీవంగా తేల్చేసినట్టే ఉన్నారు. ఆ విషయాన్ని దశలవారీగా బహిర్గతం చేయడానికి సిద్ధపడుతున్నట్టుగానూ కనిపిస్తున్నారు. అంత చెడగొట్టే ప్రతిభ ప్రస్తుతం ఆ పార్టీలో ఎవరికి ఉందో జాతికి ప్రత్యేకంగా బోధించనక్కరలేదు. ఆ అసమాన ప్రతిభావంతుడు రాహుల్‌ ‌గాంధీయే. కాంగ్రెస్‌ ‌ముక్త భారత్‌ అన్న నినాదం ఇచ్చిన బీజేపీ పనిని ఈ గాంధీ వారసుడే సులభతరం చేసిపెడుతున్నారు. అందుకు బీజేపీ కృతజ్ఞతలు చెప్పుకోవడం మరవరాదు.

పార్టీ కోమాలోకి వెళ్లిపోయిందంటూ రెండేళ్ల క్రితం 23 మంది కాంగ్రెస్‌ ‌సభ్యులు పార్టీ అధినేత్రికి పెద్ద లేఖ రాశారు. దానికి సరైన సమాధానం లేదు. నెహ్రూ గాంధీ వారసుడు రాహుల్‌ ‌తప్ప పార్టీకి అన్యధా శరణం నాస్తి అన్న నినాదం వదిలేస్తే మంచిదన్న అభిప్రాయాన్నే ఆ 23 మంది పరోక్షంగా సూచించారు. పోనీ నాయకత్వ బాధ్యతలైనా పద్ధతిగా స్వీకరిస్తే గుడ్డిలో మెల్ల కదా అన్న రాజీ ధోరణి కూడా ఆ 23 మంది వచ్చారు. కానీ రాహుల్‌ ‌మనసు కరగలేదు. దేశంలో కాంగ్రెస్‌ ‌ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలాంటి ఎన్నికలు కావచ్చు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన విదేశీయాత్రను అవి ఆపలేవు. ఆయన వెళ్లి తీరతారు. ఆ పార్టీ ప్రత్యేకత ఏమిటంటే, చెంచాలనీ, భృత్యులనీ అపురూపంగా చూసుకునే సంస్కృతి పుష్కలంగా ఉందక్కడ. వాళ్లు రాహుల్‌ ‌మాత్రమే అర్హుడంటూ కొన్నేళ్లుగా పాడిందే పాడుతున్నారు. ఇంతకీ రాహుల్‌ ఎలాంటి నాయకుడు? ఆయన పార్టీ పదవులు స్వీకరించరు. అలా అని పార్టీ మీద స్వారీ చేయడం ఆపరు. అలాగే ప్రధాని పీఠం మీద గాంధీ-నెహ్రూ వంశీకులు కాని వారు కూర్చుంటే రాహుల్‌ ‌సుతరాం సహించలేరు. అయోధ్య కూల్చివేత సమయంలో మా వంశీకులు ఉంటేనా… అని ఆయన అసందర్భ ప్రేలాపన చేశారు. అసలు కాంగ్రెస్‌ ‌మీద పెత్తనం తమ జన్మహక్కని ఆయన గాఢంగా నమ్ముతారు. దీనితోనే కడుపు మండిన పెద్దలు ఇప్పుడు తమ ప్రతాపం చూపిస్తున్నారు. కపిల్‌ ‌సిబల్‌, అశ్వినీకుమార్‌, ‌హార్దిక్‌ ‌పటేల్‌, ‌సునీల్‌ ‌జాకడ్‌ ‌వంటి నాయకులంతా వరస పెట్టి కాంగ్రెస్‌కు సలాం కొట్టినవారే. ఇప్పుడు గులాం నబీ ఆజాద్‌ ‌వంతు వచ్చింది.

యాభయ్‌ ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ను సేవించు కుంటున్న కశ్మీరీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ ఎట్టకేలకు ఆగస్ట్ 26‌న రాజీనామా పత్రాన్ని దాదాపు పార్టీ ముఖానికేసి కొట్టారు. ఆ లేఖలో రాహుల్‌ ‌గాంధీని ఎన్ని విశేషణాలతో ఛీత్కరించారో గమనిస్తే, ఆజాద్‌గారి భాషా చాతుర్యం, శబ్ద సౌందర్యం, భావ ప్రకటనా సామర్ధ్యం మనలని విస్తుపోయేటట్టు చేస్తాయి. 2013లో రాహుల్‌ ఉపాధ్యక్షుడయ్యాడు, ఇక ఇంతే సంగతులు అని తేల్చారు ఆజాద్‌. ఆ ‌పాదం మహిమ మామూలు మహిమ కాదని చెప్పడం ఆజాద్‌ ఉద్దేశం. 2014-2022 మధ్య జరిగిన 49 అసెంబ్లీ ఎన్నికలకు గాను 39 సార్లు కాంగ్రెస్‌ ‌పార్టీ చిత్తుగా ఓడిపోయింది మరి. యువనేత వెళ్లడం ఏమిటి, అక్కడ పార్టీ చతికిల పడడం ఏమిటి! సర్వసాధారణ మైపోయింది. అయినా రాహుల్‌ ‌మాత్రమే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఒరలో కత్తిలా సరిపోతాడని చెబుతున్నారు, తైనాతీలు. ఈ వికారపు ధోరణి పట్ల ఏవగింపుతోనే ఆజాద్‌ ‌గట్టి సలాం కొట్టి బయటకి నడిచారని అర్ధమవుతుంది.

తాను పార్టీని ఎందుకు వదిలిపోవలసి వచ్చిందో ఏడు కారణాలను ఆజాద్‌ ‌ప్రస్తావించారు. అవి ఏడు చేపల కథని గుర్తుకు తెస్తాయి. ఒక అంశంతో ఒకటి లోతుగా ముడిపడి ఉన్నాయి. ఆయన ఏకరువు పెట్టిన కారణాలన్నీ కూడా రాహుల్‌ ‌మీద ఛీత్కారాలే. రాహుల్‌కు బొత్తిగా పరిపక్వత లేదని నిర్ధారించారు ఆజాద్‌. ‌పరిపక్వత లేకపోవడం అంటే రాహుల్‌వన్నీ పిల్ల చేష్టలేనని అర్ధం. అదీ చెప్పారు. సీనియర్లని చూస్తే ఆయనకి తేళ్లు,జెర్రిలు పాకినట్టు ఉంటుందట. కోటరీ మాటని పన్నీటి జల్లులా ఆస్వాదిస్తారట. అయినా రాహుల్‌ ‌గాంధీకి ఆయన సెక్రటరీలు, సెక్యూరిటీ గార్డులు శ్రమ ఇవ్వరట. పార్టీకి సంబంధించిన నిర్ణయాలు వీళ్లే తీసుకుంటారట. సోనియమ్మ ఉత్సవ విగ్రహం తప్ప మరేమీ కాదనీ, నిర్ణయాలన్నీ ఆమె కొంగుచాటు ముద్దుల తనయుడివేనని ఆజాద్‌ అం‌తఃపుర రహస్యాల గుట్టు విప్పేశారు. ఆజాద్‌కి ఇక్కడ ఈ పక్షపాతం ఎందుకో అర్ధం కాదు. ఈ కొడుకు ఆ తల్లి కొడుకు కాదూ! ఆమె మాత్రం తక్కువా?

రాహుల్‌ అపరిపక్వత ఎప్పుడూ ఒక్కలా ఉండిపోలేదు. అందులో తగినంత వృద్ధి కూడా కనిపిస్తుందట. మన్మోహన్‌ ‌సింగ్‌ ‌రెండో దఫా పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంలో జాతి యావత్తు ముక్కున వేలేసుకునేటట్టు రాహుల్‌ ‌చేసిన ఒక నిర్వాకం గురించి కూడా ఆజాద్‌ ‌గుర్తు చేశారు. అప్పుడే ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆర్డినెన్సును పట్టుకొచ్చి విలేకరుల సమావేశంలో పరపర చింపేశారు, రాహుల్‌. ఆ ‌సమావేశంలో నాటి ప్రధాని, మౌనముని మన్మోహన్‌సింగ్‌ ‌కూడా ఉన్నారు. ఇది రాహుల్‌ అపరిపక్వతకు పరాకాష్ట అంటున్నారు ఆజాద్‌. అన్నట్టు ఆ ఆర్డినెన్స్ ‌మీద రాష్ట్రపతి ఆమోదముద్ర సైతం పడిపోయింది. ఆ విధంగా రాష్ట్రపతినీ, ప్రధానినీ ఏకకాలంలో అవమానించిన నాయకుడిగా రాహుల్‌ ‌చరిత్రకెక్కాడు. 2019లో వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలోనే రాహుల్‌ ‌సీనియర్లని ఘోరంగా అవమానించిన సంగతిని కూడా ఆజాద్‌ ఇప్పుడు బయటపెట్టారు. ఆ తిట్లు ఎలాంటివో కూడా చెబితే బాగుండేది.

గులాం నబీ ఆక్రోశాన్ని అర్ధం చేసుకోవలసిందే. 23 మంది కలసి పార్టీ శ్రేయస్సు కోసం లేఖ రాస్తే, కశ్మీర్‌ ‌కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఆ విన్నపం మీద సంతకాలు చేసిన ఇంకొందరు కాంగ్రెస్‌ ‌నేతల ఇళ్ల ముందు ఉత్సాహవంతులైన రాహుల్‌ ‌విధేయులు బైఠాయింపు జరిపారు కూడా. కాంగ్రెస్‌ ‌సర్వనాశనం అయిపోయినా ఫర్వాలేదు. పోటీ చేసిన ప్రతిచోటా ఓడిపోయినా పట్టించుకోనక్కరలేదు. రెండు మూడు సీట్ల కోసం ప్రాంతీయ పార్టీల పంచన చేరినా కూడా ఫరవాలేదు. కానీ గాంధీ కుటుంబం మీద ఈగ వాలితే మాత్రం సహించరు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు.

పంజాబ్‌లోని ఆనందపూర్‌సాహెబ్‌ ఎం‌పీ, మరొక సీనియర్‌ ‌నాయకుడు మనీష్‌ ‌తివారీ అయితే ఇంకొంచెం నిశితమైన అంశాన్ని బయటపెట్టారు. ఇంత తెలివైనవాడు ఆ పార్టీలో ఎందుకు ఉండి పోయాడో కదా అనిపిస్తుంది. చూడబోతే భారత్‌కీ, కాంగ్రెస్‌కీ మధ్య అగాధం వచ్చినట్టే కనిపిస్తోంది అన్నారాయన. కాంగ్రెస్‌ ‌మాటేమో కాని, ఇది బీజేపీకి నిరాశ కలిగించే అంశమే. తమ ప్రమేయం ఆట్టే లేకుండానే భారత గడ్డ మీద కాంగ్రెస్‌ ‌పార్టీ ఎండిపోతోంది మరి! నిర్మొహమాటంగా చెప్పాలంటే ఆ పార్టీకీ, దేశ ప్రజలకీ మధ్య అంతరం ఎప్పుడో వచ్చింది. గులాం నబీ ఆజాద్‌ ‌రాజీనామా, మరొక నాయకుడు ఆనంద్‌ ‌శర్మ హిమాచల్‌ ‌పార్టీ స్టీరింగ్‌ ‌బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో మనీష్‌ ‌చేసిన ఈ వ్యాఖ్య మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో మథనం ఎలాగూ లేదు సరే, కనీసం అంతర్మథమైనా చేసుకోలేరేమి అన్నదే మనీష్‌ ఆ‌క్రోశం. పాపం, ఆనంద శర్మ అయితే ఆత్మ గౌరవం అనేది అడిగి తీసుకునేది కాదని గట్టిగా చెప్పారు. తను హిమాచల్‌ ‌స్టీరింగ్‌ ‌కమిటీ సభ్యుడే. కానీ ఏ ఒక్క విషయమూ శర్మకు తెలియడం లేదట. ఎవరికి తెలుస్తున్నాయో, ఎవరు నడిపిస్తున్నారో వేరే చెప్పాలా? ఇక మనీష్‌ ‌మాటలు తూటాల్లాగే ఉన్నాయి. వార్డు సభ్యునిగా పోటీ చేసే అర్హత కూడా లేని వాళ్లు, పార్టీలో చప్రాసీల వంటి వాళ్లు ఇప్పుడు జ్ఞానబోధకు ఉపక్రమించారని, ఇది బొత్తిగా హాస్యాస్పదమని అన్నారాయన. ఆజాద్‌ ‌రాజీనామా గురించి గాంధీ-నెహ్రూ కుటుంబ భృత్యులు కొందరు చేసిన వ్యాఖ్యలకు మనీష్‌ ఇం‌త ఘాటుగా సమాధానం ఇచ్చారన్న మాట. 1885లో స్థాపించిన ఈ పార్టీకి, దేశానికీ మధ్య అగాధం వచ్చినట్టే ఉందని మనీష్‌ ‌తీర్పు ఇచ్చారు.

ఇప్పుడు అసోం ముఖ్యమంత్రిగా పని చేస్తూ దేశవ్యాప్త ఖ్యాతిని సంతరించుకున్న వ్యక్తి ఎవరో గుర్తుంది కదా! హిమంత బిశ్వశర్మ. ఆయన కాంగ్రెస్‌ ‌వారే. ఒకసారి ఆయన ఢిల్లీ వెళ్లి తమ అధిష్టానదేవుడు రాహుల్‌ ‌వారి దర్శనం కోరారు. అయితే రాహుల్‌ ‌తీరిక లేనంత పనిలో ఉన్నారు, ఎవరినీ కలుసుకునే ఉద్దేశంలో అసలే లేరు అని భృత్యులు హిమంతను తరిమేశారు. ఇంతకీ రాహుల్‌ ‌గాంధీకి అంత తీరిక లేని పనేమిటి అంటే, కుక్క పిల్లతో ఆడుకోవడం. హిమంత అక్కడ నుంచి అటే బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. తరువాత కథ తెలిసిందే.

అటు గులాం నబీకి కాని, ఇటు మనీష్‌కి కాని చిర్రెత్తుకొచ్చిన విషయం ఒకటి ఉందని అనిపిస్తుంది. నబీ అన్ని పదవులు అనుభవించి కష్టాలలో ఉన్న ప్పుడు వదిలిపెట్టిపోతున్న ద్రోహి అన్నట్టు కొందరు భృత్య శిఖామణులు అవాకులు చెవాకులు పేలారు. ఇంకా పేలుతూనే ఉన్నారు. పార్టీలో ఉండనివ్వరు. వెళ్లిపోతే అవాకులు చెవాకులు!

ఇదంతా చూస్తుంటే 1990లో సోవియెట్‌ ‌రష్యా పతనానికి ముందు వినిపించిన ఒక చలోక్తి గుర్తుకొస్తున్నది. అప్పటికే రొట్టె, మాంసం, ఓడ్కా వంటి నిత్యావసరాలు దొరకని పరిస్థితి రష్యాలో. ఇక కుప్పకూలడమే తరువాయి. ఆఖరి అధ్యక్షుడు మిఖాయిల్‌ ‌గోర్బచెవ్‌. అసంతృప్తితో ఉన్న జనానికి ఊరట కల్పించేందుకు కొన్ని దేశ సరిహద్దులని కాపలా లేకుండా కావాలని విడిచి పెట్టేవారట. అక్కడ నుంచి జనం ఇతర దేశాలకు వెళ్లిపోతూ ఉండేవారు. ఇదంతా తన భవనం నుంచి గోర్బచెవ్‌ ‌చూస్తుండేవారట. ఒకసారి భార్య రైసా గోర్బచెవ్‌, ‌గోర్బచెవ్‌ ‌జనం వందల సంఖ్యలో వెళిపోతున్న దృశ్యం చూశారట. దీనితో గోర్బచెవ్‌ ‌రైసాతో అన్నారట, ఇలా అయితే రష్యాలో ఇద్దరమే మిగులుతామేమో అని. అందుకు రైసా, ఆ రెండోవారు ఎవరో? అని అడిగారట. అంటే ఆమె కూడా అక్కడ నుంచి నిష్క్రమించే యోచనలో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పరిస్థితి కూడా దానికి భిన్నంగా ఏమీ లేదు. నాయకులు వెళ్లిపోతున్నారు. రాష్ట్రాలలో పరిస్థితి చెప్పక్కరలేదు. ఎక్కడైనా వర్గాలే. రాజస్తాన్‌, ‌కర్ణాటక, తెలంగాణలలో తిరుగుబాట్లు వర్ధిల్లు తున్నాయి. అన్నట్టు వచ్చే అక్టోబర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయట. చూద్దాం!

షరా: యువరాజుకు గిట్టని పెద్దలు అప్పటికీ ఇంకా పార్టీలో అడుగు బొడుగు ఎవరైనా మిగిలి ఉంటే వాళ్లు సైతం బయటకి పోయే వరకు ఎన్నికలు వాయిదా వేసే అవకాశం మాత్రం ఉంది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram