జూలై13 గురుపౌర్ణమి

– ఎక్కా చంద్రశేఖర్‌

ఆత్మసాక్షాత్కారం పొందిన గురుపరంపరను పూజించే రోజు ఆషాఢ పౌర్ణమి, గురుపౌర్ణమి. వేద వాజ్మయాన్ని, బ్రహ్మసూత్రాలను, మహాభారతాన్ని, భగవద్గీతను, అష్టాదశ పురాణాలను సమస్త మానవాళికి అందించిన వేదవ్యాసుల వారిని, తమతమ సంప్రదాయాలను అనుసరించి గురుపరంపరను పూజించుకునే రోజు ఆషాఢ పౌర్ణమి. అదే గురుపౌర్ణమి.

గుశబ్దస్త్వం ధకారః స్యాత్‌ – ‌గుశబ్దస్తన్నిరోధకః

అంధకార నిరోధిత్వాత్‌ – ‌గురురిత్యాభిధీయతే (16)

అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారిని గురువు అంటారని అద్వయ తారక ఉపనిషత్‌లో పేర్కొన్నారు.

జ్ఞానసంపన్నమై గురుపరంపర వేలాది సంవత్స రాలుగా సమస్త హిందూ సమాజానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్త్తున్న కారణంగా సనాతన ధర్మం శాశ్వత ధర్మంగా కొనసాగుతోంది. త్రిమతాచార్యులు ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వా చార్యుల నుంచి మార్గదర్శనం చేస్తున్న ఎందరో గురువుల అనుగ్రహంతోనే భారతీయ సంస్కృతి పరిఢవిల్లుతోంది.

వ్యక్తుల జీవితంలో లభించే మార్గదర్శనమే కాకుండా యావత్‌ ‌సమాజాన్ని సాంస్కృతిక విలువలతో జోడించడంతోపాటు సమాజం బలహీన మైనప్పుడు దిశానిర్దేశం చేసే బాధ్యతను రుషులు, ఆచార్యులు, గురువులే స్వీకరించారు. వాల్మీకి, వేదవ్యాసుడు, భీష్మపితామహుడి గురువైన పరశురాముడు, అర్జునుడి గురువు ద్రోణాచార్యుడు, వసిష్ఠుడు, గాయత్రీ మంత్రాన్ని అందించిన విశ్వామిత్రుడు తదితరులు అందరూ వందనీయులు, నిత్యస్మరణీయులు.

సిక్కు గురుపరంపర, సమర్థ రామదాసు, విరజానంద, రామానంద, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, రమణ మహర్షిలాంటి వారు గత నాలుగైదు వందల సంవత్సరాల్లో సమాజానికి రక్షణనిచ్చే నేతృత్వాన్ని అందించారు. హిందూ సమాజ సంఘటనను, సాంస్కృతిక విలువలను, ధర్మాచరణను పెంపొందించి, హిందూ రాష్ట్ర వైభవాన్ని పునః స్థాపించేందుకు విశిష్టమైన గురు పరంపరే ఆధారమని సంఘస్థాపకులు పరమపూజ్య డాక్టర్‌జీ భావించారు. ‘సంఘకార్యం కానీ, దాని ఆలోచనా ప్రవాహం కానీ మనం కొత్తగా రూపొందిం చినది కాదు. మన పవిత్ర హిందూ ధర్మం, ప్రాచీన సంస్కృతి, హిందూ రాష్ట్రం, అనాదిగా వస్తున్న పరమపునీత భగవధ్వజం… వీటిని సంఘం అందరి ముందు ఉంచింది. పైన పేర్కొన్న విషయాల్లో నూతన చైతన్యాన్ని ప్రసరింప చేసే పరిస్థితికి అనుగుణమైన నూతన కార్యపద్ధతి సంఘానికి అవసరమౌతుంది. దీనిని సంఘం అంగీకరిస్తుంది’ అని డాక్టర్‌జీ తెలియజేశారు.

తదనుగుణంగానే ‘పరమపవిత్ర భగవధ్వజమే సంఘంలో గురువు స్థానంలో ఉంటుంది’ అని 1928లో మొదటి గురుపూజ కార్యక్రమంలో డాక్టర్జీ ప్రకటించారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం ఏ వ్యక్తినీ గురువుగా స్వీకరించదు. పరమ పవిత్ర భగవధ్వజమే తన గురువు. ఎంత గొప్ప వ్యక్తి అయినా శాశ్వతం, పరిపూర్ణుడు కాడు. కాలం వ్యక్తిని బంధిస్తుంది. కానీ తత్వం శాశ్వతమైనది. భగవధ్వజం శాశ్వత తత్వానికి ప్రతీక. దానిని ధరించిన మాత్రంతోనే జాతి సంపూర్ణ ఇతిహాసం, ఉత్కృష్టమైన సంస్కృతి, సంప్రదాయాలు మనసును స్పృశించి నూతన ప్రేరణ కలుగుతుంది.

‘కర్మతో, సంతానంతో, ధనం’తో కాకుండా త్యాగ సమర్పణ భావనతోనే అమృతత్వాన్ని సాధించాలని సన్యాససూక్తం తెలియజేస్తుంది. అందుకే స్వామి వివేకానందుల వారు Sacrifice and Renunciation are twin ideals of Indian Culture అని తెలియజేశారు. సన్యాస ధర్మానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి ఆశ్రమ ధర్మాలలో గొప్పదైన సన్యాస ధర్మానికి కాషాయ వర్ణం కల్పించారు.

త్యాగ సమర్పణ భావాన్ని రుషులు, మహర్షులు, ఆచార్యులు, గురువులు నిరంతరం సమాజానికి అందించారు కాబట్టే గొప్ప వీరులు, రాజులు, త్యాగ ధనులు, సమాజ సంస్కర్తలు, దేశభక్తులు ఆవిర్భ వించారు. ఛత్రపతి శివాజీ, రాణాప్రతాప్‌, ‌గురు గోవిందసింగ్‌, ‌వివేకానంద తదితరులు దేశం కోసం సర్వస్వాన్నీ త్యాగం చేసి భావితరాల దేశభక్తులకు ఆదర్శంగా నిలిచారు.

త్యాగం, సమర్పణ విలువలను విస్మరిస్తే మిగిలేది స్వార్థమే. పరమపూజ్య డాక్టర్‌జీ, పరమపూజ్య గురూజీ జీవితం త్యాగం, సమర్పణలతో కూడినది. పరమపవిత్ర భగవధ్వజ ఛాయలో వారు ఆ ఆదర్శాన్ని ముందుంచి ధర్మాన్ని, సంస్కృతిని రక్షించే లక్షలాది వ్యక్తుల నిర్మాణం చేయగలిగే కార్యపద్ధతిని వికసింపచేశారు. ‘రాష్ట్రాయ స్వాహా ఇదం న మమ’ అనే భావనే గురూజీ జీవన సందేశం.

ఇలాంటి త్యాగ, సమర్పణ భావన సూచించ డానికి, అలాగే జీవితంలో ప్రత్యక్ష ఆచరణగా మారటానికి గురుపూజోత్సవంలో గురుదక్షిణ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. సముపార్జించిన విలువైన డబ్బులో దేశధర్మాల కోసం సమర్పించే గుణం స్వయంసేవకుల జీవితంలో గురుదక్షిణ ద్వారా నిర్మితమైనది. ధన సమర్పణతో లభించిన ప్రేరణతో జీవితాంతం దేశం కోసం జీవించారనేందుకు ఉదాహరణే నేతాజీ వద్ద గూఢ•చారి విభాగంలో పని చేసిన సరస్వతీ రాజామణి జీవితం.

1944లో నేతాజీ ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌నిధి సేకరిస్తున్నప్పుడు 16 సంవత్సరాల వయసున్న రాజామణి తన ఇంటిలో బంగారాన్ని, వజ్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. నేతాజీ నమ్మలేక ఆమె తండ్రికి తెలియ చేయగా, ఆమె తండ్రి కూడా కూతురు నిర్ణయాన్ని సమర్థించారు. ఆమె పట్టుదల, దేశభక్తిని చూసిన నేతాజీ ఆమెను తన ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌లోకి తీసుకోవడానికి ఒప్పుకొని బంగారం, వజ్రాలను తిరిగి ఇచ్చేశారు. ఆ రాజామణి తరువాతి కాలంలో సరస్వతీ రాజామణిగా మారి ‘ఫౌజ్‌’ ‌గూఢ•చారిగా ఉంటూ తన స్నేహితురాలు దుర్గతో కలిసి యుద్ధ సమయంలో మారువేషంలో ఎన్నో రహస్యాలు చేరవేసేది. ఆ క్రమంలోనే దుర్గను జైలు నుంచి విడిపించడానికి నర్తకిగా మారి రక్షకభటులకు మత్తుపదార్థం ఇచ్చి స్నేహితురాలితో జైలు నుంచి పారిపోతున్న క్రమంలో జరిగిన కాల్పులలో గాయపడింది. గాయాలతోనే 2 రోజులు అడవిలో గడిపి క్షేమంగా బయటపడింది. ఆమె సాహసానికి మెచ్చిన నేతాజీ ‘భారత మొదటి గూఢ•చారి’ అనే బిరుదు ఇచ్చారు. ఆస్తి సర్వస్వాన్ని సుభాష్‌ ‌చంద్రబోస్‌కు సమర్పించి స్వాతంత్రానంతరం బర్మాలోని ఆస్తిని అమ్ముకుని స్వస్థలం చెన్నైకి చేరారు. 30 సంవత్సరాల వయస్సు నుంచి 2018లో తను మరణించే వరకూ కటిక బీదరికాన్ని అనుభవించారు.

ధన సమర్పణ అనేది త్యాగ భావనను, సమర్పణ భావనను పెంపొందిస్తుంది. కాబట్టి లక్షలాది స్వయంసేవకులు దేశం కోసం తమ శక్తియుక్తులను, విలువైన సమయాన్ని కేటాయిస్తారు. ప్రచారకులుగా జీవితాలను సమర్పిస్తారు. అవసరమనుకుంటే దేశం కోసం బలిదానానికి సిద్ధపడతారు. 1980-90 కేరళతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు అనేక మంది కార్యకర్తలు ప్రచారకులుగా వెళ్లారు. ఉల్ఫా తీవ్రవాదం, క్రైస్తవ, ముస్లిం తీవ్రవాదం తారస్థాయిలో ఉన్నది. అస్సాంలో నవగాంగ్‌ ‌విభాగ్‌ ‌ప్రచారక్‌గా బాధ్యత స్వీకరించిన మురళీధర్‌కు ఉల్ఫా తీవ్రవాదులు చీటీ పంపి బెదిరించారు. కేరళ తిరిగి వెళ్లాలని హెచ్చరించారు. అయినా మురళీధర్‌ ‌భయపడలేదు,అక్కడే కొనసాగారు. కొద్ది మాసాల తర్వాత ఆయనను అపహరించి, చంపి మృతదేహానికి అంత్యక్రియలకు కూడా అవకాశం లేకుండా బ్రహ్మపుత్ర నదిలో పడేశారు. మృత్యువునైనా ఆహ్వానించాడు కానీ కార్యక్షేత్రం వదలని ఆ ప్రేరణ పరమ పవిత్ర భగవధ్వజ ఛాయలో లభించినదే.

ఆగస్టు 1,2005లో మనోజ్‌ ‌చౌహాన్‌ అనే 17 సంవత్సరాల తరుణ స్వయంసేవక్‌కు మరణానంతరం నేషనల్‌ ‌బ్రేవరీ అవార్డును భారత ప్రభుత్వం 2006-2007 సంవత్సరానికిగాను ప్రకటించింది. మనోజ్‌ ‌సాయంత్రం శాఖ ముఖ్య శిక్షక్‌. ‌తండ్రి దివ్యాంగుడు. చదువుకోని తల్లి. వయసులో ఉన్న అక్క, తమ్ముడున్నారు. చాలా పేద కుటుంబం. మనోజ్‌కు గుండెకు సంబంధించిన వ్యాధి ఉండేది. తాము ఉంటున్న కాలనీలో ఆకస్మాత్తుగా వచ్చిన వరద నీటిలో ఇళ్లు మునిగిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో మనోజ్‌ ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ ఖాళీ డబ్బాలతో, టైర్ల ట్యూబ్‌లతో 30 మంది ప్రాణాలను కాపాడాడు. మరుసటి రోజు నుంచి మనోజ్‌ ‌చౌహాన్‌కు న్యుమోనియా సోకి చనిపోయాడు. జీవితంలో అన్ని ప్రతికూలతల మధ్య కూడా సమాజ, దేశ బాధ్యతలను గుర్తెరిగి, ప్రాణాలు సైతం లెక్కచేయని వేలాది మంది స్వయంసేవకులు నిర్మాణం కావడానికి త్యాగం, సమర్పణ భావనలే మూలం. ప్రతినిత్యం పరమపవిత్ర భగవధ్వజం ఎదురుగా ప్రార్ధన చేసి త్యాగం, సమర్పణ భావనలను ప్రసాదించమని భగవంతున్ని కోరుకోవడమే ప్రధాన కారణం.

కరోనా సమయంలో దేశమంతా ఆశ్చర్య చకితులైన సంఘటన ముంబైలో జరిగింది. నారాయణ దబాడ్‌కర్‌ అనే 85 సంవత్సరాల వయసు కలిగిన స్వయంసేవక్‌ ‌త్యాగభావన ప్రజలందరికీ తెలిసిందే. ఆయన తనకు లభించిన ఆక్సిజన్‌ ‌సిలిండర్‌ను తన కన్నా చిన్న యువకుడి ప్రాణాలు కాపాడటానికి స్వచ్ఛందంగా ఇచ్చి, ఆ తర్వాత ఆక్సిజన్‌ ‌లభించక చనిపోవడం అందరినీ కలచివేసింది. అన్ని పత్రికలూ ఆయన త్యాగాన్ని కొనియాడాయి. ముంబై హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌  ‌దీపాంకర్‌ ‌దత్త ఆ విషయాన్ని కోర్టులో ప్రస్తావిస్తూ, ఈ దేశ ప్రజలు ఆ పెద్దమనిషి ముందు నతమస్తకమవుతారని తెలియజేశారు. ఇలాంటి భావనను సంఘం తన కార్యపద్ధతి ద్వారా నిర్మించింది. అలాంటి ప్రేరణ గురుదక్షిణ ద్వారా లభిస్తుంది. గత 97 సంవత్సరాల నుంచి జరుగుతున్న సంఘ కార్యపద్ధతి ఫలితాలనిస్తోంది. లక్షలాదిమంది కరసేవకుల త్యాగం, సంఘర్షణ ఫలితమే రామజన్మభూమి నిర్మాణం. 450 సంవత్సరాల్లో నాలుగు లక్షల మంది బలిదానాలకు ముగింపును సంఘటిత హిందూ శక్తి సాధించింది.

త్యాగం, సమర్పణ భావాల ప్రతిరూపమే పరమ పూజ్య డాక్టర్‌జీ, గురూజీల జీవితం. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని పరమపవిత్ర భగవాధ్వజ ఛాయలో జరిగే సాధనయే విశాల హిందూ సంఘటన కార్య నిర్మాణానికి ఆధారమవుచున్నది. స్వామి వివేకానంద చెప్పినట్లు, హిందూ సమాజం జాగృతావస్థలోకి అడుగిడుతున్నది. జాతీయ స్పృహతో హిందూ సమాజం ఆలోచిస్తున్నది.

గురుదక్షిణ కార్యక్రమంలో లభించే స్ఫూర్తే స్వయంసేవకుల జీవితంలో ఎప్పటికీ స్ఫురించాలి. ఆదర్శానికి అనుగుణంగా జీవించే ప్రేరణ లభించాలని ప్రతి సంవత్సరం గురుదక్షిణ సమర్పిస్తాం. దీనిని లక్షలాది మంది స్వయంసేవకులు వ్రత దీక్షగా భావిస్తారు. బృహత్తర కార్యం దేశమంతా కొనసాగటానికి అవసరమైన నిధిని ఈ కార్యక్రమం ద్వారా సమకూర్చుకోవటం సంఘం ప్రత్యేకత. సంఘ దైనందిన కార్యం కోసం అవసరమైన నిధిని స్వయంసేవకులే సమకూర్చుకోవడం వారి మనసులలో దేశ కార్యం పట్ల గల దృష్టి కోణాన్ని సూచిస్తుంది. సంఘ కార్యాన్ని, దేశ కార్యాన్ని దైవ కార్యంగా భావిస్తాం కాబట్టి డబ్బును చందాలాగా కాకుండా సమర్పణ, ఆధ్యాత్మిక భావనతో సమర్పిస్తాము. అది ఒక దైవీ గుణంగా, జీవన సంస్కారంగా మారుతుంది.

 గుజరాత్‌ ‌రాష్ట్రంలోని జామ్‌నగర్‌ ‌తరుణ శాఖలో గురుదక్షిణ ఉత్సవం నిర్వహిస్తుండగా, ఒక తల్లి నడుచుకుంటూ వచ్చి ధ్వజం ముందు తన చేతిలోని కవర్‌ను పెట్టి గురుదక్షిణ సమర్పించారు. శాఖ కార్యకర్తలు ఆ తర్వాత వెళ్లి ఆమె గురించి అడుగగా, తన కుమారుడు చిన్న పనులు చేసుకుని బతికే వాడని, తను సంపాదించిన దానిలో సంఘం కోసం దాచేవాడని తెలిపారు. అతను అనారోగ్యంతో మరణించిన తర్వాత అతని వస్తువులు సర్దుతున్నప్పుడు ఈ డబ్బు లభించిందని ఆమె తెలియజేశారు. అత్యంత పేదరికం అనుభవిస్తున్నా కూడా ఆ డబ్బును ఆ తల్లి గురుదక్షిణగా సమర్పించారు.

కెన్యా దేశంలోని ముంబాసా శాఖకు చెందిన రతన్‌ అగర్వాల్‌ అనే యువ స్వయంసేవక్‌ ‌గుండెపోటుకు గురై ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను గురుదక్షిణ కార్యక్రమం వరకు జీవించి ఉండకపోవచ్చునని భావించి తోటి కార్యకర్తలతో తన తరపున గురుదక్షిణ చేయమన్నాడు. అలానే జరిగింది. బర్మింగ్‌హామ్‌లోని గురుగోవింద్‌ ‌శాఖకు చెందిన శ్యామ్‌ అనే తరుణ స్వయంసేవక్‌ ‌దివ్యాంగుడు. తన 6వ ఏట నుండి సోదరునితో కలిసి వీల్‌చైర్‌పై రోజూ శాఖకు వెళ్లేవారు. 2003లో పెద్ద శస్త్రచికిత్స జరిగి శరీరం అంతా కట్లు ఉన్నాయి. అయినా డాక్టర్‌ను బతిమాలి వీల్‌ ‌చైర్‌లో వచ్చి గురుదక్షిణ సమర్పించడం ఒక ఉదాత్త ఆధ్యాత్మిక భావనను సూచిస్తుంది.

పరమపూజ్య డాక్టర్‌జీ ఒక మిత్రుడి ఇంటికి వెళ్లినప్పుడు ఒక చిత్ర పటంపై ‘దేశ్‌ ‌కే లియే మరనా సీఖో’ అనే వాక్యాన్ని చూసి అదే చిత్రపటంపై ‘దేశ్‌ ‌కేలియే జీనా సీఖో’ అని రాశారని మనందరం విన్నాం. రుషిరుణం, సమాజ రుణం మానవ జీవితంలో చెల్లించాల్సినవి కాబట్టి స్వయంసేవకులు అదే భావనతో రాష్ట్రం కార్యం జీవితాంతం చేస్తారు.

దేశంలో మారుతున్న పరిస్థితుల్లో అన్ని విషయాలలో, జీవన రంగాలలో సంఘ ప్రభావం పెరగాలని పెద్దలు ఆశిస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో తన అనుభవం, అభిరుచి ఉన్న విషయాల ఆధారంగా దేశకార్యం చేసే అవకాశం సంఘం సమకూరుస్తుంది. ధర్మ జాగరణ పేరుతో కోట్లాది మందిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువచ్చే బృహత్‌ ‌ప్రయత్నం జరుగుతోంది. సమాజంలో అస్పృశ్యత లేకుండా సమరసతను నిర్మించడానికి సమరసతా వేదిక, సేవా, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక సమస్యలతో బలహీన పడుతున్న కుటుంబ వ్యవస్థను సరిచేసేందుకు కుటుంబ ప్రబోధన్‌ ‌లాంటి కార్యక్రమాలను వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవనంలో చేస్తేనే దేశంలో శాశ్వతమైన ప్రాతిపదికపై మార్పు ఉంటుందని పెద్దల నిర్ణయం. దేశం పట్ల తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గురుదక్షిణ సందర్భంగా సంకల్పం చేసి, డబ్బుతోపాటు విలువైన సమయాన్ని కూడా సమాజ కార్యంలో సమర్పించటం మన కర్తవ్యం. వ్యవహారంలోనికి, ఆచరణలోనికి రాని తత్త్వం తత్వమే కాదు. ‘మన ప్రవర్తనను అనుసరించి తత్వాన్ని మార్చకూడదు. త్త్వంతో పాటుగా మన ప్రవర్తన తత్వరూపాన్ని దాల్చాలి’ అన్న పరమపూజ్య గురూజీ పలుకులను ఆచరణలో పెడదాం.

వ్యాసకర్త : ఆర్‌ఎస్‌ఎస్‌ ‌క్షేత్ర సేవా ప్రముఖ్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram